Tenth question paper leak
-
హరీశ్ పరీక్ష ఫలితాలు వెల్లడించండి
సాక్షి, హైదరాబాద్/కమలాపూర్: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న దండెబోయిన హరీశ్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి చేసిన డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. అనంతరం ఇతర విద్యార్థులలాగానే హరీశ్‌కు అన్ని సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. కమలాపూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఏప్రిల్ 4న హిందీ ప్రశ్నపత్రం బయటికి రాగా విద్యార్థి దండెబోయిన హరీశ్‌ను బాధ్యుడిని చేస్తూ అప్పటి డీఈఓ ఐదేళ్లపాటు డీబార్ చేశారు. దీంతో విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులతో మిగిలిన పరీక్షలు రాశాడు. అయినప్పటికీ ఫలితాల్లో హరీశ్‌ది విత్‌హెల్డ్‌లో పెట్టి మాల్ ప్రాక్టీస్ కింద చూపారు. దీంతో హరీశ్ మరోసారి తన ఫలితాలు ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుదీర్‌కుమార్ బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. హరీశ్ పరీక్ష ఫలితాలను అధికారులు వెల్లడించకుండా విత్ హెల్డ్‌లో పెట్టారని, దీంతో అతను పైతరగతులకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. హరీశ్ ఫలితాలు వెంటనే వెల్లడించడంతోపాటు సర్టిఫికెట్లన్నింటినీ అందజేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల పట్ల హరీశ్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు చెప్పినా ఫలితాలు ప్రకటించడం లేదు: బల్మూరి పేపర్ లీకేజీ కేసులో అకారణంగా డీబార్ చేసిన విద్యార్థి హరీశ్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినా హరీశ్ ఫలితాలు విడుదల చేయడం లేదని, మరో రెండు, మూడు రోజుల్లో ఇంటర్ అడ్మిషన్లు పూర్తవుతున్న తరుణంలోనైనా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసి హరీశ్‌కు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్, బీజేపీలు తమ రాజకీయ డ్రామాల కోసం హరీశ్ జీవితంతో ఆడుకుంటున్నాయని గురువారం గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. కనీసం పదో తరగతి పేపర్ లీకేజీతో సంబంధం ఉందని అరెస్టు చేసిన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసు ఏమైందో అయినా ప్రభుత్వం చెప్పాలని వెంకట్ ఎద్దేవా చేశారు. -
బండికి రిమాండ్.. కరీంనగర్లో హైఅలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ముగ్గురికి హనుమకొండ మొదటి సెషన్స్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇందులో బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు, మిగతా ముగ్గురిని ఖమ్మం జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు వారిని జైళ్లకు తరలించారు. అటూ ఇటూ తిప్పి కోర్టుకు.. : మంగళవారం కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచ్చిన కేసులో పోలీసులు బండి సంజయ్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను అర్ధరాత్రి తర్వాత యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో హనుమకొండలోని నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి జడ్జి రాపోలు అనిత ఎదుట హాజరుపర్చారు. తన అరెస్టు సందర్భంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారని, తనకు గాయాలు అయ్యాయని జడ్జికి సంజయ్ విన్నవించారు. దానిపై స్పందించిన న్యాయమూర్తి.. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, కమలాపూర్ సీఐ సంజీవ్‌లను పిలిపించుకుని విచారించారు. తర్వాత బండి సంజయ్, ఇతర నిందితులను రిమాండ్ చేయాలంటూ పోలీసులు ఇచ్చిన రిపోర్టుపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. నిందితుల అభ్యంతరాలను తిరస్కరించి.. విచారణ సందర్భంగా బండి సంజయ్‌పై కేసు నమోదు, అరెస్టు తీరుపై ఆయన తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇచ్చాకే అరెస్టు చేయాలని.. ఈ కేసులో అలా చేయలేదని, రిమాండ్‌ను తిరస్కరించాలని పిటిషన్ వేశారు. వాదనలు విన్న జడ్జి.. నిందితుల అభ్యర్థనను తిరస్కరించి, పోలీసుల రిమాండ్ రిపోర్టును అంగీకరించారు. బండి సంజయ్‌తోపాటు బూర ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు), గుండెబోయిన మహేశ్ (కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్), మౌటం శివగణేశ్ (డ్రైవర్)లకు 14 రోజులు రిమాండ్ విధించారు. సంజయ్‌కు హాని ఉందనడంతో.. అయితే బండి సంజయ్‌కు ప్రాణహాని ఉందని, ఆహారంలో విష ప్రయోగం చేసి చంపే అవకాశం ఉందని న్యాయవాదులు కోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో సంజయ్‌కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించిన మీదటే అందజేయాలని జడ్జి ఆదేశించారు. ఇక వరంగల్ కోర్టు పరిధిలోని నిందితులను రిమాండ్ నిమిత్తం ఖమ్మం జైలుకు తరలిస్తారు. కానీ సంజయ్ తరఫు న్యాయవాదులు ఆయనను కరీంనగర్ జైలుకు తరలించాలని కోరగా న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు బండి సంజయ్‌ను భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ జైలుకు తీసుకెళ్లారు. మిగతా నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు. కరీంనగర్లో హైఅలర్ట్ కరీంనగర్ క్రైం: పోలీసులు బండి సంజయ్‌ను బుధవారం రాత్రి 10 గంటలకు కరీంనగర్ జైలుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్ పట్టణంలో హైఅలర్ట్ ప్రకటించారు. మానేరు బ్రిడ్జి నుంచి బస్టాండ్ వరకు, జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్ కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుని ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా ఒకే చెప్పలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బాస సత్యనారాయణను మాత్రమే జైలు వద్దకు అనుమతించారు. దౌర్జన్యంగా లాక్కెళ్లారు: సంజయ్ భార్య అపర్ణ పోలీసులు తన భర్తను దౌర్జన్యంగా లాక్కెళ్లారని బండి సంజయ్ సతీమణి అపర్ణ బుధవారం ఆరోపించారు. మంగళవారం అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చిన పోలీసులు.. సంజయ్ భోజనం చేసిన తర్వాత గుండెకు సంబంధించిన మందులు వేసుకోవాల్సి ఉందని చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. వారెంట్ చూపించాలని అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. పోలీసుల తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై పెట్టిన సెక్షన్లు ఇవీ.. బండి సంజయ్, ఇతర నిందితులపై కమలాపూర్ పోలీసులు 4ఏ, 6 రెడ్‌విత్ 8 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997; సెక్షన్ 66డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)యాక్ట్లతోపాటు ఐపీసీ సెక్షన్లు 120బీ,420, 447, 505 కింద కేసు నమోదు చేశారు. ► ఇందులో ప్రధాన నిందితుడి (ఏ1)గా బండి సంజయ్‌ను, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పోతబోయిన వర్షిత్ పేర్లను చేర్చారు. ► మొత్తం పది మందిపై కేసు నమోదు చేయగా.. మొదట నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పోలీసులు వెల్లడించారు. -
హిందీ‘టెన్’షన్
సాక్షిప్రతినిధి, వరంగల్: టెన్త్ హిందీ ప్రశ్నపత్రం కూడా అవుటైంది. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే తాండూరులో తెలుగు ప్రశ్నపత్రం లీకవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా.. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే, రెండోరోజే హిందీ పేపర్ కూడా బయటకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. మంగళవారం పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాట్సాప్ గ్రూపులలో హిందీ ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యింది. ఈ మేరకు అందిన సమాచారంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే ఉమ్మడి వరంగల్ కలెక్టర్లు, పోలీసు కమిషనర్, ఎస్పీలు, డీఈవోలతో మాట్లాడారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు సోషల్ మీడియాలో వైరలైన పోస్టింగ్‌ల ఆధారంగా దర్యాప్తు జరిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చినట్లు తేల్చారు. ఓ మైనర్ బాలుడితో పాటు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. కమలాపూర్ మండలానికి చెందిన ఓ బాలుడు (16) తన స్నేహితుడికి చిట్టీలు అందించడం కోసం ఈ పని చేశాడని, దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి పరీక్ష రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసేలా ç‘పేపర్ లీక్’ అంటూ ప్రచారం చేశారని చెప్పారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గోడెక్కి ఫొటో తీసి.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాస్తున్న తన మిత్రుడికి సహాయం చేసేందుకు కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టు సహాయంతో గోడెక్కాడు. మొదటి అంతస్తులోని మూడవ సంబర్ గది కిటికి పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్థి నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకుని తన సెల్ఫోన్లో 9.45కు ఫొటో తీశాడు. 9.46కు మౌటం శివ గణేష్‌కు వాట్సాప్‌లో పంపాడు. మౌటం శివ గణేష్ ఉదయం 9.59 గంటలకు తన సెల్‌ఫోన్ ద్వారా 31 మంది సభ్యులున్న ఎస్సెస్సీ 2019–20 అనే వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డు చేశాడు. ఆ గ్రూపులో ఉన్న గుండెబోయిన మహేశ్ అనే మాజీ రిపోర్టర్ (పస్తుతం కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్) దూడం ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు)కు పంపించాడు. అతను ‘బ్రేకింగ్ న్యూస్.. రెండోరోజు పదో తరగతి పేపర్ లీక్..’ అంటూ 10.46 కల్లా హిందీ ప్రశ్నపత్రం ఓ జర్నలిస్టుల గ్రూపుతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి, మరో 110 మందికి పోస్టు చేశాడు. చివరికిది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఎక్కడినుంచి పేపర్ లీకయ్యిందో స్పష్టత లేకపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. సైబర్‌క్రైం పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయమై ఆరా తీశారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఒకరి తర్వాత మరొకరికి పోస్టయిన విషయం వెలుగులోకి వచ్చింది. అందరికీ నోటీసులు ఇస్తాం: సీపీ బాలుడితో పాటు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని, మైనర్‌ను జువైనల్ హోంకు, శివ గణేష్, ప్రశాంత్‌ను రిమాండ్‌కు పంపినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. మహేశ్ పరారీలో ఉన్నాడని, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారందరికీ నోటీసులు ఇచ్చి విచారిస్తామని తెలిపారు. ఎప్పుడైనా పరీక్షకు ముందే పేపర్ బయటకు వస్తే దాన్ని లీక్ అంటామని.. పరీక్ష కేంద్రంలో క్వశ్చన్ పేపర్ ఇచ్చాక బయటకు వస్తే కాపీయింగ్ అంటామని కమిషనర్ వివరణ ఇచ్చారు. ఇలావుండగా పేపర్ అవుట్ కలకలం సృష్టించడంతో స్నేహితుడి కోసం బాలుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. -
బండి సంజయ్ అరెస్టు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్‌క్రైం: కరీంనగర్లో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నగర పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. టెన్త్ పేపర్ల లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా సంజయ్‌ను హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు , సీఐలు నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి దాదాపు 50 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని సహకరించాలని కోరారు. తన అరెస్టుకు కారణంగా చూపించాలని, తనకు వారెంటు చూపాలంటూ పోలీసులతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. మరో వైపు బండి సంజయ్పే అరెస్టు చేస్తున్నారనే ప్రచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంజయ్‌ను పోలీసులు ఇంటి నుండి బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాన్ని కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేస్తూ ఆయన అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు, అనుచరులు కోరినా పట్టించుకోకుండా అరెస్టు చేసి తీçసుకెళ్ళారు. తిమ్మాపూర్ మీదుగా సంజయ్‌ను తీసుకెళ్తుండగా వాహనం మొరాయించడంతో మరో వాహనంలో సంజయ్‌ను తీసుకెళ్లారు. అయితే పోలీసు వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయి. బుధవారం బండి సంజయ్ అత్త ( సంజయ్ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో సంజయ్ కరీంనగర్‌కు వచ్చారు. బుధవారం ఉదయం టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆకస్మికంగా అరెస్టు చేయడం గమనార్హం. కాగా సంజయ్ అరెస్టును బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని, అరెస్టుకు కారణం చెప్పకుండా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేస్తారా? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్‌కు మూడిందని అన్నారు. -
కర్నూల్లో టెన్త్ ప్రశ్నపత్రం లీక్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన టెన్త్ సోషల్ పేపర్–2 ప్రశ్నపత్రం ముందుగానే లీకైంది. ఉదయం 9.30గంటలకు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్‌లో చక్కర్లు కొట్టింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి డీఈఓ సెల్కే రావడంతో పేపర్ ముందుగానే లీకైన విషయం వెలుగుచూసింది. కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. రోజూలాగే శనివారం ఉదయం 9.30గంటలకు సోషల్ పేపర్–2 పరీక్ష ప్రారంభమైంది. 9.50గంటల ప్రాంతంలో డీఈఓ తహెరా సుల్తానా సెల్‌కు ప్రశ్నపత్రం వచ్చింది. ఇది ఒరిజినల్ ప్రశ్నపత్రమే అని ఆమె ధృవీకరించుకుని కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలిగే ఓ అమాత్యుని కార్పొరేట్ పాఠశాల ద్వారానే ఈ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు నుంచి సదరు విద్యా సంస్థను తప్పించేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ విద్యా సంస్థకు ముందుగానే.. వాస్తవానికి 10వ తరగతి ప్రశ్నపత్రాలు మొదటి నుంచీ సదరు విద్యా సంస్థకు లీకు అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆ పాఠశాల సిబ్బంది విద్యార్థులతో జవాబులను బట్టీ పట్టిస్తున్నారు. అవీ చదవలేని విద్యార్థుల కోసం చిట్టీలను కూడా సదరు యాజమాన్యం అందిస్తోందని తెలుస్తోంది. సమాధానాలను ఒక పేపరు మీద ఉపాధ్యాయులతో రాయిస్తున్నారు. వీటిని మైక్రో జిరాక్స్ తీసి విద్యార్థులకు అందజేస్తున్నారు. కాగా, ఏ నెంబరు నుంచి మొదట ప్రశ్నపత్రం లీకై వచ్చిందనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలోనే.. వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పలుమార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 1995లో ఒకసారి టెన్త్ ప్రశ్నపత్రాలు లీకవడంతో చివర్లో జరగాల్సిన మూడు పరీక్షలను వాయిదా వేశారు. అనంతరం తిరిగి షెడ్యూల్ ప్రకటించి పరీక్షలను నిర్వహించారు. దీనిపై అప్పట్లోనే అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 1997లో ఏకంగా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. దీంతో ఆ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఈ రెండుసార్లు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అప్పట్లో సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న కోలా రామబ్రహ్మం పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థలు, ఇంటర్మీడియట్ అధికారులతో పాటు ఏకంగా సీఎంపైనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు అప్పట్లో బాగా డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యా సంస్థపైనే అప్పట్లోనూ ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిగినప్పటికీ అసలు దోషులు మాత్రం తప్పుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు హయాంలోనే టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కావడం గమనార్హం. కేసు నమోదు చేశాం : డీఎస్పీ కాగా, టెన్త్ సోషల్ పేపర్–2 ప్రశ్నపత్రం లీక్ కావడంపై కర్నూలు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. -
లీకేజీపై దద్దరిల్లిన అసెంబ్లీ
స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన విపక్షం సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై గురువారం రాష్ట్ర అసెంబ్లీ దద్దరిల్లింది. నినాదాలు, ప్లకార్డులు, అరుపులు, కేకలతో సభ అట్టుడికింది. ఓ దశలో ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుటే కాకుండా పోడియంపైకి చేరుకుని నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పరం వాగ్వాదాలతో పాటు ఉభయ పక్షాలు సభ మధ్యలోకి దూసుకురావడంతో ఉద్రిక్తత నెలకొంది. పేపర్ల లీకేజీపై గురువారం ప్రకటన చేయాల్సి ఉన్నప్పటికీ చేసేది లేదని కాసేపు, చేస్తామని కాసేపు అధికారపక్షం కాసేపు దోబూచులాడింది. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటలోపే స్పీకర్ సభను నాలుగు సార్లు వాయిదా వేశారు. లీకేజీపై ప్రభుత్వం మంగళవారం ప్రకటించినట్టుగా గురువారం సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్షం సభ్యులు పట్టుబట్టగా ఇప్పటికే సీఎం వివరణ ఇచ్చినందున తిరిగి ఇవ్వాల్సిన పని లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కొట్టిపడేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. -
సర్కారు సెల్ఫ్‌గోల్!
ప్రశ్నపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్రప్రభుత్వం లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా? అప్పుడే కుంభకోణంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సీబీఐ విచారణ జరిపించే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా? –ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సవాల్ పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు వెల్లడైతే సాక్షిపై చర్యలు తీసుకుంటా. –ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీఐ విచారణ ఎందుకు? ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నాం. –మంత్రి గంటా శ్రీనివాసరావు సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రకరకాల వాదనలను ముందుకు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయింది. ఈ లీకేజీ వ్యవహారంలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు నారాయణ విద్యాసంస్థల అధినేత మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణలిద్దరి హస్తం ఉన్నట్లు స్పష్టం కావడంతో అధికారపక్షం ఇరకాటంలో పడి విలవిల్లాడింది. జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామంటూ దబాయిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ విసిరిన సవాల్‌కు జవాబు చెప్పలేక ఆత్మరక్షణలో పడిపోయారు. లీకేజీకి కారకుడైన వాటర్‌బాయ్ నారాయణ స్కూల్లో ఉద్యోగి కాదా అని జగన్ ప్రశ్నించడంతో అప్పటివరకు గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి సైలెంట్ అయిపోయారు. సహచర మంత్రిని రక్షించుకునేందుకు అసెంబ్లీ సాక్షిగా బాబు తాపత్రయపడడం స్పష్టంగా బయటపడింది. తగినంత సమయం మైక్ ఇవ్వకపోయినా రాష్ట్రప్రభుత్వ దివాలాకోరుతనాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షం సఫలమయ్యింది. కన్నంలో చిక్కిన దొంగలా పరిస్థితి మారడంతో ముఖ్యమంత్రి, మంత్రులు జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శించారు. జగన్ మాట్లాడుతుండగా పదేపదే మైక్ కట్ చేసి మంత్రులకు స్పీకర్ అవకాశమిచ్చారు. అయితే దక్కిన కొద్ది సమయంలోనే ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడంలో ప్రతిపక్షనేత విజయంసాధించారు. అధికారపక్షం... పలాయనమంత్రం ప్రశ్నాపత్రాల లీకేజీలపై సభలో గురువారం కూడా అదే గందరగోళం.. అదే దొంగాట.. లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా అధికారపక్షం మరోసారి పలాయనమంత్రం పఠించింది. ఈ వ్యవహారంలో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, మంత్రులు సమస్యను తప్పుదోవ పట్టించడం కోసం జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణకు సహకరించాలని కోరుతూనే.. ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ చేసిందని అభాండాలు వేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’ మీడియాపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనితతో ఆరోపణలు చేయించి.. చర్చను పక్కదోవ పట్టించి గట్టెక్కేయత్నం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షం పట్టుబట్టింది. అధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను స్తంభింపజేసింది. ఉదయం 9 గంటల నుంచి నాలుగుసార్లు వాయిదా వేసిన అనంతరం.. మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది. మాల్‌ప్రాక్టీస్‌గా చిత్రీకరించే యత్నం... మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమయ్యాక మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రకటన చేస్తారని చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నా మంత్రి జాడ కానరాలేదు. మంత్రి ఎక్కడున్నారంటూ ప్రతిపక్షం నినాదాలు చేయడంతో స్పీకర్ తన స్థానం నుంచి దిగి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. మంత్రి గంటాను సభలోకి రప్పించి ప్రకటన చేయించారు. లీకేజీపై మంత్రి చేసిన ప్రకటనలో ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పాటు ఆరున్నర లక్షలమంది విద్యార్ధులకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని చాలా చిన్నదిగా.. మాల్‌ప్రాక్టీస్ గా చూపే ప్రయత్నం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని.. పోలీసు కేసు నమోదు చేయించామని చెప్పారు. గంటా ప్రకటన అనంతరం జగన్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ సర్కార్‌ను ఏకిపారేశారు. ఆధారాలు చూపిస్తూ.. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ.. జవాబులను విద్యార్థులకు చేరవేస్తూ.. ఆ స్కూళ్ల విద్యార్థులే ర్యాంకులు సాధించేలా చేస్తోన్న తీరును ఎండగట్టారు. నెల్లూరులో కేసు నమోదు చేయించడంలో జాప్యాన్ని.. అనంతపురం జిల్లా మడకశిరలో పేపర్ లీక్ చేసిన నారాయణ సంస్థల ఉద్యోగిని పోలీసులు వదిలేసిన తీరుపై సర్కార్‌ను నిలదీశారు. నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణ, మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇద్దరూ వియ్యంకులు కావడం వల్లే ఈ కుంభకోణం సాగుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు మంత్రులను బర్త్‌రఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత ఆధారాలను చూపుతూ ప్రశ్నాస్త్రాలను సంధించడంతో అధికారపక్షం ఆత్మరక్షణలో పడింది. జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, నారాయణ, యనమల, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, టీడీపీ ఎమ్మెల్యే అనిత, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అడుగడుగునా అడ్డుతగిలారు. ఇరుకునపడ్డ ప్రభుత్వం... ప్రతిపక్ష నేత సాక్ష్యాధారాలు చూపుతూ లోటుపాట్లను ఎత్తిచూపడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేయడంతో బాబు ఎదురుదాడికి దిగారు. వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడమే కాక సాక్షి స్టింగ్ ఆపరేషన్ చేసిందని ఆరోపించారు. లీకేజీలపై విచారణలో తప్పులున్నట్లు తేలితే ఎవర్నీ వదిలిపెట్టనని.. తాను చండశాసనుణ్ని అంటూ విచారణకు సహకరిస్తారా లేదా అంటూ ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. కావాలంటే జ్యుడిషియల్ విచారణ కూడా వేస్తానన్నారు. ఇదే సమయంలో సమయం లేదు ప్రతిపక్షమా.. మీకున్నది రెండే ఆప్షన్లు సహకరిస్తారా పారిపోతారా అంటూ వ్యంగ్యంగా అన్నారు. కానీ.. జగన్ ఏమాత్రం సంయమనం కోల్పో కుండా బాబు ఎత్తులను తిప్పికొట్టారు. ‘నేను నీలా వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడలేను’ అంటూ చురకలు వేస్తూనే.. చిత్తశుద్ధి ఉంటే మంత్రులను బర్త్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ విచారణకు సిద్ధమా? మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. విచారణకు సాక్షి సహకరిస్తుంది’ అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో విపక్ష సభ్యులు స్పందిస్తూ.. ‘సమయం లేదు మిత్రమా.. శరణమా.. మరణమా..’ అంటూ అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌తో ఆత్మరక్షణలో పడిన అధికారపక్షం.. అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే అనితతో చర్చతో సంబంధం లేని అంశాన్ని ప్రస్తావింపజేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ కోడెల స్పందిస్తూ.. ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తామన్నారు. అదే క్రమంలో లీకేజీలపై ప్రతిపక్షం సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా అధికారపక్షం జ్యుడీషి యల్ విచారణ చేయిస్తామన్నదంటూ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
నేను చంద్రబాబులాగా చెప్పను: వైఎస్ జగన్
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరం లేని విషయాలు ప్రస్తావనకు తెచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్హతల విషయాన్ని సీఎం తన చర్చలోకి లాక్కొచ్చారు. అయితే సీఎం వ్యాఖ్యలకు వైఎస్ జగన్ దీటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా, చురకలు అంటించారు. తాను బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవానని, తాను అన్నింటిలోనూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్‌నని వైఎస్ జగన్ అన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీలోనూ ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాయని ఆయన తెలిపారు. అయితే తాను సీఎం చంద్రబాబులాగా ఎంఫిల్ చదవకున్నా చదివానని చెప్పనని, ఆయనలా పీహెచ్డీ డిస్కంటిన్యూ చేయలేదంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఇంత దారుణంగా ఇంగ్లీష్ మాట్లాడే ముఖ్యమంత్రిని చూడలేదని, పక్క రాష్ట్రం మంత్రే ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. కాగా అంతకు ముందు చంద్రబాబు... తాను వెంకటేశ్వర యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివానని, అయితే ప్రతిపక్ష నేత ఎక్కడ చదివారో తెలియదంటూ వ్యాఖ్యలు చేశారు. దానిపై వైఎస్ జగన్ క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అన్నారు. -
దమ్ముంటే మా సవాల్ స్వీకరించండి
-
దమ్ముంటే మా సవాల్ స్వీకరించండి: వైఎస్ జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపిస్తే మంత్రి నారాయణ పాత్ర బయటకు వస్తుందని ఆయన అన్నారు. దమ్ముంటే తమ సవాల్‌ను స్వీకరించాలని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా వాదించి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. పేపర్ లీక్‌కు కారకులైన వారి విషయం ప్రస్తావించకుండా...లీక్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాక్షి విలేకరి గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సాక్షి తరఫున తమ పూర్తి సహకారం ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాలు సీబీఐకి అందిస్తామని తెలిపారు. పేపర్ లీక్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. జంబ్లింగ్ విధానంపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. తామే జంబ్లింగ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని సీఎం చెబుతున్నారని, 1978 నుంచే జంబ్లింగ్ విధానం అమల్లో ఉందన్నారు. నెల్లూరులో ఈ నెల 25న పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయితే... ప్రభుత్వం తీరిగ్గా 28న ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు. అదేవిధంగా కదిరిలోనూ హిందీ పేపర్ లీక్ అయ్యిందని, నారాయణ విద్యాసంస్థల సిబ్బందే స్వయంగా విద్యార్థులకు స్లిప్‌లు అందిస్తూ దొరికిపోయారన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నారు. దీనిపై ఏం చర్య తీసుకుంటారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. -
నేను చంద్రబాబులాగా చెప్పను
-
అందులోనూ 'నారాయణ' ఫస్ట్: రోజా
అమరావతి : ప్రతి సంవత్సరం ఫస్ట్ ర్యాంక్..సెకండ్ ర్యాంక్.. థర్డ్ ర్యాంకు అంటూ ప్రకటనలిచ్చి గొప్పలు చెప్పుకునే నారాయణ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రశ్నప్రతాల లీకులు వంటి అక్రమాల ర్యాంకుల్లోను ఆ సంస్థ ప్రథమ స్థానంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రంలో మూడేళ్లుగా ముఖ్యమంత్రి అసమర్థపాలన, మంత్రుల దద్దమ్మల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ....ఏ మాత్రం రాజకీయ అవగాహనలేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చి పాలన మొత్తం ఆయన చేతిలో పెట్టారన్నారు. వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, నారాయణలు ఇద్దరూ కలిసి రాష్ట్రంలోని విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని రోజా మండిపడ్డారు. ఇద్దరు వియ్యంకులు కలిసి విద్యా వ్యాపారం కోసం అనేక అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు, మంత్రి నారాయణ జిల్లా నెల్లూరు, గంటా శ్రీనివాసరావు ఇన్చార్జ్గా ఉన్న వైఎస్ఆర్ కడప, ఆయన జిల్లా విశాఖలోను టెన్త్ పేపర్లు లీకు అయ్యాయని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నారాయణ విద్యా సంస్థల ర్యాంకుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుని, వారి జీవితాలను నాశనం చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. విద్యాలయాల్లో జరుగుతున్న ఘటనలపై మంత్రి గంటా ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని మంత్రి గంటా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లారని, మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే ఆయన అమెరికాలో పర్యటిస్తారని, ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల్లో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీకు అయితే ఆస్తుల కేసు నుంచి బయటపడేందుకు పెద్దలను ప్రాధేయపడే పనిలో బిజీగా ఉన్నారని రోజా దుయ్యబట్టారు. మంత్రులుగా వాళ్లిద్దరూ ఎన్నిరోజులు అసెంబ్లీ సమావేశాలకు వచ్చారో వెల్లడించాలన్నారు. నిజంగా గంటాకు సిగ్గు శరం ఉంటే నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఇద్దరు మంత్రులు నారాయణ, గంటాలను బర్తరఫ్ చేసి, నారాయణ విద్యా సంస్థల్లో పేపర్ లీకేజిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అలా చేయలేకపోతే సీఎం స్వచ్చందంగా రాజీనామా చేయాలని హితవు పలికారు. -
లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్: చంద్రబాబు
-
లీక్ కాదు, మాల్ ప్రాక్టీస్: చంద్రబాబు
అమరావతి: అసెంబ్లీ సాక్షిగా టెన్త్ సైన్స్ ప్రశ్నాపత్రం లీకేజీకి ‘వాటర్ బాయ్, ఇన్విజిలేటర్, అటెండర్’ బాధ్యులు అయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. ఓ వైపు నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ....లీకేజీకి నారాయణ విద్యాసంస్థలకు సంబంధమే లేనట్లు .... ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్ చేసిన తర్వాత లీకేజీపై చర్చ చేయకుండానే చంద్రబాబు సభలో ప్రకటన చేశారు. అంతేకాకుండా ప్రశ్నపత్రం లీక్ కాలేదని, మాల్ ప్రాక్టీస్ అయినట్లు చెప్పుకొచ్చారు. పనిలో పనిగా 'సాక్షి'ని ఇందులోకి లాగే యత్నం చేశారు. లీకైందన్న పేపర్‌పై లావణ్య అనే పేరు ఉందని, ఆ పేరు ఆధారంగా అధికారులు దర్యాప్తు చేపట్టారని చంద్రబాబు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇన్విజిలేటర్‌ను విధులు నుంచి తొలగించారని, అలాగే ఇద్దరు సూపర్ వైజర్ల మీద చర్యలు తీసుకున్నట్లు సీఎం చెప్పారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఎంతటివారినైనా సహించేది లేదని, తప్పుడు పనులు చేస్తే ఎవర్నీ ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు. నెల్లూరులో టెన్త్ సైన్స్ పేపర్ 10.35 గంటలకు వాట్సప్‌లో బయటకు వచ్చిందన్నారు. పేపర్ నారాయణ విద్యాసంస్థలోనే లీకైనా అక్కడ పరీక్ష రాసింది ఆ విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు కారని ఆయన తెలిపారు. పేపర్ బయటకు రాగానే అధికారులు విచారణ ప్రారంభించారని చంద్రబాబు పేర్కొన్నారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని, ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామన్నారు. ‘సాక్షి’కి బుదర అంటించే కుట్ర... అలాగే సభలో పేపర్ లీకేజీపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి.. సున్నితమైన లీకేజీ అంశాన్ని 'సాక్షి'కి అంటగట్టే ప్రయత్నం చేశారు. నెల్లూరులోని ఓ పరీక్షా కేంద్రంలో ఓ వాటర్ బాయ్ ఉదయం 9.25 గంటలకు ఫోటో తీశారని చంద్రబాబు సభలో పేర్కొన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం పరీక్ష 9.30 గంటలకు మొదలవుతుంది. అంటే పరీక్ష జరగడానికి అయిదు నిమిషాల ముందే పరీక్ష పత్రాన్ని బయటకు పంపించారు. అది కూడా నారాయణ సంస్థల సిబ్బందేనని ముఖ్యమంత్రి సభలో ధ్రువీకరించారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి ప్రకటించని మరో అంశం.. వాటర్ బాయ్ వాట్సాప్‌లో ఈ పత్రాన్ని వేర్వేరు వ్యక్తులకు పంపించి ఉంటారన్నది. దాదాపు గంట తర్వాత వేర్వేరు గ్రూపుల్లో తిరుగుతున్న విషయాన్ని పసిగట్టిన సాక్షి రిపోర్టర్.. దీంట్లో నిజనిజాలను తెలుసుకునేందుకు మాత్రమే ఆ పోస్టింగ్‌ను డీఈవోకి పంపించారు. ఒక వేళ సాక్షి రిపోర్టరే తప్పు చేయాలనుకుంటే డీఈవోకు ఎందుకు పంపిస్తారన్న కనీస ఆలోచన సర్కార్‌కు రాలేదు. అసలు విషయాన్ని పక్కనబెట్టి.. ప్రభుత్వ వైఫల్యాలను పక్కకు తప్పించడానికి లీకేజీ విషయంలో సాక్షికి బురద అంటించే యత్నం చేశారు. మరోవైపు టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంతో అధికార యంత్రాంగం నెల్లూరుకు పరుగులు తీసింది. డీఈవో ఫిర్యాదుతో ఇంటెలిజెన్స్, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. -
సీబీఐ ఎంక్వైరీ వేయాలి: వైఎస్ జగన్
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా ...‘ఈ రోజు ఆరున్నర లక్షల కుటుంబాలకి సంబంధించిన అంశంలో ఏమాత్రం లెక్కలేనితనం ఈ ప్రభుత్వానిది. దాన్ని ఎంతసేపూ కవర్ చేసే ప్రయత్నమే తప్ప పరిష్కరించే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చెయ్యడం లేదు. ఈ ప్రశ్నా పత్రాల లీకేజీ ఇష్యూ లో తప్పు జరిగింది అని విద్యాశాఖే ఒప్పుకుంటుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే ఢిల్లీ నుండి మాట్లాడుతూ అటెండర్ ఫోన్ ద్వారా లీక్ అయింది అని చెబుతున్నారు. ఆ అటెండర్ ఏ కాలేజీకి చెందిన వాడో అందరికీ తెలుసు. ఆ కాలేజీ ఎవరిదో ఎఫ్ఐఆర్ కాపీయే చెబుతుంది. ఇలా ఇష్టమొచ్చినట్టు ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే కష్టపడి చదివిన విద్యార్థులకు కనీసం 100వ రాంకైనా వస్తుందా? ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు. అది వేస్తేనే కదా మిగిలిన ఎన్ని కాలేజీలలో ఇలాంటి భాగోతాలు జరుగుతున్నాయో తెలుస్తాయి. చంద్రబాబుకి మంత్రి నారాయణ బినామీ అని చెబుతారు. నారాయణ కాలేజీలో చంద్రబాబుకి వాటాలున్నాయని పుకార్లు ఉన్నాయి. స్కామ్ జరిగిన కాలేజీ ఒకమంత్రికి చెందినది.. దానిపై విచారణ జరిపించాల్సిన మరొక మంత్రి ఆయన వియ్యంకుడు. ఇది చాలదా ఈ కేసు ఎంత బాగా నడుస్తోంది అని చెప్పడానికి? చిన్న చిన్న అధికారుల పైనో..అటెండర్ల పైకో ఈ కేసు గెంటేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు ఈ కేసుపై చంద్రబాబు ఎందుకు స్పందించరు? చంద్రబాబు తరువాత ఎప్పుడో దీనిపై స్పందిస్తాననడం రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉంది. బహుశా కాపీలు కొట్టిన నారాయణ విద్యార్థులకు ఫస్ట్ రాంకు వచ్చాక స్పందిస్తారేమో’ అని ఎద్దేవా చేశారు. మంత్రి నారాయణ కారణంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నారాయణ యాజమాన్యంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ప్రశ్నించారు. తాము ఏ విషయాన్ని ప్రస్తావించినా చర్చకు అనుమతించడం లేదని, ప్రశ్నపత్రాల లీక్ గురించి ప్రశ్నిస్తే దాన్ని పక్కనపెట్టి ల్యాండ్ బిల్లును ఆమోదించారని అన్నారు. ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై వేసిన విచారణకు ఇప్పటికీ అతీగతి లేదని, ఏ విషయం అయినా దాటవేత ధోరణే అవలంభిస్తోందన్నారు. తాము అన్ని ఆధారాలు చూపించినా ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని వైఎస్ జగన్ అన్నారు. మరోవైపు టెన్త్ పేపర్ల లీకేజీపై ఏపీ అసెంబ్లీ మంగళవారం అట్టుడుకిపోయింది. ప్రశ్నాపత్రాల లీకేజీపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్ఆర్సిపి .. చర్చకు పట్టుబట్టింది. స్పీకర్ తిరస్కరించడంతో సభను స్తంభింపజేసింది. సభ ప్రారంభం కాగానే.. ఈ అంశాన్ని ప్రస్తావించిన విపక్షం.. వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని కోరింది. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు ఏం సమాధానం చెబుతారని మండిపడింది. టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీపై ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నివేదికను విపక్ష నేత వైఎస్ జగన్ సభలో బయటపెట్టారు. నారాయణ విద్యాసంస్థల్లో పేపర్ లీకైందని నివేదికలో తేలిందనీ..దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వైఎస్ జగన్ మైక్ కట్ చేయడంతో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పలుమార్లు సభ వాయిదా పడింది. -
అందులోనూ 'నారాయణ' ఫస్ట్: రోజా
-
అదే నిర్లక్ష్యం!
‘పది’ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ వైఫల్యం మొన్న మడకశిర, నిన్న కదిరిలో ప్రశ్నపత్రం లీక్ లీక్ వ్యవహారం వెనుక ‘నారాయణ’ హస్తం? పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తొలిరోజు మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ‘బీ’ కేంద్రంలో తెలుగు పేపర్–1 ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన తర్వాత అధికారులు హడావుడి చేశారు. మరింత పకడ్బందీగా నిర్వహిస్తామని, ఏ స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చేసినా యాక్ట్ -25 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు. ఇది జరిగి మూడు రోజులు కూడా గడవకనే సోమవారం కదిరి పట్టణంలో హిందీ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే జవాబుల జిరాక్స్ ప్రతులు బయట హల్చల్ చేశాయి. చివరకు సామాజిక, ప్రసార మాధ్యమాల్లోనూ దుమారం రేకెత్తించాయి. మడకశిర, హిందూపురంతో పాటు కదిరి పట్టణంలో చోటు చేసుకున్న లీక్ ఘటనల వెనుక కార్పొరేట్ శక్తులున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి నారాయణకు చెందిన పాఠశాలల సిబ్బందిపై ఆరోపణలు వస్తున్నాయి. హిందూపురం పట్టణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తాజాగా కదిరిలో దొరికిన హిందీ పరీక్ష జవాబు పేపర్ల వెనుక నారాయణ పాఠశాల హస్తముందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సిబ్బంది పాత్రపైనా అనుమానాలు పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్ల పాత్రపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరి ప్రమేయం లేకుండా ప్రశ్నపత్రం బయటకు వెళ్లదని, ఒకవేళ వెళ్లినా తిరిగి జవాబులు వచ్చి వాటిని పిల్లలు రాయాలంటే వీరి సహకారం ఉండాల్సిందేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ యాజమాన్యాలతో కొందరు సిబ్బంది కుమ్మక్కై అక్రమాలకు తెర తీశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కదిరి పట్టణంలోని వివిధ కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న నారాయణ పాఠశాల విద్యార్థులకు జవాబులు చేరవేశారు. ఆయా కేంద్రాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది కాకుండా పోలీసులు ఈ వ్యవహారాన్ని బయటకు తేవడం గమనార్హం. దీంతో కేంద్రాల్లోని సిబ్బంది తీరుపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక భారీ ఎత్తున డబ్బు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల ఆదేశాలు బేఖాతర్ తొలిరోజు మడకశిరలో చోటు చేసుకున్న ఘటనతో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్, జిల్లా కలెక్టర్, రీజనల్ జాయింట్ డైరెక్టర్, డీఈఓ తీవ్రంగా స్పందించి గట్టి ఆదేశాలు జారీ చేశారు. అయినా సిబ్బందిలో ఏమాత్రమూ భయం లేదనేది కదిరి ఘటనతో స్పష్టమవుతోంది. ఒకవైపు అధికారుల హెచ్చరికలు, మరోవైపు యాక్ట్ -25 నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని తెలిసినా బరి తెగిస్తుండటం గమనార్హం. అక్రమార్కులకు ప్రభుత్వంలోని ‘కీలక’ శక్తుల అండ ఉండటంతో కొన్ని కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది ‘చూసీ చూడనట్లు’ వెళ్తున్నట్లు తెలుస్తోంది.