'సూది కోసం సోదికి వెళితే ఏదో బాగోతం బయటపడిందని సామెత.' ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరు అలాగే ఉంది. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైన, వైఎస్సార్‌సీపీపైన తీవ్రమైన ఆరోపణలు చేయాలని తెగ ఉబలాటపడిపోతున్నారు. వాటిలో వాస్తవం ఉంటే అదొక పద్ధతి. కానీ ఎంతసేపు ఎదుటి వారి వ్యక్తిత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధిపొందాలన్నదే ఆయన లక్ష్యం. దానికి అనుగుణంగా ఈనాడు అధినేత రామోజీ బాకాలు ఊదుతుంటారు. ఏపీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చకు రాకూడదన్న ఉద్దేశంతో, ఆ అంశాలను డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు, రామోజీరావులు కుట్రపన్ని వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
గత కొద్ది రోజులుగా నిత్యం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ప్రస్తావించడం, ముఖ్యమంత్రిపై ఏదో పిచ్చి ఆరోపణలు చేయడం ఒక తంతుగా మారింది. ఇప్పటికే సీబీఐ విచారణ చేసి, కొందరిని అరెస్టు చేసి, కోర్టు విచారణ దశకు వచ్చాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయ విమర్శలు చేయడంలోనే దురుద్దేశం కనిపిస్తుంది. వివేకా హత్య జరిగిన సమయంలో, ఆ తర్వాత మూడు నెలలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైమ్‌లో ఎందుకు కేసులు పెట్టలేకపోయారు? అంత అసమర్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని చంద్రబాబు ఒప్పుకుంటున్నారా? అప్పుడు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద వేయాలని చూశారుకానీ, ప్రజలు నమ్మరని అప్పట్లో భావించారు. తదుపరి ఒక్కొక్క క్యారెక్టర్‌ను తమకు అనుకూలంగా మలచుకుని కొత్త డ్రామా మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది.
చంద్రబాబు రాజకీయ నాయకుడు కాబట్టి, తన ప్రత్యర్ధులు ఎవరిపైన అయినా బురద చల్లడం ఆయనకు అలవాటే. ఆయనను పట్టించుకోనవసరం లేదు. కానీ ఈనాడు రామోజీరావుకు ఏమైంది? పత్రికలలో వరసగా ఒకే అంశాన్ని పదే, పదే ఇవ్వడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైనా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కోపంతో ఆయన కూడా చంద్రబాబు పాడే పాతపాటను, మహా ప్రసాదంగా రోజూ బ్యానర్ కథనాలుగా ఇచ్చుకుంటూ ఆత్మ వంచన చేసుకుంటున్నారు. అదే టైమ్‌లో వంగవీటి రంగా హత్య కేసు, తదితర కేసులలో చంద్రబాబు పాత్ర గురించి కూడా చర్చకు సిద్ధమని చెప్పి, వివేకా హత్య కేసుపై కూడా చర్చించదలిస్తే ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను కూడా ఈనాడు బ్యానర్‌గా ఇస్తుందా? కొన్ని సంగతులు చూద్దాం.
1988లో విజయవాడ నడిరోడ్డుపై నిరశన దీక్ష చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావును హత్య చేసిన టీడీపీ నేతలు ఎవరు? వారికి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చింది ఎవరు? ఇప్పటికీ ఆ కేసులో విచారణ ఎదుర్కున్నవారికి టిక్కెట్ ఇస్తున్నది ఎవరు? మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తన పుస్తకంలో రంగా హత్య ఉదంతంలో చంద్రబాబు పాత్ర గురించి చేసిన ప్రస్తావనను ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? పాత్రికేయుడు పింగళి దశరథ్‌రామ్‌ను హత్య చేయించింది ఎవరు? మల్లెల బాబ్జి మరణానికి కారకులు ఎవరు? ప్రముఖ గాయకుడు గద్దర్‌పై కాల్పులు జరిపించింది ఎవరు? గద్దర్ బతికి బయటపడ్డాక ఎవరిపైన పాటలు కట్టారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లోనే కదా ఈ ఘటన జరిగింది! మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆస్పత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు కనీసం పలకరించలేదు! ఏ అవమాన భారంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు? అంతెందుకు! ఎన్.టి.రామారావును ఒక్క పోటు పొడిచి ఆయనను ముఖ్యమంత్రి సీటు నుంచి లాగేసింది ఎవరు? ఆయన మనోవేదనతో మరణించడానికి కారణం ఎవరు? రాజమండ్రి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చంద్రబాబు ప్రచార యావ కారణంగా తొక్కిసలాటలో మరణించింది నిజమా? అబద్దమా?తిరుమలలో ఇరవై మంది తమళ కూలీలను చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ కౌంటర్ చేస్తే దానికి బాధ్యులు ఎవరో ఎందుకు తేల్చలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి.
మరివీటన్నిటిపైన చంద్రబాబు, టీడీపీ నేతలు చర్చకు సిద్ధపడతారా? వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత ఆ రోజుల్లో ఏమని చెప్పేవారు. చంద్రబాబు ప్రభుత్వంపైన, ఇతర టీడీపీ నేతలపై ఎన్ని ఆరోపణలు చేశారు? తదుపరి ఆమె ఎలా మారిపోయారు? వివేకాకు ఉన్న అక్రమ సంబంధాల విషయాలన్ని బయటకు వచ్చాక కేసు ఎంత గందరగోళంగా మారింది? అసలు తానే హత్య చేశానని నిర్భీతిగా చెబుతూ బయట తిరుగుతున్న వ్యక్తికి సునీత ఎందుకు అండగా ఉంటున్నారు? వీటన్నిటి మీద కూడా చర్చ చేస్తే ప్రజలకు అన్ని అర్ధం అవుతాయి. అసలు వివేకా హత్య కేసుకు ఇప్పుడు ఎందుకు చంద్రబాబు, రామోజీ ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి ఒక కారణం కనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోవడం కష్టమని వారికి అర్ధం అయిపోయింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకు వచ్చిన అనేక పాలన సంస్కరణలు, సంక్షేమ స్కీముల ఫలితాలు ప్రజలకు అందుతున్నాయి. వారిలో సంతృప్తి స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆ కోణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే తమకు ఓట్లు రాలవని వారు భయపడుతున్నారు. సూపర్ సిక్స్ అంటూ గతంలో హోరెత్తించారు. కానీ ఇప్పుడు దాని ప్రచార తీవ్రతను చంద్రబాబు తగ్గించినట్లు అనిపిస్తుంది.
పైగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకు వచ్చిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగుతుందని చంద్రబాబు చెప్పవలసి వస్తోంది. వలంటీర్లను సంఘ వ్యతిరేక శక్తులుగా, మూటలు మోసేవారుగా ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు వెళ్ళి మహిళలను వేధించేవారిగా పోల్చి ప్రచారం చేసిన చంద్రబాబు, వలంటీర్లపై విషం చిమ్మిన రామోజీరావులు ఇప్పుడు అదే వ్యవస్థను కొనసాగిస్తాం అంటున్నారంటే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత బలంగా పాతుకుపోయారో తెలిసిపోతుంది. అభివృద్ధి గురించి చర్చిస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉద్దానం ప్రాజెక్టు మొదలు కర్నూలు గ్రీన్ కో కంపెనీ, ఓడరేవులు, వైద్య కళాశాలలు, విజయవాడ వద్ద నిర్మించిన వంతెనలు, కృష్ణానది రిటైనింగ్ వాల్, తిరుపతిలో సేతు నిర్మాణం మొదలైనవన్ని ప్రస్తావనకు వస్తాయి. అలాగే పరిశ్రమ గురించి చర్చించినా అదే పరిస్థితి. ఏ రకంగా చూసినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను ఏదో జనరల్‌గా విధ్వంసం అని, ఇంకేదో అని విమర్శించడం తప్ప స్పెసిఫిక్‌గా లోటుపాట్లు చెప్పలేని దైన్యం వారిది.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రకరకాల పాత్రలను ప్రవేశపెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను బదనాం చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, షర్మిల, సునీత, ప్రశాంత కిషోర్ వంటివారు తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పాత్రలు పోషించి వెళుతున్నారు. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి టీడీపీ మీడియా సంస్థలు రోజూ లక్షల పత్రికలను కరపత్రాల మాదిరిగా పంచుతున్నాయి. టీవీలలో ఊదరగొడుతున్నాయి. అయినా అవేవి ఆనడం లేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చలేకపోతున్నామన్న భయం వారికి పట్టుకుంది. అందుకే చంద్రబాబు పదే, పదే వివేకా హత్య కేసు గురించి మాట్లాడి, తనకు ఇంకో సబ్జెక్టు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు కావల్సింది వారి అవసరాలు తీర్చే ప్రభుత్వం కానీ, ఇలా పిచ్చి ఆరోపణలతో కాలక్షేపం చేసే చంద్రబాబు వంటి నేతలు కాదు.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment