అభివృద్ధా? అయితే... వద్దట! | Kommineni Srinivasa Rao Guest Column TDP Politics | Sakshi
Sakshi News home page

అభివృద్ధా? అయితే... వద్దట!

Published Wed, Oct 6 2021 12:43 AM | Last Updated on Wed, Oct 6 2021 12:43 AM

Kommineni Srinivasa Rao Guest Column TDP Politics - Sakshi

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పరంగా చిన్న కదలిక జరిగినా, వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆ పార్టీ గొప్పలు పోయేది. వారికి మద్దతిచ్చే మీడియా తిరిగి దాన్నే ఊదరగొట్టేది. చంద్రబాబును పొగడడానికి విశేషణాలు చాలేవి కావు. కానీ అంతకంటే చొరవతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. వారికి మద్దతిచ్చే మీడియా లేని తప్పులను వెతుకుతూ ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తోంది. ఇదంతా ఎందుకో ఊహించడం పెద్ద కష్టం కాదు. సాగుతున్న సంక్షేమ పథానికి తోడుగా, అభివృద్ధి రథం కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరుగులు తీయనుంది. ఇది జీర్ణించుకోవడం కొందరికి కష్టమే.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు రాకుండా చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా తెలుగు దేశంకు మద్దతిచ్చే మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అదానీ గతంలో ఎన్నికలకు మూడు నెలల ముందు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిస్తే, వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ప్రచారం చేసిన ఇదే మీడియా, ప్రస్తుత ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిస్తే మాత్రం ‘ఆంధ్ర సూర్యుడు అదానీ’ అంటూ వ్యతిరేక కథనాన్ని ఇచ్చి తన ద్వేషాన్ని వెళ్లగక్కింది. మీడియా అన్నాక ఎందులో అయినా లోటుపాట్లను, అవకతవకలను రాయడం తప్పు కాదు. కానీ వచ్చే పరిశ్రమలను అడ్డుకునే విధంగా కథనాలు ఇవ్వడం మాత్రం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్లే అవు తుంది. ఈ పని ఎవరు చేసినా తప్పే. రాజకీయ పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది.

గతంలో పరిశ్రమలు వచ్చినా, రాకపోయినా ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. విశాఖ సదస్సుల ద్వారా ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయనీ, లక్షల మందికి ఉద్యో గాలు వచ్చేస్తున్నాయనీ ఊదరగొట్టేది. ఆ సదస్సులలో కొందరు దారిన పోయేవాళ్లతో కూడా ఎంఓయూలు కుదుర్చుకుని ఆనాటి ప్రభుత్వం అభాసుపాలైంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైనా వచ్చిందంటే అది కియా కార్ల కంపెనీనే. అంత వరకు మంచిదే. కానీ ఆ కియా సంస్థ పెట్టిన పెట్టుబడి ఎంత? ప్రభుత్వం ఎన్ని వేలకోట్ల రాయితీ ఇచ్చింది అన్నది వేరే విషయం. తిరుపతి, మంగళగిరి వంటి చోట్ల ఏవో చిన్న, చిన్న ఐటీ సంస్థలు వచ్చి ఉండవచ్చు. విశాఖలో లూలూ గ్రూప్‌కు భూమి కేటాయిస్తే వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

అమరావతిలో సింగపూర్‌ కంపెనీలకు రియల్‌ ఎస్టేట్‌ నిమిత్తం 1,600 ఎకరాలు కేటాయించి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ఐదువేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధపడినా ఆ కంపెనీలు అక్కడ చేసింది ఏమీ లేదు. పైగా ఆ తర్వాత చేతులు ఎత్తివేశారు. అలాగే బి.ఆర్‌.శెట్టి గ్రూప్‌ వారికి ఆసుపత్రి తదితర సంస్థల ఏర్పాటుకు అమరావతిలో వంద ఎకరాలు కేటాయించారు. కానీ ఆ కంపెనీపై దుబాయిలోనే పలు ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే తమ హయాంలో ఏమి జరిగినా, జరగకపోయినా బ్రహ్మాండం బద్దలవుతు న్నట్లు టీడీపీ నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా హోరెత్తించేది.

2019 జనవరిలో అదానీ వచ్చి ఆనాటి సీఎం చంద్రబాబును కలిశారు. ప్రధాని మోదీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న రోజులవి. అయినా మోదీకి సన్నిహితుడుగా పేరొందిన అదానీ ప్రత్యేక విమానంలో విజయవాడకు స్వయంగా వచ్చారనీ, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతున్నారనీ, డేటా సెంటర్లు రాబో తున్నాయనీ, ఇందుకోసం మంత్రి లోకేష్‌ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారనీ ప్రచారం చేశారు. అంతే కాదు, అదానీ రాకతో ప్రత్యర్థి పక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని కూడా ఆ మీడియా వారు వ్యాఖ్యా నించారు. ఎవరి హయాంలో మంచి పరిశ్రమ వచ్చినా సంతోషించా ల్సిందే.

కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు పారిశ్రామికవేత్త ఒకరు ముఖ్యమంత్రిని కలిస్తే వేల కోట్ల పెట్టుబడులు ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో మరో ప్రచారం కూడా చేశారు. అదేదో మోదీనే చంద్రబాబుతో రాజీకి అదానీని పంపించారని కూడా కొందరు టీడీపీ నేతలు ప్రచారం చేసేవారు. కానీ టీడీపీ మీడియా మాత్రం పరిశ్రమల వెల్లువ అని చెప్పేది. అంటే దీని ప్రకారం అదానీ గొప్పవాడు అని ఒప్పుకున్నట్లే కదా. అదానీ సోదరులు పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే కదా. మరి అలాంటి అదానీ సోదరులు ఇప్పుడు సీఎం జగన్‌ను కలిస్తే అది నష్టం ఎలా అవుతుంది? అదానీకి అంతా కట్టబెట్టేస్తున్నారని ప్రచారం చేయడంలో మతలబు ఏమిటి?

ఏపీలో సుమారు 8 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జాతీయ సౌరశక్తి సంస్థ ఒక ప్రతిపాదన చేసింది. ఇప్పటికే దానికి సంబంధించిన టెండర్‌ అదానీలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఖరారయ్యాయట. జాతీయ సౌర శక్తి సంస్థ ప్రతిపాదన కనుక ఏపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు ఏవైనా ఆరోపణలు చేయడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అంతకుముందు ఆరువేల మెగావాట్లకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, అందులో అన్యాయం జరిగిందంటూ కొందరు కోర్టుకు వెళ్లడం, కోర్టు వాటిని నిలుపుదల చేయడం జరిగింది. మరి అందులో టీడీపీ వర్గం పాత్ర ఎంత ఉందో తెలియదు. ఏపీ ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్లినా ఇంకా తేలలేదు. ఈలోగా జాతీయ సంస్థ ప్రతిపాదన రావడంతో ఏపీ క్యాబినెట్‌ ఇందుకు సమ్మతిస్తూ తీర్మానం చేసింది. ఒకరకంగా గత టెండర్‌దారులు కోర్టుకు వెళ్లి ఏపీకి మేలు చేశారన్నమాట. ఇది సహజంగానే టీడీపీకీ, ఆ వర్గం మీడియాకూ జీర్ణించుకోలేని సమస్యే.

అదానీ సోదరులకు ఇప్పటికే డేటా సెంటర్‌ ఏర్పాటు నిమిత్తం విశాఖపట్నంలో 130 ఎకరాల స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం కేటాయింది. అది కార్యరూపం దాల్చితే అక్కడ ఐటీ రంగం ముందుకు వెళుతుంది. మరో వైపు అదానీ సంస్థలు కనుక భారీ ఎత్తున సౌర ఉత్పత్తికి ఏపీని ఎంపిక చేసుకుంటే సుమారు యాభై వేల కోట్ల పెట్టుబడులు తేలికగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకా శాలు పెరుగుతాయి. చిన్న పరిశ్రమలకు కూడా మేలు జరగవచ్చు. సహజంగానే ఈ క్రెడిట్‌ జగన్‌ ప్రభుత్వానికి వస్తుంది. దీనిని రాకుండా చెడగొట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ మీడియా వ్యతిరేక ప్రచారం చేప ట్టిందన్నమాట. జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో సౌరశక్తి పీపీఏలను సవరించడానికి ప్రయత్నించింది.

టీడీపీ హయాంలో యూనిట్‌ విద్యుత్‌ రేటు నాలుగున్నర రూపాయలకు పైగా ఉంటే, దానిని తగ్గించడానికిగానూ పీపీఏలను రద్దు చేయాలని ప్రయత్నిస్తే ఇదే మీడియా, టీడీపీ వారు రాష్ట్రం నుంచి పెట్టుబడులను తరిమి వేస్తున్నారని ప్రచారం చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ అధిక రేటుకు ప్రైౖవేటు సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేసే వారు. ఇప్పుడు అదానీ సంస్థ యూనిట్‌ విద్యుత్‌ రేటును సుమారుగా రెండున్నర రూపాయలుగా నిర్ధారించే అవకాశం ఉన్నా, అందులో ఏదో తప్పు ఉన్నట్లుగా, ఇంకా తక్కువకే విద్యుత్‌ వస్తుంది అన్నట్లుగా కథనాలు వండి వార్చారు. పైగా మొత్తం ఆంధ్రలో సూర్యుడిని అదానీకి కట్టబెడుతున్నారని వాపోయారు. ఈ రోదన అంతా ఎందుకో ఊహించుకోవడం కష్టం కాదు. అంత పెద్ద సంస్థ ఏపీకి వస్తే జగన్‌ ప్రభుత్వానికి పెద్ద ప్లస్‌ అవుతుందన్న బాధ తప్ప, ఏపీకి మేలు జరుగుతుందన్న కించిత్‌ సంతోషం కూడా వీరికి లేదన్నమాట.

ఇక్కడితో ఆగడం లేదు. అదానీకి బందరు లడ్డు అంటూ బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి కూడా మరో కథనాన్ని ఇచ్చారు. ఆ పోర్టు అనేక సంవత్సరాలుగా ముందుకు వెళ్లడం లేదు. ఏవైనా కొన్ని సంస్థలు నిర్మాణానికి సంసిద్ధమైనా, వివిధ కారణాలతో చేయలేక పోయాయి. నిజంగానే ఇప్పుడు బందరు పోర్టు నిర్మాణానికి అదానీ సిద్ధపడితే బందరు దశ మారినట్లే. బందరు చుట్టుపక్కల ప్రజలు చిరకాలంగా కంటున్న కలలు ఫలించినట్లే. కానీ టీడీపీ మీడియాకు ఇది కూడా నచ్చడం లేదు. ఏవేవో క«థనాలు రాస్తూ పోర్టు నిర్మాణం జరగకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఏపీలో పోర్టులన్నీ అదానీ వశం అవుతున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఏపీకి సంబంధించి నంతవరకూ ఇలాంటి పరిణామాలు ఏ మాత్రం మంచివి కావు. ప్రజలు ఎవరూ వీటిని గమనించడం లేదని అనుకుంటే అది వారి భ్రమే అవుతుంది. ఇప్పటికే అలా చేస్తున్నవారికి కర్రు కాల్చి వాత పెట్టారు. అయినా వారు తమ దివాళాకోరు రాజకీయాన్నీ, ప్రచారాన్నీ ఆపకపోతే వారికి పుట్టగతులు లేకుండా పోతారని చెప్పక తప్పదు.


కొమ్మినేని శ్రీనివాసరావు

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement