ఈ మేకప్‌ బాక్స్‌ ఉపయోగించడం చాలా ఈజీ..! | Beauty Product: This Makeup Box Easy keep And Its Products Clean | Sakshi
Sakshi News home page

ఈ మేకప్‌ బాక్స్‌ ఉపయోగించడం చాలా ఈజీ..! ముఖ కాంతి కోసం..

Published Sun, Mar 9 2025 2:06 PM | Last Updated on Sun, Mar 9 2025 2:28 PM

Beauty Product: This Makeup Box Easy keep And Its Products Clean

మేకప్‌ ఉత్పత్తులను దాచిపెట్టుకోవడం, అవసరానికి వాటిని వెతుక్కోవడం పెద్ద సమస్య. ఇక మేకప్‌ సామగ్రికి బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి చేరకుండా జాగ్రత్తపడటం మరో సమస్య. ఆ సమస్యను ఈ మేకప్‌ బాక్స్‌ ఇట్టే దూరం చేయగలదు. పైగా మిర్రర్, ఫ్యాన్, లైట్‌ వంటి వాటితో రూపొందిన ఈ మేకప్‌ బాక్స్‌ వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.

క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్‌, ఫౌండేషన్స లిప్‌స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్స్‌ ఇలా రోజువారీ వినియోగించే మేకప్‌ సామాన్లను ఈ బాక్స్‌లో చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్‌ స్టోరేజ్‌ బాక్స్‌కి ఒకవైపు అద్దం ఉంటుంది. మరోవైపు స్టోరేజ్‌ కంటైనర్‌ ఉంటుంది. దీనికున్న అద్దాన్ని 360 డిగ్రీల్లో ఎలా అయినా తిప్పుకోవచ్చు. కూర్చునే కాదు, నిలబడి కూడా మేకప్‌ వేసుకోవచ్చు. వేసుకున్న మేకప్‌ త్వరగా ఆరడానికి దీనిలో ఫ్యాన్‌ కూడా ఉంటుంది. 

ఇక దీనిలో పర్ఫ్యూమ్స్, నెయిల్‌ పాలిష్‌లు, నెయిల్‌ రిమూవర్స్‌ వంటివన్నీ దాచుకోవచ్చు. అద్దం వెనుక భాగంలో కూడా కొన్ని మేకప్‌ వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్‌ స్టోరేజ్‌ బాక్స్‌లో మరో నాలుగు చిన్నచిన్న సొరుగులు ఉంటాయి. దీనికి ఎల్‌ఈడీ లైట్‌ అమర్చి ఉండటంతో, కరెంట్‌ లేనప్పుడు కూడా మేకప్‌ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ లైట్‌ మూడు వేర్వేరు కాంతుల్లో వెలిగేందుకు ఆప్షన్స్‌ ఉంటాయి. వాటిని మార్చుకుంటూ మేకప్‌ ముఖానికి సరైన విధంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాల మేకప్‌ ఉత్పత్తులను ఇందులో భద్రపరచుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని బాత్‌ రూమ్‌లో, బెడ్‌ రూమ్‌లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 

ఇలాంటి మేకప్‌బాక్సులు చాలానే, రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర సుమారుగా మూడు లేదా నాలుగు వేలు ఉంటుంది. మోడల్‌ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వీటిలో కొన్నింటిని ముందే చార్జింగ్‌ పెట్టుకుని వాడుకోవచ్చు. కొన్నింటిని బ్యాటరీలతో వినియోగించుకోవచ్చు.

ముఖ కాంతికి చికిత్స..:
ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. రకరకాల సౌందర్య లేపనాలు, అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవేవీ ఫలించనప్పుడు నిపుణులు చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి. ముఖ సౌందర్యాన్ని త్వరగా మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో ‘లో లెవల్‌ లేజర్‌ లైట్‌ థెరపీ’ అందుబాటులోకి వచ్చింది. 

ఈ పద్ధతిలో తక్కువ స్థాయిలో లేజర్‌ లైట్‌ను వెదజల్లే పరికరాన్ని ఉపయోగిస్తారు. టార్చ్‌లైట్‌లా ఉండే ఈ పరికరం ద్వారా ముఖచర్మంపై లేజర్‌ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో కొలాజెన్‌ ఉత్పత్తి పెరిగి, సడలిపోయిన ముఖం తిరిగి బిగుతుదేరుతుంది. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా క్రమంగా నయమవుతాయి. పలు దేశాల్లో చర్మవైద్య నిపుణులు ఈ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారు. 

(చదవండి: ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement