
నల్గొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు శిక్షలు పడ్డాయి. దీంతో ప్రణయ్ తల్లిదండ్రులు(Pranay Parents) మీడియాతో మాట్లాడుతూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అంతకు ముందు.. కొడుకు సమాధిని ముద్దాడి నివాళులర్పించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే అమృత తండ్రి మారుతి రావు బలవన్మరణంతో మృతి చెందగా.. ఇప్పుడు అమృత చిన్నాన్న శ్రవణ్‌కు జీవిత ఖైదు పడింది.
ప్రణయ్ హత్య ప్లాన్ అమలులో ఆరుగురు ప్రధాన సూత్రధారులని.. అందులో తన బాబాయ్ శ్రవణ్ కీలకంగా వ్యవహరించారంటూ అమృత అప్పట్లో ఘటన జరిగిన టైంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు.. శ్రవణ్‌ను ఏ6గా నిందితుల జాబితాలో చేర్చారు. అయితే ఇవాళ తీర్పులో ఆయనకు జీవిత ఖైదు పడగా.. శ్రవణ్ కుటుంబం పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

ఏ తప్పు చేయకున్నా.. తన తండ్రిని ఈ కేసులో ఇరికించారని శ్రవణ్ కూతురు మీడియా ముందు వాపోయింది. ఈ ఎపిసోడ్‌కు అమృతే కారణమంటూ ఆరోపించింది కూడా. ఈ క్రమంలో ఈ కేసులో తన తండ్రి ప్రమేయం లేదని చెబుతూ.. ఆయన్ని తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారామె.

సంచలనం సృష్టించిన ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నారు. ఏ1 మారుతి మృతి చెందగా.. హంతకుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష పడింది. అమృత బాబాయ్ శ్రవణ్ సహా మిగతా నిందితులకు జీవిత ఖైదు పడింది. మారుతిరావు నుంచి సుపారీ అందుకున్న అస్ఘర్(ఉగ్రవాది కూడా), సుభాష్ శర్మలు అండర్ ట్రయల్స్‌గా ఉండగా.. మిగతా వాళ్లు బెయిల్‌పై బయటకు వచ్చారు. పోలీసులు 1600 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. 5 సంవత్సరాల 9 నెలలపాటు విచారణ జరిగింది.
ఇదీ చదవండి: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు