కృష్ణదేవరాయలు తొందరపడ్డారా? | Confused YSRCP Leader Lau Krishna Deva Rao Resigned | Sakshi
Sakshi News home page

కృష్ణదేవరాయలు తొందరపడ్డారా?

Published Thu, Jan 25 2024 12:19 PM | Last Updated on Sun, Feb 4 2024 4:23 PM

Confused YSRCP Leader Lau Krishna Deva Rao Resigned - Sakshi

రాజకీయాలలో తొందరపాటు ఉండకూడదు. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితాలు ఎక్కువ సందర్భాలలో అనుకూలంగా ఉంటాయి. నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం తొందరపాటు చర్య అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వంతో కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కానీ ఆయనకు విబేధాలు ఏమీ లేవు. ఆయనకు పార్టీలో తగు గౌరవం లభించింది. ఎమ్మెల్యేల నుంచి సహకారం పొందగలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కాకపోతే ఈసారి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే బాగుంటుందని కృష్ణదేవరాయలకు పార్టీ అధిష్టానం సూచించింది.

దానికి కారణం ఈయన అభ్యర్ధిత్వం అక్కడ ఉపయోగపడుతుందనే కదా! కానీ రాయలకు ఇష్టం లేదు. నరసరావుపేట నుంచే పోటీచేస్తానని ఆయన పట్టుబడుతున్నారు. అంతవరకు తప్పు లేదు. దీనిపై ఒకటికి రెండు సార్లు పార్టీ నాయకత్వంతో చర్చించవచ్చు. సీఎం జగన్‌ను కలిసి తన వాదన వినిపించవచ్చు. అలా కాకుండా కృష్ణదేవరాయలు రాజీనామా ప్రకటన చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియవలసి ఉంది. కానీ, ఇందుకు ఆయన చెప్పిన కారణాలు అంత సమర్ధనీయంగా లేవు. నరసరావుపేటలో బీసీ అభ్యర్ధిని పోటీలో దించాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానం భావిస్తోందని, దాంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన చెప్పారు.

అంటే కార్యకర్తలలో ఒక గందరగోళ పరిస్థితి ఉందని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ, దానికే రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఆయన గందరగోళంలో ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. పార్టీ నాయకత్వంపైన, ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన ఎలాంటి విమర్శలు చేయకపోవడం కొంతలో కొంత బెటర్. నిజానికి పార్టీకి కట్టుబడి ఉండటం అన్నది ఒక విధానం. విద్యాధికుడై, పలు విద్యా సంస్ధలను నిర్వహించే కృష్ణదేవరాయలు అందుకు భిన్నంగా కేవలం ఒక పదవిని ఆశించి ఇలా వ్యవహరించడం ఆయనకు అంత ప్రతిష్టకాదని చెప్పక తప్పదు. ఆయన తండ్రి లావు రత్తయ్య 1996లో ఎన్.టీ.ఆర్.టీడీపీ తరపున బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు.

ఆ తర్వాత ఆయన రాజకీయాలలో రానించలేకపోయారు. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా మంచిపేరు తెచ్చుకున్నా, రాజకీయాలలో ఆయనకు ఉన్న ఆసక్తిని నెరవేర్చుకోలేకపోయారు. కానీ, వైఎస్సార్‌సీపీను స్థాపించిన సీఎం జగన్‌.. ఆయన కుమారుడు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చి నరసరావుపేట నుంచి పోటీకిగాను టిక్కెట్ ఇచ్చారు. విజయం సాధించి ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. అంతవరకు ఓకే. కానీ, ఇప్పుడు సడన్‌గా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం మాత్రం తొందరపాటే అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళతారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అయినా రాయలు వంటి విద్యాధికులు అలా చేస్తారా అని అనుకునేవారు.

ఒక వేళ ఆయన నిజంగానే అలా టీడీపీలోకి వెళితే రాజకీయాలలో విలువలు పాటించని వ్యక్తులలో ఈయన కూడా ఒకరు అవుతారు. విశేషం ఏమిటంటే వైఎస్సార్‌సీపీ నుంచి అయితే నరసరావుపేట టిక్కెట్ కావాలట. టీడీపీ అయితే గుంటూరు నుంచి పోటీకి దిగుతారట. ఇది వాస్తవమో, కాదో తెలియదు. కానీ, ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారేమోనన్న అనుమానం వస్తుంది. కృష్ణదేవరాయలు ఇలా ఓపెన్ అయిపోవడంతో బహుశా రాజీ చర్చలు కూడా ఏమీ ముందుకు వెళ్లకపోవచ్చు. నరసరావుపేట సీటును వైఎస్సార్‌సీపీ ఒక బీసీ అభ్యర్ధికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఎంపీ బాలశౌరిది మరో కధ.

ఈయనకు పార్టీలో ఎనలేని గుర్తింపు ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఒకసారి తెనాలి నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్‌ ఆధ్వర్యంలో మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీ అయ్యారు. అయినా ఆ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. మచిలీపట్నంలో కొత్త అభ్యర్దికి అవకాశం ఇస్తారన్న భావన ఆయనలో ఏర్పడి ఉండవచ్చు. దాంతో ఆయనకు అసంతృప్తి ఏర్పడినట్లు ఉంది. సామాజికవర్గం రీత్యా జనసేనకు వెళితే బెటర్ అని ఆయన అనుకున్నారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఆయనకు జనసేట టిక్కెట్ వస్తుందో, లేదో ఎవరూ చెప్పలేరు.

అయినా ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయం గమనిస్తే పాలిటిక్స్‌లో విధేయతకు తక్కువ అవకాశం ఉంటుందని రుజువు చేసినట్లయింది. పార్టీలో కొంతమందితో విబేధాలు ఉంటే ఉండవచ్చు. అయినా పార్టీ నాయకత్వంతో సంబంధాలు బాగానే ఉన్నప్పుడు ఇలా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే వారికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. బాలశౌరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్‌సీపీలోకి రాలేదా అన్న ప్రశ్న రావచ్చు. టీడీపీలో నాని అవమానాలకు గురవడం వల్ల పార్టీ మారక తప్పలేదు. సొంత తమ్ముడితోనే నానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకత్వం కుంపటి పెట్టించింది.

తిరువూరులో జరిగిన పార్టీ సభ ఏర్పాట్లకు రావద్దని ఎంపీగా ఉన్న నానికి చెప్పడం అంటే ఒకరకంగా అవమానించడమే. ఆ నేపథ్యంలో ఆయన వైఎస్సార్‌సీపీలోకి వచ్చి విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక, లావు కృష్ణదేవరాయలకు కానీ, బాలశౌరికి కానీ పార్టీలో అలాంటి అవమానాలేమీ లేవు. పైగా వారికి మంచి గౌరవమే లభించింది. అయినా టిక్కెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడడంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లే రాజకీయాలలో వీరు విలువలు పాటించలేదన్న అభిప్రాయానికి తావిచ్చారు.

ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌ వీటిని ఏమీ పట్టించుకోకుండా, కేవలం జనాన్ని నమ్ముకుని రాజకీయాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దులు ఎవరన్నదానికి కొంతమేరకే ప్రాముఖ్యత ఉంటుందనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనిపిస్తుంది. కాబట్టి సీఎం జగన్‌కు ఎవరూ ఎదురు చెప్పలేకపోతున్నారనిపిస్తుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేనల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌ ఇంతవరకు టిక్కెట్ల కేటాయింపు ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం తన పద్దతి ప్రకారం అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకత అని చెప్పాలి.


-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement