యువ కథ: నీలం కారు | Yuva Katha magazine storie | Sakshi
Sakshi News home page

యువ కథ: నీలం కారు

Published Sun, Dec 1 2024 8:22 AM | Last Updated on Sun, Dec 1 2024 8:22 AM

 Yuva Katha magazine storie

‘ఏమిటీ ఈ డొక్కు కారు ఇక్కడా!! ఎవరిది ఇది?’ అనే మాట వినిపించే సరికి చురుక్కున చూశాను.ఇస్త్రీ చేసిన చొక్కా, గాలి వీస్తున్నా వడలిపోని జరీ అంచు కుచ్చిళ్ళు, ఎండకి మెరుస్తున్న పంచె, నున్నగా గీసిన గడ్డం, నల్ల కళ్ళజోడు, ఇతగాడికి ఎండ తాకకుండా వెనుక గొడుగు పట్టుకొని మా రాముడు. అర్థం అయింది కొత్త పెళ్ళికొడుకు అని. రెండేళ్ళ నుండి మూలన పడి వున్నా ఇన్నేళ్ళుగా నన్ను ఎవరూ కదిలించింది లేదు పట్టించుకోనూ లేదు. ఇలా ఈసడించిన వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్నట్టుండి డొక్కు కారు అని వినేసరికి కుంభకర్ణుడికి నిద్రాభంగం అయినట్టు లేచాను. ‘ఇది మా షావుకారుగారి మొదటి కారు అయ్యగారూ.. మా షావుకారు అనే కాదు, ఇది ఈ ఊర్లోనే మొదటి కారు’ నన్ను నాకు గుర్తుచేస్తూ, నా గత వైభోగం గురించి గొప్పగా చెప్పాడు రాముడు.

‘అయితే?’ అన్నాడు కొత్త పెళ్ళికొడుకు.నేను అక్కడ ఉండటం, అలా ఉండటం అతగాడికి బొత్తిగా నచ్చనట్టు ఉంది. అతనికి నచ్చకపోయేసరికి రాముడు చిన్నబుచ్చుకుంటూ నన్ను చూశాడు.పాపం నన్ను ఇంటికి మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు నాకు దిష్టి తీసింది రాముడే. అలా తీసినందుకు షావుకారు రాముడికి, అతని భార్యకి, కొడుకుకి కలిపి ఒక రూపాయి నోటు ఇచ్చారు. నన్ను చాలా ఆప్యాయంగా, సొంత బిడ్డలా చూస్తూ తాకిన మా షావుకారి చేతి స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. నన్ను ఒక కారులా కాకుండా ఇంట్లో ఒకరు అన్నట్టు చూసుకునే వాళ్ళు. డ్రైవర్‌ పేరుతో బయట మనిషి కూడా నన్ను తాకకుండా షావుకారు అన్నీ తానే అన్నట్టు అల్లారుముద్దుగా చూసుకునే రోజులవి.

మొదటిసారి నేను ఊరిలోకి వచ్చిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. అది ఒక జాతర అనే చెప్పాలి. లేదా నేను ఒక గ్రహాంతరవాసిని అయినా అయ్యుండాలి.మా షావుకారుగారు నన్ను తోలుకుంటూ ఊరిలోకి వస్తుంటే, ఏదో తెలియని అమాయకపు హోదాని ఇస్తూ గడపల దగ్గర, అరుగుల మీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి చూడటం; మా షావుకారి గారినో, నన్నో చూసి చూసి మురిసిపోవటం, బుడత గాళ్ళందరూ నా వెనుకనే పరిగెత్తుకుంటూ రావటం, కొందరు సైకిల్‌ టైరుని కొట్టుకుంటూ నా వెనుక పరిగెత్తటం, రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఆగిపోవటం... ఆహా!! 

ఇంటికి వచ్చాక వాహన పూజ అన్నట్టు అయ్యగార్లు మంత్రాలని  వల్లిస్తుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. కొత్త ముతైదువుని అలకరించినట్టు పసుపు కుంకుమలతో నన్ను సింగారించి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, చిన్న పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ నెమరు వేసుకొంటుండగా టపీమని ఒక చేతి అచ్చు పడింది బోనెట్‌ మీద. ఒక్కసారిగా కలలో నుండి ఇలలోకి వచ్చినట్టు అయ్యింది. ఎవరా అని చూస్తే ఇంకెవరు కొత్త పెళ్ళికొడుకే!

‘ఎందుకూ పనికి రాని ఇనుము ఇంట ఉంచరాదు అని తెలియదా రాముడూ’ అంటున్నాడు.‘నిజమే నయ్యా!! కానీ ఈ కారుని ఇనుము అని ఇంటిల్లిపాది ఎప్పుడూ అనుకున్నదే లేదు. ఈ కారు వచ్చాకనే ఇంటికే కాదు, ఊరికి కూడా చాలా విషయాలు కలిసొచ్చాయి.’
తన మాటకు ఎదురు పలుకుతున్నందుకు రాముణ్ణి కొత్త పెళ్ళికొడుకు గురాయించి చూస్తుంటే నా ఒళ్ళు వుడికిపోతోంది. అయ్యగారి చూపులని గమనించిన రాముడు తనని తాను తమాయించుకున్నాడు. దూరంగా చూస్తే చిన్నమ్మాయి గారు. నన్ను పరిచయం చేయటానికే ఏమో ఇటుకేసి వస్తున్నారు. నేను ఇంటికి వచ్చిన కొత్తల్లోనే పెద్దమ్మాయి గారికి పెళ్ళయింది. పెళ్ళి పిలుపుల దగ్గర నుండి అప్పగింతల వరకు తిరిగింది నేనే, తిప్పింది నన్నే. 

ఎంత హడావిడి వున్నా కారు తీయాలంటే షావుకారు గారే వచ్చే వాళ్ళు కానీ పొరపాటున కూడా నన్ను ఇంకొకరి చేతిలో పెట్టలేదు. పెద్దమ్మాయికి నేనంటే చాలా సెంటిమెంట్‌. అందుకే అత్తారింటికి వెళ్ళే ముందు నాకు నమస్కారాలు పెట్టి తృప్తిగా తడిమి మరీ వెళ్ళిందా బంగారుతల్లి.ఇక మా చిన్నమ్మాయి గారు నేను ఫ్రెండ్స్‌. తన కాలేజీ చదువులకు, పరీక్షలకు, టైపింగ్‌ నేర్చుకునేందుకు, పట్టణంలో షాపింగ్‌కి, స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి అన్నిటికీ నేనే... అంటే అదే నా తోడునే.

ఒకసారేమో ఊరి అవతల వైపు ఉండే అమ్మాయి గారి స్నేహితురాలు లలితకి పురిటినొప్పులు మొదలు అయ్యాయి. మంత్రసాని ఊరిలో లేదాయె. సమయానికి షావుకారు కూడా ఊరిలో లేరు. చిన్నమ్మాయి గారే ధైర్యం చేసి తోలారు నన్ను. చాలా జాగ్రత్తగా లలితను తీసుకొని పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పసికందు పుట్టాక ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నాతోనే. డ్రైవ్‌ చేయటానికి కొంచెం దడ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా బాగానే తోలారు. ఆ ఒక్క సంఘటనతో అమ్మాయి గారికే కాదు వాళ్ళ స్నేహితురాళ్లందరికీ కూడా నేనంటే మక్కువ. 

ఒక్కోసారి పూలతో, మరోసారి బొట్లతో, ఇంకోసారి ఓణీలతో రకరకాలుగా ముస్తాబు చేసే వాళ్ళు నన్ను. అలా నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటే మా కారు మా ఇష్టం అని నన్ను హత్తుకునే వాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోయాను. 
షావుకారు గారు ఎటైనా ఏదైనా పని మీద వెళ్ళడం మా అమ్మాయి గారు నన్ను తీసుకొని షికారుకి వెళ్ళటం. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు మా అమ్మాయి గార్ని సతాయించాలనుకుంటే స్పీడ్‌ పెంచి మేము వాళ్ళని బెదరకొట్టటం. భలే ఉండేదిలే మా సావాసం. పై చదువులు అని అమ్మాయి గారిని పట్టణం పంపేశాక ఇదే మళ్ళీ చూడటం. చాలా మారిపోయారు అప్పటికీ ఇప్పటికీ. ఈ రెండేళ్ళలో ఇంటికి మరో కారు వచ్చింది. 

కానీ నాకు ఇచ్చిన స్వాగతం, హోదా ఆ కారుకి లేదు. ఊరు చిన్నదే అయినా ఇప్పుడు మరో నాలుగైదు కార్లు వచ్చాయి. ఇదంతా ఎపుడు జరిగిందో కూడా తెలియలేదు. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గర వాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. ఆ ఫొటోలన్నీ హాల్లో గోడలకి వేలాడుతుండేవి. ఇపుడు కట్నం పేరిట కొత్త పెళ్ళికొడుక్కు ఒక కొత్త మోడల్‌ కారు వెళ్తుందంట! మా అమ్మాయి గారు దగ్గరికి వచ్చేశారు.
‘ఓరి కొత్త పెళ్ళికొడకా... ఇప్పుడు చూడు ఆమె నీకెలా గడ్డి పెడుతుందో’ అనుకున్నాను.

చిన్నమ్మాయి గారు వచ్చి రాగానే ‘ఈ కారు ఇంకా ఇక్కడనే ఉందా?!’ అన్నారు. ’రాముడూ! నాన్నకంటే చాదస్తం ఎక్కువ. నీకేమైంది. ఇదుగో ఈ కారు తాళం. తీసుకొని వెళ్ళో, తోసుకొని వెళ్ళో డంపింగ్‌ యార్డ్‌లో పడేయ్‌’. రాముడు ఆ మాటలకి నివ్వెరపోయాడు. ‘ఏంటి రాముడు అలా చూస్తున్నావ్‌? ఇదుగో తాళం. తీసుకొని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు’. ఏదో ఆలోచిస్తూ రాముడు తాళం తీసుకున్నాడు. నాకు గుండెల్లో కవ్వం పెట్టి చిలికేస్తున్నట్టు ఉంది. రాముడు ఎన్నడూ నన్ను నడిపించింది లేదు. అలాంటిది మొదటిసారి ఎక్కి కీ ఆ¯Œ  చేశాడు. ఇంజి¯Œ లో వణుకు పుట్టింది. 

నేను అమ్మాయి గారి వైపు చూశాను. ఒకప్పుడు అన్నీ తన ఇష్టంగా జరిపించుకున్న అమ్మాయి గారు. తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయిగారు. బికినీ వేసుకుని స్విమ్మింగ్‌ చేస్తానని అంటే షావుకారు గారు హడలిపోయి వద్దన్నా ‘చేస్తాను. నా ఇష్టం. అందులో తప్పేముంది’ అని మాట చలాయించుకున్న అమ్మాయిగారు, పెద్దమ్మాయిగారు ఉన్నప్పుడు ఇద్దరం రోజూ ఒకే రంగు బట్టలేసుకుందాం అనంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది... ఏంటి నీ కోరిక యూనిఫారంలాగా అని పడీపడీ నవ్విన అమ్మాయి గారు, పుస్తకాలు తెగ చదివే అమ్మాయి గారు, పెళ్ళి అయిన నాలుగు రోజులకే...

రాముడు మెల్లగా నన్ను కదిల్చాడు.‘సాయంత్రం షికారుకెళ్దామా’ కొత్తపెళ్లికొడుకు అడుగుతున్నాడు.‘మీ ఇష్టం’ అంటోంది అమ్మాయిగారు.‘ఆ ఫ్యాష  ఎందుకు... తాళిబొట్టు బయటకు కనిపించేలా వేసుకో’‘అలాగే. మీ ఇష్టం’‘నాకు చెప్పకుండా ఎప్పుడూ డ్రైవింగ్‌ చేయకు’‘సరే’...రాముడు నన్ను బంగ్లా బయటకు తోలుకెళ్తున్నాడు.నేను అమ్మాయిగారినే చూస్తూ ఉన్నాను.ఆమె అక్కడే ఉండిపోగా నేను గేటు దాటి, మలుపు తిరిగిపోయాను. 

ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గరవాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement