సర్కారు సెల్ఫ్‌గోల్!
ప్రశ్నపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్రప్రభుత్వం
లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిద్ధమా? అప్పుడే కుంభకోణంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడుతుంది. సీబీఐ విచారణ జరిపించే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
–ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సవాల్
పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపిస్తాం. స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు వెల్లడైతే సాక్షిపై చర్యలు తీసుకుంటా.
–ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
సీబీఐ విచారణ ఎందుకు? ప్రశ్నాపత్రం లీక్ కాలేదు.. ఇది మాల్ ప్రాక్టీస్ మాత్రమే. ఈ వ్యవహారంలో ఇప్పటికే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నాం.
–మంత్రి గంటా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రకరకాల వాదనలను ముందుకు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయింది. ఈ లీకేజీ వ్యవహారంలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు నారాయణ విద్యాసంస్థల అధినేత మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణలిద్దరి హస్తం ఉన్నట్లు స్పష్టం కావడంతో అధికారపక్షం ఇరకాటంలో పడి విలవిల్లాడింది. జ్యుడీషియల్ విచారణ జరిపిస్తామంటూ దబాయిస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అంటూ విసిరిన సవాల్‌కు జవాబు చెప్పలేక ఆత్మరక్షణలో పడిపోయారు.
లీకేజీకి కారకుడైన వాటర్‌బాయ్ నారాయణ స్కూల్‌లో ఉద్యోగి కాదా అని జగన్ ప్రశ్నించడంతో అప్పటివరకు గట్టిగా మాట్లాడిన ముఖ్యమంత్రి సైలెంట్ అయిపోయారు. సహచర మంత్రిని రక్షించుకునేందుకు అసెంబ్లీ సాక్షిగా బాబు తాపత్రయపడడం స్పష్టంగా బయటపడింది. తగినంత సమయం మైక్ ఇవ్వకపోయినా రాష్ట్రప్రభుత్వ దివాలాకోరుతనాన్ని ఎండగట్టడంలో ప్రతిపక్షం సఫలమయ్యింది. కన్నంలో చిక్కిన దొంగలా పరిస్థితి మారడంతో ముఖ్యమంత్రి, మంత్రులు జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శించారు. జగన్ మాట్లాడుతుండగా పదేపదే మైక్ కట్ చేసి మంత్రులకు స్పీకర్ అవకాశమిచ్చారు. అయితే దక్కిన కొద్ది సమయంలోనే ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడంలో ప్రతిపక్షనేత విజయంసాధించారు.
అధికారపక్షం... పలాయనమంత్రం
ప్రశ్నాపత్రాల లీకేజీలపై సభలో గురువారం కూడా అదే గందరగోళం.. అదే దొంగాట.. లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌ను స్వీకరించకుండా అధికారపక్షం మరోసారి పలాయనమంత్రం పఠించింది. ఈ వ్యవహారంలో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, మంత్రులు సమస్యను తప్పుదోవ పట్టించడం కోసం జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై విచారణకు సహకరించాలని కోరుతూనే.. ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ చేసిందని అభాండాలు వేశారు.
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’ మీడియాపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే అనితతో ఆరోపణలు చేయించి.. చర్చను పక్కదోవ పట్టించి గట్టెక్కేయత్నం చేశారు. గురువారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షం పట్టుబట్టింది. అధికారపక్షం అంగీకరించకపోవడంతో సభా కార్యక్రమాలను స్తంభింపజేసింది. ఉదయం 9 గంటల నుంచి నాలుగుసార్లు వాయిదా వేసిన అనంతరం.. మధ్యాహ్నం 12.53 గంటలకు సభ ప్రారంభమైంది.
మాల్‌ప్రాక్టీస్‌గా చిత్రీకరించే యత్నం...
మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమయ్యాక మంత్రి గంటాశ్రీనివాసరావు ప్రకటన చేస్తారని చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నా మంత్రి జాడ కానరాలేదు. మంత్రి ఎక్కడున్నారంటూ ప్రతిపక్షం నినాదాలు చేయడంతో స్పీకర్ తన స్థానం నుంచి దిగి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. మంత్రి గంటాను సభలోకి రప్పించి ప్రకటన చేయించారు. లీకేజీపై మంత్రి చేసిన ప్రకటనలో ఒకదానికొకటి పొంతన లేకపోవడంతో పాటు ఆరున్నర లక్షలమంది విద్యార్ధులకు సంబంధించిన ఈ వ్యవహారాన్ని చాలా చిన్నదిగా.. మాల్‌ప్రాక్టీస్ గా చూపే ప్రయత్నం చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని.. పోలీసు కేసు నమోదు చేయించామని చెప్పారు.
గంటా ప్రకటన అనంతరం జగన్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోటుపాట్లను ఎత్తిచూపుతూ సర్కార్‌ను ఏకిపారేశారు. ఆధారాలు చూపిస్తూ.. నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తూ.. జవాబులను విద్యార్థులకు చేరవేస్తూ.. ఆ స్కూళ్ల విద్యార్థులే ర్యాంకులు సాధించేలా చేస్తోన్న తీరును ఎండగట్టారు. నెల్లూరులో కేసు నమోదు చేయించడంలో జాప్యాన్ని.. అనంతపురం జిల్లా మడకశిరలో పేపర్ లీక్ చేసిన నారాయణ సంస్థల ఉద్యోగిని పోలీసులు వదిలేసిన తీరుపై సర్కార్‌ను నిలదీశారు.
నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణ, మానవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇద్దరూ వియ్యంకులు కావడం వల్లే ఈ కుంభకోణం సాగుతోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు మంత్రులను బర్త్‌రఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత ఆధారాలను చూపుతూ ప్రశ్నాస్త్రాలను సంధించడంతో అధికారపక్షం ఆత్మరక్షణలో పడింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి సీఎం చంద్రబాబు, మంత్రులు గంటా, నారాయణ, యనమల, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, టీడీపీ ఎమ్మెల్యే అనిత, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు అడుగడుగునా అడ్డుతగిలారు.
ఇరుకునపడ్డ ప్రభుత్వం...
ప్రతిపక్ష నేత సాక్ష్యాధారాలు చూపుతూ లోటుపాట్లను ఎత్తిచూపడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేయడంతో బాబు ఎదురుదాడికి దిగారు. వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగడమే కాక సాక్షి స్టింగ్ ఆపరేషన్ చేసిందని ఆరోపించారు. లీకేజీలపై విచారణలో తప్పులున్నట్లు తేలితే ఎవర్నీ వదిలిపెట్టనని.. తాను చండశాసనుణ్ని అంటూ విచారణకు సహకరిస్తారా లేదా అంటూ ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. కావాలంటే జ్యుడిషియల్ విచారణ కూడా వేస్తానన్నారు. ఇదే సమయంలో సమయం లేదు ప్రతిపక్షమా.. మీకున్నది రెండే ఆప్షన్లు సహకరిస్తారా పారిపోతారా అంటూ వ్యంగ్యంగా అన్నారు.
కానీ.. జగన్ ఏమాత్రం సంయమనం కోల్పో కుండా బాబు ఎత్తులను తిప్పికొట్టారు. ‘నేను నీలా వచ్చీ రాని ఇంగ్లీషులో మాట్లాడలేను’ అంటూ చురకలు వేస్తూనే.. చిత్తశుద్ధి ఉంటే మంత్రులను బర్త్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘సీబీఐ విచారణకు సిద్ధమా? మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. విచారణకు సాక్షి సహకరిస్తుంది’ అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో విపక్ష సభ్యులు స్పందిస్తూ.. ‘సమయం లేదు మిత్రమా.. శరణమా.. మరణమా..’ అంటూ అధికారపక్షానికి కౌంటర్ ఇచ్చారు.
ప్రతిపక్ష నేత విసిరిన సవాల్‌తో ఆత్మరక్షణలో పడిన అధికారపక్షం.. అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు ఎమ్మెల్యే అనితతో చర్చతో సంబంధం లేని అంశాన్ని ప్రస్తావింపజేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలకు ముందు స్పీకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలను వక్రీకరించిన ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ కోడెల స్పందిస్తూ.. ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదిస్తామన్నారు. అదే క్రమంలో లీకేజీలపై ప్రతిపక్షం సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా అధికారపక్షం జ్యుడీషి యల్ విచారణ చేయిస్తామన్నదంటూ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.