ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక సంచలనం. ఒక రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా అతి తక్కువ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాగలిగారు ఎన్టీఆర్. ఆయన జనాకర్షణ శక్తి అలాంటిది. పాలనలోనూ తనవైన ఆదర్శాలతోనే కొనసాగారు. కానీ కాలం ఆయనకు సహకరించలేదు. సింహంలా బతికినవాడే తన సొంత పార్టీనుంచి గెంటేయబడి సింహం గుర్తుతో మరో పార్టీ పెట్టుకునేందుకు సన్నద్ధమయ్యారు. పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబు పాతికేళ్లుగా పార్టీని ఏలుతున్నారు. కానీ గత వైభవం ఇప్పుడు మచ్చుకైనా కానరాదు. రికార్డులు సృష్టించిన పార్టీ మొన్నటికి మొన్న రికార్డు స్థాయిలో ఓడిపోయింది. బతికి బట్ట కట్టడమే నలభై ఏళ్ల పార్టీకి ఇప్పుడు పెనుసవాలు.
ప్రఖ్యాత సినీ నటుడు నందమూరి తారక రామారావు ఆరంభించిన తెలుగుదేశం పార్టీ 39 ఏళ్లు పూర్తి చేసుకుని, నలభయ్యో సంవత్సరంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీయే కొనసాగుతోందా అంటే అవుననలేం, కాదనలేం. ఎందుకు అవును అనలేమని అంటే పార్టీని నెలకొల్పిన ఎన్టీఆర్‌నే పార్టీ నుంచి బయటకు గెంటేశారు. సొంత పార్టీవారే ఆయనపై చెప్పులు విసిరారు. ఆయన మరో పార్టీ పెట్టుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఎన్నికల చిహ్నంగా సింహాన్ని ఎంపిక చేసుకోవాలని కూడా భావించారు. కానీ ఇంతలోనే దుర దృష్టవశాత్తూ పరమపదించారు. అందువల్ల ఇప్పుడున్న టీడీపీ ఆయన నెలకొల్పిన నాటిది కాదని భావించవచ్చు. కానీ ఆయన మరణం తర్వాత ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీని సొంతం చేసుకోగలిగారు. పార్టీ జెండాతో పాటు, ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను కూడా పొందారు. అప్పటికే న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టు ద్వారా చివరికి ఆ పార్టీ పేరుతో ఉన్న డెబ్భై ఐదు లక్షలను కూడా ఎన్టీఆర్ బతికి ఉండగానే స్వాధీనం చేసుకోగలిగారు. దానివల్లే ఎన్టీఆర్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని పలువురు నమ్ముతారు. అది వేరే విషయం. పార్టీ గుర్తు, నిధులు అన్నింటినీ చంద్రబాబు కైవసం చేసుకోవడం వల్ల, ఎన్టీఆర్‌కు సంబంధం లేకపోయినా ఇదే నలభై ఏళ్లనాటి పార్టీ అని చెప్పవలసి ఉంటుంది.
1982లో ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక సంచలనం. ఆయన మాటే ఒక వేదవాక్కు మాదిరిగా అభిమానులు భావించేవారు. ఎక్కడకు వెళ్లినా వేలాది మంది స్వచ్ఛం దంగా తరలివచ్చేవారు. ఆయన నిలబెట్టిన అభ్యర్థి అయితే చాలు గెలుపు ఖాయం అన్న అభిప్రాయం ఉండేది. అంతవరకు అధి కారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయన పెద్ద గండంగా కనిపించారు. ఆయన ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గట్టి ప్రయత్నం చేయకపోలేదు. కానీ ఆమె తిరుపతికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు పరిస్థితి అర్థం అయిపోయింది. అప్పటికే గొప్పనేతగా వెలుగొందుతున్న ఇందిరాగాంధీ తిరుపతి సభకు అతి తక్కువ మంది వచ్చి పేలవంగా సాగడం, అదే రోజు సాయంత్రం ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన సభకు వేలాది మంది వచ్చి జయజయధ్వానాలు చేయడం కనిపించింది. తదనుగుణంగానే టీడీపీ అధికారంలోకి రావడం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. అలాంటి ఎన్టీఆర్‌ను దించడానికి 1984లో జరిగిన ఒక ప్రయత్నం విఫలం అయిన తీరు మరో సంచలనం. లక్షలాది మంది జనం తరలిరావడం, మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన వైపే ఉండటంతో ఇందిరాగాంధీ తిరిగి ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయడానికి ఒప్పుకోక తప్పలేదు. అప్పట్లో ఎన్నికల ఖర్చు కూడా తక్కువే. కొందరు అభ్య ర్థులు ఎన్టీఆర్ ఏమైనా డబ్బు ఇస్తారేమోనని ఆశించి అడిగితే, ‘ఎందుకు బ్రదర్, నా ఫొటో పెట్టుకుని తిరగండి చాలు’ అని చెప్పిన ఘట్టాలు కూడా ఉన్నాయి.
కానీ 1989లో అనూహ్యమైన రీతిలో తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయింది. రెండు చోట్ల పోటీచేసిన ఎన్టీఆర్ ఒక స్థానంలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్య, ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వడం, చంద్రబాబు అన్నింటి లోనూ జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు... ఇలా ఈ పరిణా మానికి అనేక కారణాలు. కానీ 1994 నాటికి రెట్టింపు శక్తిని తెచ్చుకుని ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అది కూడా ఆయన కొంప మునగడానికి కారణమైందా అన్న అభిప్రాయం ఉంది. భార్య బసవతారకం మరణించడం, తదుపరి కుటుంబ సభ్యులు ఆయన్ని సరిగ్గా పట్టించుకోలేదన్న ప్రచారం ఉంది. దాంతో తన జీవితచరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతికి దగ్గరై ఆమెను పెళ్ళి చేసుకున్నారు. వారిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారం కూడా చేసి విజయం సాధించారు.
ఇక్కడి నుంచి కొత్త రాజకీయం మొదలైంది. లక్ష్మీపార్వతి ఒక వర్గంగా, చంద్రబాబు మరో వర్గంగా గొడవలు పడుతుండేవారు. వారిద్దరూ తగాదాపడుతూ తన జోలికి రారులే అని ఎన్టీఆర్ అనుకునివుంటారు. కానీ అల్లుడే తన పతనానికి కారకుడు అవుతాడని ఊహించలేక ఘోరంగా దెబ్బతిన్నారు. 1995 ఆగస్టులో చంద్రబాబు అటు గవర్నర్ కృష్ణకాంత్‌ను, కేంద్రంలో ప్రధాని పీవీని మేనేజ్ చేసుకుని ముఖ్యమంత్రి అయిపోయారు. దాంతో ఆయనకు మెజా రిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడా వచ్చేసింది. నిజానికి ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబుతో సహా ఐదుగురిని మంత్రి పదవుల నుంచి తొల గించినా, పార్టీ నుంచి బహిష్కరించినా, గవర్నర్ మాత్రం చంద్ర బాబును టీడీపీ శాసనసభా పక్ష నేతగా గుర్తించడానికి అంగీకరిం చడం వివాదాస్పదంగానే మిగిలింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఎన్టీఆర్ మరణించడంతో పార్టీలో చంద్రబాబుకు ఎదురు లేకుండా పోయింది. దానికి తగ్గట్లు ఎన్టీఆర్ సంతానంలో పెద్దగా సమర్థులు లేకపోవడం కలిసి వచ్చింది.
అయితే టీడీపీని ఎన్టీఆర్ ఆశయాలతో నడిపించారా అన్నది చర్చనీయాంశం. ఆయన ఎన్నికలలో డబ్బు ఖర్చును పెద్దగా ప్రోత్స హించలేదు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జరిగిన మొదటి ఉప ఎన్నికనే అత్యంత ఖరీదైనదిగా మార్చారు. అప్పట్లోనే ఓటుకు 500 రూపాయలు ఇప్పించారని ఆయనతో సన్నిహితంగా మెలగిన మాజీ మంత్రి వేణుగోపాలాచారి వంటివారు చెబుతుంటారు. ఆ తర్వాత వామపక్షాలతో రెండుసార్లు, బీజేపీతో రెండుసార్లు పొత్తులు పెట్టుకోవడం చేశారు. అందువల్ల రాజకీయంగా లబ్ధి పొందారు. కానీ 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయడం మరో ప్రత్యే కత. ఎన్టీఆర్ ఒక మాట అంటే చాలావరకు దానిని నెరవేర్చుతారన్న భావన ఉండేది. తనతో ఉన్నవారికి ఏదో విధంగా న్యాయం చేసే వారని అంటారు. ప్రభుత్వంలో అవినీతికి పెద్దగా ఆస్కారం లేకుండా జాగ్రత్తపడ్డారని చెబుతారు. తెలుగుగంగ వంటి నీటిపారుదల ప్రాజె క్టులకు శ్రీకారం చుట్టి చరితార్థుడు అయ్యారు. కానీ చంద్రబాబు వాడుకుని వదిలేస్తుంటారన్న అపప్రథను మూటగట్టుకున్నారు. తడ వకో మాట చెబుతుంటారు. డబుల్ టంగ్ చేయడం ఆయన బలం, బలహీనత. బీజేపీని దూషించగలరు. వారితోనే జత కట్టగలరు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇస్తారు. విభజన తర్వాత ఏపీలో దానికి వ్యతిరేకంగా మాట్లాడగలరు. ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు మాట మార్చారో చెప్పనక్కర్లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి గురించి చెప్పనవసరం లేదు. మీడియాకు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఉప యోగపడితే చంద్రబాబు మీడియాను బాగా వాడుకున్నారు. మీడియా మేనేజ్‌మెంట్‌లో సిద్ధహస్తుడుగా పేరొందారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వారం ఒక మీడియా అధిపతి వద్దకు వెళ్లి ఆయా విషయాలపై చర్చించేవారు. ఇలా ఎన్టీఆర్‌కూ చంద్ర బాబుకూ మధ్య చాలా తేడాలున్నాయి. ఒకే ఒక్క క్రెడిట్ ఏమిటంటే సీఎం పదవినీ, పార్టీ అధ్యక్ష పదవినీ లాక్కున్న తర్వాత పాతికేళ్లపాటు నిలబడగలగడం. కానీ ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుని ఉంటే మంచి పేరు వచ్చేది. అధిక భాగం దుర్వినియోగం చేశారు. దాని ఫలితమే యువకుడైన వైఎస్ జగన్ చేతిలో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తింది. ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కాపాడుకోవడమే పెద్ద సవాల్‌గా మారింది. 1982లో టీడీపీ ఒక ఆశా కిరణంగా కని పించేది. 2021లో మాత్రం తీవ్రమైన నిరాశతో కుమిలి పోతోంది.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment