
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్‌ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు.