Andhra Pradesh Politics
-
నన్ను అంతమొందించడమే కూటమి లక్ష్యం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గతంలో తనకున్న జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో.. 3–6–2024 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్లో కోర్టును కోరారు. అంతేగాక.. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్ అసాల్ట్ టీమ్స్, జామర్లను సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్ధించారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. వైఎస్ జగన్ తన పిటిషన్లో ఏం పేర్కొన్నారంటే.. నన్ను ప్రమాదంలోకి నెట్టేందుకే.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకున్న జెడ్ ప్లస్ భద్రతను ఇప్పుడు కూడా కొనసాగించాలని కోరుతూ మా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు అధికార కూటమి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. నన్ను ప్రజల నుంచి దూరంగా ఉంచేందుకు, వ్యక్తిగతంగా నేను దాడులకు గురయ్యేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో గత రెండునెలలుగా యథేచ్ఛగా వ్యవస్థీకృత రాజకీయ హింస కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసు పెద్దలు చోద్యం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. నాకున్న ప్రాణహానిని సరైన కోణంలో మదింపు చేయలేదు. ప్రజాసేవలు, రాజకీయ జీవితంలో, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఉపసంహరించింది. నా భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ మా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఎలాంటి స్పందనలేదు. నా జీవితాన్ని, స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు ఈ అధికార కూటమి ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగిస్తోంది. ఉన్నపళంగా, అకారణంగా, ఏకపక్షంగా నాకున్న భద్రతను కుదించింది. ఇటీవల నా భద్రతా వలయంలో ఉల్లంఘనలు జరిగినా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదు. వారు కూటమి ప్రభుత్వ పెద్దల పల్లకీలు మోస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తమ విధులను వారు విస్మరించడంవల్లే ఇటీవల కాలంలో మా పార్టీ కేడర్‌పై, ఆస్తులపై వ్యవస్థీకృత హింస పెరిగిపోయింది. దీనిపై మేం ఢిల్లీలో నిరసన కార్యక్రమం కూడా చేపట్టాం. నన్ను భౌతికంగా లేకుండా చేయడమే అధికార కూటమి లక్ష్యం. ఈ విషయంలో టీడీపీ సీనియర్ నేతల మధ్య సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్నపాత్రుడు నా గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని’ ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక.. చచ్చేవరకు కొట్టాలని కూడా వారు మాట్లాడుకున్నారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా భద్రత కుదింపు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నాకు భద్రతను కుదించారు. అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తగ్గించారు. నాకు భౌతిక హాని తలపెడతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో పదేపదే చెప్పారు. అందులో భాగంగానే నాపై ఎన్నికల ప్రచార సమయంలో గులకరాయి దాడి జరిగింది. గతంలో నాపై కోడికత్తితో హత్యాయత్నం కూడా చేశారు. వీటన్నింటి దృష్ట్యా నాకు 3–6–2024 నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీచేయండి. నాకు రక్షణగా ఇద్దరు అధికారులే ఉన్నారు..రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉంది. అయితే, అధికార పార్టీ కూటమి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే మా పార్టీ కేడర్, నేతలపై దాడులు జరగడానికి పునాది. నా భద్రతను కుదించేందుకు అధికారుల వద్ద సహేతుక కారణాలుగానీ, ఆధారాలుగానీ ఏమీలేవు. అత్యున్నత భద్రత వ్యవస్థ అయిన జెడ్ ప్లస్ నుంచి నా భద్రతను కుదించారు. వాస్తవానికి జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను తొలగించనప్పటికీ, నా చుట్టూ ఉన్న భద్రత సిబ్బందిని మాత్రం బాగా కుదించారు. నాకు రక్షణగా ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉన్నారు. నా ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. అధికార పార్టీ నుంచి నిరంతరం నేను బహిరంగ బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. అందువల్ల ప్రభుత్వం నాకు ఇంటి వద్ద, ఆఫీసు వద్ద భద్రతను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. నాకు అత్యంత సమీపంలో ఉండే క్యాట్ ఆక్టోపస్ టీమ్స్‌ను ఈ ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే ఉంటున్నారు. గతంలో ఇలా 10 మంది ఉండేవారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల కంటే నా వద్ద ఉన్న వ్యక్తిగత భద్రతాధికారుల సంఖ్యే తక్కువ. గతంలో ఇల్లు, ఆఫీసు వద్ద 11 మంది గార్డులు ఉండేవారు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ఇక నా భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందన్న విషయం నాకు రక్షణగా ఇచ్చిన బుల్లెట్‌ప్రూఫ్ కారును చూస్తే అర్థమైపోతుంది. అద్దాలు పగుళ్లు వచ్చి ఉన్నాయి. వెనుక డోర్ తెరుచుకోవడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో కారు నుంచి బయటకొచ్చే పరిస్థితిలేదు. మధ్యలో ఆగిపోతోంది. ఇటీవల ఓ పర్యటనకు వెళ్తుండగా మధ్యలో ఆగిపోవడంతో పర్యటనను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో.. నేను నా వ్యక్తిగత బుల్లెట్‌ప్రూఫ్ కారు వాడుకునేందుకు అనుమతి కోరగా అధికారులు అనుమతినివ్వలేదు. పైగా వాళ్లు ఇచ్చే కారునే వాడాలన్నారు. నేను ప్రజలను కలవకుండా ఇంటి వద్దనే ఉండాలన్న కారణంతోనే అలాంటి కారును ఇచ్చారు. -
శ్వేతపత్రం కాదు.. మా కేసుల సంగతి చూడండి!
సాక్షి, అమరావతి: శాసన సభ సమావేశాల్లో గురువారం విచిత్ర పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభ్యులు చర్చించేందుకు స్పీకర్ అవకాశం కల్పించగా.. దొరికిందే ఛాన్సన్నట్లుగా సభ్యులు కేసులు ఎత్తేయాలని కోరడం కొసమెరుపు. శ్వేత పత్రాల సంగతి తర్వాత చర్చించాలని కోరుతూ చాలామంది ఎమ్మెల్యేలు.. కోరికల చిట్టా విప్పారు. పాత కేసులు కూడా ఎత్తేయాలని కోరారు. తమ ఒక్కరిపై ఉన్న కేసులంటేనే బాగోదని భావించి, పార్టీ కార్యకర్తల పైన ఉన్న కేసులూ ఎత్తేయాలని చెప్పారు. ఒక సందర్భంలో సభలో కేసులున్న సభ్యులు లేచి నిల్చోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా.. దాదాపు 90 శాతం సభ్యులు లేచి నిలబడ్డారు. వీళ్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. -
రంగంలోకి వైఎస్ జగన్.. ఇక బాబు అండ్ కోకు చుక్కలే!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కసారి రోడ్డు మీదకు రావడం ఆరంభం అయితే ఎలా ఉంటుందో చూశారుగా. దెబ్బకు దెయ్యం దిగివచ్చినట్లు ప్రభుత్వంలో కూడా కాస్త చలనం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించక తప్పలేదు. తెలుగుదేశంవారు హింసకు పాల్పడినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఏమి వ్యాఖ్యానించేవారంటే.. వైఎస్సార్‌సీపీవారు దాడులు చేసినా ప్రతిదాఢులు చేయవద్దని చెప్పారే తప్ప టీడీపీవారు హింసాకాండకు దిగవద్దని బాబు ఒక్క మాట కూడా అనలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు నోరే విప్పలేదు. హోం మంత్రి అనిత ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై, ఇతర నేరాలపై మాట్లాడుతూ తాను లాఠీ తీసుకుని వెళ్లాలా అని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ రకంగా ఒక బాధ్యత లేకుండా సాగుతున్న పాలనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్ పెట్టారని అనుకోవాలి.వినుకొండ వద్ద జరిగిన రషీద్ దారుణ హత్య తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అతని కుటుంబాన్ని పరామర్శించడానికి స్వయంగా అక్కడకు వెళ్లడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఒక నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. నెలనర్నరకు పైగా టీడీపీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినా, వందలాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర కష్టాలపాలవుతున్నా, పార్టీపరంగా గట్టిగా సమాధానం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉండేది. జగన్మోహన్రెడ్డి వెంటనే రంగంలో దిగాలని పలువురు కోరుకునే వారు. కానీ జగన్మోహన్రెడ్డి తొందరపడకుండా ఉండాలని భావించినట్లు ఉన్నారు. అవసరమైనప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు.ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాకముందే జనంలోకి వెళితే భిన్నమైన సంకేతం వెళుతుందని అనుకుని ఉండవచ్చు. కానీ పరిస్థితి రోజు, రోజుకు దిగజారి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పూర్తిగా భయాందోళనకు గురి అయ్యారు. 36 మంది హత్యలకు గురి అయ్యారు. వందల మందిపై హత్యాయత్నాలు జరిగాయి. వందల కొద్ది ఆస్తుల విధ్వంసాలు సాగాయి. రెండువేలమందికి పైగా ఇళ్ళు వదిలి వేరే ప్రాంతాలలో తలదాచుకోవలసి వచ్చింది. చివరికి మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిపై దాడి జరిగిన తీరు, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటివద్ద కార్యకర్తలతో సమావేశం అయినప్పుడు టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన వైనం దారుణంగా ఉన్నాయి. వారిద్దరి కార్లను ధ్వంసం చేయడం, రెడ్డప్ప వాహనాన్ని దగ్ధం చేయడం, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పైగా వీరిపైనే హత్యాయత్నం కేసు పెట్టడం శోచనీయంగా ఉంది.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక రోజులలో ఉన్నామా? అన్న అనుమానం వస్తుంది. దానికి తగ్గట్లుగా చంద్రబాబు, లోకేష్ వంటివారు హింసను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఏపీలో వ్రజలకు రక్షణలేకుండా పోయింది. ప్రతిపక్షం లేకుండా చేయాలని గత టరమ్‌లో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, ఈసారి కార్యకర్తలను భయపెట్టి వైఎస్సార్సీపీని దెబ్బతీయాలన్న ఆలోచనగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ యువ నేత రషీద్ జరిగిన హత్య సమాచారం తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగుళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకుని మరుసటి రోజు వినుకొండకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనకు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. పదిహేను చోట్ల ఏదో కారణం చెప్పి ఆయన కాన్వాయిని పోలీసులు నిలువరించే యత్నం చేశారట. ఆయన వెంట పార్టీ ఇతర నేతలు ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టారట. చివరికి ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతది, సరిగా పనిచేయనిది అని వైఎస్సార్సీపీ వర్గాలు చెప్పాయి. తత్పలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వేరొక వాహనం మారి ప్రయాణించవలసి వచ్చింది.సాధారణంగా తాడేపల్లి నుంచి వినుకొండకు గంటన్నరలో చేరుకోవచ్చు. కానీ వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయా చోట్ల గుమికూడి సాదరంగా స్వాగతం చెబుతుండడంతో కాన్వాయి బాగా ఆలస్యం అయింది. వినుకొండ జనసంద్రమే అయింది. వంద కిలోమీటర్ల దూరం కూడా లేని వినుకొండకు చేరుకోవడానికి ఏడుగంటలకుపైగా పట్టింది. దీనితో వైఎస్సార్సీపీలో ఒక విశ్వాసం ఏర్పడింది. కష్టకాలంలో తమకు పార్టీ అండదండగా ఉంటుందన్న ధీమా వచ్చింది. అధికార తెలుగుదేశం కూటమికి చెందినవారు చేసే దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి వారు సిద్ధమవడానికి అవకాశం ఏర్పడింది.రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎండగట్టారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నరకే ఎవరూ ఈ డిమాండ్ చేయరు. కానీ 36 మంది హత్యలకు గురి కావడం, వందలమందిపై హత్యాయత్నం చేయడం, వందల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడం వంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ తెగబడడంలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఒక హెచ్చరిక పంపడానికి ఈ డిమాండ్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. డిల్లీలో ధర్నా చేయాలని తలపెట్టారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంధర్భంలో ఒక కీలకమైన సంగతి ఏమిటంటే తమతో కలిసివచ్చే ఇతర రాజకీయ పక్షాలను కూడా ధర్నాకు ఆహ్వానించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం.ఇంతకాలం వైఎస్సార్సీపీ ఒంటరియానం సాగించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి సహకరించినా, అందులో భాగం కాలేదు. అలాగే కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో ఎన్డీఏని వ్యతిరేకించినా కాంగ్రెస్ కూటమిలో భాగం కాలేదు. బీజేపీనేమో తమ సొంత రాజకీయం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీతో సంబంధాలకు విఘాతం ఏర్పడింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలలో ఏవైనా ఈ ధర్నాకు వస్తే విశేషమే అవుతుంది.అలాగే వైఎస్సార్సీపీని దగ్గర చేసుకుంటే ఉపయోగం ఉంటుందని భావించి కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఏవైనా డిల్లీలో జరిగే దర్నాకు హాజరైతే ప్రధాన వార్తే అవుతుంది. ఈ రెండు కూటమిలలో లేని పార్టీలవారు ఎందరు వస్తారో చూడాలి. ఎవరు వచ్చినా, రాకపోయినా ఈ ధర్నా జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. భవిష్యత్ రాజకీయ పరిణామాలకు ఒక సూచన అవుతుంది. ధర్నాలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు అనుసరించవలసిన ప్రక్రియలే. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఏపీలో జరుగుతున్న హింసాకాండ గురించి ప్రజలకు, రాజకీయవర్గాలకు తెలుస్తుంది. ఎంత మిత్రపక్షమైనా బీజేపీ కూడా టీడీపీకి హెచ్చరికలు పంపించే అవకాశం ఉంటుంది.శాసనసభలో సైతం గవర్నర్ ప్రసంగ టైమ్‌లో కానీ, ఇతర సంధర్భాలలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తుతామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజలలోకి ప్రభుత్వ పార్టీ హింసాకాండను ఎండగడితేనే టీడీపీలో కాస్త అయినా జంకు వస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డుమీదకు రావడం వల్లే, ఆయనకు జనంలో ఉన్న విశేష ఆదరణ కనిపించడం వల్లే చంద్రబాబు సైతం కాస్త వెనక్కి తగ్గి మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఎన్ని విమర్శించినా, రషీద్ హత్య గురించి ఆయన మాట్లాడక తప్పలేదు. శాంతిభద్రతల సమస్యపై వివరణ ఇవ్వక తప్పలేదు. ఎవరు శాంతి భద్రతల సమస్య సృష్టించినా చర్యలు తీసుకోవాలని పోలీసులను మాటవరసకైనా కోరక తప్పలేదు. అది వైఎస్ జగన్మోహన్రెడ్డి పవర్! గెలిచినా, ఓడినా.. సింహం, సింహమే!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులుఇదీ చదవండి: అరాచక పాలనపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా.. ఢిల్లీకి చేరుకున్న వైఎస్ జగన్ -
యూటర్న్ బాబు.. ఎందుకంత ఉలికిపాటు?
విశాఖపట్నంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. విలువైన ప్రింటింగ్ యంత్ర సామాగ్రిని నాశనం చేయాలని చూశారు.. ఇది డెక్కన్ క్రానికల్ అధికారికంగా ఇచ్చిన కథనం. మరో విషయం చూద్దాం. ఏపీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీనిపై ఒక ప్రకటన చేశారు. 'డెక్కన్ క్రానికల్ డిస్ ప్లే బోర్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ భావోద్వేగాలను ఇలా చూపరాదు'.ఈ రెండు ప్రకటనల మధ్య తేడాను గమనించారా? తెలుగుదేశం కార్యకర్తలు కేవలం బోర్డును తగులపెట్టారు తప్ప ఇంకేమీ జరగలేదన్నట్లుగా లోకేష్ ప్రకటన ఉంటే, తమ కార్యాలయంపై టీడీపీ గూండాలు ఏ రకంగా దాడి చేసింది, ఫర్నిచర్ తదితర సామాగ్రిని ధ్వంసం చేసింది. మహిళా ఉద్యోగుల పట్ల ఎలా అసభ్యంగా వ్యవహరించింది. ఆఫీస్‌పై రాళ్లు విసిరిన వైనం మొదలైనవాటి గురించి క్రానికల్ సవివరంగా రాసింది. అంటే ఈ ఘటన తీవ్రత కనిపంచకుండా ఉండడానికి లోకేష్ యత్నిస్తూ, ఒక విషయాన్ని మాత్రం అంగీకరించారు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని. క్రానికల్ పత్రిక మాత్రం వారంతా టీడీపీ గూండాలని స్పష్టంగా ప్రకటించింది. వారిలో కొందరు మహిళలు కూడా ఉండడం మరో ప్రత్యేకత. తదుపరి రెండు రోజులకు విశాఖ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై పెద్దగా స్పందించకుండా కార్యకర్తలు ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. అంతే తప్ప ఇలాంటి దాడులు తప్పు అని చెప్పినట్లు కనిపించలేదు.ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంభవించిన విధ్వంస కాండ గతంలో ఎన్నడూ జరగనిది. టీడీపీ గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు వైఎస్పార్సీపీ అనుకూలరులపై దారుణమైన రీతిలో దాడులు చేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ విగ్రహాలను దగ్దం చేశారు. కొంతమందిని కత్తులతో పొడిచారు. కర్రలతో కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి బోర్డులు పీకేశారు. ఇంత జరుగుతున్నా చేష్టలుడిగిన పోలీస్ యంత్రాంగం, మానసికంగా పైశాచికానందం పొందుతున్న టీడీపీ నాయకత్వం కారణంగా టీడీపీ గుండాలు తమ ఇష్టారాజ్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. వాటికి పరాకాష్టగా ఇప్పుడు మీడియాపై కూడా దాడి చేశారు.ఇలాంటి ఘటనే కనుక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మొత్తం దేశం అంతా ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియా హోరెత్తించేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టేవారు. వీలైతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి.. ఇలా ఎవరు కలిస్తే వారిదగ్గర ఏపీ అంతా అట్టుడికిపోతోందని చెప్పేవారు. పత్రికా స్వేచ్చ కనుమరుగు అవుతున్నా జర్నలిస్టులకు చీమ కుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు స్వయంగా టీడీపీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఖండించలేదు. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి చేసినవారిని పట్టుకుని కేసు పెట్టాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఆయనే మాట్లాడనప్పుడు హోం మంత్రి అనిత వంటివారు ఎందుకు పట్టించుకుంటారు!టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ కూడా ఎక్కడా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పలేదు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి గురించి సిబ్బంది ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. కానీ వారిని చూసి టీడీపీ గూండాలు పారిపోయారని క్రానికల్ తెలిపింది. మరి ఈ దాడులు చేసినవారిని ఎప్పటికి పట్టుకుంటారో, ఎప్పటికి కేసులు పెడతారో తెలియదు. అరెస్టులు చేయకుండా నోటీసులు ఇవ్వడం విశేషం. ఏపీ వ్యాప్తంగా వందలాది చోట్ల టీడీపీ గూండాలు అకృత్యాలకు పాల్పడినా కేసులు పెట్టని పోలీసు యంత్రాంగం విశాఖలో మీడియా ఆఫీస్ మీద జరిగిన దాడి మీద మాత్రం గట్టిగా స్పందిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి వచ్చినవారిని అదుపులోకి తీసుకుంటే మాత్రం అభినందించవచ్చు.మరో విషయం చెప్పాలి. గత ఐదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రంకెలు వేస్తూ, పచ్చి అబద్దాలను ప్రచారం చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు ఉపన్యాసాలు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపైన, మీడియాపై జరిగిన దాడి మీద కనీసం స్పందించలేదు. అది ఆయన నిజాయితి, చిత్తశుద్ది. ఇప్పటికే సాక్షితో సహా పలు మీడియా సంస్థలపై అనధికార ఆంక్షలు పెట్టి వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇక ప్రత్యక్ష దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరం.ఇక సంగతి ఏమిటి?విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నది క్రానికల్ రాసిన వార్త సారాంశం. నిజానికి క్రానికల్ ఈ వార్తను ముందుగా వెలుగులోకి తేలేదు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ అనే పత్రిక ఈ విషయాన్ని వెల్లడించి, టీడీపీ, జనసేనలు విశాఖ ఉక్కు విషయంలో యు టర్న్ తీసుకుంటున్నాయని తెలిపింది. ఒక టాప్ టీడీపీ లీడర్ ఈ విషయం చెప్పినట్లు కూడా ఆ పత్రిక రాసింది. అదృష్టవశాత్తు ఆ పత్రిక కార్యాలయం విశాఖలో లేదు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే ఆ పత్రిక ఆఫీస్‌పై కూడా ఇలాగే దాడి చేసి బీభత్సం సృష్టించి ఉండేవారేమో!ఆ తర్వాత రోజు క్రానికల్ పత్రిక అదే వార్తను కొందరు దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా ఉన్న కొందరు ప్రైవేటైజేషన్‌కు అనుకూలంగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో కథనాన్ని ఇచ్చింది. అదే ఆ మీడియా చేసిన తప్పట. ఉన్న మాట అంటే ఉలికిపడినట్లుగా, టీడీపీ కూటమి యుటర్న్ తీసుకుంటోందని చెప్పడం వారికి ఆగ్రహం కలిగించింది. నిజానికి తెలుగుదేశంకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యూటర్న్లు తీసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ సంగతి దేశ ప్రధాని నరేంద్ర మోదీనే గతంలో ఒకసారి చెప్పి యుటర్న్ బాబు అని పేరు పెట్టారు.నిజంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ, జనసేనల వైఖరి మారకపోతే అదే విషయాన్ని స్పష్టం చేసి ఉండవచ్చు. ఖండన ఇవ్వవచ్చు. లేదా ఆ పత్రిక అసత్యం రాసిందని వారు భావిస్తే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు. అలాకాకుండా ఇలా దహనకాండకు పాల్పడ్డారంటే ఏమని అనుకోవాలి. ఏపీలో శాంతిభద్రతలు ఇంత ఘోరంగా ఉన్నాయని అర్ధం అవడం లేదా?తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎవరూ ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై నిర్దిష్టంగా మాట్లాడడం లేదు. విశాఖ టూర్లో చంద్రబాబు తాము ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకమని మొక్కుబడిగా చెప్పినట్లు ఉంది తప్ప, దానికి కట్టుబడి ఉంటే ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పిస్తామో చెప్పి ఉంటే కొంత విశ్వాసం ఏర్పడేది.కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ మూతపడకుండా చూస్తామని అంటున్నారు తప్ప ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టంగా చెప్పినట్లు అనిపించదు. నిజమైన టీడీపీ, జనసేన కార్యకర్తలైతే ముందుగా తమ నాయకులను దీనిపై నిలదీయాలి! కనీసం వాస్తవమా? కాదా?అన్నది తెలుసుకోవాలి. అలాకాకుండా దహనకాండకు తెగబడడం అంటే వారి అరాచక స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శించినట్లు అనుకోవాలి! చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖ స్టీల్‌పై తమ కార్యాచరణను స్పష్టం చేస్తే సరే! లేకుంటే మీడియాలో వచ్చిన కథనాలన్ని వాస్తవమేనని భవిష్యత్తులో తేలుతుంది కదా! అప్పుడు అలవాటు ప్రకారం టీడీపీ కూటమి యూ టర్న్ తీసుకున్నట్లే కదా! దాని గురించి మీడియా రాస్తే మాత్రం దహనకాండకు పాల్పడతారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
సూపర్ సిక్స్ కాదిది.. సూపర్ మోసం: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: పిల్లలను బడులకు పంపించడానికి పేదరికం అడ్డు కాకూడదని, బడి ఈడు పిల్లలు పనులకు పోకూడదన్న మంచి సంకల్పంతో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన అమ్మఒడి పథకాన్ని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చదువుకునే పిల్లలున్న తల్లులకు ఏటా రూ.15 వేలు ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉన్న వాళ్లకు వైఎస్ జగన్ మేలు చేశారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయనటువంటి వినూత్న ఆలోచనను చేసిన నేత ఒక్క జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఒక్క పథకానికే ఏకంగా రూ.26 వేల కోట్లు తల్లుల ఖాతాల్లోకి జమ చేశారన్నారు. ఐదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని తెలుగుదేశం కూటమి కాపీ కొట్టడమేకాక, మాట నిలుపుకోలేదని ధ్వజమెత్తారు. ‘ఇంటిలో ఎంత మంది చదువుకున్నా జగన్ ఒక్కరికే రూ.15 వేలు ఇస్తున్నారు. మమ్నల్ని అధికారంలోకి తీసుకొస్తే ఒకరైతే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు అందజేస్తామని ప్రకటిస్తే ప్రజలు ఆకర్షితులై ఓట్లేసి గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబునాయుడికి ఉందా? లేదా?’ అని నిలదీశారు. ఇదే విషయాన్ని ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలంతా ప్రచారం చేశారని చెప్పారు. వారి ప్రచారానికి సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తల్లికి వందనం కాదు.. మోసం తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని చదివితే చాలా అనుమానాలు కలుగుతున్నాయని అంబటి అన్నారు. ఈ జీవో ప్రకారం ప్రతి ఏడాది తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తామని ఉందని చెప్పారు. ఎంత మంది పిల్లలను స్కూల్‌కి పంపినా రూ.15 వేలు మాత్రమే ఇస్తామని దాని అర్థం అన్నారు. ఇది సూపర్ సిక్స్ కాదని.. సూపర్ మోసమని అభివరి్ణంచారు. ఇది తల్లికి వందనం కాదని.. తల్లికి మోసమని నిప్పులు చెరిగారు. ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్ అయితే, ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు అని చెప్పారు. బాబు మోసంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు? జగన్ వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులు, కుటుంబాలు తాము ఎంత దారుణమైన మోసాలు చేసే వ్యక్తికి ఓట్లేశామో గుర్తించాలని అంబటి సూచించారు. ఇదే జగన్ ఉన్నట్లయితే జూన్ ఆఖరుకు ప్రతి తల్లి ఖాతాలో అమ్మఒడి జమ అయి ఉండేదని, ఇవాళ జూలై వచ్చినా ఆ డబ్బులు రాలేదన్నారు. ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను మార్చి ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనన్నారు. వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్సార్సీపీ మీ వెంట పడుతుందని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇప్పుడు చంద్రబాబు చెప్పడం దారుణం అని, ఆ విషయం హామీలు ఇచ్చే ముందు తెలియదా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుని ఉంటే బావుండేదని రాష్ట్ర ప్రజలు అనుకునే రోజులు ప్రారంభమయ్యాయన్నారు. -
ఇద్దరు సీఎంల భేటీ.. పరువు పాయే.. అంతా తుస్సే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు విభజన సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం అవడం ముదావహమే. వారిద్దరి భేటీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చాలామంది ఆశించారు. తెలుగుదేశం మీడియా ఇచ్చిన హైప్ చూసినవారికి ఏదో జరిగిపోతుందన్న భావన కలిగింది. తీరా ఇద్దరు సీఎంల సమావేశం అయిన తర్వాత ఇంతేనా.. ఏదో అయిపోతుందనుకుంటే ఇలా తుస్సుమనిపించారేమిటా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.పేరుకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్ల ప్రకటించినా అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చెప్పలేం. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. గత అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ విభజన సమస్యలు రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు సీఎంలు దిశానిర్దేశం చేయనిదే కమిటీలు కూడా ఏమీ చేయజాలవు. గతంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సంప్రదింపులు కొనసాగించాలని భావించినా, ఆ తర్వాత కాలంలో అవి పెద్దగా జరగకపోవడంతో సీరియస్ నెస్ పోయినట్లయింది.ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగితే మంచిదే. విభజనలో కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దాటవేసే ధోరణినే అవలంబించినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఒకరికొకరు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చుకుంటున్నట్లు కనిపించడానికి ఈ సమావేశం జరిగినట్లు అనిపిస్తుంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ కు, రేవంత్ కు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. అలాగే చంద్రబాబును రేవంత్ అప్పుడప్పుడు పొగుడుతుంటారు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు అనే సంగతి బహిరంగ రహస్యమే. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి కోస్తా తీరంలో వాటా, టీడీపీలో షేర్ అడుగుతామంటూ లీక్ లు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టకుండా చేశారన్న భావన కలుగుతుంది.ప్రత్యేకించి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని ఆస్తులలో తమకు వాటా రావాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలవారు కలిసి హైదరాబాద్ అభివృద్ది చేసుకున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా చెల్లించిన పన్నులతో హైదరాబాద్ లో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, వాటిలో షేర్ ఉంటుందన్నది ఏపీ వాదన. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్ ల లోని ఆస్తుల విభజన ద్వారా ఏపీకి న్యాయబద్దమైన వాటా వస్తుందని ఆశించినవారికి ఈ సమావేశం ఆశాభంగం కలిగించింది.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ తమవేనని ఉద్ఘాటిస్తోంది. హైదరాబాద్ లో సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ఉంటే, అందులో జనాభా నిష్పత్తి ప్రకారం ఏభై ఎనిమిది శాతం వాటా ఏపీకి వస్తాయని అనుకున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశం ఏపీకి 75 వేల కోట్ల రూపాయలు రావల్సి ఉందని అంచనా వేసింది. కానీ ఇవేవి చర్చకు వచ్చినట్లు అనిపించదు.ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇంత కీలకమైన రెండు రాష్ట్రాల సమావేశానికి రాకుండా తప్పించుకున్నారా? లేక చంద్రబాబు రమ్మనలేదో తెలియదు కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఈ భేటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే, పవన్ కల్యాణ్ అసలు పాల్గొనలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రామోజీరావు సంస్మరణ సభలో కేవలం చంద్రబాబు పేరు మాత్రమే వేయడం, ఢిల్లీ టూర్ లో పవన్ కల్యాణ్ లేకుండానే ప్రధాని మోదీని, ఇతరకేంద్ర మంత్రులను చంద్రబాబు ఒక్కరే కలవడం, ఇప్పుడు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల కీలక చర్చలలో పవన్ కు అవకాశం ఇవ్వకపోవడం వంటివి కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్ ఇలాంటి అవమానకర ఘటనల విషయంలో పెద్దగా ఫీల్ కాకపోతుండవచ్చు. ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ భేటీ ఎజెండాను ఖరారు చేయడానికి సమావేశం పెట్టారుకానీ ఆయన ఎందువల్లనో పాల్గొనలేదు. ఈ సంగతి పక్కనబెడితే ఇద్దరు సీఎంలు కలిసిన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడతారని అంతా ఊహిస్తారు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ మీడియాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేది తెలిసిన సంగతే. కానీ వారు మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి వెళ్లిపోయారంటేనే దాని అర్ధం ఈ సమావేశం ఫలప్రదం కాలేదని అనుకోవాలి.ఒకవేళ ఏ ఒక్కదానిపైన అయినా అవగాహన కుదిరితే దాని గురించి అయినా ఘనంగా చెప్పుకునేవారు. విభజన సమస్యల వల్ల తెలంగాణకు పెద్దగా నష్టం ఏమీ లేదు. ఎటుతిరిగి ఏపీకే ఈ సమస్యల సత్వర పరిష్కారం అవసరం. తద్వారా నిర్దిష్ట మొత్తంలో నిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయిందని అనిపిస్తుంది. హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల గురించి తేల్చలేకపోతే చంద్రబాబు అంతటి సీనియర్ నేత వల్ల ఏపీకి ఏమి ఒరిగిందన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ లో భవనాలు ఇవ్వబోమని, కావాలంటే స్థలాలు ఇస్తాం.. బిల్డింగులు కట్టుకోండని రేవంత్ స్పష్టం చేశారంటే అది ఏపీకి నష్టం చేయడానికే ఆయన వెనుకాడడం లేదని అర్దం. దానిని చంద్రబాబు ఖండించలేకపోవడం, ఏపీ వాటా గురించి పట్టుబట్టలేకపోవడం ఆయన బలహీనత అనిపిస్తుంది. లేదా రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోయారని అనుకోవాలి.అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి ఏడువేల కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఏపీ ఫిర్యాదు చేస్తోంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి, హోం మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. ఆయా అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రింకోర్టుకు కూడా వెళ్లింది. చంద్రబాబు దానిని కొనసాగిస్తారో, లేదో తెలియదు. ఇప్పుడు తెలంగాణ తమకే 24వేల కోట్ల మేర ఏపీ నుంచి రావాలని ఎదురుదాడి చేసింది. అయినా చంద్రబాబు దీనిపై నోరెత్తినట్లు కనిపించలేదు.పోలవరం ప్రాజెక్టు కింద ముంపు మండలాలుగా ఉన్న ఏడింటిని ఏపీలో కలపడంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. వాటిలో కనీసం ఐదు గ్రామాలనైనా తమకు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. దీనికి ఈ చర్చలలో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించినట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారని కథనం వచ్చింది. దానిని సానుకూలంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాదో లో ఉమ్మడి ఆస్తుల విషయంలో తెలంగాణ అంత గట్టిగా ఉన్నా, భద్రాచలం పక్కన ఉన్న గ్రామాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా ఉండడం విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.కృష్ణా జలాలలో తెలంగాణ ప్రభుత్వం అధిక వాటా కోరుతోంది. దానివల్ల ఏపీకి నష్టం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతానికి బాగా ఇబ్బంది వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంంల రేవంత్ తన మనుషుల ద్వారా అడ్డుకున్నారు. అలాంటి ముఖ్యమైన సమస్యలు అసలు చర్చకే వచ్చినట్లు లేదు. ఇద్దరు సీఎంల భేటీ ముందడుగు అంటూ టీడీపీ మీడియా ఊదరగొట్టింది కానీ అది ఏ రకంగానో చెప్పలేకపోయింది. పైగా డ్రగ్స్ అంశంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీశారన్న వాదన వినవస్తోంది. డ్రగ్స్ అంశంలో ఇద్దరు డీజీపీలు సహకరించుకుని కఠినచర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు. అది దేశ వ్యాప్త సమస్యగా ఉంది.అయినా ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు అదేదో ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు మాట్లాడడం దారుణంగా ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ తదితర నగరాలలో ఇది ఎంత పెద్ద సమస్యగా ఉందో చెప్పనక్కర్లేదు. కేవలం రాజకీయంగా వైఎస్సార్సీపీపై పిచ్చి ఆరోపణలు చేయడానికి ఇలా ప్రచారం చేసి ఏపీ మంత్రులే రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడం శోచనీయం అని చెప్పాలి. 2017లో టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లోనే ఏపీలో గంజాయి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీడియాకే చెప్పారు. అయినా టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పిస్తారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా టీడీపీ మంత్రులు మాట్లాడితే రాష్ట్రానికి ఏమి ప్రయోజనం వస్తుంది?ఏపీ డిమాండ్లకు ముకుతాడు వేయడానికి రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త లీకులు ఇచ్చినట్లు అనిపిస్తుంది. కోస్తా తీర ప్రాంతం, ఓడరేవులలో వాటా ఇవ్వాలని, తిరుమల, తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నట్లు మీడియాలో వార్తలు ప్రచారం చేయించింది. అది సంచలనంగా మారింది. ఆ రకంగా ముందరికాళ్లకు బంధం వేయడంతో చంద్రబాబు అసలు కీలకమైన ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు మొదలైన అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించలేకపోయారా? అనే సంశయం ఏర్పడుతోంది.ఇటీవల తెలంగాణ కూడా తన ముఖ్యమే అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. అందువల్లే ఏపీ డిమాండ్లపై చంద్రబాబు పట్టలేదనిపిస్తుంది. వీటిపై పట్టుబట్టి రేవంత్ ను ఒప్పించలేకపోతే ఏపీకి ఆయన చాలా నష్టం చేసినవారు అవుతారని వేరే చెప్పనవసరం లేదు. అయినా చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా ఉంది కనుక ముందడుగు అని, ఏదో సాధించేశారనో రాయవచ్చుకానీ, వాస్తవరూపంలో ఏపీకి ఒక్క అంశంలో కూడా మేలు జరిగినట్లు అనిపించదు. ఈ మొత్తం ప్రక్రియ చూస్తే రాష్ట్రాల సమస్యల పరిష్కారం కన్నా, వేర్వేరు కూటములకు చెందిన చంద్రబాబు, రేవంత్ లు తాము రాజకీయంగా కలిసే ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీలో అందుకేనా టీడీపీ చర్యలు!
ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పాలన సాగుతోంది? గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సొంత కారణాలతో ఘర్షణపడినా అందులో ఒకరికి వైఎస్సార్సీపీ రంగు పులిమి సైకో పాలన అంటూ విపరీతంగా దుష్ప్రచారం చేసేవారు. ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతున్నా రాష్ట్రంలో హింసాకాండ ఆగడం లేదు. వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం ఒక వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఒక వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేత జరిగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులను టీడీపీ వారు వేధిస్తూనే ఉన్నారు. విధ్వంసం, దహనాలు జరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఇష్టారాజ్యంగా దగ్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని, ఏపీలో ఆటవిక రాజ్యం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోందని అనిపించడం లేదా! ఇదేనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం కలిగి, మరోసారి సీఎం అయిన చంద్రబాబు నుంచి ప్రజలు ఆశించింది!ఆయన రాజ్యంలో పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారు. బాధితులపై దాడులు చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తిగా తీసుకోవాలన్నమాట. రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వెళ్లకూడదని పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసిన తీరు పోలీసుల అసమర్ధతకు అద్దం పడుతుందని అనుకోవాలి.గతంలో చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మార్గంలో కాకుండా మరో రూట్లో పుంగనూరు వెళ్లి అక్కడ అరాచకానీకి కారకులయ్యారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారు. ఒక పోలీస్ కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ సందర్భంగా కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ నేత చల్లా బాబుపై కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు. బహుశా అది టీడీపీ వర్గీయులకు కోప కారణం అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వీలు లేదంటూ టీడీపీ వారు అడ్డుపడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ ప్రాంతంలో దౌర్జన్యాలకు గురైన వైఎస్సార్సీపీ వారిని, ఇతర బాధితులను పరామర్శించడానికి వెళ్లడానికి వీలులేదని పోలీసులు ఆదేశించారు.ఇదీ చదవండి: కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడురామచంద్రారెడ్డి పర్యటన వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనుకుంటే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయాలి కానీ, పెద్దిరెడ్డిని పుంగనూరు నుంచి వెనక్కి పంపించడం ఏమిటి? పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ టీడీపీ నేత పర్యటనలనైనా ఎవరైనా అడ్డుకున్నారా? కుప్పంలో చంద్రబాబు పర్యటించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు సైతం పోలీసులు ఎంతో సంయమనం పాటించి, అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటన పూర్తి అయ్యేలా చేశారే! అయినా ఆ రోజుల్లో చంద్రబాబు వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, వైఎస్సార్సీపీ వారిని ఎవరిని కదలనివ్వడం లేదు. టీడీపీ వారు ప్రత్యర్ధుల పొలాలలోని తోటలను నరికి వేస్తున్నారు. పుంగనూరులో అయితే వైఎస్సార్సీపీ అనుకూలురైన పేదల ఇళ్లలోని ఆవులను కూడా తోలుకుపోతున్నారట.రాష్ట్రంలో అనేక చోట్ల పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఎక్కడో మణిపూర్, ఆస్సోం వంటి రాష్ట్రాలలో నెలల తరబడి హింసాకాండ జరుగుతుంటే ప్రజలు ఎలా భరిస్తున్నారా అని అంతా బాధపడుతుండేవాళ్లం. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతున్నా అందులో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ, బీజేపీ కానీ నోరు విప్పడం లేదు. కొన్ని చోట్ల జనసేన కూడా ఈ విధ్వంసంలో భాగస్వామి అవుతోంది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. కూటమి నేతలు కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పుంగనూరుకు ప్రతిష్టాత్మకమైన విద్యుత్ బస్‌ల తయారీ కర్మాగారాన్ని తీసుకు వస్తే, కూటమి నేతలు దానిని చెడగొట్టి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమి చేయాలా? అని సందిగ్ధంలో పడిందట.విశేషం ఏమిటంటే మిథున్ రెడ్డి తిరుపతిలో ఉన్నప్పటికీ, అక్కడకు వచ్చిన పుంగనూరు పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని ఆయనను కలవనివ్వలేదట. పోలీసులు నిజంగానే లోకేష్ ఎర్రబుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. తాను ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్దమని, ప్రభుత్వ అరచాకాలను అడ్డుకుంటానని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు మిథున్ రెడ్డి మాదిరి స్పందించడం ఆరంభించవలసిన అవసరం ఉంది. టీడీపీ వారు కానీ, పోలీసులు కానీ ఎన్నాళ్లు దాడులు చేస్తారు! ఎన్ని కేసులు పెడతారు?గతంలో ఒకసారి పల్నాడులోని ఒక గ్రామంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. వెంటనే దానిని రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటనకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. దానిని చంద్రబాబు ఎంతగా విమర్శించింది అందరికి తెలుసు. అదే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్సీపీ వారిపై అంతకన్నా దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ వారు చేస్తున్న క్రిమినల్ చర్యలకు ప్రోత్సాహం ఇస్తోంది. హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావు పేటలో సైతం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలని కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆటవిక చర్యలను ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ప్రతిఘటించికపోతే ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమవుతుంది. ఏపీ ఒక ఆటవిక రాజ్యంగా మిగులుతుంది.ఈ సందర్భంలో వేమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జీ వి. అశోక్ బాబు గట్టిగా సమాధానం ఇచ్చిన వైనం ప్రస్తావనార్హం. భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వారు దగ్ధం చేశారు. దానికి నిరసనగా అశోక్ బాబు అక్కడకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో ఆయన మౌన దీక్ష చేశారు. ఫలితంగా పోలీసులు వెనక్కి తగ్గకతప్పలేదు. అంతేకాక మరో కొత్త విగ్రహాన్ని తెప్పించి ఆయన అదే స్థానంలో ఆవిష్కరించారు. ఇలా ప్రతిచోట టీడీపీ వారి దుండగాలను ఎదుర్కోకపోతే అప్రతిహతంగా ఇలాంటి వాటినే కొనసాగిస్తారు. కేవలం వైఎస్సార్‌సీపీవారిని భయభ్రాంతులను చేసి టీడీపీ హామీలు ఎగవేసినా ఎవరూ ప్రశ్నించకుండా ఉండడం కోసం కూడా ఈ హింసాకాండ సాగిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కేంద్ర నాయకత్వం కూడా క్రియాశీలకం అయి నిరసనలకు దిగి కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపవలసిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నలభై ఆరేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏలుబడి ఇంత అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు ప్రజలలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో చంద్రబాబుకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ వారి అరాచకాలను ఆపుతారని, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా ఆదేశాలు ఇస్తారని ఆశిద్దాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవని గుర్తు పెట్టుకో చంద్రబాబూ.. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి. ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్లే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటు వంటి తప్పుడు సంప్రదాయాలు ఇప్పటికైనా ఆపండి. ఇలాంటివి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు. రియాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుంది. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతూ విష సంస్కృతికి చంద్రబాబు బీజం వేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే భవిష్యత్‌లో రియాక్షన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాడులు, విధ్వంసాలు ఆపాలని కోరడం లేదని, హెచ్చరిస్తున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని.. పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇది ఏ మాత్రం న్యాయం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు పాపాలు పండుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై, మంచి పాలన అందించడంపై చంద్రబాబు దృష్టి పెడితే మంచిదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం వైఎస్ జగన్ ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసక చర్యలు జరుగుతున్నాయి. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దొంగ కేసులు పెడుతున్నారు. వీళ్లే కొడతారు, మళ్లీ వీళ్లే అటు వైపున ఉన్న వారి మీద కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రాంతం చూడలేదు. చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకం, ప్రతి మంచిని అర్హత ప్రామాణికంగా ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాం. ఈ రోజు చంద్రబాబునాయుడుకు ఓటు వేయలేదనే కారణంతో అన్యాయంగా రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. ఆ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను విరగ్గొడుతున్నారు.. పగలగొడుతున్నారు. ఇవన్నీ శిశు పాలుని పాపాల మాదిరిగా పండుతాయి. నెల్లూరులో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరకు వెళ్లి ఫలాన మంచి చేశాం కాబట్టి ఓటు వేయండి అనే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, అన్యాయమైన కేసులు పెట్టి, ఆస్తులు ధ్వంసం చేసి, భయాందోళనలు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తే, అలాంటి రాజకీయం ఏ రోజూ నిలబడదు. తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో కానీ తర్వాత ఓటు వేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. అందుకే చంద్రబాబులో మార్పు రావాలి. లేదంటే ప్రజలు లెక్కా జమా సరిచేసి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..పిన్నెల్లిపై ఇంత అన్యాయంగా కక్ష సాధింపా?⇒ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏకంగా 307 అంటే హత్యాయత్నం కేసు పెట్టారు. ఏ రకంగా అన్యాయంగా అతన్ని జైల్లో నిర్బంధించారో చూస్తున్నాం. కారంపూడి ఘటన జరిగిందెప్పుడు? ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు అంటే మే 14న. కారంపూడిలో టీడీపీ ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలోని మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినందున వాళ్లను పరామర్శించడానికి డీఎస్పీ అనుమతి తీసుకుని అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి బయల్దేరాడు. ⇒ కారంపూడికి అటు వైపున ఎస్సీ కుటుంబం ఇల్లు ఉంటే.. ఎమ్మెల్యే ఊర్లోకి ప్రవేశించక ముందే ఇటు వైపు అడ్డగించారు. గొడవ టౌన్లో జరుగుతుంటే పిన్నెల్లిని ఊరుబయటే అడ్డగించారు. నారాయణస్వామి అనే సీఐని పిన్నెల్లి చూసిన దాఖలాలు కూడా లేవు. మే 14న గొడవ జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23న ఆయనకేదో జరిగింది అన్నట్లుగా ఆ సీఐ, రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. ఆ సీన్లో లేని వ్యక్తిపై ఈ కేసు బనాయించారు. ఇది అన్యాయం కాదా? ⇒ అసలు ఇన్సిడెంట్ నిజంగా జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగి ఉంటే మే 15న మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం సిట్ వేసింది. 17 నుంచి 20వ తేదీ వరకు పల్నాడు ప్రాంతంలో ఆ సిట్ బృందం తిరిగి ఘటనపై రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టులో ఎందుకు ఈ అంశం రాలేదు? అలాంటప్పుడు ఈ రకంగా హత్యాయత్నం కేసులో ఒక మనిషిని ఇరికించడం ధర్మమేనా?ప్రతి దశలో ఓ రెడ్‌బుక్⇒ ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్‌బుక్స్ అని చెప్పి పెట్టుకున్నారు. చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్‌బుక్, లోకేశ్ స్థాయిలో ఒక రెడ్‌బుక్, ఎమ్మెల్యే స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్‌బుక్‌లు పెట్టుకుని ఏం చేస్తున్నారు? అతి దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ⇒ మీ విధ్వంసాలు, దాడులను రాష్ట్రం మొత్తం చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఊరూరా ఆస్తుల ధ్వంసం, దాడులు, దౌర్జన్యాలపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.ఎమ్మెల్యే 10 సార్లు ఫోన్ చేసినా ఎస్పీ స్పందించలేదు⇒ మే 13న ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గరకు అప్పటి ఎమ్మెల్యే వెళ్లినప్పుడు జరిగిన ఘటన మీద మరో కేసు పెట్టారు. అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది? అక్కడ ఉన్న ఎస్సీ సామాజిక వర్గం వారు పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే పరిస్థితి లేనప్పుడు ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లారు. ఆ పరిస్థితులను చూసి ఎస్పీకి 10 సార్లు ఫోన్ చేసినా కూడా స్పందించని పక్షంలో కనీసం సీఐని, ఎస్సైని పంపించండనే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి సెన్సిటివ్ బూత్‌లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టారు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఘటన జరిగింది. ఆ ఈవీఎం పగలగొట్టిన కేసులో తనకు బెయిల్ వచ్చింది. కానీ ఎవరిపైనో హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ జైలు పాలు చేశారు. ⇒ ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున కేసులు పెట్టారు. రిగ్గింగ్‌ను అడ్డుకునే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేస్తే, హత్యాయత్నం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. నిజంగా అటువంటిది జరిగి ఉంటే సిట్ 17వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఇచ్చిన రిపోర్టులో చెప్పాలి కదా? 2009 నుంచి వరుసగా నాలుగు సార్లు పిన్నెల్లి గెలిచాడంటే మంచోడు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంత వరకు ధర్మం? ఈ రోజు ఇది రామకృష్ణారెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఇలానే జరుగుతోంది. ⇒ వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు పిన్నెల్లితో ములాఖత్‌లో పాల్గొన్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి తదితరులు ప్రెస్మీట్లో పాల్గొన్నారు.ప్రజలు మీకు ఓటు వేసింది ఎందుకు?⇒ ప్రజలకు మంచి చేసి వైఎస్సార్సీపీ ఓడిపోలేదు. చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఆకర్షితులయ్యారు. 10 శాతం ఓట్లు అటు షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. మేనిఫెస్టోలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానన్నారు. ఖరీఫ్‌లో జోరుగా వ్యవసాయం పనులు జరుగుతున్నాయి. రైతన్నలు పంటలు వేగంగా వేస్తున్నారు. ఇంత వరకు రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానన్న దానికి అతీగతీ లేదు.⇒ బడులు మొదలయ్యాయి. అమ్మ ఒడి కింద జగన్ రూ.15 వేలు ఐదేళ్ల పాటు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇస్తానని, ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా బడి ఈడు పిల్లలున్నారు. తల్లికి వందనం కింద ఆ డబ్బులేమయ్యాయి అని ప్రతి తల్లీ అడుగుతోంది. ⇒ 18 ఏళ్లు పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని మొన్ననే లెక్కలు తేలాయి. అందులో దాదాపుగా 2.10 కోట్ల మంది మహిళా ఓటర్లే. అందరూ 18 సంవత్సరాలు నిండిన వారే. ప్రతి నెలా రూ.1500 ఇస్తానన్నావు, ఏమైంది? అని వీరందరూ ఈ రోజు అడుగుతున్నారు. ⇒ వీటన్నింటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి. గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకు డబ్బులిచ్చే కార్యక్రమం చూడండి. రైతులకు రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమం చూడండి. ప్రజలు ఎందుకు తమకు ఓటు వేశారు అని చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. ఇవేవీ కూడా చేయకుండా కేవలం భయాందోళనలు నెలకొల్పాలి.. రాష్ట్రంలో రావణకాష్టం రగిలించాలి.. దొంగ కేసులు పెట్టి ఇరికించాలి.. ఆస్తులను ధ్వంసం చేయాలి.. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారెవరినీ ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం. -
బాబు ‘బిల్డప్’ షురూ.. సూపర్ సిక్స్ అయిపోయినట్లేనా..!?
ఏపీలో సామాజిక పెన్షన్ల రాజకీయం తమాషాగా ఉంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ప్రాంతం చూడం, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం.. అని స్పష్టంగా చెప్పి ఎక్కడా రాజకీయాలకు తావు లేకుండా కార్యక్రమాలు అమలు చేసింది. అందులో భాగంగా వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పెన్షన్లను వలంటీర్ల ద్వారా పంపిణీ చేసింది. ఎక్కడా వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రమేయం లేకుండానే సాగిపోయేది. వలంటీర్లు ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం కనుక వివాదం, పబ్లిసిటీ లేకుండా పెన్షన్లు పంచేవారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓటమిపాలైంది.కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తాను చెప్పిన విధంగా ఈ నెలకైతే పెంచిన సామాజిక పెన్షన్ లు ఇచ్చింది. అంతవరకు ఒకే. మిగిలిన స్కీముల గురించి ఇంకా చెప్పకపోయినప్పటికీ ఇప్పటికే అమలులో ఉన్న పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలు పెంచి, మూడు నెలల బకాయిలు చెల్లించారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఇదేదో ఇప్పుడే సరికొత్తగా కనిపెట్టినట్లు, మొత్తం రాజకీయ కార్యక్రమంగా మార్చి టీడీపీ ప్రచారానికి వాడుకోవడం మాత్రం ఆక్షేపణీయమే.జూలై ఒకటిన జరిగిన తంతు చూశాకా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమాయకత్వంగా చిత్తశుద్దితో రాజకీయాలకు అతీతంగా వలంటీర్లు ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారా అనే భావన ఎవరికైనా రావచ్చు. అదే చంద్రబాబు అయితే ఫక్తు తనదైన రాజకీయ శైలిలో గతంలో జన్మభూమి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈసారి తన పార్టీ కార్యకర్తల ద్వారా వీటిని పంపిణీ చేయించారు. వలంటీర్లు లేకుండానే పంపిణీ చేయగలం చెప్పుకోవడంతో పాటు ప్రచారం కూడా భారీగా రావాలన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేశారన్నది అర్ధం అవుతూనే ఉంది.ఇప్పటికే పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా పార్టీ కార్యకర్తల ద్వారా డబ్బు పంపిణీ చేయించవచ్చా అని అడిగితే ఎవరు బదులు ఇస్తారు. వారికి ఉన్న చట్టబద్దత ఏమిటని ఎవరు ప్రశ్నిస్తారు? పైగా టీడీపీ కేంద్ర కార్యాలయమే దీనిపై ఆదేశాలు ఇచ్చి మరీ కార్యకర్తలను రంగంలోకి దింపింది. పేరుకు సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఇస్తారని తెలిపినా, హడావుడి చేసి ఫోటోలు దిగింది మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలే. కొన్ని చోట్ల వీరి మధ్య గొడవలు కూడా జరిగాయట. కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలో, సిబ్బందో ఐదువందల రూపాయలు కట్ చేసుకుని పెన్షన్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. మరికొన్నిచోట్ల వృద్ధుల ఇళ్లకు వెళ్లకుండా, అందరిని ఒక చోటకు పోగు చేసి పెన్షన్లు అందచేశారు. వైఎస్సార్సీపీకి సంబంధించినవారని చెప్పి పలాస తదితర కొన్నిచోట్ల పెన్షన్ ఇవ్వకుండా నిలుపుదల చేశారు. భవిష్యత్తులో పెన్షన్ దారుల సంఖ్యలో కోత పెట్టబోతున్నారని కూడా సమాచారం వస్తోంది.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా ఒక లబ్దిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం విశేషం. గతంలో ఎప్పుడూ ఆయన ఇలా చేయలేదు. ఈసారి అలా చేయవలసి వచ్చిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వ్యవస్థ ప్రభావమే అని చెప్పాలి. అంతకు ముందు పద్నాలుగేళ్లు తాను సీఎంగా ఉన్నప్పుడు మాదిరి ఇప్పుడు కూడా లబ్దిదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని చంద్రబాబు చెప్పి ఉంటే నానా రభస అవుతుందని భయపడి ఇళ్లవద్దే పెన్షన్ పంపిణీ చేశారు. చివరికి ఆయన కూడా వలంటీర్ పాత్ర పోషించారని వైఎస్సార్‌సీపీవారు చమత్కరిస్తున్నారు.ఇక్కడే చంద్రబాబు అనండి.. తెలుగుదేశం వారు అనండి.. తమదైన శైలిలో అసత్యాలు చెప్పే యత్నం చేశారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఇదే తొలిసారి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో చివరి మూడు నెలలు తప్ప మిగిలిన కాలం అంతా వృద్దులు, వికలాంగులు, తదితర వర్గాలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లి పెన్షన్ ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే సంగతి దాచేస్తే దాగని సత్యం. ఎన్నికల సమయంలో వలంటీర్లు ఈ కార్యక్రమం జరపకుండా అడ్డుపడిందే కూటమి నేతలు అనే సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వలంటీర్లు లేకపోతే పంపిణీ ఆగిందా అని ప్రశ్నించడం ద్వారా తన నైజం ప్రదర్శించుకున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల వద్ద లంచాలు తీసుకున్నారని ఆరోపించి వారిపై విషం కక్కారు. వారిపై ఇంకా తన అక్కసు తీరలేదని రుజువు చేసుకున్నారు. తీరాచూస్తే ఇప్పుడు కొంతమంది చేతివాటం ప్రదర్శించారని వీడియో సహితంగా తేలింది. అదే టైమ్ లో వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చంద్రబాబుతో పాటు తాను ఎందుకు హామీ ఇచ్చింది మాత్రం పవన్ కల్యాణ్ వివరించలేదు. పైగా వారిని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతం ఇస్తున్నారు. వారికి ప్రత్యామ్నయా ఉపాధి చూపుతారట.ఉన్న ఉద్యోగం పీకి కొత్తగా ఏదో చేస్తామంటే నమ్మడానికి జనం పిచ్చివారా! అబద్దాలు చెప్పినా జనం ఓట్లు వేసి గెలిపించారు కనుక వారు పిచ్చోళ్లే అని పవన్ కల్యాణ్ భావిస్తుండవచ్చు. తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు. లబ్దిదారుల అర్హతలపై రీసర్వే చేయించాలని అన్నారు. అంటే దాని అర్థం.. లబ్దిదారులలో కోత పెడతామనే కదా! ఈ సంగతి ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదు. కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారు. ఇది జనాన్ని మాయ చేయడం కాదా? అని అడిగితే జవాబు ఏమి ఉంటుంది. ఇక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికి గుర్తుకు వస్తారు. ఆయన పార్టీలు చూడకుండా ప్రజలకు మేలు చేయాలని తలపెట్టి దెబ్బతిన్నారు.చంద్రబాబు నాయుడు అయితే యథా ప్రకారం ప్రవచనాలు వల్లించారు. పేదరికం లేని సమాజం సృష్టించడమే ఆయన లక్ష్యమట. ఈ మాట 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు. కాలం ఆయనకు కలిసి వచ్చి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కానీ, పేదరికం మాత్రం పోలేదు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. ఆ బ్రహ్మ పదార్ధం ఎలా ఉంటుందో ఎవరికి కనిపించదు. వినేవాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉంటాయి ఈ మాటలు. పోలవరం పూర్తి అయితే సంపద వచ్చేసేదట. పేదరికం పోయేదట. ఆయన పాలన ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా! అయినా పేదరికం ఎందుకు కొనసాగుతోంది. జనాన్ని మభ్య పెట్టడానికి ఇలాంటివి మాట్లాడుతుంటారు. అందులో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని విమర్శించిన చంద్రబాబు తాను పవర్ లోకి వచ్చిన ఇరవైరోజులలోనే ఏడువేల కోట్ల అప్పు చేశారు. ఈ అప్పులనే సంపద అని ప్రజలు అనుకోవాలి కాబోలు. ఈ అప్పులలో తమకు ఎంతో కొంత వాటా వస్తుంది కనుక, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కూడా ఈ అప్పులపై నోరు విప్పడం లేదు. చంద్రబాబుకు అనుభవం ఉంది కనుకే పెన్షన్లు ఇవ్వగలిగారని పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మరి గత ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్దగా ప్రచారం లేకుండానే ప్రతి నెల మొదటితేదీకే పెన్షన్లు ఇచ్చింది కదా! అది గొప్ప విషయం కాదా? చంద్రబాబు తన అనుభవంతో అప్పులు తెచ్చారని పవన్ భావిస్తున్నారా! ఈ అప్పులతో రాష్ట్రం శ్రీలంక అవ్వదని కూడా ఆయన చెప్పి ఉండాల్సింది.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. గతంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించిన చంద్రబాబు ఈసారి ఒక్క పవన్ కల్యాణ్ కు మాత్రమే ఆ పదవి కట్టబెట్టి వెయిట్ పెంచారని ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నిచోట్ల పవన్ కల్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆయన ఫోటోలు సైతం ఉంచాలని చంద్రబాబు చెప్పినట్లు లీకులు వచ్చాయి. కానీ వారంతా భావిస్తున్న ఇంత ప్రతిష్టాత్మక కార్యకమం ప్రచార ప్రకటనలో మాత్రం పవన్ కల్యాణ్ ఫోటో కనిపించలేదు. ఒక్క చంద్రబాబు ఫోటోనే ప్రచురించారు. రామోజీరావు సంస్మరణ సభ ప్రకటనలో కూడా పవన్ కల్యాణ్ పేరే వేయలేదు. అదేదో చంద్రబాబు రాజగురువు సంస్మరణ సభ కనుక పవన్ కల్యాణ్ పేరు వేయలేదులే అని అనుకున్నారు. కానీ పెన్షన్లు పంపిణీ ఇది ప్రభుత్వపరంగా చేసిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కదా! అయినా పవన్ కల్యాణ్ పోటో వేయలేదేమిటా అని జనసేన వారు ఆవేదన చెందుతున్నారు.పవన్ కల్యాణ్ వెనుక ఉన్న సామాజికవర్గం వారు కూడా మదన పడుతున్నారు. ఆయా రాష్ట్రాలలో ఉప ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా ప్రచారంలో వాడుతుంటారు. అయినా పవన్ కల్యాణ్ దీనిని అవమానంగా భావించకపోవచ్చు. టీడీపీ వారు ఏమి చేసినా పడి ఉండడానికి ఆయన ఎప్పుడో సిద్దపడిపోయారన్న భావన ఉంది. ఏది ఏమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రహితంగా ఇలాంటి సంక్షేమ స్కీములు ఎన్నిటినో అమలు చేసి తన మంచిని ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తే తద్విరుద్దంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దీనిని ఫక్తు రాజకీయం చేసి పార్టీ కార్యక్రమం చేశారు. ఒక్క స్కీము అమలు చేసి, సూపర్ సిక్స్ అయిపోయినంతగా బిల్డప్ ఇచ్చే యోచనలో ఉన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు ఏమి చెప్పినా, ఏమి చేసినా అంతా రైటే అని జనం ఒప్పుకుంటారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
విరాళాలు, ఆస్తుల అమ్మకం.. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!
సాక్షి, అమరావతి: ‘అమరావతి రాజధానిని విధ్వంసం చేసి తెలుగు జాతికి జగన్ తీరని అన్యాయం చేశారు. దేశ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారు తప్ప ఇంకెవరూ రాజధాని మార్పు నిర్ణయాన్ని తీసుకోరు. విధ్వంసానికి జగన్ ఒక కేస్ స్టడీ. మాకు రాజధాని లేదు అని చెప్పుకునేంత పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? రాష్ట్రంలో పుష్కలంగా వనరులు ఉన్నాయి. తెలివి గల మానవ వనరులు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు విధ్వంసంతో నాశనం చేశారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి ఒక టైమ్ బాండ్ అంటూ పెట్టుకోలేదని, పాత ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళతామని స్పష్టం చేయడం చూస్తుంటే.. గత ప్రభుత్వం చెప్పిందే నిజమని స్పష్టమవుతోంది. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరుగుతుందని, ఇక్కడ రాజధాని కట్టాల్సి వస్తుందని ఎవరూ అనుకోలేదని, రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు రామోజీరావు అమరావతి పేరును సూచించారన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రతి గ్రామం నుంచి.. దేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాల నుంచి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చామన్నారు. కుప్పం వారికైనా, ఇచ్ఛాపురం వారికైనా అమరావతి సమదూరంగా ఉంటుందని, అందువల్లే ఇక్కడ రాజధాని నిర్ణయించినట్టు చెప్పారు. బుద్ధి ఉన్న ఏ వ్యక్తీ అమరావతి రాజధానిని వ్యతిరేకించరని, రాజధానికి రెండు వైపులా 12 చొప్పున ఎంపీ స్థానాలు ఉన్నాయని, విభజన అనంతరం శివరామృష్ణ కమిటీ రాష్ట్రంలో పర్యటించి కృష్ణా, గుంటూరు లేదా ఆ 2 జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు చెప్పిందన్నారు. ఏటా 3 పంటలు పండే మంచి భూమిని రాజధాని కోసం తీసుకోవడం సరికాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాన్ని ఇక్కడ ఆయన వక్రీకరించి అనుకూలంగా మార్చుకున్నారు.హైదరాబాద్‌కు కరెంట్, నీళ్లు.. బాబు ఘనతేనటగతంలో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.15 వేల కోట్లు ఆర్థిక లోటు ఉన్నా, సైబరాబాద్ నిర్మాణ అనుభవంతో అమరావతిని నిర్మించాలని ఆలోచించామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌కు నాడు సరిగా కరెంట్, నీళ్లు లేవని.. రానురాను అన్నీ కలిసొచ్చాయన్నారు. ఎంత మంది ప్రయత్నించినా వీలుపడని కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని, 14 రోజుల పాటు అమెరికాలో తిరిగి ఐటీ పరిశ్రమలను కూడా సైబరాబాద్‌కు తీసుకొచ్చినట్టు సీఎం వివరించారు. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామని, తన హయాంలో సాగు నీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఎయిర్ పోర్టులకు భూములు ఇచ్చిన వారు సంతృప్తిగా ఉండేలా చేశానని బాబు గొప్పలు చెప్పుకున్నారు. తొలుత అమరావతికి ల్యాండ్ పూలింగ్ సాధ్యమవుతుందా.. అని అనుమాన పడినా, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 34,400 ఎకరాలను 29,966 మంది రైతులు ఇచ్చారన్నారు. ఈ రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వాలని నిర్ణయించామని, వ్యయసాయ కూలీలకు నెలకు రూ.2,500 పెన్షన్ అందిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 1నే దాన్ని రూ.5 వేలకు పెంచి అందించామన్నారు. వాస్తవంగా పెన్షన్‌ను పెంచింది గత ప్రభుత్వమనే విషయాన్ని మరచి తన ఖాతాలోకి వేసుకోవడం బాబుకే చెల్లింది.గత ప్రభుత్వంపై ఏడుపువైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే విధ్వంసం ప్రారంభించారని, కనీసం నిబంధనలు కూడా పాటించకుండా ప్రజా వేదికను కూల్చేశారని, తర్వాత మూడు రాజధానులు ప్రకటించారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘జీఎన్.రావు, బోస్టన్ కమిటీ అంటూ ఎన్ని విన్యాసాలు చేయాలో అన్నీ చేశారు. ప్రజావేదిక శిథిలాలను తొలగించవద్దని ఇప్పుడు అంతా చెబుతున్నారు. అది చూస్తే ప్రతి ఒక్కరిలో గత ప్రభుత్వ విధ్వంసం గుర్తుకు రావాలి. జగన్ నిర్ణయంతో రైతులు రోడ్డున పడ్డారు. తిరుపతి యాత్రకు వెళితే ఉండటానికి మండపాలు ఇవ్వకుండా వేధించారు. అరసవెల్లి యాత్రకు వెళితే దాడులు చేసి మధ్యలోనే నిలిపేయించారు’ అని సీఎం చంద్రబాబు మొసలి కన్నీళ్లు కార్చారు. గత పాలకులు అధికారంలోకి రాగానే రాజధానిలో అన్ని నిర్మాణాలను మధ్యలోనే నిలిపేశారని, వ్యవసాయ కూలీలకు అందించాల్సిన పెన్షన్లు, రైతులకు ఇవ్వాల్సిన కౌలు నిలిపేశారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేశారని, రూ.1000 కోట్లు గ్రాంట్ రాకుండా కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేశారని.. ఉన్నవి లేనివి కల్పించి చెప్పారు. సింగపూర్ కన్సార్టియంపైనా ఆరోపణలు చేశారని, 14 ఎకరాల్లో 12 టవర్లతో నిర్మాణం తలపెట్టిన హ్యాపీ నెస్ట్‌ను నాశనం చేశారని, అది పూర్తయితే ప్రభుత్వానికి రూ.57.37 కోట్లు ఆదాయం వచ్చేదని, మున్ముందు రూ.885 కోట్లకు పెరిగేదన్నారు. కానీ దాన్ని కూడా నాశనం చేయడంతో ఇప్పుడు రూ.164.5 కోట్ల నష్టంతో పాటు రాజధాని పరిధిలోని రోడ్లు, భవనాలు దెబ్బ తిన్నాయన్నారు.నిర్మాణ ఖర్చు పెంచడానికే ఈ మాటలు..గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంసంతోనే రాజధాని నిర్మాణం ఖర్చు పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పడం చూస్తుంటే మళ్లీ ఎస్టిమేషన్లు పెంచుకోవడం కోసమేనని తెలుస్తోంది. ‘రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది. పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లింది. సంపద ఉత్పత్తి పెరగలేదు. అన్ని రంగాలు రివర్స్ అయ్యాయి. నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలో ఉన్న పనులు పూర్తవలేదు. రెవెన్యూ ఆదాయం తగ్గిపోయింది. ఏపీలో భూముల విలువ కూడా తగ్గిపోయింది. హైకోర్టు, హెచ్‌వోడీ, సచివాలయాల భవనాల ఐకానిక్ పునాదులన్నింటినీ నీళ్లలో ముంచేశారు. గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జీల కోసం నిర్మించ తలపెట్టిన వాటిని కూడా అర్ధంతరంగా నిలిపేశారు. నేను పడ్డ కష్టం వృధా అయింది. అది చూస్తే మనసు నిగ్రహం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఉమ్మడి రాజధాని కాలం కూడా అయిపోంది. పెట్టుబడిదారులు నమ్మకాన్ని కోల్పోయారు. సింగపూర్ ప్రతినిధులు వస్తారో రారో తెలీదు. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశారు. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం మనది. వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇలాంటి వ్యక్తికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? నన్ను ఇబ్బందులు పెట్టారని నేను మాట్లాడడం లేదు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మర్చిపోకూడదు. బూడిద చేసిన ప్రాంతం నుండే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతా’ అని అన్నారు.ఉద్యోగ కల్పనకు నిలయంగా రాజధాని రూపకల్పనరాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారికి ఉద్యోగాల కల్పన అమరావతిలో జరుగుతుందని సీఎం చంద్రబాబు మరోసారి చుక్కలు చూపారు. ప్రతి పంచాయతీ సంక్షేమానికి ఇది నిక్షేపంలా ఉంటుందన్నారు. అమరావతి నాది అని చెప్పుకునేలా ప్రణాళిక రూపొందించామని, మాస్టర్ ప్లాన్‌లో మార్పులు లేవని తెలిపారు. గతంలో రూపొందించిన అదే మాస్టర్ ప్లాన్‌ను కొనసాగిస్తామన్నారు. ఇన్ని చెప్పిన బాబు.. అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామని, కొన్ని ఆస్తులు అమ్మి సంపద సృష్టిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఎన్నో సందేహాలకు తెర లేపింది. ఇక్కడ భూములమ్మిన వారు ఇతర ప్రాంతాల్లో భూములు కొంటే అక్కడ కూడా విలువ పెరుగుతుందని, ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగి ఉంటే ప్రభుత్వానికి కూడా పన్నులు, జీఎస్టీ రూపంలో రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేదన్నారు. విట్, ఎస్ఆర్, అమృత్ లాంటి యూనివర్సిటీల్లో పేద పిల్లలు చదువుకుంటే కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలు వస్తాయని యువతను మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. రాజధాని పునర్నిర్మానంపై కేంద్రంతో కూడా మాట్లాడతామని చెప్పారు. రాజధాని పనులు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే పనులు ప్రారంభిస్తామే తప్ప వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి సెంటు పట్టాలని డ్రామాలాడారని, ఇల్లు లేని వారికి వారి ప్రాంతాల్లోనే ఇల్లు కట్టిస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ లెక్కన అమరావతిలో పేదలకు స్థానం లేదని చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఎయిమ్స్‌కు కూడా నీళ్లివ్వకుండా గత ప్రభుత్వం వేధించిందని, తద్వారా పడకల పెరుగుదలకు అవరోధం ఏర్పడి ఆసుపత్రిలో ఓపీలు కూడా తగ్గాయని చెప్పారు. ఏ లెక్కన చంద్రబాబు ఈ మాట చెప్పారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఎయిమ్స్‌లో ఓపీలు పెరగడం గమనార్హం. గతంలో అనుమతులు పొందిన 132 సంస్థలకు గాను 122 సంస్థలు అమరావతికి రాలేదని చెప్పుకొచ్చారు. ఆ విజన్‌కు ప్రపంచ స్థాయి అట!అమరావతిలో 53,748 ఎకరాలు సేకరించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రోడ్లు, ఇతర నిర్మాణాలకు 27,885 ఎకరాలు, రిటర్నబుల్ ప్లాట్ల కింద 11,826, ఇతర అవసరాలకు 14,037 ఎకరాలు పోను ప్రభుత్వం వద్ద 8,274 ఎకరాలు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం వద్దనున్న భూమిని విక్రయించి రాజధాని నిర్మాణం చేయొచ్చని ఆలోచించామని, కేంద్ర ప్రభుత్వం కేపిటెల్ గెయిన్ మినహాయింపునిచ్చి రూ.2,500 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకుని రూ.1,500 కోట్లు కూడా అందించిందన్నారు. నాడు రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏఐఐబీ, జేఐసీఏ వంటి సంస్థలు ఆర్థిక తోడ్పాటుకు ముందుకు వచ్చాయని, సింగపూర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. మొదట సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, తర్వాత రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థ అందించిందన్నారు. దేశంలోనే స్మార్ట్ సిటీగా, ప్రపంచ స్థాయి ఆర్థిక రాజధానిగా అమరావతి విజన్ రూపొందించినట్టు చెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌తో పాటు అన్ని విభాగాలు ఒకేచోట ఉండాలని మాస్టర్ ప్లాన్‌లో నిర్ణయించామన్నారు. దేశంలో ఏ సిటీకి లేనంత మేర నదీ ప్రాంతం అమరావతికి ఉందని, రెండు నదులను అనుసంధానం చేసే కాన్సెప్ట్‌తో నగరానికి రూపకల్పన చేశామన్నారు. రూ.51,687 కోట్లతో రాజధాని పనులకు అంచనా వేసి, రూ.41,170 కోట్లకు టెండర్లు పిలిచామని, అప్పటికే జరిగిన నిర్మాణాలకు గాను రూ.4,318 కోట్లు బిల్లులు చెల్లించామని, రూ.1,268 కోట్లు ఇప్పటికీ పెండింగులో ఉందన్నారు. -
ఏపీలో మొదలైన ముసళ్ల పండగ
గతంలో ఒక ప్రచార ప్రకటన వచ్చేది. ఈ నగరానికి ఏమైంది.. ఎటు చూసిన పొగ, నుసి.. అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అది కాలుష్యానికి సంబంధించినది అయితే, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కు కూడా ఆ ప్రకటన సూట్ అయ్యేలా ఉంది. ఏపీలో ఎటు చూసినా జరుగుతున్న విధ్వంసం, హింసాకాండ గమనించిన తర్వాత ఈ ప్రకటన మాదిరే ఏపీ తయారైందన్న అభిప్రాయం కలుగుతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేసేది. కోడ్ అమలులోకి రావడంంతోనే అన్నీ తలకిందులు అవడం ఆరంభమైంది. ప్రభుత్వాన్ని సజావుగా నడవనివ్వకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అన్ని ప్రయత్నాలు చేసేవి. ఎన్నికల కమిషన్ కూడా ఆ కూటమికి తన వంతు సాయం అందించింది. వలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా వృద్దులు పెన్షన్ పొందడానికి నానా పాట్లు పడేలా చేశారు.అవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతోనే హింసాకాండ, విద్వంసం వంటివి రాజ్యమేలాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన అరాచక శక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాయి. ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వంటివారు వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ పరిణామాలపై స్పందించకుండా కథ నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పరస్పరం పొగుడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.మరో వైపు ఏపీ వ్యాప్తంగా పారిశుద్ద్యం కొరవడి డయారియా వంటి వ్యాధులు ప్రబలాయి. నీటి కాలుష్యం తోడవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి వస్తే వెంటనే వలంటీర్లు ఆరా తీసి తగు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వానికి సమాచారం అందించేవారు. కరోనా వంటి పెద్ద సంక్షోభాన్ని సైతం వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆ ప్రభుత్వం ఎదుర్కుంది. కానీ గత పది, పదిహేను రోజులుగా ఈ విషయాలను పట్టించుకున్నవారే ఉన్నట్లు లేరు. కాకినాడ, జగ్గయ్యపేట, నంద్యాల మొదలైన చోట్ల గ్రామాలలో అతిసార వ్యాపించి పది మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనేక మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు.అదొక్కటే సరిపోదు. గ్రామాలలో కలుషిత సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలించి చర్యలు చేపట్టాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి ఉండాలి. కానీ ఆయన ఇది తన శాఖకు సంబంధించింది కాదనుకున్నారో, ఏమో కానీ గ్రామాలలో పారిశుధ్ద్యంపై చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చి గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే పట్టణాలలో అయితే మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించి సిబ్బందితో పని చేయించాలి. లేకుంటే ఈ సమస్యమరింత ప్రబలుతుంది.ఇక్కడ మరో సంగతి చెప్పాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ టైమ్ లో ఎక్కడైనా కలుషిత సమస్య వచ్చి ఒకరిద్దరు మరణించినా, కొంతమంది ఆస్పత్రిలో చేరినా దానిని బూతద్దంలో చూపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రస్తుతం తెలుగుదేశం ఏలుబడిలో మాత్రం ఇందుకు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఇంకో వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయం తీసుకువస్తే, ప్రస్తుతం అది అంతా అక్రమార్కుల పాలవుతున్నట్లుగా ఉంది.వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్ లో పోగుచేసిన ఇసుక గుట్టలు, గుట్టలుగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ ఇసుకను గతంలో ఒక సిస్టమ్ ప్రకారం విక్రయించేవారు. టీడీపీ కూటమి ఇసుకను ఉచితం చేస్తామని హామీ ఇచ్చింది. అది అక్రమార్కులకు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఆయా చోట్ల విజృంభించి అందుబాటులో ఉన్న ఇసుకను తమ ఇష్టారీతిన అమ్ముకుంటున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల ఇలా లారీ ఒక్కింటికి పదమూడు వేల రూపాయల నుంచి పదహారువేల రూపాయల వరకు వసూలు చేసుకుంటూ అక్రమ రవాణా చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం స్పందించినట్లు కనిపించలేదు. ఈసరికే సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఇసుక టీడీపీ, జనసేనలకు చెందిన నేతల పరమైందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం పనిచేస్తోందో, లేదో అన్నట్లుగా పరిస్థితి ఉంటే అది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు.ఇదిలా ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా అంత తేలికకాదు. దాంతో ఆ అంశాలను డైవర్ట్ చేసే లక్ష్యంతో కూటమి పెద్దలు, వారికి సపోర్టు చేసే మీడియా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్సార్సీపీపైన పలు కథలు సృష్టించి జనం మీదకు వదలుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేసిన ఐదేళ్లు వీరు వెంటాడారు. ఓటమి తర్వాత కూడా అదే పనిచేస్తున్నారు. ఉన్నవి, లేనివి కలిపి అబద్దాలను వండి ప్రజలపై రుద్దుతున్నారు. వైఎస్సార్సీపీ ఆఫీస్ ల నిర్మాణంలో ఏవో అక్రమాలు జరిగాయని, అనుమతులు లేకుండా నిర్మించారంటూ స్టోరీలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ మాత్రమే ప్రభుత్వ స్థలాలు తీసుకున్నట్లు, తెలుగుదేశం అసలు తీసుకోనట్లు చిత్రీకరిస్తున్నారు.మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైఎస్సార్సీపీ ఆయా జిల్లాలలో నిర్మించిన భవనాలను పాలస్ లతో పోల్చుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. విశేషం ఏమిటంటే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీస్ లకు ఇవ్వడానికి అధిక చొరవ తీసుకున్నది చంద్రబాబు నాయుడే. 1997లో ఉమ్మడి ఏపీలో ఎన్.టి.ఆర్ ట్రస్ట్ పేరుతో హైదరాబాద్ లో కెబిఆర్ పార్కు ఎదుట అత్యంత ఖరీదైన హుడా భూమిని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నది చంద్రబాబు నాయుడే. అందులో పార్టీ ఆఫీస్ ను నడిపింది ఆయనే. అది ఏమీ చిన్న ఇల్లు కాదు. ఒక భారీ భవంతి.ఆ రోజుల్లో విపక్ష నేతగా ఉన్న పి జనార్ధనరెడ్డి ప్రభుత్వ భూమిని టీడీపీ ఆఫీస్ కు కేటాయించుకోవడంపై పెద్ద పోరాటమే చేశారు. కానీ అదేమి ఫలించలేదు. బహుశా లోకేష్ కు ఈ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన అప్పటికి విద్యార్ధిగానే ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీలో పలు జిల్లాలలో ప్రభుత్వ భూములలో, కొన్నిచోట్ల అస్సైన్డ్ భూములలో కూడా పార్టీ ఆఫీస్ లు నిర్మించుకున్నారు. ఇందుకోసం జీఓలు కూడా ఇచ్చారు. అంతదాకా ఎందుకు!? పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లి వద్ద చెరువు, డొంక ప్రాంతం కూడా కొంత ఆక్రమించి నిర్మించారన్న అభియోగాలు ఉన్నాయి. తీసుకున్న అనుమతులు మించి అంతస్తులు కట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇది కానీ, జిల్లాలలో నిర్మించిన భవనాలు కూడా చిన్నవేమీ కాదు.లోకేష్ పరిభాష ప్రకారమే అయితే అవి కూడా పాలస్ లే అవుతాయి. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలు నిర్మించుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాకాకుండా పొరపాట్లు చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. దీనిని బూతద్దంలో చూపుతూ టీడీపీ కథ నడుపుతోంది. అనేకమార్లు బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు తెచ్చే ప్రభుత్వాలు, ఇప్పుడు పార్టీ ఆఫీస్ లకు కొంత సమయం ఇచ్చి ఒకవేళ భవనాలకు అనుమతి లేనట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేస్తే పద్దతిగా ఉంటుంది. ఎందుకంటే ఇవేమీ ఆక్రమిత స్థలాలు కావు. ఈ భవనాల నిర్మాణ సమయంలో అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని తేలుతున్నందున ఆ బిల్డింగ్ లను క్రమబద్దం చేస్తే బెటర్. కాకపోతే గురివింద గింజ తన నలుపు తెలుసుకోలేదన్నట్లుగా, టీడీపీ వారు వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం.నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్ భవనాన్ని కూల్చివేయడం ద్వారా తమ విధ్వంస పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. పదిహేను రోజులుగా వైఎస్సార్సీపీ వారి ఆస్తులు, రైతు భరోస కేంద్రాలు, సచివాలయాల భవనాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు ప్రభుత్వపరంగా కూడా ధ్వంస రచన సాగించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లు తాము హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. ఏదో అరకొరగా చేసి జనాన్ని మభ్యపెట్టే ఆలోచనలే సాగిస్తున్నారన్న అనుమానం ప్రజలలో ఉంది. కొన్ని స్కీములను ఎలా వాయిదా వేయాలా? అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు.ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసే విషయం పరిశీలనకు మరో నెల పడుతుందని రవాణశాఖ మంత్రి రామ్ ప్రసాదరెడ్డి చెప్పారు. కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకటి, రెండు రోజులలోనే ఉచిత బస్ స్కీమ్ ను అమలు చేసింది. ఏపీలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. నిజానికి ఏపీలోనే ఈ స్కీము అమలు చేయడం తేలిక. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి మార్చడం ద్వారా ఆ సంస్థకు చాలా వెసులుబాటు కల్పించింది. అంటే జీతాల భారం తగ్గిందన్నమాట. అయినా ఈ స్కీమును అమలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? అనేదానికి సరైన కారణం కనిపించదు.ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో ప్రభుత్వం తీరు అలాగే ఉంది. ప్రజలు నిజంగా గెలిపించారో, లేక ఈవిఎమ్ ల మాయ ఏమైన ఉందో తెలియదు కానీ, టీడీపీ ప్రభుత్వం ఇకనైనా ఈ విధ్వంసపాలన ఆపి ప్రజోపయోగ కార్యక్రమాలకు దిగితే మంచిది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీలో ‘పక్కదారి’ పాలన షురూ!
ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.ఇంతకాలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఈవీఎంల గోల్మాల్.. తెరపైకి బ్యాలెట్.. ఇది అత్యవసర సమస్యే!
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) చర్చనీయాంశం అవుతున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక నిపుణుడు ఎలాన్ మస్క్, మరో ప్రముఖుడు శ్యామ్ పిట్రోడా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈవీఎంలపై చేసిన ట్వీట్ లు సహజంగానే అందరి దృష్టిని ఆకరర్షిస్తాయి. న్యాయం చేయడం కాదు.. న్యాయం జరిగినట్లు కనిపించాలన్న సూత్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉటంకించారు. అలాగే ప్రజాస్వామ్యం ఉందని అనుకోవడం కాకుండా, ప్రజాస్వామ్యం నిస్సందేహంగా అమలు అవుతున్నట్లు కనిపించాలని ఆయన అన్నారు.ప్రపంచవ్యాప్తంగా, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న దేశాలలో ఈవీఎం ల బదులు, బాలెట్ పత్రాలనే వాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడడానికి మనం కూడా ఆ దిశగా వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేయడంపై అధికార పక్షం తెలుగుదేశం అభ్యంతరం చెప్పవచ్చు. ఆ ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా మాట్లాడలేదు కానీ, ఆయన ఆ పార్టీ నేతలు కొందరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 2019 ఎన్నికలలో 151 సీట్లతో వైఎస్సార్సీపీ గెలిచిన ఘట్టాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.విశేషం ఏమిటంటే 2009, 2019లలో టీడీపీ ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఈవీఎంలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. 2009 లో అయితే చంద్రబాబు తన అనుచరుడు ఒకరు తీసుకు వచ్చిన ఈవీఎం తో అవి ఎలా హాక్ చేయవచ్చో తెలియచేస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2014లో విభజిత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. వైఎస్సార్సీపీ 67 సీట్లకే పరిమితం అయింది. అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానిపై ఏమీ ఆరోపణ చేయలేదు. ప్రతిపక్షంగా వ్యవహరించి ప్రజాక్షేత్రంలో పని చేసుకుంటూ సాగారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అప్పుడు టీడీపీ ఈవీఎం లపై అనుమానాలు వ్యక్తం చేయకపోలేదు.ఆ సమయంలో సహజంగానే వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. 2024లో వైఎస్సార్సీపీ మామూలుగా ఓడిపోయి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. ప్రజలలో వ్యతిరేకత ఏర్పడిందేమోలే అనుకునేవారు. అలాకాకుండా ఎవరూ ఊహించని రీతిలో కేవలం పదకుండు స్థానాలకే వైఎస్సార్సీపీ పరిమితం అవడంతో ఈవీఎం లపై అనుమానాలు పెల్లుబుకుతున్నాయి. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆ స్థాయిలో ప్రజలలో వ్యతిరేకత లేదన్నది ఎక్కువమంది అభిప్రాయం. 2014లోనే 67 సీట్లు వస్తే, ఐదేళ్ల అధికారం తర్వాత, అనేక హామీలు అమలు చేసిన తర్వాత కేవలం 11 సీట్లే ఎలా వస్తాయన్నది పలువురి ప్రశ్నగా ఉంది.ఈవీఎం లపై సందేహాలు వచ్చినా, ప్రభుత్వపరంగా, లేదా పార్టీపరంగా జరిగిన లోటుపాట్లపైనే వైఎస్సార్సీపీ వర్గాలు దృష్టి పెట్టి చర్చించుకున్నాయి. కానీ ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు, టెస్లా కార్ల అధిపతి ఎలాన్ మస్క్ ఈవీఎం లపై చేసిన వ్యాఖ్యలతో అందరిలోను దీనిపై ఆలోచన ఆరంభం అయింది. ఆయన ఈవీఎం లను హాక్ చేయడం, టాంపర్ చేయడం సాధ్యమేనని వ్యాఖ్యానించారు. దానిని మరో నిపుణుడు, భారత్ లో కంప్యూటర్ల శకం ఆరంభించడంలో కీలక పాత్ర పోషించిన శ్యామ్ పిట్రోడా కూడా బలపరిచారు. తాను అరవై ఏళ్లుగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నానని, ఈవీఎం ల పనితీరును అధ్యయనం చేశానని, వాటిని మానిప్యులేట్ చేయడం సాద్యమేనని పేర్కొన్నారు. పేపర్ బాలెట్ వైపు వెళ్లడమే శ్రేయస్కరమని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈవీఎం లపై ఆరోపణలు చేయడం ఆరంభించాయి.శివసేన నేత ఆదిత్య ఠాక్రే అయితే నేరుగా బీజేపీ ఈవీఎం లను ట్యాంపర్ చేసిందని ఆరోపించారు. కాగా దేశంలో ఎన్నికల అవసరాలకు అరవైలక్షల ఈవీఎం లను సరఫరా చేశామని సంబంధిత సంస్థలు చెబుతుంటే, నలభై లక్షల ఈవీఎం లే తమ వద్ద ఉన్నాయని, మిగిలిన 20 లక్షల ఈవీఎం ల సంగతి తమకు తెలియదని ఎన్నికల సంఘం చెబుతోంది. దీంతో ఇదంతా మిస్టరీగా మారింది. కర్నాటకలో ఈవీఎం ల గోల్ మాల్ జరిగిందని కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. అందువల్లే కర్నాటకలో కాంగ్రెస్ కు తక్కువ పార్లమెంటు సీట్లు వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎం ల టాంపరింగ్ జరిగిందా? హాకింగ్ జరిగిందా? లేక ఈవీఎం లను మార్చివేశారా? అన్న అనుమానాలు ప్రజలలో వ్యాపిస్తున్నాయి.ఈ సందర్భంలో ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ వెల్లడిచేసిన విషయాలు మరింత సంచలనంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఒక గ్రామంలో జరిగిన అనుభవాన్ని ఆయన వివరించారు. ఆ గ్రామంలో ఎప్పుడూ రిగ్గింగ్ లేదా కొందరు కూర్చుని ఓట్లు ఎవరికి వేయాలా అన్నది డిసైడ్ చేసి ఆ ప్రకారం చేస్తుంటారట. అందులో ఒక పార్టీకి అధిక ఓట్లు వేసి, ఎదుటి పార్టీకి కూడా కొన్ని ఓట్లు వేస్తారట. కానీ చిత్రంగా తాము తక్కువ ఓట్లు వేసిన పార్టీకి మెజార్టీ వచ్చినట్లు కౌంటింగ్ లో వెల్లడైందని, ఇదెలా సాద్యమని వారు ప్రశ్నిస్తున్నారట. ఆ గ్రామం, తనకు చెప్పిన వ్యక్తుల గురించి బహిరంగంగా వెల్లడించి ఎన్నికల కమిషన్ ను ఉండవల్లి అరుణకుమార్ నిలదీయగలిగితే, దీనిపై ఆయన న్యాయపోరాటం చేయగలిగితే మరో చరిత్రను సృష్టించినవారు అవుతారు. ఆయనకు ఆయా రాజకీయ పక్షాలు సహకరిస్తే మంచిదే. సీపీఐ నేత కే నారాయణ కూడా ఇదే తరహాలో ఈవీఎం లను వ్యతిరేకిస్తూ బాలట్ పత్రాలే బెటర్ అని స్పష్టం చేస్తున్నారు. అదే టైమ్ లో రాజీవ్ చంద్రశేఖరన్ అనే ప్రముఖుడు మాత్రం ఈ వాదనలను అంగీకరించలేదు. ఎలాన్ మస్క్ చెప్పినట్లు ఏ దేశంలో అయినా టాంపరింగ్ జరుగుతుందేమో కానీ, ఇండియాలో కాదని అన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ నిర్దిష్టమైన ప్రకటన చేసినట్లు కనిపించలేదు. ఈవీఎం లను సెల్ ఫోన్ ద్వారా మార్చవచ్చని కొందరు, చిప్ లను రహస్యంగా మార్చే అవకాశం ఉందని మరికొందరు, నెట్ కనెక్షన్ లేకపోయినా టాంపర్ చేయవచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసుకుని ఈ మానిప్యులేషన్ జరిగిందా అన్నది కొందరి ప్రశ్నగా ఉంది.ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీకి బాగా తక్కువ సంఖ్యలో సీట్లు రావడంతో పలువురు ఆసక్తి కొద్ది ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలో అనేక చోట్ల ప్రజలు తాము వైఎస్సార్సీపీకి ఓట్లు వేశామని, అయినా మెజార్టీ టీడీపీకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్న ఘట్టాలు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. హిందుపూర్ లో వైఎస్సార్సీపీ ప్రాతినిద్యం వహిస్తున్న ఒక వార్డులో ఈ పార్టీకి ఒకే ఓటు వచ్చినట్లు నమోదు అవడం విస్తుపరచింది. 2019లో ఎన్నికల సమయానికి, 2024 ఎన్నికలనాటి పరిస్థితులకు చాలా తేడా ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. బీజేపీ, జనసేనలు టీడీపీకి దూరం అయ్యాయి. రుణమాఫీ, కాపుల రిజర్వేషన్ వంటి హామీలు నెరవేర్చకపోవడంతో టీడీపీ బాగా అన్ పాపులర్ అయింది.2024లో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ప్రజలకు నవరత్నాల పేరుతో ఏ హామీలు ఇచ్చారో వాటినన్నిటిని అమలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. సిద్దం సభలు, బస్ యాత్ర వంటివి బాగా విజయవంతం అయ్యాయి. పేద వర్గాలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాయన్న భావన ఉంది. ప్రతిపక్ష దుష్ప్రచారం ప్రభావం కొంత పడినా, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయేంత కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. టీడీపీ కూటమికి, వైఎస్సార్సీపీకి మధ్య నువ్వా, నేనా అన్నంతగా పోటీ ఉండవచ్చని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అందుకు విరుద్దంగా ఫలితాలు రావడం అందరిని ఆశ్చర్యపరచింది.కొంతమంది కూటమి పెద్దలు అసెంబ్లీ సీట్లపై పందాలు కాసిన తీరు, మెజార్టీలపై కూడా బెట్టింగ్ లు కాసిన వైనం కూడా అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అసలు బీజేపీ గెలిచే అవకాశం ఉండదనుకున్న ఒక నియోజకవర్గంలో, తమకు ఇన్నివేల మెజార్టీ వస్తుందంటూ కొందరు నేతలు పందాలు కాశారట. 2019లో వైఎస్సార్సీపీ గెలిచినా మెజార్టీలు కొద్ది నియోజకవర్గాలలో మినహా మరీ అతిగా లేవు. అలాంటిది ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్దులకు వచ్చిన మెజార్టీలు అనూహ్యంగా ఉన్నాయి. అనేకమందికి ఏభైవేలకుపైగా మెజార్టీలు రావడం విస్తుపరుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఈవీఎం ల టాంపరింగ్ పై ప్రజలలో డౌట్లు మొదలయ్యాయని అంటున్నారు. మాబోటి వాళ్లం కూడా ఈవీఎం ల టాంపరింగ్ సాధ్యం కాదేమో అనుకున్నప్పటికీ, గత కొద్ది సంవత్సరాలలో టెక్నాలజీ మరింతగా వృద్ది చెందడం, సైబర్ నేరాలు బాగా పెరగడం, హాకింగ్ పై వస్తున్న కథనాల నేపథ్యంలో ఈవీఎం లు కూడా వీటికి అతీతం కాదేమోనన్న డౌటుకు రావల్సి వస్తోంది. అందులోను అంతర్జాతీయ స్థాయి నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఎన్నికల సంఘం వీటిని నివృత్తి చేయడానికి గాను చర్యలు చేపడితే బాగుంటుందనిపిస్తుంది.ఇందుకోసం ఎలాన్ మస్క్ వంటివారిని, భారత్ కు చెందిన కొందరునిపుణులను పిలిచి ఈవీఎం ల ప్రామాణికత, హాకింగ్ అవకాశం ఉందా? లేదా? అనేదానిపై ప్రాక్టికల్ ప్రజెంటేషన్లు తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరం అనిపిస్తుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పరిపుష్టం చేయాలని చెప్పాలి. నిజంగానే ఈవీఎం లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని తేలితే బాలట్ పత్రాలవైపు మొగ్గు చూపవచ్చు. అమెరికా, జపాన్ వంటి దేశాలలో బాలెట్ పత్రాలనే వాడుతున్నారు.ఇండియాలో బాలెట్ పత్రాల సిస్టమ్ ఉన్నప్పుడు రిగ్గింగ్ వంటి సమస్యలు ఎదురయ్యేవి. వాటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టవచ్చన్నది ఈ పద్ధతికి అనుకూలంగా ఉన్నవారి భావన. మొత్తం మీద ఈవీఎం లపై వచ్చిన డౌట్లను తీర్చకపోతే ఎన్నికల సంఘం తీరుపై కూడా అనుమానాలు వస్తాయి. ఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరించిన శైలిపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. కూటమిలోని పార్టీలకు కమిషన్ సహకరించిందన్న అభియోగాలు వచ్చాయి. అందువల్ల ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తోందన్న నమ్మకం కలగాలంటే ఈవీఎం లపై వచ్చిన సందేహాలన్నిటిని పరిష్కరించడం అత్యవసరమని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమరావతి కోసం అప్పుల చిప్ప.. ఎదురు ప్రశ్నే సమాధానమా?!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టైలే వేరు అన్నట్లుగా ఉంటారు. తన వద్ద సమాధానం లేని ప్రశ్నను ఎవరైనా వేస్తే, ఎదురు ప్రశ్నించడంతో వారి నోరు మూయించే యత్నం చేస్తుంటారు. అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటించి మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఒక విలేకరి అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎంత వ్యయం చేస్తారు? అని ప్రశ్నించారు. ఆయన వద్ద దానికి సరైన జవాబు లేదు. అంతే! వ్యూహాత్మకంగా ఆయన మీరే చెప్పండి.. మీరు అయితే ఎంత కాలంలో నిర్మిస్తారు? అంటూ ఏదేదో మాట్లాడారు. అది విన్నవారు విస్తుపోవడం తప్ప చేయగలిగింది లేదు.ప్రభుత్వ గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అర్ధం కావడం లేదు. ఆ వివరాలన్ని సిద్దం చేస్తున్నారు.. అని కూడా చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అది పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందో, ఇంకా ఎక్కువ అవుతుందో అని వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో అలా కూడా చెప్పలేదు. పైగా ప్రశ్నించివనారే ఎంత కాలం పడుతుందో చెప్పాలని అంటున్నారు. అమరావతిలో రకరకాల రూపాలలో సెంటిమెంట్ పండించడానికి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిను విమర్శించడానికి ఆయన ఈ సందర్శనను వాడుకున్న సంగతి అర్ధం అవుతూనే ఉంది.రాజకీయాలలో ఇలాంటివి సహజమే అయినా చంద్రబాబు నాయుడు అసలు విషయాలను పక్కదోవన పట్టిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది? ఒకవైపు అమరావతిని పూర్తి చేస్తామని అంటారు. అమరావతిలో ప్రభుత్వానికి మిగిలే భూముల అమ్మకంతో వచ్చే డబ్బుతో రాజధాని నిర్మాణంతో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అంటారు. అమరావతి రాజధానిలో మౌలిక వసతులకే లక్ష కోట్లకు పైగా వ్యయం అవుతుందని ఐదేళ్ల క్రితమే అంచనా వేశారు. అది ఇంకా పెరుగుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తొలిదశకు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంచనా అవుతుందని అప్పట్లో లెక్కించామని, తాజాగా ఎంత అవుతుందన్నది గణించాలని కొద్ది రోజుల క్రితం చెప్పారు.ఇక్కడ అందరికి వచ్చే సందేహం ఏమిటంటే? ముందుగా ప్రభుత్వం సమీకరించిన భూమికి సంబంధించి రైతులకు ప్లాట్లు కేటాయించి, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అంటే రోడ్లు, డ్రైన్లు, మంచినీరు తదితర సదుపాయాలు కల్పించాలన్నమాట. ఇక ప్రభుత్వ పరంగా నిర్మించదలచిన భవనాలకు కూడా వేల కోట్ల వ్యయం అవసరం. వీటన్నిటికి డబ్బు సమకూర్చుకోవాలంటే భూములు అమ్మాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఏదైనా చేయడానికి భూములను విక్రయించడానికి ప్రయత్నిస్తే టీడీపీ అడ్డుకునేది. ఇప్పుడు తాను భూములను అమ్మి సంపద సృష్టించి దానిని అటు అమరావతికి, ఇటు సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తానని చెబుతున్నారు. ముందుగా అన్నీ వసతులు ఏర్పడితే కదా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చేది అనే ప్రశ్న వస్తుంది.రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చిన రాజధానిలో హైప్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు పర్యటన ఉపయోగపడవచ్చు. కానీ సకాలంలో చంద్రబాబు ప్రభుత్వం తాము చెప్పిన విధంగా సదుపాయాలు కల్పించి, ఆయా సంస్థలను రాజధానికి తీసుకురాలేకపోతే ఈ హైప్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాని వల్ల అక్కడ భూములు కొన్నవారికి నష్టం జరుగుతుంది. గత ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించిందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన భవనాల స్పేస్ కన్నా బాగా అధికంగా అందుబాటులో ఉండడం, అమెరికాలో మాంద్య పరిస్థితులు, ఇతర అంశాలు ఇందుకు కారణమని వారు అంటున్నారు. అమరావతిలో ప్రస్తుతం కొంతమేర రేట్లు పెరిగాయని సమాచారం. అది కొనసాగాలంటే ముందుగా ప్లాట్ల కేటాయింపు, అభివృద్ది పనులు పూర్తి కావాలి. అందుబాటులోకి వచ్చే ప్లాట్లు అమ్ముడుపోవడానికి తగిన డిమాండ్ ఉండాలి. ఒక ఏడాదిలోనో, రెండేళ్లలోనో జరిగేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుంది. నిజానికి చంద్రబాబు నాయుడు 2014 టరమ్ లో రాజధానికి అవసరమైన రెండువేల నుంచి ఐదువేల ఎకరాల వరకు భూములు తీసుకుంటే సరిపోయేది. మిగిలిన భూమిని ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అభివృద్ది చేసుకునేవారు. ప్రభుత్వపరంగా తీసుకోవల్సిన చర్యలు చేపడితే సరిపోయేది. అలా చేయకుండా ఏభైఐదువేల ఎకరాలభూమిని సమీకరించడంతో ఆ బాధ్యత అంతా ప్రభుత్వంపై పడింది.రైతుల నుంచి సమీకరించిన ముప్పైమూడు వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములు కలిపి ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయాలంటే లక్షన్నర కోట్ల వరకు వ్యయం కావచ్చు. ఒకసారి చంద్రబాబు నాయుడు కేంద్రం ఆర్థిక సాయం చేయాలని అంటారు. ఇంకోసారి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని అంటారు. మరోసారి ఎప్పటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామో చెప్పలేమని అంటారు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తారు. ఇక్కడ ఒక ఆసక్తికర సంగతి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మొదటి తేదీన ఉద్యోగుల జీతాలు పెన్షన్లు, వృద్దాప్య పెన్షన్లు తదితర ఖర్చుల నిమిత్తం పదివేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. ఇందుకోసం వనరుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని, రుణ సమీకరణ చేస్తున్నారని టీడీపీ మీడియా ఈనాడు పత్రికలోనే రాశారు.గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేనికైనా రుణాలు తీసుకుంటే.. అప్పుల చిప్ప అని రాసిన ఈ పత్రిక ఇప్పుడు రుణ సమీకరణ అని చాలా గౌరవంగా చెబుతోంది. విశేషం ఏమిటంటే ఒక్క సామాజిక పెన్షన్లు నాలుగువేల రూపాయలు, బకాయిలతో సహా చెల్లించడానికి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లు చెల్లించడానికే పదివేల కోట్లు అవసరం అయితే, మరి మిగిలిన హామీలకు ఎన్నివేల కోట్లు అవసరం అవవుతాయన్న ప్రశ్న వస్తుంది. ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున నెలకు చెల్లిస్తామని, మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని, నిరుద్యోగులకు మూడువేల రూపాయల భృతి, తల్లికి వందనం స్కీమ్ లో ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని ఇలా అనేక హామీలను టీడీపీ, జనసేనల కూటమి మానిఫెస్టోలో ప్రకటించింది. వాటన్నిటికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న వస్తుంది.ప్రస్తుతానికి ఏవైనా కొన్ని భవనాలను నిర్మించి సరిపెట్టుకుంటారా? లేక గతంలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పన్నులన్నిటిని ఇక్కడే ఖర్చు చేస్తారా? అనేదానిపై క్లారిటీ రావల్సి ఉంటుంది. దీనివల్ల ఇతర ప్రాంతాలలో అసంతృప్తి వస్తుంది. అన్నిటికి జిందా తిలస్మాత్ మాదిరి అమరావతి రాజధానిలో మిగులు భూముల అమ్మకం ద్వారా సంపద సృష్టించి కార్యక్రమాలు అమలు చేస్తామని చెబుతున్నారు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి కోసం పదిహేనువేల కోట్ల సాయం అడిగారట. కేంద్రం ఆ డబ్బు ఇస్తే ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట అభిస్తుంది. కానీ అది సాధ్యమా అన్నది సంశయం.ఈ నేపథ్యంలో అమరావతి ఎప్పటికి అభివృద్ది కావాలి? ఎప్పటికి కొత్త సంస్థలు రావాలి? అక్కడ ఉద్యోగులు, సిబ్బంది ఎన్నివేల మంది రావాలి? ఇదంతా జరగడానికి ఎన్ని ఏళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. అంతవరకు తమ హామీలను అమలు చేయలేమని చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చెబుతుందా? ప్రభుత్వంలో గల్లా పెట్టె ఖాళీగా ఉందని చంద్రబాబు అంటున్నారు. అలాగే అప్పుల గురించి కూడా ఏమీ తెలియదన్నట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వం పదమూడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు చెప్పారు కదా! ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతారేమిటి? అని ఎవరికైనా సందేహం వస్తే ఏమి చెబుతాం.ఇక్కడ ఇంకో సంగతి ప్రస్తావించాలి. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అనేక స్కాములు జరిగాయని కేసులు పెట్టింది. అందులో చంద్రబాబుతో సహా పలువురు నిందితులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కేసులన్నీ ఏమి అవుతాయో తెలియదు. వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా? లేక ఇంకేమైనా చేస్తారా అనేది చూడాలి. ఆ కేసులు పెట్టిన అధికారులపై ఇప్పటికే కక్షసాధింపు చర్యలు ఆరంభించారు. ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారి తీస్తాయో కాలమే తేల్చుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చేసేది చెప్పాం.. చెప్పింది చేశాం: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘చెప్పింది చెప్పినట్లు చేసి చూపెట్టాం. చెప్పనవి కూడా ఆచరణలో చూపెట్టాం. మనం చేయగలిగిందే ఎన్నికల్లో చెప్పాం. 40 శాతం మంది నమ్మి ఓటేశారు. మన వైపు ఉన్న మరో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నిలబెట్టుకుంటారో వేచిచూద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించే రోజు రానే వస్తుంది. వైఎస్సార్సీపీ కేడర్ లక్ష్యంగా వ్యక్తిగత దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ కూటమి ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోంది. కేడర్ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. అండగా నిలుస్తాం. బాధితులందర్నీ కలుస్తాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, అందుకోసం వైఎస్సార్సీపీ ప్రజాపక్షంగా నినదిస్తోందన్నారు. ‘మన హామీలను నమ్మి 40 శాతం మంది ఓటు వేశారు. 50 శాతం కూటమి వైపు మొగ్గుచూపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన పథకాలు అమలు చేయలేరు. ఆరు నెలల్లో చంద్రబాబు అసలు స్వరూపం బహిర్గతం అవుతుంది. కూటమికి ఓటేసిన ప్రజలు మరోమారు మోసపోయామని గ్రహిస్తారు’ అన్నారు.పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో సమావేశమైన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పోటెత్తిన యువత మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయనతో మాట కలిపేందుకు, ఫొటో దిగేందుకు యువత పెద్ద సంఖ్యలో పులివెందులకు వచ్చారు. సుపరిపాలన అందించిన జగన్ యోగ క్షేమాలు తెలుసుకోవాలని మరికొందరు తరలి వచ్చారు. పదవులు ముఖ్యం కాదు.. మీ వెంటే మేమంతా నడుస్తాం.. మీతోనే మాబాట.. అని భరోసా నింపేందుకు ఇంకొందరు విచ్చేయడంతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసింది. స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహిస్తూనే, మరోవైపు వచ్చిన వారికి ధైర్యం చెబుతూ వైఎస్ జగన్ రోజంతా బిజీబిజీగా గడిపారు. పులివెందుల క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏకధాటిగా నిల్చొని వేలాది మంది ప్రజానీకాన్ని కలిశారు. ఈ క్రమంలో ఆయన్ను చూడాలని, కలవాలని యువత ఆత్రుత ప్రదర్శించే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. కిటీకి అద్దాలు పగలి ఓ యువకుడికి చిన్నపాటి గాయమైంది. జనం భారీగా తరలి రావడంతో కేవలం అర గంటలో మధ్యాహ్న భోజనం ముగించి, మళ్లీ సాయంత్రం వరకు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, ఎస్బీ అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, కడప మేయర్ కె సురేష్‌బాబు, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైఎస్ మనోహార్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి మాట్లాడారు.మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది వైఎస్సార్సీపీ పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. మనం చేసిన మంచి, మేలు ప్రజల గుండెల్లో ఉండిపోయిందని చెప్పారు. శిశుపాలుడు లాగా తప్పులు మొదలయ్యాయని, రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ‘మనకు ఓటు వేశారని, వారికి ఓటు వేయలేదనే కారణంగా ప్రజలు, వైఎస్సార్సీపీ కేడర్, ఆస్తులపైన దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం కూడా జరిగింది. శిశుపాలుని లాగా పాపాలు చేస్తున్నారు. ఆ పాపం పండే రోజు వస్తుంది. 2029లో ప్రజలు మన వైపే చూస్తారు. మంచి చేసిన మీ జగన్ వైపే ప్రజలు నిలవనున్నారు. ఎవ్వరూ అధైర్యపడొద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుస్తా. చంద్రబాబు సర్కార్ బాధితులందర్నీ కలుస్తా’ అని స్పష్టం చేశారు. టీడీపీ వాళ్లు తన భర్తను టార్గెట్ చేసి దాడి చేశారని ముదిగుబ్బ సర్పంచ్ సతీమణీ వాపోయారు. అధైర్య పడొద్దని, తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ ఆమెను ఊరడించారు. మనకు మంచిరోజులు రానున్నాయని, అంత వరకు ఓపిగ్గా ఉండాలని సూచించారు. -
రాష్ట్రవ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు
సాక్షి, అమరావతి: సర్కారు స్థలాలు, పేదల భూములను లాక్కుని పచ్చ భవనాలు నిర్మించుకున్న టీడీపీ పెద్దలు సుద్దులు వల్లించడం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. అధికారంలో ఉండగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో అత్యాధునిక కార్యాలయాలు సమకూర్చుకున్న టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాగు పోరంబోకు, రైతుల భూమిని కబ్జా చేసి మంగళగిరిలో అత్యంత విలాసవంతమైన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకోగా విశాఖలో దసపల్లా భూముల్లో పాగా వేసి పచ్చ భవనాలు కట్టుకున్నారు. విజయవాడ ఆటోనగర్‌లో ఇరిగేషన్ స్థలం.. శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూమి.. కాకినాడలో జెడ్పీ స్థలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్క చాంతాడును తలపిస్తుంది. ఇవన్నీ ఎన్టీఆర్ భవన్‌లే. అధికారం మాటున చంద్రబాబు సమకూర్చుకున్న పార్టీ కార్యాలయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కరకట్ట నివాసమే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. నిబంధనలు, చట్టాలకు తూట్లు పొడిచి కృష్ణా నది ఒడ్డున కట్టిన ఆ విలాస రాజ భవనంలోనే చంద్రబాబు ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు. అక్రమాల బాటలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో విలాసవంతమైన కోటలు కట్టేశారు. వీటిని కప్పిపుచ్చి నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ కార్యాలయాలపై బురద జల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.పార్టీలకు భూముల జీఓ ఇచ్చిందే బాబునిజానికి చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు భూములు కేటాయించే విధానాన్ని తెచ్చారు. ఇందుకోసం 2016 జూలై 21న జీఓ నెంబర్ 826 విడుదల చేశారు. రాజధానిలో మూడు కేటగిరీలుగా పార్టీలకు భూములు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో జాతీయ రాజకీయ పార్టీ / గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీకి అసెంబ్లీలో 50 శాతానికి పైగా బలం ఉంటే 4 ఎకరాలు కేటాయించాలి. రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో 25 నుంచి 50 శాతం బలం ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయించాలి. మూడో కేటగిరీలో 25 శాతం కంటే తక్కువ ఉన్న పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. దీని ప్రకారం అప్పట్లో టీడీపీకి 4 ఎకరాలు, నాడు 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీకి అర ఎకరం పొందే అర్హత లభించింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం మొదటి కేటగిరీలో ఉన్న పార్టీలకు రెండు ఎకరాలు, రెండో కేటగిరీలో ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు, మూడో కేటగిరీలో ఉన్న పార్టీలకు 300 గజాలు ఇవ్వాలన్నది జీవో సారాంశం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు ఈ విధానంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం 30 సెంట్లు కేటాయించాలని 2017 డిసెంబర్ 8న మరో జీఓ 340 జారీ చేశారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు సంబంధించి 2016లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో లీజు నిబంధనలు బేఖాతర్తాను ఇచ్చిన జీవోకు అనుగుణంగా రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ కార్యాలయాల కోసం చంద్రబాబు వరసగా భూములు కేటాయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట ఈ భూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి చాలాచోట్ల భూములు కేటాయించి ఆగమేఘాల మీద భవనాలు కూడా కట్టేశారు. నాడు చంద్రబాబు ప్రకటించిన విధానం ప్రకారం 33 ఏళ్ల లీజుకు భూములు కేటాయించాలి. అయితే ఆ నిబంధనను కొన్నిచోట్ల ఉల్లంఘించి ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేసుకున్నారు. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళంలో 99 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నారు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో అత్యంత విలువైన భూముల్లో స్థలాలు కేటాయించుకొని కార్యాలయాలు నిర్మించి ఇప్పుడు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. అదే జీవో ప్రకారం వివిధ జిల్లాల్లో వైఎస్సార్సీపీ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంటే అదేదో ఘోరం అనే రీతిలో దుష్ప్రచారానికి తెర తీశారు.హైదరాబాద్‌లో రాత్రికి రాత్రేఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో అత్యంత ఖరీదైన ఎకరం స్థలాన్ని రాత్రికి రాత్రే కేటాయించేసుకున్నారు. వాణిజ్య భూమిగా హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) చేతిలో ఉన్న ఆ స్థలాన్ని 1997 ఏప్రిల్ 30న జూబీ్లహిల్స్ మున్సిపాలిటీ నుంచి షేక్‌పేట ఎమ్మార్వోకు బదలాయించారు. ఆయన అదేరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీగా ఉన్న డి.శ్రీనివాసరావు పేరు మీదకు మార్చారు. అదే రోజున ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం గమనార్హం. ఈ పనులన్నీ గంటల వ్యవధిలో జరిగిపోయాయి. అంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.7,500 అద్దెకు చంద్రబాబు కేటాయించుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా అత్యాధునిక హంగులతో ఎన్టీఆర్ భవన్‌ను నిర్మించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారీగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్న చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగించారు.పోరంబోకు భూమికి మంగళం!ప్రస్తుతం చంద్రబాబు, టీడీపీ నేతలు సకల విలాసాలతో దర్జాగా మీడియా, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం స్థలం కోల్‌కతా–చెన్నై హైవేను ఆనుకుని ఉంది. 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ రూ.75 కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి. కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి... రైతుల భూములను కబ్జా చేసి మరీ టీడీపీ జాతీయ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు రూ.1,000 మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలుగా ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి సాగు చేస్తున్న పంటలను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి రాత్రే టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఆ రైతుల తరపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 8 అంతస్తుల విలాసవంతమైన ఈ ఎన్టీఆర్ భవన్‌ను అనుమతి లేకుండా నిర్మించేశారు. ఉల్లంఘనలు, అక్రమాలకు పర్యాయపదం టీడీపీ జాతీయ కార్యాలయం.గుంటూరులోనూ గుటకాయ స్వాహాతొలుత 2015లో గుంటూరు అరండల్‌పేటలోని పిచుకలగుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమిని లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్లో తీర్మానం చేయించి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకుని పార్టీ భవనం కట్టేశారు.సిక్కోలులో దళితుల భూమిలో పాగాశ్రీకాకుళంలో ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ సేకరించిన భూమిని టీడీపీ కార్యాలయానికి తీసుకున్నారు. ఉడా, కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా పార్టీ భవనాన్ని నిర్మించారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని ఆక్రమించేశారు. 80 అడుగుల ప్రధాన రోడ్డులో ఉన్న ఈ స్థలం విలువ 2017లోనే అనధికారికంగా రూ.20 కోట్లు ఉంది. ఏడాదికి రూ.25 వేల చొప్పున 99 సంవత్సరాల లీజుకు తీసుకున్న ఈ స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు స్వయంగా చంద్రబాబే ప్రారంభించారు.కాకినాడలో జెడ్పీ స్థలంపై కన్నేసి..కాకినాడలో విలువైన జిల్లా పరిషత్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుని విలాసవంతమైన భవనాన్ని కట్టారు. మేడలైన్ ఆఫ్ కాకినాడ ప్రాంతంలో 2 వేల గజాలను 99 ఏళ్ల లీజుకి జిల్లా పరిషత్ తీర్మానం ద్వారా టీడీపీ పరం చేశారు. ఈమేరకు 2016 నవంబర్ 1న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దీని విలువ రూ.10 కోట్లకు పైమాటే.బెజవాడ నడిబొడ్డున రూ.40 కోట్ల స్థలంవిజయవాడ నడిబొడ్డున ప్రజావసరాలకు ఉపయోగపడే విలువైన భూమిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి అప్పగించారు. గుణదల పరిధిలోకి వచ్చే ఆటోనగర్–గురునానక్ కాలనీకి ఆనుకుని ఇరిగేషన్ శాఖకు 95 సెంట్ల భూమి ఉంది. ఇరిగేషన్ విభాగం ఫ్లోరేజి, ఇతర పనుల కోసం దీన్ని వినియోగించేవారు. ఇందులో కార్యాలయం కూడా ఉండేది. అయితే టీడీపీ ఆఫీసు కోసం దీన్ని ఇవ్వాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కూల్చేశారు. ఇరిగేషన్ మెటీరియల్, యంత్రాలను మరోచోటకు తరలించారు. అన్ని అభ్యంతరాలనూ తోసిరాజని 99 ఏళ్ల లీజుకిచ్చేశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా ఐలా పాలకవర్గాన్ని బెదిరించి నోరు మూయి ంచారు. వాణిజ్య భూమిగా కన్వర్షన్ చేసి టీడీపీ కార్యాలయం నిర్మించుకున్నారు. దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. విశాఖలో దసపల్లా కొండను తొలచి..విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు. దసపల్లా భూముల్లో 2 వేల గజాల్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు లీజు చొప్పున 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీకి కేటాయించింది. ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న కొండను (మరో వెయ్యి గజాల మేర) కూడా ఆక్రమించి 2016లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండానే జీ+3 భవనం నిర్మించి 2018లో లోకేశ్ ప్రారంభించారు. -
మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’ అంటూ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. -
పోలవరంపై రివర్స్ గేర్ ఏం చెబుతుందంటే..
ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏవైనా, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్డ్డిను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లు పర్యటన సాగించారు.2014 నుంచి ఐదేళ్లపాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అందులో వాస్తవం ఉందా? లేదా? అనేది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తి అయిపోయి ఉంటే కీలకమైన డయాఫ్రం వాల్ వరదలలో కొట్టుకుని పోయేది కాదు కదా అనే లాజిక్కు సమాధానం దొరకదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్ల జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా! నామినేషన్ పద్దతిన నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా! డయాఫ్రం వాల్‌తో సహా ఆయా పనులు నామినేటెడ్ పద్దతిన కొన్ని కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది వివరించాలి కదా!2014 టరమ్‌లో కేంద్రంలో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని, రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఎందుకు కోరినట్లు? ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావల్సినవారికే ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ అయిందని ఎందుకు విమర్శించారు. దానికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు! మళ్లీ పొత్తు కుదిరింది కనుక మోడీ కూడా ఆ పాయింట్ మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. అది వేరే విషయం. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు రాలేదు?కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడనుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ, నిర్వాసితుల సమస్య రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి, రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది నిజమే అవుతుందా?2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా? లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదాచేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెఘా సంస్థ టెండర్ పొందింది. దీనిని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను కొనసాగించదలిచారా? లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారా? లేదా?బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపుచేయించిందన్న విమర్శల గురించి ఏమి చెబుతారు? బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల వ్యయం కేంద్రం పూర్తిగా భరించి సహకరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎందుకు కోరలేకపోయారు? చంద్రబాబు తన హయాంలో ఆయా కీలక పనుల ప్రాధాన్యతలను మార్చి పనులు చేయించడంవల్లే ఈ సమస్య వచ్యిందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన. దీనిని ఆయన గత అసెంబ్లీలో వివరణాత్మకంగా వివరించారు.కాఫర్ డామ్ పూర్తి కాకుండానే, గ్యాప్‌లు ఉంచి డయాఫ్రం వాల్ నిర్మాణం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? డయాఫ్రం వాల్ నిర్మాణం వరద కారణంగా దెబ్బతిన్నదంటే అది నాణ్యతాలోపమా? లేక మరేదైనా కారణమా? దీనిపై కేంద్ర జల కమిషన్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తోంది? కేంద్రంలో ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తే ఏమి ప్రయోజనం. తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా! ఇన్ని రాజకీయాలు ఎందుకు!మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో అన్నారు కదా? ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తారా? కీలకమైన ఢయాప్రం వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి, డామ్ నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దానిని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా! కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని ఎందుకు చంద్రబాబు ప్రశ్నించడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది? అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది?మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఇప్పుడు సమస్య రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తప్పు పట్టడానికే అయితే చంద్రబాబు సోమవారం.. పోలవరం కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం ఉండదు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా విమర్శిస్తే విమర్శించండి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తే యత్నించండి. ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు. ఎవరు ఏ మేరకు కృషి చేశారు? ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? అనే అంశాలు చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం ముఖ్యం కాదు. ప్రాజెక్టును పూర్తి చేసిన రోజున చంద్రబాబు కాలర్ ఎగురవేసుకుని ఏమి చెప్పినా వినవచ్చు. అలాకాకుండా కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.ప్రాజెక్టులో తొలిదశలో నీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో 194 టీఎమ్సీల నీటిని నిల్వ ఉంచాలంటే నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం సుమారు ముప్పైవేల కోట్లను కూడా కేంద్రం నుంచి ఎంత తొందరగా రాబట్టుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ద చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి.వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం పనులపై ఎంతో శ్రద్దపెట్టి అనుమతులు తేకపోతే, విభజన సమయంలో ఈ ప్రాజెక్టు చట్టంలోకి కూడా వచ్చేది కాదేమో! విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఒక వరం అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్యింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి.తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా? లేక జగన్మోహన్ రెడ్డిను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ప్రతి కార్యకర్తకూ 'తోడుగా ఉందాం': వైఎస్ జగన్
ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో కనిపించిన పాలన మనదైతే.. ఇప్పుడు రెడ్ బుక్ హోర్డింగ్‌లు పెడుతున్నారు. ఏ అధికారిపై కక్ష సాధించాలి? ఎవరిపై దాడులు చేయాలి? ఎవరిని నాశనం చేయాలి? ఎవరిపై కక్ష సాధించాలి? అని అందులో ఏకంగా పేర్లు రాసుకుంటున్నారు. వాళ్లను కొడతాం, చంపుతామంటూ నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఈ ప్రభుత్వం పాపాలు వేగంగా పండుతున్నాయి. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘మన కార్యకర్తలు కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మనతోనే నిలబడ్డారు. జెండాలు మోసి కష్టపడ్డారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు కూడా తిన్నారు. ప్రతి కార్యకర్తకూ తోడుగా నిలిచి భరోసా ఇద్దాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులతో గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. సోషల్ మీడియా కార్యకర్తలను, మనకోసం నిలబడ్డ వలంటీర్లను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్ధాయిలో మన పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాలని, వారికి తోడుగా ఉండాలని ఆదేశించారు. ‘‘రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడని రీతిలో మన కార్యకర్తలు, సానుభూతిపరులమీద దాడులు చేస్తున్నారు. మనకు ఓటు వేసిన వారి మీద దాడులు చేస్తున్నారు. తీవ్రంగా అవమానించడంతోపాటు ఆస్తులకు నష్టం చేకూరుస్తున్నారు. ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చూశాం’’ అని పేర్కొన్నారు. ‘‘మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా.. మీ నియోజక వర్గాలలో కార్యకర్తలకు తోడుగా ఉంటూ పరామర్శించి భరోసా కల్పించండి. సోషల్ మీడియా కార్యకర్తలు, మనకోసం నిలబడ్డ వలంటీర్లకు తోడుగా నిలవాలి. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. పార్టీ ఇచ్చే సహాయాన్ని మీరు స్వయంగా అందచేయండి’’ అని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ‘‘రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుస్తా. నష్టపోయిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి కలసి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తా. మా ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి మా వద్దకు రాలేదనే మాట అనిపించుకోవద్దు. ప్రతి కార్యకర్తకూ భరోసా కల్పిద్దాం. ఇది అవసరం’’ అని సూచించారు. ‘‘మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనం పక్కకు తప్పుకుంటే వారంతా నష్టపోతారు. లక్షల మంది కార్యకర్తలు, వేలమంది నాయకులు, వందల మంది పోటీచేసిన అభ్యర్థులు కూడా నష్టపోతారు. మనల్ని నమ్ముకున్న ప్రజలు, నాయకులు అంతా నష్టపోతారు. నిరాశకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకూడదు. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి’ అని ధైర్యం చెప్పారు. ప్రతి అభిమానికీ, ప్రతి కార్యకర్తకూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడిది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. శ్రీకృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులకు ఓటమి తప్పలేదు. చివరకు ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పకుండా. మనం ధర్మం వైపే ఉన్నాం. విశ్వసనీయతతో రాజకీయాలు చేశాం. తలెత్తుకునేలా రాజకీయాలు చేశాం. ప్రతి ఒక్కరూ అర్జునుడి మాదిరిగా తిరిగి విజయం సాధిస్తారు. పైన దేవుడున్నాడు. ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రజలను, దేవుడ్ని నమ్ముకున్నాం. ధైర్యంగా అడుగులు వేద్దాం’’ అంటూ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మేనిఫెస్టో అజెండాగా పాలన..ఈ రోజు నేను మీ అందరితో నా మనసు నుంచి వచ్చిన విషయాలను పంచుకుంటున్నా. ఈ ఎన్నికల్లో మీరంతా గట్టి పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయన్నది ఇవ్వాళ్టికీ ఆశ్చర్యకరం. ఎందుకంటే ఎప్పుడూ ఊహించని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, మనలో ప్రతి ఒక్కరూ తలెత్తుకునేలా పాలన చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేశాం. ప్రతి ఇంటికీ మేనిఫెస్టోతో వెళ్లి ఆశీస్సులు తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. ప్రతి గడపకూ తిరిగాం. రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోను ఇంత సీరియస్‌గా ఎవరూ, ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పి, పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రించి ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులను మనం చూశాం. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకూ మేనిఫెస్టోలు పెట్టి అమలు చేశాం. ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడీల కార్యాలయాల్లో మన మేనిఫెస్టో పెట్టి అదే అజెండాగా పాలన చేశాం. వారందరినీ మొట్ట మొదటి రోజు నుంచి సమాయాత్తం చేసి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లాం.సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు..ఎప్పుడూ జరగని విధంగా పేదవాడిని ఆ పేదరికం నుంచి బయటకు తెస్తూ మన అడుగులు పడ్డాయి. క్వాలిటీ చదువుల వల్లే ఇది సాధ్యమని భావించి విద్యారంగంలో సమూల సంస్కరణలు తెచ్చాం. మూడో తరగతి పిల్లలకు టోఫెల్ పీరియడ్, ఇంగ్లీషు మీడియం బడులు, ఆరో తరగతి నుంచే ఐఎఫ్‌పీలు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు.. ఇలా ఎన్నో మార్పులు తెచ్చాం. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ కింద ఏకంగా రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితంగా అందించాం. ఆరోగ్య ఆసరా నుంచి గ్రామ స్ధాయిలో విలేజ్ క్లినిక్ ద్వారా ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాం. ఏకంగా 54 వేలమంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆర్బీకేల ద్వారా రైతన్నలకు తోడుగా నిలిచాం.గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం..విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, సుపరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మొట్టమొదటిసారిగా గ్రామ స్ధాయిలో ఎన్నో మార్పులతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తీసుకొచ్చాం. లంచాలు, వివక్ష లేని పాలన కచ్చితంగా సాధ్యమేనని గత ఐదేళ్లలో నిరూపించాం. ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. మహిళా సాధికారితకు ఏం చేయవచ్చో అన్నీ చేశాం. అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లే పరిస్ధితి కల్పించాం. దిశ యాప్ ద్వారా మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకున్నాం. గ్రామంలోనే మహిళా పోలీసుల సేవలను తీసుకొచ్చాం.చేసిన మంచే శ్రీరామరక్ష..ఇంత జరిగిన తర్వాత కూడా ఏకంగా 40 శాతం ఓటు షేర్‌తో మనం ప్రతిపక్షంలో ఉన్నాం. 2019లో మనకు 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి 10 శాతం ఓట్లు తగ్గాయి. ఇదే ప్రజలు మళ్లీ 2029 వచ్చేసరికి చంద్రబాబు మోసాలను గుర్తించి రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ మనల్ని తెచ్చుకుంటారు. ఇవ్వాళ్టికి కూడా మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ఈరోజు కూడా ప్రతి గడపలోనూ మనం చేసిన మంచి కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికీ, ప్రతి ఇంటికీ మనం చేసిన మంచేమిటో తెలుసు. మనం చేసిన మంచే ఎప్పటికీ మనకు శ్రీరామరక్షే. విశ్వసనీయతకు మన పార్టీ చిరునామా. జగన్ మాట తప్పడు, మాట మీద నిలబడతాడు, మాట తప్పని పాలన ఇచ్చాడని విశ్వసనీయతకు అర్ధం చెబుతూ మనం అందించిన పాలనను ప్రజలు మరిచిపోరు. చంద్రబాబు సింగిల్ డిజిట్ చూస్తారు..ఈరోజుకీ జగన్ అబద్ధాలు చెప్పడు, మోసం చేయడని గర్వంగా చెబుతున్నా. చంద్రబాబు కన్నా మనం ఎక్కువ హామీలిచ్చి ఉంటే బాగుండేదని చాలా మందికి అనిపించవచ్చు కూడా! రాజకీయాల్లో జగన్ ఇంత నిజాయితీగా ఉండడం అవసరమా? అనుకునే వాళ్లూ ఉండొచ్చు! కానీ ఒక్కటే చెబుతున్నా... ఓడిపోయినా ఫర్వాలేదు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం.. ధర్మం, న్యాయం కాదనే జగన్ ఎప్పుడూ నమ్ముతాడు. 2014లో కూడా ఇదే నమ్మా. సాధ్యం కానిది సాధ్యం కాదనే చెప్పాను. చంద్రబాబు వ్యవసాయ రుణాల మాఫీ దగ్గర నుంచి అన్నీ చేస్తానని చెప్పి 2019 నాటికీ చేయకపోవడం వల్ల నాడు ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో మనల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మనకు గొప్ప విజయంతో అధికారం ఇచ్చారు. ప్రజలు మళ్లీ అదే చేస్తారు. ప్రజలు మనల్ని ఏ స్థాయిలో ఆశీర్వదిస్తారంటే.. చంద్రబాబు నాయుడికి సింగిల్ డిజిట్ వచ్చే పరిస్థితులు కూడా చూస్తాం. ఇది వాస్తవం.ప్రజలతో కలసి పోరాటాలు చేద్దాం..మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. విశ్వసనీయతతో మనం చేసిన రాజకీయాలు ఎక్కడికీ పోలేదు. ఈ రోజు నేను చెబుతున్నా.. జగన్‌కు వయసుతోపాటు సత్తువ కూడా ఉంది. చంద్రబాబు పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలసి చేసే పోరాటాల్లో వైఎస్సార్సీపీకి, జగన్‌కు ఎవరూ సాటిరారు. ప్రజలకు మళ్లీ దగ్గరయ్యే కార్యక్రమాలు, వారికి తోడుగా ఉంటూ వారి తరపున పోరాటం చేసే కార్యక్రమాలు జరుగుతాయి. మన సంఖ్యాబలం తక్కువే కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగేది తక్కువే. స్పీకర్ పదవి చేపట్టనున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలను మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒకరేమో జగన్ ఓడిపోయాడు కానీ.. చనిపోలేదు అని అంటారు. చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకరు అంటారు. ఆ వ్యక్తిని ఇప్పుడు స్పీకర్ పదవిలోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలుగుతామనే నమ్మకం లేదు. కానీ చంద్రబాబు పాపాలు పండేకొద్దీ ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా చంద్రబాబు నాయుడు పాపాలు వేగంగా పండుతున్నాయి. కులం, మతం, ప్రాంతం చూడకుండా, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడకుండా ప్రతి పథకాన్ని మనం డోర్ డెలివరీ చేశాం. కానీ ఇవాళ వారి పార్టీకి ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో ఏకంగా మనుషులపై దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటే శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయి. ప్రతి ఇంటికీ తలెత్తుకుని వెళ్లగలం..ఓడిపోయామన్న భావనను మీ మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఉంది. ప్రతి ఇంట్లో కూడా మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికీ మనం తలెత్తుకుని వెళ్లగలం. చెప్పినవన్నీ చేశాం కాబట్టి ప్రజల మధ్యకు గౌరవంగా వెళ్లగలుగుతాం. చంద్రబాబు ప్రలోభాల వల్ల మోసపోయిన పరిస్ధితులతో మనకు అంతో ఇంతో అపజయం జరిగింది. ఆ మోసాలు ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో.. కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై ప్రజాగ్రహం, మన పట్ల అభిమానం వ్యక్తం అవుతుంది. మనం మళ్లీ రికార్డు మెజార్టీలతో గెలుస్తాం.బాధ అనిపించింది..గతంలో ఎప్పుడూ ఇలాంటి మార్పులు జరగలేదు. ఇన్ని చేశాక వచ్చిన ఫలితాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇవేవీ చేయకపోయి ఉంటే... చేయలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటున్నామనే దానికి అర్ధం ఉండేది. ఇంత బాధ కూడా ఉండేది కాదు. కానీ ఇన్ని చేసిన తర్వాత, ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఫలితాలు చూసిన తర్వాత బాధ అనిపించింది. ఫలితాలు చూసిన తర్వాత శకుని, పాచికల కథ గుర్తుకొచ్చింది. శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడలేం.నాలుగేళ్లు అవిశ్వాసానికి ఆస్కారం లేదుస్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు భరోసా కల్పించాలన్న వైఎస్ జగన్‌మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరితో మాట్లాడి భరోసా ఇవ్వండి. వారిని బెదిరించే కార్యక్రమాలు, ప్రలోభాలు జోరుగా జరుగుతున్నాయి. రాజీనామాలు చేయాలని వారిని బెదిరిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో కార్యకర్తలను, నాయకులను పిలిచి చెప్పండి. స్థానిక సంస్థలకు సంబంధించి వారిపై నాలుగేళ్ల వరకూ కూడా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. చట్టం దీన్ని నిరోధిస్తుంది. ఆ చట్టాన్ని మార్చి ఏదో చేయాలనుకుంటే ఏమీ చేయలేరు. కోర్టులు దీనికి ఒప్పుకోవు. అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ మనవాళ్లకు విడమరచి చెప్పాలి. వారికి తోడుగా ఉన్నామనే ధీమా కల్పించాలి. అప్పుడు వారిలో భరోసా కలుగుతుంది. మీరంతా ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా చేయాలి.హోదా అడగకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి..కేంద్రంలో మెజారిటీ కోసం 272 స్థానాలు అవసరం కాగా బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది. చంద్రబాబుకు 16 ఎంపీ స్థానాలున్నాయి. తాను ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నట్టుగా ప్రధాని మోదీ పక్కన కూర్చుని కనిపిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను అడగకపోవడం, అడిగి సాధించుకునే దిశగా అడుగులు వేయకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి. అలా అడగలేని మనిషి రాష్ట్రానికి, యువతకు ఏం సమాధానం చెబుతాడు?హనీమూన్ ముగుస్తుంది..ఇవాళ వైఎస్సార్సీపీ పాలన, జగన్ ఉండి ఉంటే ఈపాటికే విద్యాదీవెన ఇచ్చేవాళ్లం. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన బటన్ నొక్కేవాళ్లం. ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. రైతు భరోసా పెండింగ్, అమ్మ ఒడి పెండింగ్, చివరకు చిన్న అమౌంట్ అయిన మత్స్యకార భరోసా కూడా పెండింగ్‌లోనే పెట్టారు. ఒక్క జగన్ తప్పుకోవడంతో, వైఎస్సార్సీపీ పాలన లేకపోవడంతో ఏమీ రావడం లేదని ప్రజలు గమనిస్తున్నారు. ఏపీలో 4.12 కోట్ల మంది ఓటర్లున్నారు. దాదాపు సగానికిపైగా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. రూ.1,500 ప్రతి ఒక్కరికీ ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్లని పక్కనపెట్టినా మిగిలిన 1.8 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. రూ.20 వేల పెట్టుబడి సహాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దాదాపు కోటి మంది పిల్లలు అమ్మ ఒడి కింద వచ్చే డబ్బులు కోసం నిరీక్షిస్తున్నారు. వీరి కోసం అడుగులు ఏవీ ముందుకు పడని పరిస్థితి నెలకొంది. కాలం గడుస్తున్న కొద్దీ హనీమూన్ పీరియడ్ ముగుస్తుంది.ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో?ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి తలెత్తుకుని సగర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగాం. కానీ ఫలితాలు చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు ప్రజలకు డీబీటీ ద్వారా నేరుగా అందచేశాం. ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందే క్యాలెండర్ ప్రకటించి తేదీల వారీగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఇలా ఎప్పుడూ ఇలా జరగలేదు. మరి ఆ ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి? అని ఒక్కోసారి అనిపిస్తుంది. మనం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు వరకు పెన్షన్ కేవలం రూ.వెయ్యి మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంటే మనం ఏకంగా రూ.3 వేలకు పెంచాం. అప్పట్లో 39 లక్షల మంత్రి మాత్రమే పెన్షనర్లు ఉంటే మనం వచ్చాక ఏకంగా 66 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ పింఛన్లు ఇంటి వద్దే వారి చేతికే అందించాం. వాళ్ల ఆశీస్సులు తీసుకున్నాం. మరి ఆ 66 లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మల ఆప్యాయతలు, ప్రేమలు ఏమయ్యాయి? 54 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి అందించాం. పిల్లలు గొప్పగా చదవాలి, వారికి మంచి భవిష్యత్ ఉండాలనే తపనతో అమ్మఒడి ఇచ్చాం. వాళ్ల ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. ఏకంగా 53.58 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయ రంగంలో ఇవి ఎప్పుడూ చూడని విప్లవాత్మక మార్పులు. మరి వారి ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియదు. ఏకంగా 1.5 కోట్ల మందికి పైగా అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ ఇచ్చాం. 79 లక్షలమంది అక్క చెల్లెమ్మలు అప్పులతో కుదేలైన పరిస్థితుల్లో వారికి అండగా ఉంటూ ఆసరా ఇచ్చాం. 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఇచ్చాం. 30 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన వారి తల్లులకే ఇచ్చాం. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 3.60 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు కాపు నేస్తం, 4.96 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, 82 వేల మందికి నేతన్న నేస్తం, 2.76 లక్షల మందికి వాహనమిత్ర, 16 లక్షల మందిని తోడు కార్యక్రమం ద్వారా ఆదుకున్నాం. 3.38 లక్షల మందికి చేదోడు, 1.10 లక్షల మంది మత్స్యకారులకు మత్స్యకార భరోసా క్రమం తప్పకుండా ఇచ్చాం. కోవిడ్ లాంటి సంక్షోభ పరిస్థితులున్నా సాకులు చెప్పకుండా మంచి చేశాం. -
నా కొ..ల్లారా.. నరుకుతా..
అనంతపురం క్రైం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి అధికారులపై విరుచుకుపడ్డారు. ‘నా కొ..ల్లారా.. ఒక్కొక్కరినీ నరుకుతా’ అంటూ బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే బండబూతులతో చెలరేగిపోయారు. రవాణా శాఖ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో పాటు తాడిపత్రి మునిసిపల్ అధికారులకు, పోలీసులకు, వైఎస్సార్సీపీ నేతలకు బహిరంగంగానే వారి్నంగ్ ఇచ్చారు. ప్రధానంగా గతంలో రవాణా శాఖ కమిషనర్‌గా చేసిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, డీటీసీ శివరాంప్రసాద్, మహిళా అధికారిణి అత్తికానాజ్లను దుర్భాషలాడారు. ‘మీరెక్కడ దాక్కున్నా వదలను. గత ప్రభుత్వ హయాంలో నా బస్సులు, లారీలను అన్యాయంగా సీజ్ చేశారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారు. నన్ను, నా కొడుకును జైలుకు పంపారు. నిబంధనల మేరకే మేము బీఎస్–4 వాహనాలు కొన్నాం. బీఎస్–4 వాహనాలు అమ్మిన వాళ్లదే తప్పు అని సుప్రీం కోర్టు చెప్పింది. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అమ్మిన వాహనాలను సరెండర్ చేశారు. అక్కడ రిజి్రస్టేషన్ చేసిన అధికారుల ఉద్యోగాలు పోయాయి. ఏపీలో మాత్రం వాహనాలు కొన్న మాపై కేసులు పెట్టారు. జైళ్లకు కూడా పంపారు. అందరిపై ప్రతీకారం తీర్చుకుంటా. సీజ్ చేసిన మా బస్సులు, లారీలన్నీ తుప్పు పట్టిపోయాయి. వాటిని మీరే (అధికారులే) రిపేరు చేయించి తిరిగి రోడ్డుపైకి తేవాలి. ఇందుకు పది రోజులు గడువిస్తున్నా. లేదంటే భార్య, పిల్లలతో కలసి డీటీసీ, ఎస్పీ కార్యాలయాల ముందు నిరాహార దీక్ష చేస్తా. తాడిపత్రి మునిసిపల్ ఆఫీసులో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. రేయ్.. కమిషనర్లూ మిమ్మల్ని వదలను. ‘నా కొ..ల్లారా నరికేస్తా. ఏమవుతుంది మీతో’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అధికారులను దుర్భాషలాడారు. ‘నా ఫ్యామిలీకి 620 ఏళ్ల చరిత్ర ఉంది. నా గడ్డం ఎందుకు వదిలాననుకుంటున్నారు? చంద్రబాబు సీఎం కావాలని వదల్లేదు. ఒక్కో వెంట్రుకకు ఒక్కో కథ ఉంది. అత్తికానాజ్ ఆడదంట.. ఏమ్మా అన్నా వినలేదు. ఇంట్లో తను ఎలా ఉంటుందో తెలుసా?’ అంటూ రాయలేని భాషలో దూషించారు. వైఎస్సార్సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నానీలను కూడా దూషించారు. బస్సులు, లారీల వ్యవహారం పూర్తిగా తన వ్యక్తిగత సమస్య అని, చంద్రబాబుకు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. తాను సొంతంగానే పరిష్కరించుకుంటానన్నారు. అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. తాను ఊ అంటే చాలు తనకున్న జనం మరెవరికీ లేరని అన్నారు. -
‘పోలవరం’ పనుల్లో సంక్షోభం.. బాబు తప్పిదం వల్లే..: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య అధి కారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదంవల్లే పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుందని.. పనుల జాప్యానికి ఆయనే కారణమని మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సోమ వారం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలన్నీ పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలన్నారు. పోలవరం పర్యటన సందర్భంగా ఆయన చేసిన తప్పులను గుర్తుచేసుకోకుండా.. వైఎస్ జగన్‌పై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి 2019–24 మధ్య వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేశారని.. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తిచేసి గోదావరి వరద ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారని గుర్తుచేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకుని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అంబటి చంద్రబాబుకు హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వాస్తవాలు అవాస్తవాలు అవుతాయా..?ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే సోమవారం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఆయనచేసిన తప్పులన్నీ వైఎస్ జగన్‌పై నెట్టేందుకు యత్నించారు. కానీ, పోలవరం పూర్తిచేయాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారంటూ బాబు వెల్లడించారు. పోలవరంలో విధ్వంసానికి వైఎస్ జగనే కారణమని ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి.. 2019కి ముందు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం విషయంలో సంక్షోభం వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో బాబు వ్యూహాత్మక, చారిత్రక తప్పిదాలే ఈ పరిస్థితికి దారితీశాయి. ముందుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, తర్వాత ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టడమే దీనికి ప్రధాన కారణం. డయాఫ్రం వాల్‌తో పాటు ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులు సమాంతరంగా చేపట్టారు. జర్మనీకి చెందిన బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్‌ను పూర్తిచేసి రూ.460 కోట్లు బిల్లులు తీసుకుంది. చివరకు కాఫర్ డ్యాంల మధ్య ఖాళీలు ఉంచేయడంతో వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. ఇదీ వాస్తవం. దీన్ని దాచిపెట్టి, కాంట్రాక్టర్‌ను మార్చడంవల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నట్లుగా చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారు. అంతేకాక.. ఇటు స్పిల్ వే, కాఫర్ డ్యాం పూర్తిచేయకపోడం, గోదావరి నదిని డైవర్షన్ చేయకపోవడంవల్ల 54 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొన్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వీటికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన తప్పులను వైఎస్ జగన్ పైకి నెట్టేసి పబ్బం గడుపుకుందామనుకుంటున్నారా చంద్రబాబూ? పోలవరంలో జరిగిన అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్లు అర్థంచేసుకోవాలి.ఐదేళ్లలో పూర్తిచేస్తామని చెప్పలేకపోతున్నారు..నిజానికి.. చంద్రబాబువల్లే ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యానికి చంద్రబాబే కారణం. చివరకు.. ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చినా సరే ఐదేళ్లలో పూర్తిచేస్తామనే మాట చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. 2019కి ముందు చంద్రబాబు అశాస్త్రీయంగా ఆలోచించడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది.. అప్పట్లో సొంత తెలివితేటలు ఉపయోగించడంవల్ల ఆయన అనేక తప్పులు చేశారు. ఇవాళ వైఎస్ జగన్ మీద విరుచుకుపడడం అన్యాయం.శరవేగంగా పనులు చేసింది వైఎస్ జగనే..ఇక దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలన్న దానిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికీ నిర్ధిష్టమైన నిర్ణయానికి రాలేదు. ప్రాజెక్టులో 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెబుతుండటం విడ్డూరం. ఎందుకంటే..– మేం కట్టిన పోలవరం స్పిల్‌వే మీద చంద్రబాబు ప్రయాణించారని తెలుసుకోవాలి. మేమే రెండు కాఫర్ డ్యాంలు పూర్తిచేశాం. – అలాగే, గోదావరి నదిని పూర్తిగా స్పిల్‌వే మీదుగా డైవర్షన్ చేశాం. – స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ కూడా పూర్తిచేశాం. – ఇవికాక క్రిటికల్ నిర్మాణాలు పూర్తిచేసి, గేట్లన్నీ పెట్టి ప్రస్తుతం ఎంత వరద వచ్చినా ఆపరేట్ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్లాం. – కానీ, చంద్రబాబు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేస్తున్నాడు.జగన్ ఏ తప్పూ చేయలేదు..మరోవైపు.. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్తానంటున్నారు. వైఎస్ జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నారు. కాబట్టి దీన్ని కూలంకషంగా ప్రజలు అర్థంచేసుకోవాలి. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. పోలవరం పనుల్లో జగన్ ఎలాంటి తప్పుచేయలేదు. శరవేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్లే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. నాలుగేళ్లకు పూర్తవుతుందా? ఐదేళ్లకు పూర్తవుతుందా? అనే అంశాన్ని అపర మేధావినని, చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం.. ఆయన ప్రభుత్వం చేసిన తప్పిదం తప్ప మరొకటి కాదు. బాబు హయాంలో జరిగిన విధ్వంసంవల్ల ప్రతి తెలుగువాడూ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయలేదు. చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోవాలి.‘హోదా’ తీసుకురాకపోతే ద్రోహిగా మిగిలిపోతారు..చంద్రబాబుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కూటమిని గెలిపించారు. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. చంద్రబాబు చాలా లక్కీ. ఆంధ్రప్రదేశ్‌కు కూడా లక్కీయే. ఇలాంటి పరిస్థితి రావాలని వైఎస్ జగన్ చాలాసార్లు కోరుకున్నారు. ఆయనకు రాని అవకాశం టీడీపీకి వచ్చింది. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు అవసరంలేదు. మీ చేతిలో పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదాను తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోయండని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోలేకపోతే రాష్ట్రానికి చంద్రబాబులాంటి ద్రోహి ఎవరూ ఉండరని మనవి చేస్తున్నా. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటివన్నీ వదిలేసి వైఎస్ జగన్‌ను రోజూ తిట్టుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు బాబూ? -
బ్యాలెట్టే బెటర్: వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలపై ఒకవైపు.. ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్, అన్లాకింగ్ తదితర అంశాలపై మరోవైపు తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఫలితాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రమే కాదు.. ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మాధ్యమం(ఎక్స్) ఖాతాలో ఓ కీలక సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘న్యాయం జరగడం ఒక్కటే ముఖ్యం కాదు. జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలు కాదు. దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎంలను పక్కన పెట్టాలి. ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
ఏపీలో చంద్రన్న రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లేనా?
నేను ఫలానా వాళ్లను కొట్టబోతున్నాను.. లేదా చంపబోతున్నాను అని ఎవరైనా పెద్ద హోర్డింగ్ పెడితే ఏమవుతుంది. వెంటనే పోలీసులు చర్య తీసుకుని అలాంటి హోర్డింగ్ ను తొలగించడమే కాకుండా, అలా చేసినవారిని అదుపులోకి తీసుకుంటారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. బహిరంగంగా హోర్డింగ్ లు పెట్టి రెడ్ బుక్ సిద్ధం అంటూ తమ నేత బొమ్మ వేసుకుని మరీ ప్రచారం చేసుకోవచ్చు. అయినా పోలీసులు స్పందించరు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా చూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టి, పట్టనట్లు వ్యవహరిస్తుంది. వారికి ఇష్టమైన మీడియా ఆహో, ఓహో అని భజన చేస్తాయి. ఇదో చిత్రమైన పరిస్థితి అని చెప్పాలి.⇒ ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే ఇలాంటి దారుణమైన పోకడలు సాగుతున్నాయి. దీనిని అదుపు చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాలలో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉండవచ్చు. కోప, తాపాలు ఉండవచ్చు. లేదా ఎదుటివారు ఎదైనా తప్పు చేశారనుకుంటే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు. ఇవేవి కాకుండా మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బోర్డులు పెడుతున్నారు. అదేదో గొప్ప పనిగా వారు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్యేనా అనే ప్రశ్న వస్తే, మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా, రౌడీలు, గూండాలు చెలరేగిపోయినా పట్టని కాలంలో మాత్రమే ఇలాంటివాటిని సమర్థించగలం.⇒ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటివి జరగకూడదు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నలభైఆరేళ్లుగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. దేశంలోనే ఆయన అంత అదృష్టవంతుడైన నేత లేరంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను, అంతకన్నా ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఆయనకు నిబంధనలు, చట్టం, రాజ్యాంగం గురించి తెలియవని అనుకుంటే పొరపాటు. అయినా ఆయన ఏలుబడిలో ఇలాంటి దుశ్చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏమి చెబుదాం. ఆయనలో ఇంకా కక్షపూరిత రాజకీయాలు పోలేదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు.⇒ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే తీవ్రంగా స్పందించి, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇంకొకటని అరిచి ఘీ పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తాము అధికారంలోకి రాగానే కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నారని అనుకోవాలా? చంద్రన్న రాజ్యాంగం అమలులోకి వచ్చినట్లా? దీని ప్రకారం ఎవరినైనా తాము కొట్టవచ్చని, తిట్టవచ్చని, చంపవచ్చని, ఎవరూ మాట్లాడడానికి వీలు లేదని కొత్త నిబంధనలు తయారు చేశారా! పైగా వాటిని బహిరంగంగా హోర్డింగ్ ల ద్వారా ప్రజలందరికి తెలియచేసే కొత్త సంస్కృతికి తెరదీశారా? ఇదేనా చట్టబద్దమైన, రాజ్యాంగ పాలన అంటే!⇒ ప్రతిపక్షంలో ఉండగా, ఎవరు సలహా ఇచ్చారో కానీ లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అంటూ పట్టుకు తిరిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న భావన కలిగితేనో, అధికారుల శైలి తమకు నచ్చకపోతేనో, లేక తాము చేసే అల్లర్లకు అడ్డుపడితేనో, కేసులు పెడితేనో, వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని బెదిరిస్తుండేవారు. తొలుత ఎవరూ దీనిని సీరియస్ గా తీసుకోలేదు.⇒ కొందరు సరదాగా తీసుకుంటే, పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించలేదు. అయితే చంద్రబాబు, లోకేష్ లపై ఆయా స్కాములకు సంబంధించి కేసులు పెట్టిన సందర్భంలో అప్పటి సీఐడీ అధికారులు ఈ రెడ్ బుక్ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. ఈలోగానే వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రెడ్ బుక్ కేసు ఏమవుతుందో కానీ, అధికారులు ఎవరూ దానిని పర్స్యూ చేసేపరిస్థితి ఉండదు. రెడ్ బుక్ అంటూ తిరిగిన వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్ ను విశాఖ సభలో ఆయన తన తండ్రి చంద్రబాబుకు అందచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.⇒ ఆ రెడ్ బుక్ లో పలువురు అధికారుల పేర్లు, వైఎస్సార్సీపీ నేతల పేర్లు.. లేదా ఇంకొందరు తమను వ్యతిరేకించేవారి పేర్లు రాసుకుని ఉండవచ్చు. ఆయా సభలలో కొందరి పేర్లను లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు కూడా. చిత్తూరులో ఒక ఎస్పీ పేరును ఇలానే అప్పట్లో ప్రకటించారు. అలా అధికారులను బెదిరించవచ్చా! నిజంగానే అధికారంలోకి వచ్చారు కనుక వారిపై చర్య తీసుకుంటామని బహిరంగంగా బోర్డులు పెట్టవచ్చా! గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయా! అసలే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, అది చాలదన్నట్లు రెడ్ బుక్ సిద్దం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రకటనలు ఏమిటో తెలియదు.⇒ టీడీపీ నేత బుద్దా వెంకన్న వంటివారు వారిని అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రాజకీయ ప్రకటనలు చేస్తుంటే అదేదో మామూలేనని అనుకుంటాం. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, మరొక టీడీపీ నేత కూర్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ, చావలేదు.. అని అంటుంటే వీరి మనసులో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? అన్న విషయం బహిర్గతం అయిపోతుంది. దానికి తగినట్లుగానే రెడ్ బుక్ హోర్డింగ్ లు పెడుతున్నారన్న అనుమానం ప్రజలలో ప్రబలుతుంది.⇒ పూర్వకాలంలో తమ అధికారానికి అడ్డు పడుతారనుకునే వారిని రాజులు, నియంతలు చంపించేసేవారట. ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇప్పటికీ అలాంటి రాక్షస సంస్కృతి ఉంది. చైనాలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కమ్యూనిజం ముసుగులో ఉన్న నియంత రాజ్యం కనుక. చైనాలో సాంస్కృతిక విప్లవం పేరుతో ఎన్ని ఘోరాలు జరిగాయో చరిత్ర చెబుతుంది. రష్యాలో పుతిన్ కు ఎదురుతిరిగినవారిని బతకనివ్వడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యదేశంగా ఉన్న భారత్ లో అలాంటివి సాధ్యమేనా? అందులోను ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? అది ఎల్లకాలం అయ్యే పనేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉండేది ఐదేళ్ల కాలపరిమితే అన్న సంగతి మర్చిపోయి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే తర్వాత ప్రజలు వాటిని గుర్తుంచుకోరా?⇒ గొప్ప నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను జైళ్లపాలు చేసిన తర్వాత కొంతకాలం అధికారంలో ఉండగలిగారు కానీ, ఆ తర్వాత ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోలేదు. అయినా రాజకీయ నేతలు గుణపాఠాలు నేర్చుకోరు. పోలీసులు తమ చేతిలో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చని, ఇతర వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చన్న విశ్వాసంతో అరాచకాలకు పాల్పడుంటారు. కానీ ఆ తర్వాత వారు కూడా ఏదో నాడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోతారు.⇒ ఎంత పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందని సామెత. ఒకపక్క రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ రెడ్ బుక్ ప్రకటనలు ఇంత బహిరంగంగా హోర్డింగ్ ల రూపంలో జనంలోకి వస్తే, గూండాలను, మాఫియాలను ఎంకరేజ్ చేసినట్లా? కాదా? అన్నది వారే ఆలోచించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి
సాక్షి, అమరావతి: పోలవరం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతూ.. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కిమీల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ నిర్మించడం ద్వారా చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని.. ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తొలిసారిగా పోలవరం పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చారిత్రక తప్పిదంతో కోతకు గురైన డయాఫ్రమ్ వాల్⇒ విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ⇒ ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ⇒ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. ⇒ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి. ⇒ గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. ⇒ వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. విధ్వంసం వల్లే పనుల్లో జాప్యంనాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్‌శక్తి శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు అప్పగించిన రూ.2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్ జగన్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ఖజానాకు రూ.783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్‌లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరక కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వేను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ చానల్‌ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ.ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడివేసి వరదల ఉద్ధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్త యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా? అనే విషయాన్ని సీడబ్ల్యూసీ తేల్చలేదు. సాంకేతికపరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీని కోరుత⇒ వచ్చింది. డయాఫ్రమ్ వాల్సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్‌ను ఆమోదించి పనులు చేయాలని సీడబ్ల్యూసీకి చెబుత⇒ వచ్చింది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని.. ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2029 నాటికే.. వరదల ప్రభావం వల్ల నవంబర్ వరక⇒ పోలవరం పనులు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే నాలుగు సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను వైఎస్ జగన్ చక్కదిద్దినప్పటికీ పోలవరాన్ని 2029 నాటికి గానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫరి్మయబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతువరక⇒ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరక⇒ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యతి్నంచడం గమనార్హం. రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెపె్టంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోను మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ బౌన్స్ బ్యాక్ వెరీ సూన్!
వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు అనూహ్యంగా ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుంటున్నారు. ఆయన తిరిగి రాజకీయ కార్యకలాపాలను ఆరంభించారు. ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. పార్టీ నేతలతో సంభాషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో వేర్వేరుగా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాలలో పార్టీకి ఎదురైన ఓటమి నుంచి కోలుకుని, మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే విషయమై చర్చిస్తున్నారు. తాను కచ్చితంగా ప్రజలలో తిరుగుతానని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా క్యాడర్ కు భరోసా ఇచ్చేది అవుతుంది.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పే విధంగా తాను టూర్ చేస్తానని ప్రకటించారు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలో తిరగడం మొదలు పెడితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల హింసాయుత ఘటనలు జరిగాయి. వాటిలో వందల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. కొద్ది మంది మరణించారు. ఓటమిని భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీవారి ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. వారి కోసం ఇప్పటికే జిల్లా వారీగా లీగల్ టీమ్ లు ఏర్పాటుచేశారు. నేతలతో కమిటీలు ఏర్పాటు చేసి ఆయా చోట్ల పర్యటించాలని కోరారు. తదుపరి తానే స్వయంగా వెళ్లి పరామర్శించబోతున్నారు.ఏ రాజకీయ పార్టీ నేత అయినా ఇదే పని చేయాలి. గతంలో వ్యక్తిగత కారణాలతో ఎక్కడైనా గొడవ జరిగి, టీడీపీ వ్యక్తి ఎవరైనా గాయపడినా, మరణించినా చంద్రబాబు దానిని రాజకీయం చేసి, అక్కడకు పరామర్శ యాత్ర చేపట్టేవారు. అదంతా టీడీపీ మీడియాలో విస్తారంగా ప్రచారం అవుతుండేది. ఈ రకంగా ఐదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నవి, లేనివి కలిపి దుష్ప్రచారం చేశారు. ఎలాగైతేనేం అధికారం సంపాదించారు. టీడీపీ వారు దానిని సద్వినియోగం పరచుకోవడం మాని వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు. టీడీపీ క్యాడర్ యధేచ్చగా హింసాకాండకు పాల్పడడానికి చంద్రబాబు వంటి పెద్ద నేతలు కూడా ప్రోత్సహం ఇవ్వడం దురదృష్టకరం.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీవారిలో విశ్వాసం పెంపొందిచడానికి చర్యలు చేపట్టారు. వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఉందని ఆయన చెబుతూ ఆత్మ స్థైర్యం కోల్పోవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది వాస్తవం. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 1989-94, 2004-2014, 2019-2024 టరమ్ లలో అధికారంలో లేదు. ప్రతిపక్షంగానే ఉంది. అయినా పార్టీ నిలబడింది. తిరిగి పవర్ లోకి వచ్చింది. అబద్ధాలతో వచ్చిందా? లేక కొందరు అనుమానిస్తున్నట్లు ఈవీఎం మోసాలతో వచ్చిందా? అనేది వేరే విషయం. కానీ పార్టీ ఏర్పడిన తర్వాత నాలుగు దశాబ్దాలలో రెండు దశాబ్దాలపాటు అధికారంలో లేదన్న సంగతి గుర్తుంచుకోవాలి.అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించినప్పుడు దాదాపు ఒంటరిగానే రాజకీయం ఆరంభించారు. ఆ తర్వాత 2014లో అధికారం సాధించలేకపోయినా, నిత్యం ప్రజలతో మమేకమయి 2019లో ప్రభుత్వంలోకి వచ్చారు. కనుక ప్రతిపక్షంలో ఉండడం వైఎస్సార్సీపీకి కూడా కొత్త కాదు. కాకపోతే ఒక్కసారిగా ఓటమిని ఊహించని క్యాడర్ కు కాస్త ధైర్యాన్ని ఇచ్చి ప్రజలలో పనిచేసేలా వ్యూహం రచించుకోవాలి. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం విపక్షానికి ఉంటుంది. దానిని వినియోగించుకోగలగాలి.ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన ప్రభుత్వం నడుపుతున్నప్పుడు చెప్పిన హామీలను నెరవేర్చి ఒక విశ్వసనీయత కలిగిన నేతగా పేరొందారు. అంతవరకు వాస్తవం. ఓటమికి పలు ఇతర కారణాలు ఉండవచ్చు. కానీ చాలా వరకు మాట మీద నిలబడే వ్యక్తిగా జగన్ నిలబడిపోతారు. దానినే ఆయన ప్రస్తావించి మనపట్ల విశ్వసనీయత బతికే ఉందని అన్నారు. అర్హతే ప్రమాణికంగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా స్కీములు అమలు చేసిన చరిత్ర తమది అయితే, కూటమికి ఓటేయలేదనే ఏకైక కారణంతో టీడీపీ వారు తెగబడి రాష్ట్రాన్ని రావణాకాష్టంగా మార్చారని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిరి స్కీముల అమలులో పార్టీ, కులం, మతం వంటివి చూడని నేత మరొకరు లేరంటే అతిశయోక్తికాదు.అయితే అదే విశ్వసనీయత పాయింట్ ఆయనను దెబ్బతీసిందని చెప్పాలి. తన ప్రభుత్వం ఏడాదికి సుమారు డెబ్బైవేల కోట్ల రూపాయల మేర వివిధ స్కీములను అమలు చేస్తున్నందున అదనంగా కొత్త స్కీములు ఇవ్వలేమని, పెన్షన్ లు నాలుగువేల రూపాయలు చేయలేమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టో విడుదల సందర్భంగా పేర్కొన్నారు. దానిని జనం పాజిటివ్ గా తీసుకోలేదని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన భారీ హామీల ప్రకటనకు ఆశపడి టీడీపీకి ఓటు వేసినట్లు కనబడుతుంది. దానిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. "విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా! లేక కష్టాలు ఎదుర్కుంటూ హూందాగా నిలబడి ముందడుగు వేద్దామా?" అని ప్రశ్నించారు. మాట ప్రకారం నిలబడితేనే మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన నమ్ముతున్నారు.తాత్కాలికంగా ప్రజలు చంద్రబాబు హామీలను నమ్మినా, వాటిని అమలు చేయడం కష్టం కనుక, 2014 టరమ్ లో మాదిరి చంద్రబాబు ప్రభుత్వం ఈసారి కూడా చతికిలపడుతుందని పలువురు భావిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా అదే కావచ్చు. అందుకే నిబ్బరంగా ఉండి పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి అత్యధిక మెజార్టీ ఉన్నందున చంద్రబాబు నాయుడు రకరకాల ప్రలోభాలు పెట్టడమో, లేక తప్పుడు కేసులు పెట్టించడమో చేస్తారని ఆయన అనుమానిస్తున్నారు. దానిని తట్టుకుని నిలబడాలని ఎమ్మెల్సీలను ఆయన కోరారు. దానికి ఎంతమంది కట్టుబడి ఉంటారన్నది కాలమే తేల్చుతుందని చెప్పాలి.ప్రత్యేక హోదా గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పేవారు. తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే, కేంద్రంలో ఏ కూటమికి తక్కువ సీట్లు వస్తే, దానికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక హోదా డిమాండ్ పెడతానని అనేవారు. అప్పట్లో బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చింది. దాంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితిలో పడ్డారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి రావడం ప్లస్ పాయింట్. అయినా ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం ఆయన బలహీనత. దానిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా ఎక్స్ పోజ్ చేశారు. మరో మాట కూడా అన్నారు. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్నది ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. దానికి ప్రతిపక్ష హోదాకు తగినన్ని సీట్లు లేవు. అందువల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు. అంత ఉదారత తెలుగుదేశం పార్టీకి ఉంటుందని ఆశించనవసరం లేదు.1994లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కు ఉమ్మడి ఏపీలో ఇరవైఆరు సీట్లే వచ్చాయి. దీని ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కలేదు. అప్పట్లో కాంగ్రెస్ నేత పి. జనార్ధనరెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడానికి చంద్రబాబు అంగీకరించలేదు. అలాంటిది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ఆ హోదా ఇస్తారని అనుకోనవసరం లేదు. అయితే శాసనమండలిలో వైఎస్సార్సీపీకి బలం ఉన్నంతకాలం ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పార్టీలో పునరుత్తేజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పక తప్పదు. అంతవరకు ఓపిక పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్సీపీకు భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు