ఆంధ్రప్రదేశ్‌లో ఇక ప్రధాన ప్రతి పక్షం తెలుగుదేశం కాదు.. ‘ఈనాడు’ మీడియానే. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కాదు..‘ఈనాడు’ అధినేత రామోజీరావే! ఈ మధ్య కాలంలో ‘ఈనాడు’ మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే ఈ అభి ప్రాయం కలుగుతుంది. చంద్రబాబు చేసే విమర్శలకు తన మీడియాలో అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వడంతో పాటు, టీడీపీ చెప్పడానికి ఇబ్బంది పడే విషయాలను రామోజీ తన భుజాన వేసుకుని మోస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం తాలిబన్ల రాజ్యం అంటూ సంపాదకీయంలో విషం కక్కిన ఆయన మరో అడుగు ముందుకేసి వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం ఆరంభించారు. ఏకంగా వలంటీర్లపైనే ఒక ప్రముఖ పత్రిక సంపాదకీయం రాసిందంటేనే ఆ వ్యవస్థ ఏపీలో ఎంతబలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారిని వైసీపీ వలంటీర్లు అని ‘ఈనాడు’ రామోజీ ముద్రవేసి ఇందులో రాజకీయాలను చొప్పించడానికి తీవ్రకృషి చేశారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి.
చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వలంటీర్లను అవమానిస్తూ మాట్లా డారు. వారిని మూటలు మోసేవారిగా అభివర్ణించడమే కాకుండా, మధ్యాహ్నపువేళ మగవాళ్లు ఇళ్లలో లేనప్పుడు వారు వెళ్లి ఆడవారిని ఇబ్బందిపెడతారంటూ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దానిపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆయన తన స్వరం మార్చుకుని తాము కూడా వలంటీర్లను తొలగించబోమని చెప్పవలసి వచ్చింది. అయితే ఈ వ్యవస్థ వల్ల అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు జనంలో ఆదరణ పెరుగుతోందన్న భావన ఉంది. దీనిని దెబ్బకొట్టాలంటే ఏమి చేయాలన్న ఆలోచనతోనే బహుశా తమలో తాము చర్చించుకున్న తర్వాత రామోజీరావు రంగంలో దిగినట్లు అనిపిస్తుంది. అందుకే ఆయన హైకో ర్టులో వలంటీర్లకు సంబంధించి ఒక పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా... గౌరవ న్యాయమూర్తి వేసిన కొన్ని ప్రశ్నల ఆధారంగా సంపాదకీయం రాసేసి తన దుష్ట తలంపును బహిర్గతం చేసుకున్నారని అనుకోవచ్చు. హైకోర్టుకు కూడా తెలుగుదేశం అనుకూల వర్గాలే వెళ్లి ఉంటాయి.
వలంటీర్ల వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని రామోజీ కనిపెట్టేశారు. మూడేళ్ల క్రితం ఈ వ్యవస్థ వచ్చాక ప్రజలకు ఎంతో సదుపాయం ఏర్పడింది. ప్రజలు ప్రభుత్వ ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా పోయింది. వారు దరఖాస్తులు సమర్పించడంలో సైతం తోడ్పడి వాటిని గ్రామ, వార్డు సచివాల యాలకు అందచేస్తున్నారు. ఆ తర్వాత తగు ప్రాసెస్ అయిన అనంతరం ఆదేశాలు వస్తున్నాయి. వాటిని తిరిగి వలంటీర్లు సంబంధిత దరఖాస్తుదారులకు వాటిని అందచేస్తున్నారు. ఇంత సౌలభ్యం దేశంలో ఎక్కడా లేదు. ఈ వలంటీర్ల గురించి టీడీపీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారం వల్ల టీడీపీకి నష్టం వస్తోందని భావించి... కొత్త రూట్‌లో న్యాయ స్థానం ద్వారా ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.
సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించడం ప్రభుత్వ అధికారుల విధి అనీ, ప్రజల సమాచారాన్ని వలంటీర్లు ఎలా ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారనీ గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారట. వాళ్లకేమైనా సర్వీస్ నిబంధనలు ఉన్నాయా అని కూడా అడిగారట. గౌరవ న్యాయమూర్తి తన సంశ యాలను తీర్చుకోవడానికి ప్రశ్నలు వేయడం సమంజసమే. కానీ, హైకోర్టులో వచ్చిన ప్రశ్నల ఆధారంగా మొదటి పేజీలో ఒక కథనాన్ని రాయడమే కాకుండా, సంపాదకీయం కూడా రాసి రామోజీ తన కడుపుమంట తీర్చుకున్నారు. ఎటువంటి కట్టుబాట్లు లేని సొంత కార్యకర్తల సైన్యానికి సేవాదళమనే ముసుగును జగన్ వేశారని రామోజీ ఆరోపించారు. మరి ఇదే రామోజీ టీడీపీ హయాంలో నోట్లో వేలు వేసుకుని కూర్చు న్నారా? అప్పట్లో ఘోరంగా జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధించుకు తిన్నప్పుడు రామోజీకి అంతా బ్రహ్మాండంగా కనిపించిందా? స్థానిక టీడీపీ నేతల చుట్టూ తిరగలేక, వారికి ముడుపులు చెల్లించలేక ప్రజలు నానా యాతనలు పడినప్పుడు రామోజీకి అదంతా గొప్ప విషయంగా కనిపించింది.
ఇప్పుడు అలాంటి సమస్యలేవీ లేకుండా ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్న ఈ వ్యవస్థను ఎలా దెబ్బతీయాలా అని రామోజీ కుట్ర చేస్తున్నారు. టీడీపీకి జరిగే నష్టంతో పాటు మరో ఏడుపు కూడా ఆయనకు ఉంది. అదేమంటే వలంటీర్లద్వారా ఒక పత్రిక కొనుగోలు చేస్తున్నా రట. వారు ‘సాక్షి’ పత్రికనే కొంటున్నారట. అది కూడా వారికి తెగ బాధగా ఉంది. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లినా ‘ఈనాడు’కు సానుకూలంగా ఫలితం రాలేదు. అయినా సంపాదకీయంలో మళ్లీ రోదిస్తూ అదే విషయం రాశారు. వీరు ఐటీ, పాన్ కార్డుల వంటి సున్నిత వ్యక్తిగత విషయాలను కూడా సేకరిస్తున్నారట.
అలాగే జగన్ ప్రభుత్వం స్వేచ్ఛా పావురం గొంతు నులిమేస్తున్నదనీ, నియంతృత్వంగా ఆయన వ్యవహరిస్తున్నారనీ... ఇలా ఏవేవో రాశారు. జాగ్రత్తగా ఆలోచిస్తే రామోజీనే ఆంధ్ర ప్రదేశ్ పాలిట విష సర్పంగా మారారు. రామోజీ దృష్టిలో పౌరహక్కులంటే టీడీపీ చేసే అల్లర్లకు పూర్తి లైసెన్స్ ఇవ్వాలి. తాము ఎంత చెత్త రాసినా ఎవరూ నోరెత్తకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. గతంలో ర్యాలీలు తీశారనో, 144 సెక్షన్ ఉల్లంఘించారనో ఆనాటి విపక్ష నేతలు కొడాలి నాని, వైఎస్ అవినాశ్ రెడ్డి వంటి అనేకమందిపై కేసులు పెడితే ఇప్పటికీ వారు కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తోంది. కొందరిపై కోర్టు కేసులు కొట్టివేసింది. ఆ పరిస్థితి ఆనాడు ఉంటే అది అత్యంత ప్రజా స్వామ్యంగా రామోజీకి కనిపించింది. ఇప్పుడు రోడ్ల మీద అనుమతులు తీసుకుని రోడ్ షో, ర్యాలీలు జరుపుకోండనీ, ఇరుకు రోడ్లపై సభలు పెట్టి తొక్కిసలాటలకు కారణం కావద్దనీ ప్రభుత్వం ఆదేశం ఇస్తే... అది పౌరహక్కుల ఉల్లంఘన అని ఇదే రామోజీ ప్రచారం చేశారు. నడిరోడ్లపై సభలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించడం ప్రజాస్వామ్యం అని ఈయన కొత్త నిర్వచనం ఇచ్చారు.
వలంటీర్లు అధికార పార్టీకి ఉపయోగపడతారని కొందరు వైసీపీ నాయకులు ఏవేవో వ్యాఖ్యలు చేశారట. అవన్నీ శిలాశాసనాలుగా వలంటీర్లు పాటిస్తారన్నట్లుగా ‘ఈనాడు’ రాసింది. ఇందులో ఎంతవరకు హేతుబద్ధత ఉందన్నది ఆలోచిస్తే చాలా తక్కువే. కాకపోతే వలంటీర్లను చూసి టీడీపీ, చంద్రబాబు, ‘ఈనాడు’, రామోజీరావులు బాగా భయ పడుతున్నారని మాత్రం తెలిసిపోతుంది. వలంటీర్లు క్షేత్ర స్థాయిలో ఉండే వర్కర్లు. వారు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులే తప్ప వారే నిర్ణయాధికారం కలిగినవారు కారు. అయినా రామోజీ తెగ ఆడిపోసుకున్నారు. ఈ మూడేళ్లలో జనం ఎక్కడా వలంటీర్ల మీద దాదాపు ఫిర్యాదులే చేయలేదు. పైగా ఈ వ్యవస్థ ఫలితాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఒకటీ, అరా ఫిర్యాదులు వచ్చినా ప్రభుత్వం వారిపై చర్య తీసుకుంటోంది. ఇన్ని కోట్ల మందికి సేవలందిస్తున్న వలంటీర్లు ఎక్కడా ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గించారనో, మరొకటనో ఫిర్యాదులే చేయలేదు. అయినా ఈ రకంగా తంపులు పెట్టాలని ‘ఈనాడు’ రామోజీ టీడీపీ వారికి సలహా ఇస్తున్నట్లుగా ఉంది.
పౌర హక్కుల గురించి ఇంత బాధపడుతున్న రామోజీ తన వ్యాపార సంస్థలలోఎక్కడైనా, ఎప్పుడైనా ఎలాంటి హక్కులైనా అమలు చేశారా? అక్కడ జర్నలిస్టులు, ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతారన్నసంగతి తెలియనిది ఎవరికి? మరి రామోజీ దీనికేమంటారు? ఆత్మవంచన కాక మరేమిటి? కేవలం తనకు సర్క్యులేషన్ ఎక్కువగా ఉందన్న ఒకే ఒక అహంభావంతో, తాను ఏమి రాసినా ఎంతో కొంత ప్రభావం ఉంటుందన్న భ్రమతో ఇలాంటి వాస్తవ విరుద్ధ సంపాదకీయాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనం, వ్యాపార లక్ష్యాలతో రామోజీ ఇలాంటి చెత్త సంపాదకీయాలు రాయడం జర్నలిజం విలువలకు, ప్రమాణాలకు పాతరేయడమే అవుతుంది.
అందుకే ఇకపై రామోజీనే తనకు తానే ప్రధాన ప్రత్యర్థిగా ఊహించుకుంటూ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్నవీ, లేనివీ కలిపి ఈ ఎన్నికల ఏడాది పచ్చి అబద్ధాలు ప్రచారం చేయ డానికి సన్నద్ధం అవుతున్నారని ఇట్టే కనిపెట్టేయవచ్చు.
- వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కొమ్మినేని శ్రీనివాస రావు.
Comments
Please login to add a commentAdd a comment