ఎవరిది యజ్ఞం? ఎవరు రాక్షసులు? | Sakshi Guest Column On Andhra Pradesh Legislative Assembly Debate | Sakshi
Sakshi News home page

ఎవరిది యజ్ఞం? ఎవరు రాక్షసులు?

Published Wed, Mar 30 2022 3:12 AM | Last Updated on Wed, Mar 30 2022 2:09 PM

Sakshi Guest Column On Andhra Pradesh Legislative Assembly Debate

జగన్‌ ప్రభుత్వంపై పడినన్ని వ్యాజ్యాలు బహుశా దేశంలోనే ఏ ప్రభుత్వం పైనా పడి ఉండవు. వాటిలో తొంభై శాతం టీడీపీకి సంబంధించినవారివేనన్నది బహిరంగ రహస్యం! చంద్రబాబు ఈ మధ్యకాలంలో పార్టీ నాయకులతో కన్నా అడ్వకేట్లతో ఎక్కువ టైమ్‌ గడుపుతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కోర్టులలో ఇంకేమి కేసులు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చన్నదే వారి ప్రధాన చర్చ అని వేరే చెప్పనవసరం లేదు. అప్పట్లో చంద్రబాబు... రాజధాని భూముల నిర్బంధ సమీకరణకు వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుకు వెళ్లినా, వారిని రాక్షసులతో పోల్చేవారు. తాను యజ్ఞం చేస్తుంటే ప్రతిపక్షానికి చెందిన రాక్షసులు కోర్టుల ద్వారా అడ్డు పడుతున్నారని అనేవారు. మరి వీరిని రాక్షసులు అనాలా, వద్దా అన్నది చంద్రబాబే నిర్ణయించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చరిత్రాత్మకమైన చర్చనే జరిపింది. శాసన వ్యవస్థకూ, న్యాయ వ్యవస్థకూ మధ్య అంతరం ఏర్పడితే వచ్చే సమస్యలు ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. ఈ డిబేట్‌ గొప్పదనం ఏమిటంటే ఎక్కడా న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని తగ్గించకుండా, చాలా జాగ్రత్తగా సమ తూకంగా నిర్వహించడం! ఏ ఒక్క న్యాయమూర్తి పేరు తీసుకోలేదు. మూడు రాజధానులకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న రాజ్యాంగపరమైన లోపాలను ఎత్తి చూపారే తప్ప, ఎక్కడా న్యాయ వ్యవస్థను తూలనాడలేదు. వారు చెప్పదలిచింది చెప్పారు. అది కత్తిమీద సాము వంటిదే. అయినా విజయవంతంగా పూర్తి చేశారు. 

ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి రాజధానులపై తమ ప్రభుత్వ విధానాన్ని శాసనసభలో స్పష్టంగా చెప్పారు. న్యాయ వ్యవస్థకు ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. జగన్‌ తన ప్రసంగంలో న్యాయ వ్యవస్థ గొప్పదనాన్నీ, శాసన వ్యవస్థ విశిష్టతనూ తెలియజేస్తూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులకు సంబంధించిన చట్టాలను ఉపసం హరించుకున్న తర్వాత వాటిపై తీర్పు ఇవ్వడం ఏమిటని సందేహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎలాంటి చట్టం చేయరాదన్న హైకోర్టు అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఆచరణ సాధ్యం కాని గడువులు పెట్టడం, ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అడి గారు. కేంద్రం రెండుసార్లు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసి రాజధాని అన్నది రాష్ట్ర పరిధిలోని అంశమని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

దేశంలోనే ఈ డిబేట్‌ ఒక సంచలనం అవ్వాలి. ఇలాంటి సమస్యలు మరి కొన్ని రాష్ట్రాలలో కూడా ఉండవచ్చు. ఒకరి పరిధిలోకి మరొకరు వచ్చినప్పుడు ఇలాంటి డిబేట్లు తప్పనిసరి అవుతాయి. అందువల్ల ఇది చారిత్రాత్మక చర్యగా శాసన వ్యవస్థలో మిగిలిపోతుంది. ఉమ్మడి ఏపీలో కూడా ఒకటి, రెండు సార్లు న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై ప్రస్తావనలు వచ్చినా, ఇంత సవిస్తరంగా చర్చ జరగలేదని చెప్పాలి. హైకోర్టు తీర్పును సమర్థించిన చంద్రబాబు నాయుడు నిర్దిష్ట ప్రశ్నలకు సమా ధానం ఇవ్వకుండా కప్పదాటు ధోరణిలో అసలు తీర్పునే వ్యతిరేకించకూడదన్నట్లు మాట్లాడారు.

ఇక్కడ ఒక సంగతి గుర్తు చేయాలి. స్విస్‌ చాలెంజ్‌ పద్ధతి ద్వారా రాజధానిలో కాంట్రాక్టులు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసింది. దీనిపై కొందరు ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టువారు విచారణ చేసి కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం సంబంధిత సవరణలు చేసి కొత్త చట్టం తెచ్చింది. దీనర్థం ప్రభుత్వం తప్పు చేసిందనే కదా? కాకపోతే కొత్త చట్టం తేవద్దని ఆనాటి హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. జగన్‌ ప్రభుత్వం తాను చేసిన చట్టాలను ఉపసంహరించుకుని కోర్టుకు ఆ సంగతి తెలిపింది. అయినా తాము విచారణ జరుపుతామని, లేని చట్టాలపై తీర్పు ఇచ్చారు. దీనిపై చంద్రబాబుకు నిర్దిష్ట అభిప్రాయం ఉంటే చెప్పి ఉండవలసింది. ఆయన అలా చేయలేదు.

తీర్పు తను కోరుకున్నట్లు ఉంది కనుక దానిని సమర్థిస్తున్నారు. సింగపూర్‌ సంస్థ లతో ఒప్పందం అయినప్పుడు కొన్ని దారుణమైన కండిషన్‌లకు ఆనాటి ప్రభుత్వం ఒప్పుకుంది. 350 కోట్ల వరకే ఆ కంపెనీలు పెట్టుబడి పెడితే రాష్ట్ర ప్రభుత్వం వారికి ఐదువేల కోట్లకుపైగా వివిధ వసతుల కోసం ఖర్చు చేస్తే, వారు ప్లాట్లు వేసి అమ్ముకుంటారట. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. సింగపూర్‌తో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిదన్న వ్యాఖ్యలు కూడా వచ్చాయి. మరి వైసీపీ ప్రభుత్వం రాగానే సింగపూర్‌ కంపెనీలు సైలెంట్‌గా ఒప్పందం నుంచి తప్పుకున్నాయి. ఒప్పందాలే రద్దు చేయరాదంటున్న చంద్రబాబు దీనికి ఏం జవాబిస్తారు?

జగన్‌ కంటే ముందు మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సమర్థంగా తమ వాదనలు వినిపించారు. ధర్మాన, బుగ్గన అయితే అనేక ‘కేస్‌ లా’లు చదివి శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ చొరబడకూడదన్న సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకించారు. గౌరవ న్యాయస్థానం ఈ తీర్పు లన్నీ చూడకుండానే మూడు రాజధానులపై తీర్పు ఇచ్చిందా అన్న ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండదు. చట్టాలు చేసే అధికారమే చట్టసభకు లేకపోతే ఎన్నికలు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు అన్న ప్రశ్నను ఏపీ శాసనసభ వేసింది. ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు గౌరవ హైకోర్టు వారు సుమోటోగా తాము ఏ కారణంతో లేని చట్టాలపై తీర్పు ఇచ్చింది వివరణ ఇవ్వగలిగితే సమాజానికి మంచిది. లేకుంటే చట్ట సభ అడిగిన ప్రశ్నలకు న్యాయ వ్యవస్థలో జవాబులు లేవేమో అన్న అనుమానం రావచ్చు. 

గత మూడేళ్లలో అనేక కేసులలో వెలువడ్డ తీర్పులు వివాదాలకు అతీతంగా లేవన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. కారణం ఏమైనా ఏపీ శాసనసభలో సభ్యులు ఎవరూ హైకోర్టు వారు గత మూడేళ్లలో ఇచ్చిన వివిధ తీర్పుల మంచి చెడుల గురించి ప్రస్తావించ లేదు. కేవలం మూడు రాజధానుల కేసు, చట్టసభకు చట్టాలు చేసే అధి కారం లేదన్నంతవరకే పరిమితం అయి జాగ్రత్తగా మాట్లాడుతూనే, తమ అభిప్రాయాలను నిర్మొహ మాటంగా చెప్పారు. చంద్రబాబు మరో సంగతి చెప్పారు. జగన్‌ ప్రభుత్వం రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలట. జగన్‌ రాజధానులపై తన అభిప్రాయం కొంత మార్చుకుంటే మార్చుకుని ఉండవచ్చు. కానీ అదే సమయంలో అమరావతి అభివృద్ధి కూడా తన బాధ్యత అని చెప్పారు. కానీ అమరావతి, అమరావతి అంటూ కలవరించే చంద్రబాబు గానీ, ఆయన పక్ష సభ్యులు గానీ అసలు చర్చకే హాజరు కాలేదు. కేవలం నాటుసారా మరణాలు అంటూ రోజు సభలో గొడవ చేసి, చివరికి ఈలలు, చిడతలు వేసే స్థాయికి దిగజారి వ్యవహరించారే తప్ప ఇంత కీలకమైన చర్చలో పాల్గొని తమ భావాలను వ్యక్తం చేయలేదు. ఇది వారి వైఫల్యమే. దీనిని అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్న ఆ గ్రామాలవారు కూడా గమనించగలగాలి.  

రాజీనామా చేయాల్సి వస్తే చంద్రబాబు ఎన్నిసార్లు ఆ పని చేసి ఉండాల్సింది! అసలు 1994లో ప్రజలు ఎన్టీఆర్‌ను ఎన్నుకున్నారా, చంద్రబాబునా? ఎన్టీఆర్‌ను పడగొట్టి తాను అధి కారంలోకి వచ్చిన వెంటనే ప్రజల తీర్పు కోరా ల్సింది కదా? ఎన్టీఆర్‌ హయాంలో అమలు చేసిన మద్య నిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం స్కీమ్‌ అమలు వంటివాటిని ఎత్తివేసి నప్పుడు చంద్రబాబు రాజీనామా చేసి ప్రజల మనోగతం తెలుసుకున్నారా? 2014లో సంపూర్ణ రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి, తదుపరి అలా అడిగిన వారిని ఆశపోతులని అన్నప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? 45 వేల బెల్టు షాపులను ప్రోత్స హించినందుకు ఎవరు రాజీనామా చేయాలి? నిజానికి చంద్రబాబే స్థానిక ఎన్నికల సమయంలో అదే ప్రజాభిప్రాయం అని విజయవాడ, గుంటూరు సభలలో ప్రజలను రెచ్చగొడుతూ మాట్లాడారు. ‘ప్రజలకు బుద్ధి ఉంటే, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని భావిస్తే వైసీపీని ఓడించా’లని పిలుపు ఇచ్చారు. ప్రజలు ఆయనను ఖాతరు చేయలేదు. టీడీపీ దారుణంగా ఓటమి పాలైంది. అయినా చంద్రబాబు మళ్లీ ప్రజల తీర్పు అంటూ పాత పల్లవే ఎత్తుకున్నారు. 

ఏది ఏమైనా శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఉండే సున్నితమైన రేఖ చెరిగి పోకూడదు. అలా చెరిగినప్పుడే ఇలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. రెండు వ్యవస్థలు దీనిపై ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగితే అందరికీ మంచిది. 

- కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement