
నల్లగొండ, సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.
అమృత వర్షిణి-ప్రణయ్‌లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం.. ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతీ రావు(Maruthi Rao) రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్‌ను హతమార్చడానికి అస్ఘర్ అలీకి కోటి రూపాయల సుపారీ ఇచ్చాడు. అస్ఘర్ ఏడుగురితో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ప్రణయ్‌ను అంతమొందించాడు.
👉ఆరేళ్లకు పైగా ప్రణయ్ కేసు(Pranay Case) విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు ఆత్మహత్య చేసుకోగా.. మరో ముగ్గురు నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా నలుగురు నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులదరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరు పరిచి.. తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
👉2018లో ప్రణయ్- అమృతల వివాహం జరిగింది. ఐదు నెలల గర్భంతో ఉన్న భార్య అమృత(Amrutha Pranay)తో కలిసి చెకప్‌నకు వెళ్లి తిరిగి వస్తుండగా.. సుపారీ గ్యాంగ్‌లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్‌పై దాడి చేయడంతో తల్లి, భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు.
👉మిర్యాలగూడలో 2018 సెప్టెంబరు 14వ తేదీన పెరుమాళ్ల ప్రణయ్(Perumalla Pranay) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి.. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు అయ్యింది.
👉ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు ఏ1గా ఉండగా.. ప్రణయ్‌ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ ఏ2గా ఉన్నాడు. మొత్తంగా ఎనిమిది మందిపై కేసు నమోదు కాగా.. దాదాపు ఐదున్నరేళ్ల పాటు సాగిన విచారణ సాగింది.
👉ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ భారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్(మారుతి రావు సోదరుడు), ఏ-7 సముద్రాల శివ(మారుతి రావు డ్రైవర్), ఏ-8 నిజాం(నిందితులు ప్రయాణించిన ఆటో డ్రైవర్ ఓనర్)గా ఉన్నారు.
👉2019 జూన్ 12న పోలీసుల చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతి రావుకు బెయిల్ దక్కింది.ఏ-1 మారుతీరావు 2020 మార్చి7వ తేదీన హైదరాబాద్ ఖైరతాబాద్ వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్లగొండ జిల్లా కోర్టు సముదాయంలోని.. ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి.. మార్చి 10కి(ఇవాళ్టికి) తీర్పును రిజర్వ్ చేసింది.
👉మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు
👉నిందితుల్లో అస్ఘర్ అలీ ఐఎస్ఐ ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు.. ప్రణయ్ కేసులో మారుతి రావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం ఏడుగురిని ఒక గ్రూప్‌గా చేసి.. ప్రణయ్ హత్య స్కెచ్‌ను అస్ఘర్ అమలు పరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment