టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు వీలైతే అప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తుంటారు. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని అబద్ధాలు చెబుతుంటారు. అంతేకాదు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్దులు రౌడీలని, ఇంకొకటని విమర్శలు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి యత్నిస్తుంటారు. తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో సైతం స్మగ్లర్లు, రౌడీలు అంటూ ఆరోపణలు చేశారు. తీరా చూస్తే చంద్రబాబు ప్రకటించిన అభ్యర్ధులలో ఒకాయన ఏకంగా హిందూ దేవుళ్లను అవమానించిన వ్యక్తి కాగా, మరొకరు టీవీ ఛానల్ డిబేట్‌లోనే రౌడీయిజం ప్రదర్శించిన వ్యక్తి కావడం విశేషం. అంతేకాదు.. మరొకరు గతంలో హత్య కేసులో ఉన్న వ్యక్తి. ఇలా ఒక్కొక్కరి గురించి విశ్లేషిస్తే చాలా కథలు తలుస్తాయి.
చంద్రబాబే కాదు.. ఈనాడు రామోజీరావు కూడా చాలా చెత్త రాస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రికలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదంటూ ఓ పెద్ద పాత చింతకాయ పచ్చడి స్టోరిని వండి వార్చారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఏకంగా హిందూ దేవతలను, హిందూ ఆచారాలను దూషిస్తూ వీడియోలు చేసిన మహాసేన రాజేశ్ అనే వ్యక్తికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. రాజేష్ అభ్యర్ధిత్వం ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన దూషణల తాలూకూ వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపై హిందూ వర్గాలకు చెందిన వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు కూడా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. అయినా చంద్రబాబు నోరు విప్పడం లేదు. గతంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయంటూ ప్రభుత్వంపై తప్పుడు అభియోగాలు మోపుతూ చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు హడావుడి చేశారు. తీరా పోలీసులు దర్యాప్తు చేస్తే అదంతా టీడీపీ, జనసేనలకు చెందిన కొందరు అలాంటి అరాచకాలకు పాల్పడ్డారని వెల్లడైంది.
అంతర్వేది వద్ద జరిగిన రథం దగ్ధం కేసుపై సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా, బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది. దీనిని బట్టి విపక్షాల చిత్తశుద్ది బహిర్గతం అయింది. మరోవైపు చంద్రబాబు హయాంలోనే విజయవాడలో పలు ఆలయాలను కూల్చివేయడమే కాకుండా, కొన్ని విగ్రహాలను మున్సిపల్ వాహనంలో తరలించడం వివాదాస్పదం అయింది. వాటన్నింటినీ జనం మర్చిపోయారనుకుని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఈనాడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఇప్పుడు హిందూ దేవతలను అవమానించిన వ్యక్తికి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చినా, రామోజీ ఉలకలేదు. ఆయన పత్రిక ఈనాడు అన్నీ మూసుకుని కూర్చుంది. అంటే దీని అర్థం హిందూ ఆలయాల కోసం కాకుండా దిక్కుమాలిన రాజకీయాల కోసమే ఈనాడు మీడియా అసత్య కథనాలు వండి వార్చుతున్నారని వెల్లడవుతుంది. రాజేష్ అనే వ్యక్తికి ఎందుకు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు? ఒకప్పుడు ఇదే చంద్రబాబును సైతం తీవ్ర భాషలో ఈయన విమర్శించకపోలేదు.
ఆ తర్వాత లైన్ మార్చుకుని టీడీపీలో చేరి వైఎస్సార్‌సీపీని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని దూషించడం ఆరంభించారు. ఇలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడం బాగా నచ్చిందేమో తెలియదు కానీ, చంద్రబాబు ఈయనకు టిక్కెట్ ఇచ్చారు. బహుశా రాజేష్ బ్లాక్ మెయిల్‌కు భయపడి టిక్కెట్ ఇచ్చారేమో అన్న అనుమానం వస్తుంది. ఒకవేళ ఈ రాజేష్‌కు టిక్కెట్ ఇవ్వకపోతే మళ్లీ తిట్టడం మొదలు పెడితే భరించలేమన్న భావన ఏర్పడి ఉండవచ్చు. ఇంకో సంగతి ఏమిటంటే రాజేష్ జనసేన పైనా కూడా గతంలో దూషణల పర్వం నిర్వహించారట. దాంతో ఆ పార్టీవారు పొత్తులో టీడీపీ ఈయనకు టిక్కెట్ ఇవ్వడంపై మండిపడుతోంది. ఏకంగా పార్టీ ఆఫీస్‌లోనే సమన్వయ కమిటీ సమావేశంలోనే జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదే టైమ్‌లో టీడీపీలో సైతం ఈ అభ్యర్ధి ఎంపికపై ఆశ్చర్యపోతున్నారు. ఈయనకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించబోమని చెబుతున్నారట. ఈ పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు తన ఎదుటి పక్షం వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులపై ఏవేవో ఆరోపణలు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తుంటారు.
కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తికి తిరువూరు అసెంబ్లీ టిక్కెట్‌ను టీడీపీ ఇచ్చింది. ఈయన అమరావతి రాజధాని JAC పేరుతో హడావుడి చేస్తుంటారు. వైఎస్సార్‌సీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణంరాజు సిఫారసు మేరకు టిక్కెట్ ఇచ్చారని అంటారు. కొలికపూడి కూడా గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తీవ్రమైన పరుష భాషతో విమర్శించేవారు. ఆ తర్వాత ఎలా రాజీ కుదిరిందో తెలియదు కానీ, చంద్రబాబుకు దగ్గరయ్యారు. మామూలుగా అయితే ఈయనకు టిక్కెట్ ఇచ్చే అవకాశమే ఉండదు. పైగా ఈయనకు సంబంధం లేని తిరువూరు నియోజకవర్గాన్ని కేటాయించారు. కొలికపూడికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే ఆయన ఒక తెలుగుదేశం ఛానల్ డిబేట్‌లో కూర్చుని పక్కనే ఉన్న బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరారు. దానిపై ఆగ్రహించిన బీజేపీ కొంతకాలం ఆ ఛానల్‌ను బహిష్కరించింది. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఆ ఛానల్ యజమాని దీనిపై కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయనకు ఏకంగా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఈయనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఎక్కడ రచ్చ చేస్తారో అన్న సందేహంతోనే టిక్కెట్ ఇచ్చి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
విశాఖ జిల్లాలో ఒక అభ్యర్ధి ఏకంగా వంగవీటి రంగ హత్య కేసులో ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎర్రచందనం స్మగ్లర్‌కు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారని టీడీపీలోని మరో వర్గం ఆందోళనకు దిగిందన్న వార్తలు వచ్చాయి. నిజానికి అన్ని పార్టీలలో ఇలాంటి సమస్యలు ఉండవచ్చు. అదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం కాదు. గతంలో జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న శివారెడ్డిని ఏకంగా బాంబుల శివారెడ్డి అని పిలిచేవారు. ఆయనకు ఎన్టీఆర్ క్యాబినెట‍్‌లో మంత్రిపదవి కూడా దక్కింది. మరో మాజీ మంత్రి పరిటాల రవిపై ఎన్ని హత్య కేసులు ఉన్నాయో లెక్కలేదు. ఆయన ఎన్టీఆర్ వద్ద మంత్రిగా పనిచేస్తే, చంద్రబాబు టైమ్‌లో టీడీపీ పక్షాన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక నేతపై ఎన్టీఆర్ టైమ్ లో పీడీ యాక్ట్ కింద అరెస్టు కూడా అయ్యారు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి బస్‌ల చాసిస్ నంబర్‌లను బోగస్‌గా సృష్టించిన కేసులో నిందితుడిగా ఉన్నారు. అవన్నీ ఎందుకు... చంద్రబాబే స్వయంగా ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నారు. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో అరెస్టయి జైలుకు వెళ్లారు. మరి ఆయన టిక్కెట్ తీసుకోవచ్చా అంటే.. నోరు ఉంది కదా అని ఎవరిపైనా అయినా చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారు! అది ఆయన లక్షణం.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇలాంటి చీప్ విమర్శలకు దిగరు. తన పని తాను చేసుకుంటూ ఉన్నంతలో బెటర్ అభ్యర్ధులు అనుకుంటే టిక్కెట్ ఇస్తుంటారు. కానీ చంద్రబాబు మాత్రం తాను చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. అన్నింటిలోనూ ఇలా డబుల్ స్టాండర్డ్స్‌ను పాటిస్తుంటారు. అదే ఆయన 45 ఇయర్స్ ఇండస్ట్రీ విశిష్టత. నలభై ఐదేళ్లుగా ఇలాంటి రాజకీయాలతోనే ఆయన సఫలం అయ్యారు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం, వీలైనంత బురద వేయడం, తన గురించి తాను గొప్పగా ప్రచారం చేసుకోవడం, మీడియాలోని ఒక వర్గాన్ని ఆకట్టుకుని లేని ఇమేజ్‌ని సృష్టించుకోవడం చంద్రబాబు అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు అది సఫలం అయింది. కొన్నిసార్లు విఫలం అయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం ఆయన పప్పులు అంతగా ఉడకడం లేదు. అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ తాబేదారు మీడియా ద్వారా ఈ బురద రాజకీయం చంద్రబాబు చేస్తూనే ఉన్నారు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment