ఈ వారం కథ: మెలకువలో చీడకల | Evaram Katha On Funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: మెలకువలో చీడకల

Published Sun, Mar 9 2025 1:03 PM | Last Updated on Sun, Mar 9 2025 1:03 PM

Evaram Katha On Funday

‘‘రీచ్‌ అయ్యావా?’’, టింగ్‌మని వాట్సప్‌లో భర్త. అబ్బో! కేరింగ్‌ మెసేజే అనుకుంటూ ‘‘హా, ఇప్పుడే ఆఫీస్‌ లోపలికొచ్చాను’’ అని ఆమె రిప్లై.‘‘ఒకసారి లొకేషన్‌ పంపు’’మెసేజ్‌ని ముసుగు తీస్తే బయటపడ్డ అనుమానం.‘‘యే! నమ్మట్లేదా నన్ను? అయినా దించిన ఓలా డ్రైవర్‌ నుండి డ్రాప్‌ లొకేషన్‌ కూడా పంపించుకున్నావ్‌ కదా! మళ్లీ ఏంటీ? దున్నపోతులా పడుకునే బదులు పొద్దున్నే లేచి నన్ను డ్రాప్‌ చెయ్యొచ్చుగా?’’ అని ఫాస్ట్‌గా టైప్‌ చేసింది కోపం బాధ కలిపి, కానీ పంపలేదు. బ్యాక్‌ స్పేస్‌ బటన్‌ మీద ఒత్తిడి పెంచడంతో టైప్‌ చేసిందంతా క్లియర్‌ అయింది, స్క్రీన్‌ మీద పడిన కన్నీటి బొట్లు తప్ప!
లొకేషన్‌ పంపించింది.

వచ్చిన మెసేజ్‌లోని ఆమె కోపాన్ని పసిగట్టి, ‘‘ఆఫీస్‌ అయిపోతే నిన్ను పికప్‌ చేసుకోవడానికి అడిగాన్లే’’ మెసేజ్‌కు అతడి సమాధానం.
ఆమె నమ్మినట్టుగా ఓ థంబ్సప్‌ ఎమోజీ పంపింది ఏడుపు ముఖం దాచుకుంటూ. ‘‘మీ జాయినింగ్‌ ఫార్మాలిటీస్‌ అయిపోయాయి, కాసేపు మీటింగ్‌ రూమ్‌లో కూర్చోండి’’ అనగానే ఆమె మూడ్‌ మారింది. సిస్టం కీబోర్డులతో కుస్తీ పడుతున్న ఎంప్లాయీస్‌ని గమనిస్తూ కూర్చుంది.‘‘హలో మేడమ్, వెల్‌కమ్‌ ఆన్‌ బోర్డ్‌. మై సెల్ఫ్‌ యామిని’’ అంటూ ఓ అమ్మాయి తన దగ్గరికి వచ్చింది షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది.
‘‘హలో, ఐయామ్‌ మధుమతి’’

‘‘తెలుసు మేడమ్‌‘‘‘‘అయ్యో, మేడమ్‌ వద్దు. కాల్‌ మీ మధు’’‘‘అంటే, ఇక్కడికి రాక ముందు కూడా మీరు నాకు మేడమే కదానీ’’మధుమతి వెలిగిపోయింది, కానీ ఏదో గుర్తొచ్చి ఆ బ్లష్‌ అంతా ఒక్కసారిగా ఫ్లష్‌ అయిపోయింది.‘‘కూల్‌ మేడమ్, మీరు లెక్చరర్‌గా చేసిన కాలేజ్‌లోనే నేను చదువుకున్నాను’’ చెప్పింది యామిని.‘‘అది అర్థమైంది. కానీ, ఈ విషయం ఆఫీసులో ఇంకెవరికైనా తెలుసా?’’ అడిగింది మధుమతి.‘‘లేదు, ఇంకా ఎవరికీ చెప్పలే’’ పూర్తి చేయకముందే,‘‘చెప్పొద్దు కూడా ప్లీజ్‌. సారీ నేను నిన్ను గుర్తుపట్టలేదు, ఏ ఇయర్‌ పాస్డ్‌ఔట్‌?’’ అడిగింది మధుమతి.‘‘2021 మేడమ్‌’’ చెప్పింది యామిని.

‘‘నీకోటి చెప్పాలి యామిని, బట్‌ ప్లీజ్‌ కీపిట్‌ సీక్రెట్‌’’ అని కాస్త ముందుకు వంగి, ‘‘నేను ఆ కాలేజ్‌లో మానేసి, గ్యాప్‌ తీసుకుని, ఈ కంపెనీలో జూనియర్‌ డెవలపర్‌గా జాయిన్‌ అయ్యాను. ఇన్ని రోజులు కాలేజ్‌లో వర్క్‌ చేసినట్టు ఏమీ చెప్పలేదు ఈ కంపెనీ వాళ్లకి. నో ఎక్స్‌పీరియ¯Œ ్స. సో నో బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్‌’’ అంది మధుమతి.‘‘అచ్ఛా ఓ..కే’’ దీర్ఘంగా చూస్తూ తలూపింది యామిని.‘‘మేడమ్, నాకో డౌట్‌. టెక్నికల్లీ మీరు చాలా సౌండ్‌. కాలేజ్‌లో స్టూడెంట్స్‌కి మీరంటే క్రేజ్‌ కూడా! మీకు ప్రమోషన్‌ కూడా వచ్చిందని విన్నాను. అలాంటిది మీరు రిజైన్‌ చేయడానికి రీజన్‌ మీ పెళ్లా?’, మధుమతి తాళి చూస్తూ అడిగింది యామిని.
‘‘హ్మ్‌...నో’’,‘‘మరి?’’

‘‘చెప్తాను, కానీ అది చెప్పే కంటే ముందు ఒకటి అడగాలి. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వచ్చి సిటీలో బానే సెటిల్‌ అవుతున్నవ్‌ కదా ఇప్పుడు మన కాలేజ్‌ గురించి నీకేం అనిపిస్తుంది?’’ అడిగింది మధుమతి.మొదట బ్లాంక్‌ ఫేస్‌ పెట్టింది. ‘‘చెప్పాలంటే, ఇప్పుడనే కాదు ఎప్పుడడిగినా సేమ్‌ ఫీలింగ్‌ అలాంటి బేకార్‌ కాలేజీలో ఎందుకు జాయిన్‌ అయ్యానా అని’’ అంది యామినీ.మధుమతి తన ఫోన్‌ తీసి ‘ఇది చదువు’ అని ఇచ్చింది,‘ఇది అన్ని గ్రూపుల్లోకి షేర్‌ చేయండి. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్‌ సీట్స్‌. మారుతున్న కాలంతో పాటు ఇంజనీరింగ్‌లో కూడా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీలాంటి అధునాతన కోర్సులు ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌తో అందిస్తున్నాం! రాష్ట్ర రాజధానికో మరో నగరానికో వెళ్లాల్సిన పనిలేదు, కాలేజీ మన ఊరికి దగ్గర్లోనే! హాస్టల్‌ ఫెసిలిటీ, స్కాలర్‌షిప్‌ కూడా కలదు’

యామిని మొత్తం చదివి, అర్థమయ్యీ కానట్టుగా ఫోన్‌ ఆమెకిచ్చేసింది.‘‘ఇంటర్‌ కాలేజీల్లోంచి స్టూడెంట్స్‌ లిస్ట్‌ తీసుకుని, పేరెంట్స్‌కి ఒక్కో లెక్చరర్‌ నుండి ఒక్కో నంబర్‌ ద్వారా ఈ మెసేజ్‌లు పంపేది మేమే! మన ప్రిన్సిపాల్‌ దగ్గరుండి మరీ ఇలాంటి పనులు మాతో చేయిస్తుంటాడు. ఇంజినీరింగ్‌ తర్వాత మీ 35 సంవత్సరాల కెరీర్‌ వాళ్లకు అనవసరం, వాళ్లకు నువ్వు ఓ 35 వేల రూపాయిల రీయింబర్స్‌మెంట్‌ ఐటమ్‌వి మాత్రమే! లెక్చరర్‌గా నాకే చాలాసార్లు అనిపించింది, అలాంటిది స్టూడెంట్స్‌గా మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను’’ అంది మధుమతి.‘నో నో, ఎలాగో అయిపోయి సంవత్సరాలు దాటాయి కదా మేడమ్‌. ఇప్పుడేం చేస్తాం. సో మీరు జాబ్‌ మారింది పెళ్లై కాదు కాలేజ్‌ వల్లేనా? అలా అయితే వేరే కాలేజీలు ఉన్నాయిగా!’ అంది యామిని.

‘‘కాని, ఎక్కడికి వెళ్ళినా నా కోసమే కాలేజ్‌కొచ్చే స్టూడెంట్స్‌ ఉన్నారని నువ్వే అన్నావ్‌ కదా, అలాంటి విషయాలు అల్లరిగా పైకి కనబడినా లోపలి చిల్లరతనం ఏదో రోజు బయటపడుతుంది. లాస్ట్‌ ఇయర్, క్లాస్‌ రూముల్లో మందు తాగే బదులు పైన టెర్రస్‌ మీద తాగి పడిపోండంటూ రెండు రూములు కట్టించాడు ప్రిన్సిపాల్‌! అడిగితే ఏం చెప్పాడో తెలుసా? ‘చెప్తే వినే వాడు స్టూడెంటే కాదు అని సినిమా డైలాగులు కొట్టి వెళ్లిపోయారమ్మా స్టూడెంట్సు. పైగా ఏసీ ఉందనీ నా క్యాబిన్‌లోకి వచ్చి మందు సిట్టింగ్‌లు వేస్తామంటే టెర్రస్‌ మీద రూమ్‌లు కట్టించాను. మరేం చేయమంటావ్‌? మర్యాద కాపాడుకోవాలిగా’ అన్నాడు’’

‘కాని అది మర్యాద కాదు సార్‌’ అని అంటే,దానికి ఆయన, ‘ఆపమ్మా తల్లీ, లెక్చర్లు స్టూడెంట్స్‌కివ్వు కాని, నాలాంటి ప్రిన్సిపాల్‌కి కాదు. ఏమైనా ఉంటే ప్రిన్సిపాల్‌ మీదికో కాలేజ్‌ మీదికో వచ్చి ఎగురుతారు గాని, స్టూడెంట్స్‌ వేషాలేమైనా తక్కువా! స్నానాలు చేయకుండానే, గడ్డాలు గీసుకోకుండానే కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండానే కాలేజీకి వస్తారు, రావడంతోనే అమ్మాయిలని, లేడీ స్టాఫ్‌ని చూసి కామెంట్స్‌ చేస్తున్నారు.

 ఇది చాలదన్నట్టు ఓ ముప్పైఐదు నలభై వయసున్న లెక్చరర్లతో ఫ్రెండ్‌షిప్‌లు చేయడం, వెనకేసుకొస్తారు కాబట్టి వాళ్లను కూడా కలుపుకొని పార్టీలు షికార్లకి తీసుకెళ్లి అటెండె మేనేజ్‌ చేయడం. చొక్కా పైబటన్‌ పెట్టుకోరు, అడిగితే ఉడుకపోస్తుంది అని మిగతా బట¯Œ ్స కూడా విప్పేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఫస్టియర్‌ క్లాస్‌ రూముల్లో కండోమ్స్‌ దొరకడం, బాత్రూంలో కెమెరాలు పెట్టడం, పోలీసులు వచ్చి మరీ డ్రగ్స్‌ దొరకబట్టే దాకా తెలీలేదు కాలేజ్‌ హాస్టల్లో ఎన్ని దరిద్రాలున్నాయో... ఛీ...ఛీ... ఏమైనా మారుద్దామంటే ఎన్నిసార్లని కన్నేసి ఉంచుతాం? ఎంతమంది మీదేసి ఉంచుతాం చెప్పు!

కనీసం అమ్మాయిలైనా బుద్ధిగా శ్రద్ధగా ఉంటారా అంటే కనబడితే గుడ్‌ మార్నింగ్‌ కూడా చెప్పరు. గర్ల్స్‌ హాస్టల్‌ కదా నేనెలా వెళ్లి చెక్‌ చేస్తాను అని వార్డెన్లను చూడమంటే రూమ్స్‌ నిండా బీరుసీసాలే! చదివే ఓపికుండదు గాని పొద్దున్నుండి రాత్రి వరకు హెడ్‌సెట్లు పెట్టుకొని ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. వాడెవడినో ప్రేమించిందే గాక వాడు పెట్టమన్నాడని సిగ్గులేకుండా వెళ్లి వాళ్ల హాస్టల్‌ బాత్రూముల్లో కెమెరాలు పెట్టింది...చ్చీచ్చీఛీఛీ. నాకు ఇంట్రెస్ట్‌ పోయింది. ఎలాగో జాయిన్‌ అయిన కొద్ది రోజులకే తెలుస్తోంది కదా వాళ్ల పిల్లలు ఎలా తయారవుతున్నారో, పేరెంట్స్‌ వచ్చి మళ్లీ నా మీదనే పడి చస్తారు చెడగొడ్తున్నారనీ... వాళ్లేదో పద్ధతిగా పెంచారా?’

మధుమతి ప్రిన్సిపాల్‌ మాటలు చెప్తుంటే యామినికి తన కాలేజీ రోజులు ఒక్కసారిగా కళ్లముందు కదిలాయి. ఇలాంటి రోజుల నుండి బయటపడ్డా అనే ఫీలింగ్‌ ఎంత రిలాక్స్‌డ్‌గా ఉందో తనకి!‘ఇవే కాదు అసలు దరిద్రాలు కాలేజీలో జరిగే యాన్యువల్‌ డేలు, ఫ్రెషర్‌–ఫేర్‌వెల్‌ పార్టీల్లో ఉంటాయి. దానికి గెస్టులుగా సినిమా హీరోలు, హీరోయిన్లు. అసలు వాళ్లే ఎందుకు? సరే ఆ ఏజ్‌లో సినిమా వాళ్లంటే ఓ క్రేజ్, ఓ ఇన్‌స్పిరేషన్‌ అని అనుకున్నా, అప్పటి వరకు కాలేజీ మొహం కూడా చూడని వాళ్లు ఇలాంటి ప్రోగ్రాంలకి తప్పక వస్తారు. స్టూడెంట్స్‌ చేసే గోలను చూసి సినిమా వాళ్లు ఇదే బాగుందని, ‘నెక్స్‌ట్‌ టైం నుండి సినిమా ప్రమోషన్‌ కూడా కాలేజీలోనే చేస్తే బాగుంటదని’ ఎవడో తొత్తు సలహా ఇస్తాడు. అలాంటి ప్రమోషన్‌కి పక్క కాలేజీ వాళ్లు కూడా ఈ కాలేజీకే వస్తారు. 

తాగేసి ఫ్యా అంటూ గొడవలు మొదలై, పాన్‌ పరాగ్‌ ఉమ్మిన ప్రహరీ గోడలకు రక్తంతో మెరుగులు దిద్దుతారు. సర్లే ఇదంతా ఒక్క రోజేగా అనుకుంటే ఆ హీరోను చూసి ఇంకో హీరో, అది చూసి మరో హీరో.ఇన్ని ప్రోగ్రాంల మధ్య సిలబస్‌ టైముకి అవదు, పైగా లైబ్రరీలో బుక్స్‌ సరిగ్గా ఉండవు, ఉండాల్సినంత మంది లెక్చరర్లు ఉండరు. ఖర్చుతో పని కాబట్టి ప్రిన్సిపాల్‌ పట్టించుకోడు. పైగా ‘అరవై ఉన్న క్లాసులో చదివేది పదిమందేగా! కనీసం కాలేజీకి సినిమా ఫంక్షన్‌తోనైనా పేరు వస్తుంది’ అని ఊరుకుంటాడు. వచ్చిన సినిమా వాళ్ళు ప్రమోషన్‌ మాటలు మాట్లాడుతారా అంటే, ‘ఏమీ చదవకుండానే నేనీ పొజిషన్‌లో ఉన్నాను. చదువు దేనికీ పనికిరాదు. కాలేజీ ఉన్నది కేవలం మిమ్మల్ని రోబోలుగా మార్చి పనిప్పించడానికే! ముందు ప్రపంచాన్ని చదవండి’ అని అంటుంటే ఆ వయసుకి ఆ మాటలు ఎంత వరకు అర్థమవుతాయి?

ప్రపంచాన్ని ఎంత చదివినా, చదవాల్సిన టైమ్‌లో పుస్తకాలు చదవకపోతే స్టూడెంట్స్‌ ఏ ఎగ్జామైనా ఎలా పాసవుతారు? కానీ ఆ స్పీచ్‌లకు చప్పట్లు, విజిల్స్‌తో కాలేజీ దద్దరిల్లేది’’ గ్లాసులో నీళ్ళు అందుకుంటూ అంది మధుమతి.యామిని ఏమీ అనలేక, ఆ కంప్లయినింగ్‌ టోన్‌ వినలేక సఫొకేట్‌ అవుతోంది. మేడం లెక్చరర్‌గా మానేసినా, కూడా క్లాస్‌ పీకడం మాత్రం మానట్లేదని అనుకుంటూ,
‘‘సర్లేండి మేడమ్‌. మనం మాత్రం ఏం చేస్తాం. కాఫీ?’’ అడిగింది‘‘ఇదంతా తప్పు కదమ్మా. అందుకే’’ ఆపేసింది నీళ్లు తాగుతూ.‘ఏం చేశారనీ’ కుతుహలంతో అడిగింది యామిని.‘‘ల్యాబ్స్, లైబ్రరీ, టాయిలెట్స్, హాస్టల్‌ ఎంత దారుణంగా ఉన్నాయో ఫోటోలతో సహా కలిపి యూజీసీకి కంప్లైంట్‌ రాశాను’’ చెప్పింది.‘‘యూజీసీకా! వాళ్ళు యాక్షన్‌ తీసుకోగలిగితే, ఈ పాటికి చాలా కాలేజీలు’’ యామిని ఏదో చెప్పేలోపే మధుమతి ఫోన్‌ రింగ్‌ అయ్యింది.
సైలెంట్‌లో పెట్టి కాల్‌ కట్‌ చేసింది.

‘‘అయ్యో లిఫ్ట్‌ చేయండి’’ అంది యామిని ‘‘ఇట్స్‌ ఓకే. ఇతని గురించే చెప్పాలి. కాలేజీలో నాకు ప్రమోషన్‌ వచ్చాక, ఇతని పెళ్లి సంబంధం కూడా వచ్చింది. బాగున్నాడు. నచ్చి పెళ్లి చేసుకున్నాను. అతను అదే టౌన్‌ కాబట్టి జాబ్‌ కంటిన్యూ చేశాను. అంతా బాగుండేది. కొత్తలో ఇబ్బందులున్నా కూడా లైఫ్‌లో ఎక్సైట్‌మెంట్‌ ఉండేది’’ అని ఆమె మెల్లిగా తల దించుకుంది. దుఃఖం ఆగట్లేదు, గొంతు తడబడుతోంది. వణుకుతున్న చేతులు ముఖానికి అడ్డం పెట్టుకొని వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది. 

యామిని అయోమయంగా, ‘‘అయ్యో మేడమ్, ఏమైంది, ప్లీజ్‌ ఏడ్వకండి’’ అంది దగ్గరికి తీసుకుంటూ.‘‘అలాంటి టైంలో ఒక మగ లెక్చరర్‌తో నాకు అఫైర్‌ ఉన్నట్టు నా హస్బెండ్‌కి పదేపదే కొంతమంది స్టూడెంట్స్‌ కాల్‌ చేశారు, మెసేజ్‌లు పెట్టారు. కాలేజీలో ఏ అబ్బాయి వచ్చి నాతో మాట్లాడినా తెలీకుండా ఫొటోలు తీసి పంపేవారు’’ ఏడ్చుకుంటూ చెప్పింది మధుమతి. యామిని ఇంకా దగ్గరికి తీస్కోగానే, ‘‘నేను ఏ అఫైర్‌ పెట్టుకోలేదమ్మా నిజంగా. అదే నా భర్త నమ్మాడో లేదో తెలీదు. నేను ఏ తప్పు చేయలేదని నమ్మినట్టే మాట్లాడతాడు కాని, మళ్లీ డౌట్‌ పడతాడు. జీతాలు పెంచమని అడిగినందుకు బౌన్సర్లతో కొట్టించారని ఓ లెక్చరర్‌ నాతో చెప్పుకుంటే, అతనికి నాకు అఫైర్‌ ఉందని కాలేజీలో స్ప్రెడ్‌ చేశారు. విషయం తెలుసుకున్న మా నాన్న నన్ను కొట్టాడు. అమ్మ నానా మాటలంది. నా భర్త మాత్రం కనీసం ఓ మాటైనా అనలేదు కాని, నా ఫోన్‌ లాక్కున్నాడు. నంబర్‌ మార్చాడు. పాత నంబర్‌ బ్లాక్‌ చేసి, సిమ్‌ కాల్చేశాడు. 

ఇంట్లో వాళ్ల ఫోన్‌ నంబర్లు తప్ప ఇంకెవరి నంబర్లు నా ఫోన్‌లో ఉండకుండా చేశాడు. ఎవరికి కాల్‌ చేస్తున్నాను, ఎవరికి మెసేజ్‌లు పెడ్తున్నానో చూసేవాడు. ఎవరితోనూ కాంటాక్ట్‌ అవ్వద్దన్నాడు. మెల్లగా జాబ్‌ మానేయమని ప్రెజర్‌ పెట్టాడు! సడన్‌గా జాబ్‌ మానేస్తే, ‘తప్పు చేసింది కాబట్టే మానేసింది’ అనుకుంటారని నేను చెప్పినా వినలేదు. సిటీకి తీసుకొచ్చాడు. ఎప్పుడన్నా కాలేజీ ప్రస్తావన తెస్తే చిరాకుపడుతూ అరిచేవాడు. అతనే సర్వస్వం అనుకున్నాక జాబ్‌ వదిలేయడం పెద్ద మ్యాటర్‌ కాదనిపించింది. మూడు నెలల తర్వాత, ఇంటి నుంచే వర్క్‌ చేసుకునే సౌకర్యం సాఫ్ట్‌వేర్‌లో ఉంది కాబట్టి గట్టిగా అడిగాను. ఒప్పుకున్నాడు. ఇదిగో ఇలా వచ్చి ఈ కంపెనీలో!’’ మధ్య మధ్యలో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మధుమతి.

‘‘రిలాక్స్‌ మేడమ్‌. అప్పుటి నుండి ఏదేదో చెప్తున్నారు అనుకున్నాను గాని, మీకు ఇంత జరిగిందని, ఇంత బాధ దాచుకున్నారని అనుకోలేదు. షేమ్‌ ఆన్‌ దోస్‌ పీపుల్‌. అలాంటి కాలేజీలో చేయకపోవడమే బెటర్‌ లెండి. టైమ్‌ తీసుకుని మంచి ప్లేస్‌కే వచ్చారు. డోంట్‌ వర్రీ, ఈ కంపెనీ, మా టీమ్‌ చాలా బెటర్‌. ట్రస్ట్‌ మీ’’ అంటూ మధుమతి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ అభయమిచ్చింది యామిని.ఈ గ్యాప్‌లో మధుమతి ఫోన్‌లో భర్త నుండి మిస్డ్‌ కాల్స్, మెసేజ్‌లు.‘‘సిగ్నల్స్‌ లేవనీ, ఫోన్‌ సైలెంట్‌లో ఉందని చెప్పకు. వాటర్‌ కూడా సరిగ్గా తాగలేదని నీ స్మార్ట్‌ వాచ్‌ చెప్తోంది. 

ఫోన్‌ మర్చిపోయి బాత్రూమ్‌కి కూడా వెళ్లవు అని నాకు తెలుసు. నా మెసేజ్‌లు, కాల్స్‌ అన్నీ చూస్తావు కాని, కావాలనే రిప్లై ఇవ్వవని కూడా తెలుసు. నీ కోపమంతా ఇంట్లో చూపించు మధు, ప్లీజ్‌ నేను ఆల్రెడీ నీ ఆఫీస్‌ దగ్గరున్నాను. కిందికి రా ప్లీజ్‌’’ వాట్సాప్‌లో భర్త.‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ చేయడానికి ల్యాప్‌టాప్, యాక్ససరీస్‌ ఇచ్చారు. ప్రాజెక్ట్‌ డీటెయిల్స్‌ మెయిల్‌ చేస్తామని చెప్పారు. యామినికి ‘బై’ చెప్పి ఆఫీస్‌ బిల్డింగ్‌ కిందకి వచ్చింది మధుమతి.‘‘ఒక్కరోజు, అది కూడా రెండు మూడు గంటలు బయటికి వస్తే ఇన్ని కాల్స్‌ మెసేజెస్సా! ఛీ’’ అతన్ని తిడుతూనే బైక్‌ ఎక్కి కూర్చుందామె. వెనక నుండి ఓ రెండుసార్లు అతని హెల్మెట్‌ మీద కొట్టింది కూడా. అతను ఏం మాట్లాడకుండా బండి ముందుకు పోనిచ్చాడు. ‘ఎందుకంత స్పీడు, మెల్లిగా’ అంటూ ఇంకా తిడుతోంది.

‘‘ఐయామ్‌ సారీ’’ అన్నాడతను.
ఆమె కాసేపు మౌనంగా ఉంది. చౌరస్తా దాటి ఓ ఖాళీ రోడ్డు రాగానే, వెనక నుండే అతన్ని మెల్లగా కౌగిలించుకుంటూ వాలిపోయింది. అతను ఇంకాస్త స్లో అయ్యి, చిన్నగా బ్లష్‌ అవుతూనే సిగ్గుగా వస్తున్న నవ్వును ఆపుకున్నాడు. ‘కొత్తగా ఉందిరా అంతా, కాని, బానే ఉండేలావుంది. నేను సెట్‌ అవగలను అనిపిస్తోంది. నువ్వు కూడా సెట్‌ అవ్వొచ్చుగా! మన పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా. ప్రేమగా పిలుస్తూ దగ్గరికి తీస్కోవటం, ప్రతి సాయంత్రం బయటకెళ్తూ కబుర్లు చెప్పుకోవటం, ఇంటి పనిలో నాకు హెల్ప్‌ చేస్తూ..’ ఆమె చెప్తూ పోతుంటే మళ్లీ మెయిన్‌ రోడ్‌ వచ్చిందని బండాపాడు సిగ్నల్‌ చూసి. హెల్మెట్‌ తీయడు, ఎక్స్‌ప్రెషన్‌ కనబడదు.అయినా అతనంత పెద్ద ఎక్స్‌ప్రెసివ్‌ కాదులే, కోపం తప్ప మిగతా అన్ని ఫీలింగ్స్‌ దాచుకుంటాడనీ ఆమె కంప్లైంట్‌ కూడా!

ముగింపు నిజానికి అతను అంతగా ఏం దాచుకున్నాడంటే, కాలేజ్‌ బాత్రూంలో లేడీ లెక్చరర్ల వీడియోలు కూడా తీశారనీ, అలా ఆమె వీడియో కూడా తీసి అతనికే పంపారనీ ఆమెకి చెప్పకుండా దాచాడు!అఫైర్‌ అలిగేషనే తట్టకోలేని ఆమె ఈ విషయం తెలిస్తే మానానికి పోయి సూసైడ్‌ చేసుకుని చస్తుందేమోననే భయంతో ఆమె దగ్గరి నుండి ఫోన్‌తో సహా లాక్కొని, సిమ్‌ కాల్చి, విషయం ఆమెకి చేరకుండా చేశాడు!ఇక మనుషుల్ని నమ్మడం మానేసిన అతను కాలేజీకే కాదు, ఎక్కడకి వెళ్ళినా అక్కడి బాత్రూంకి వెళ్తుందని, ఎక్కడికీ పంపించకుండా ఆమెని కాపాడే ప్రయత్నం బయటపడకుండా దాచాడు.ఇప్పుడూ అంతే, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల ఇంటి బాత్రూం మాత్రమే వాడుకోవచ్చని ఈ జాబ్‌కి రిఫర్‌ చేయించి మరీ ఇప్పించాడని ఆమె దగ్గర దాచాడు.

ఉపసంహారం 1
సడన్‌గా ఇంజనీరింగ్‌ బుక్సో, బస్సో కనబడినా, ‘మేడమ్‌’ అనే పిలుపు వినబడినా ఆమెలో ఓ అలజడి! ఆ రోజంతా డల్లైపోతుంది. రాత్రవగానే ఓ దిక్కు పడుకొని దిండు తడుపుకుంటుంది. నిద్ర పట్టక భర్త వైపు తిరిగే సరికి అతను మాత్రం గాఢనిద్రలో ఉంటాడు. ఆమె దిండు ఇంకా ఎక్కువ తడుస్తుంది.
ఉపసంహారం 2
ఎక్కడికి వెళ్లినా ఆమెకి బాత్రూం వస్తుందేమోనని, త్వరగా ఇంటికి వెళ్లాలనే తొందరలో బైక్‌ నడుపుతుంటాడు. ఫోన్‌లో ఏ మెసేజ్‌ వచ్చినా, ఏం చూడాల్సి వస్తుందోనని భయంతో రోజు గడుపుతుంటాడు. ఇలా మెలకువలో పీడకలలా వెంటాడే అతనికి, రాత్రులు నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నిద్ర పట్టదు. అతనికి నిద్రే ఓ ఉపశమనం మరి!
సంహారం
ఏదో పోగొట్టుకున్నట్టు రోజు గడిపే ఇద్దరూ తెల్లారేసరికి మాత్రం ఒకరినొకరు హత్తుకొని నిద్రలోనే కలిసిపోయినట్టు కనబడతారు, ఒకే దుప్పటిలో. అలా ఓ రోజు లేచేసరికి మధుమతి ఇన్‌బాక్స్‌లో
‘ఏఐ’ ద్వారా స్పై కెమెరాలను కనిపెట్టే మొబైల్‌ యాప్, ఇప్పటి వరకు తీసినవి లింక్‌ పెడితే వాటిని సైబర్‌ సెక్యురిటీతో బ్లాక్‌ చేయించగల యాప్‌ తయారు చేసే ప్రాజెక్ట్‌లోకి డెవలపర్‌గా తీసుకుంటున్నట్టు యామినికి మెయిల్‌ వచ్చింది. అదే ఇక నుండి ఆమెను రోజంతా యాక్టివ్‌గా ఉంచే మాత్ర, అతనికి రాత్రులు మాత్రలు అక్కర్లేకుండా పట్టే నిద్ర.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement