ప్రణయ్‌ హంతకుడికి ఉరి | Amrutha Pranay Case Verdict: Accused Subhash Kumar Sharma has been sentenced to death | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌ హంతకుడికి ఉరి

Published Tue, Mar 11 2025 4:48 AM | Last Updated on Tue, Mar 11 2025 4:48 AM

Amrutha Pranay Case Verdict: Accused Subhash Kumar Sharma has been sentenced to death

పరువు హత్య కేసులో ఒకరికి మరణశిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు 

నల్లగొండ జిల్లా రెండో అదనపు, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి ఎన్‌.రోజారమణి తీర్పు

2018లో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత వర్షిణి ప్రేమ వివాహం

వారి కులాలు వేరుకావడంతో రగిలిపోయిన అమృత తండ్రి మారుతీరావు 

రూ.కోటి సుపారీ ఇచ్చి ప్రణయ్‌ హత్య.. పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసిన పోలీసులు

2020లోనే ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు.. ప్రణయ్‌ను నరికిన సుభా‹Ùశర్మకు మరణశిక్ష.. హత్యకు ప్లాన్‌ చేసిన, తోడ్పడిన మరో ఆరుగురికి జీవిత ఖైదు 

78 మంది సాక్షుల విచారణ, 523 పేజీలతో తీర్పు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌ పరువు హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఐపీసీ సెక్షన్‌ 302, 129 (బీ), 109 ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ యాక్ట్‌ కింద నిందితులకు శిక్షలు ఖరా రు చేస్తూ.. నల్లగొండ రెండో అదనపు జిల్లా జడ్జి, ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి రోజా రమణి సోమవారం తీర్పు ఇచ్చారు.

ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావు నాలుగేళ్ల కింద ఆత్మహత్య చేసుకోగా.. ఏ2గా ఉన్న సుభాష్ కుమార్‌శర్మకు మరణశిక్ష విధించారు. ఏ3గా ఉన్న మహ్మద్‌ అజ్గర్‌అలీ, ఏ4 మహ్మద్‌ అబ్దుల్‌ బారీ, ఏ5 అబ్దుల్‌ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ నిజాంలకు జీవిత ఖైదు విధించారు. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ హత్యకు గురవగా.. సుమారు ఆరున్నరేళ్ల విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడింది.

కూతురి ప్రేమ వివాహాన్ని తట్టుకోలేక.. 
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వ్యాపారి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతీరావు, గిరిజ దంపతులకు అమృత వర్షిణి ఒక్కరే కూతురు. పట్టణంలోని ముత్తిరెడ్డికుంటలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల బాలస్వామి, ప్రేమలత దంపతుల కుమారుడు పెరుమాళ్ల ప్రణయ్‌. ఇద్దరూ మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో 2018 జనవరి 30న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసు కున్నారు. అక్కడి నుంచి నేరుగా నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తన తండ్రి మారుతీరావు నుంచి రక్షణకల్పించాలని అమృత వర్షిణి పోలీసులను కోరారు. దీని తో పోలీసులు ప్రణయ్, అమృత ఇద్దరి తల్లి దండ్రులను మిర్యాలగూడ డీఎíస్పీ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్‌ చేశారు. అనంతరం అమృత ప్రణయ్‌తో కలసి ముత్తిరెడ్డికుంటలోని ఇంటికి వెళ్లారు.తర్వాత ప్రణయ్‌ కుటుంబం ఆధ్వర్యంలో వారు వివాహ రిసెప్షన్‌ చేసుకున్నారు. 

సుపారీ గ్యాంగ్‌తో హత్య..: కూతురు ప్రేమ వివాహం, పట్టణంలోనే రిసెప్షన్‌ చేసుకోవడాన్ని చూసి మారుతీరావు తట్టుకోలేకపోయారు. ప్రణయ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. సుపారీ గ్యాంగ్‌కు రూ.కోటి ఇచ్చి ప్రణయ్‌ హత్యకు ప్లాన్‌ చేశారు. అప్పటికే అమృత, ప్రణయ్‌ వివాహమై 8 నెలలు గడిచింది.

అమృత 5 నెలల గర్భిణి కూడా. 2018 సెప్టెంబర్‌ 14న ప్రణయ్‌ తల్లితో కలసి అమృతను మెడికల్‌ చెకప్‌ కోసం పట్టణంలోని జ్యోతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా.. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న బిహారీ సుపారీ కిల్లర్‌ సుభాష్ కుమార్‌ శర్మ కత్తితో ప్రణయ్‌పై దాడి చేశాడు. అజ్గర్‌ అలీ, నిజాం అతడికి సాయం చేశారు. ప్రణయ్‌ ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. 

1,200 పేజీలతో చార్జిషిట్‌.. 
ప్రణయ్‌ పరువు హత్య అప్పట్లో జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఆ సమయంలో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్‌ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు.. ఆస్పత్రిలోని సీసీ పుటేజీ ఆధారంగా మిర్యాలగూడ పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు. 4 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. 9 నెలల పాటు దర్యాప్తు చేసి, 78 మంది సాక్షులను ప్రశ్నించి 2019 జూన్‌ 19న 1,200 పేజీలతో చార్జిషిట్‌ను దాఖలు చేశారు. 8 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020 మార్చి 8న హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లోని గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. 

సుదీర్ఘ విచారణ అనంతరం.. 
ఈ కేసులో విచారణ సుదీర్ఘంగా జరిగింది. తాజాగా సోమవారం కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఏ2 సుభా‹Ùకుమార్‌ శర్మకు న్యాయమూర్తి ఐపీసీ సెక్షన్‌ 302, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, సెక్షన్‌ 27 (3), ఆయుధ నిరోధక చట్టం కింద మరణశిక్ష విధించారు. హత్యలో పాలుపంచుకున్న ఏ3 అజ్గర్‌ అలీ, ఏ4 మహ్మద్‌ అబ్దుల్‌ బారీ, ఏ5 మహ్మద్‌ అబ్దుల్‌ కరీం, ఏ6 మారుతీరావు తమ్ముడు తిరునగరు శ్రవణ్‌కుమార్, ఏ7 మారుతీరావు కారు డ్రైవర్‌ సముద్రాల శివ, ఏ8 ఆటోడ్రైవర్‌ ఎంఏ నిజాంలకు ఐపీసీ 302 రెడ్‌విత్‌ 120 (బీ), 109, ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద జీవిత ఖైదు విధించారు. ఇక రూ.10 వేల నుంచి రూ.15 వేలు జరిమానాలు చెల్లించాలని, లేదంటే 4 నెలలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో వెల్లడించారు.

కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత: ప్రణయ్‌ హత్య కేసులో సోమవారం తుది తీర్పు వెలువడు తుందని తెలిసిన ప్రజా సంఘాల నాయ కులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు వచ్చారు. దీనితో పోలీసులు భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, సిబ్బంది, నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించాక.. నింది తుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు. తన తండ్రి ఎలాంటి నేరం చేయలేదని, అయినా శిక్ష పడిందంటూ.. తిరునగరు శ్రవణ్‌కుమార్‌ కూతురు శ్రుతి బోరున విలపించింది. కాగా.. కోర్టు తీర్పు పరువు హత్యలకు పాల్పడే వారికి చెంప పెట్టు వంటిదని ప్రణయ్‌ హత్య కేసును వాదించిన స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దర్శనం నర్సింహ పేర్కొన్నారు.

అమృతకు బాసటగా కౌసల్య 
మిర్యాలగూడ అర్బన్‌: ప్రణయ్‌ హత్య ఘటన జాతీయ స్థాయిలో సంచలనం రేప డంతో.. ఇదే తరహాలో బాధితురాలిగా మారిన తమిళనాడు మహిళ కౌసల్య మిర్యాలగూడకు వచ్చి అమృతకు బాసట గా నిలిచారు. కౌసల్య గతంలో శంకర్‌ అనే యువకుడిని ప్రేమించి కులాంతర వివా హం చేసుకుంది. ఇది తట్టుకోలేని కౌసల్య తండ్రి.. శంకర్‌ను హత్య చేయించాడు. తన భర్త మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ పోరాటం చేసిన కౌసల్య నిందితులకు శిక్షపడేలా చేసింది.

ప్రణయ్‌ ఘటన విషయం తెలిసి మిర్యాలగూడకు వచ్చింది. తనకు జరిగిన అన్యాయం, ఆ కేసులో నిందితులకు పడిన శిక్షలను అమృతకు వివరించి ధైర్యం చెప్పింది. తమిళ నాడులోని కేసుకు సంబంధించిన ఫైల్‌ కాపీని సైతం ఆమె ఇక్కడి పోలీసులకు అందజేసినట్టు సమాచారం.

కేరళ ఎంపీ డిమాండ్‌తో..: కేరళకు చెందిన దళిత సోషల్‌ ముక్తి మంచ్‌ జాతీయ నాయకుడు, ఎంపీ సోం ప్రసాద్‌ మిర్యాల గూడకు వచ్చి.. అమృతను పరామర్శించారు. దేశంలో పరువు హత్యలను నివారించడానికి ప్రణయ్‌ చట్టం తేవాలని ఆయన పార్లమెంట్‌ సమావేశాల్లో డిమాండ్‌ చేశారు. దానితో ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement