చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా! | Ksr Comments On Chandrababu Following The Volunteer System | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు దెబ్బేసిన ఎల్లో మీడియా!

Published Tue, Apr 2 2024 1:48 PM | Last Updated on Tue, Apr 2 2024 2:56 PM

Ksr Comments On Chandrababu Following The Volunteer System - Sakshi

ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు టీడీపీని ముంచేశారు. వారిద్దరూ కలిసి ఏపీలో వేళ్లూనుకున్న వలంటీర్ల వ్యవస్థపై విషం కక్కుతూ రాసిన రాతలన్నీ నిజమేనని భ్రమపడి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విలవిలలాడుతున్నారు. ఆయనకు తత్వం బోధపడేసరికి టైమ్ ముగిసిపోయింది. జరగవలసిన డామేజీ జరిగిపోయింది. అందుకే రామోజీ, రాధాకృష్ణలు స్వరం మార్చి తాము చేసిన తప్పును వైఎస్సార్‌సీపీపై నెట్టేస్తూ పూర్తిగా దొరికిపోయారు. వలంటీర్లు పెన్షన్లు తీసుకునే వృద్దుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ డబ్బు ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే తమ పన్నాగం ఫలించిందని వారు చంకలు గుద్దుకున్నారు. కొద్ది గంటలలోనే తాము ఎంత బ్లండర్ చేసింది అర్ధం చేసుకుని దానిని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను టీడీపీ ఏజెంట్‌గా మార్చుకుని, ఆయన ద్వారా అకృత్యాలు చేయిస్తూ ఏపీ ప్రజలను పీడించడమే టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు పనిగా పెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఆయన ద్వారా హైకోర్టులో వలంటీర్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం, అది చాలదన్నట్లు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం వంటివి చేయించారు. అంతేకాక బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక, కేంద్రంలో ఎవరి ద్వారానో ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన నిర్ణయాలను టీడీపీ తెప్పించుకుంటోందన్న అభిప్రాయం ఏర్పడింది. ఈ క్రమంలో వలంటీర్లు ఈ మూడు నెలలు తమ సేవలు అందించరాదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.

ఎన్నికల సంఘం అయినా ఇందులో ఉన్న మతలబు ఏమిటి? వృద్దులకు అందుతున్న సదుపాయం రద్దు చేయడం వల్ల వారు పడే బాధలు ఏమిటి? అన్నవి ఆలోచించకుండా టీడీపీ ఏజెంట్ కోరిందే తడవుగా ఆదేశాలు ఇచ్చేసింది. నిజానికి మానవత్వం ఉన్నవారెవరూ ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదు. అసలు అలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు. ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు కదా! ఇది ఎప్పటి నుంచో అమలు చేస్తున్న విధానం అయినా ఎన్నికల కమిషన్ వలంటీర్ల సేవలు అందకుండా చేసిందంటే రాజకీయ కుట్ర కూడా ఉండవచ్చన్న భావన కలుగుతుంది. వలంటీర్లు పెన్షనర్‌లను కలిసి డబ్బు ఇస్తేనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారనుకుంటే, ఇప్పుడు మాత్రం వేయకుండా ఉంటారా? టీడీపీ కుట్ర చేసి పెన్షన్లు తమ ఇంటికి రాకుండా ఆపిందని వారు తెలుసుకోకుండా ఉంటారా? ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబును వారు బండబూతులు తిడుతున్నారు. ఎవరైనా టీవీవారు దీని గురించి ప్రశ్నిస్తే టీడీపీపై విరుచుకుపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తమను మళ్లీ ఆఫీస్‌ల చుట్టూ తిప్పుతారా అని నిలదీస్తున్నారు.

దీంతో.. పరిస్థితి అర్ధం చేసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే యుటర్న్ తీసుకుని పెన్షన్ దారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ఆ రాసేదేదో ఎన్నికల సంఘానికి రాసి, వలంటీర్ల ద్వారానే పెన్షన్‌లు ఇళ్లకు పంపిణీ చేయాలని రాసి ఉంటే కాస్త గౌరవం అయినా మిగిలేది. కానీ అన్నిటిలోను డబుల్ స్టాండర్స్ పాటించే చంద్రబాబు ఇందులో కూడా ఆ ధోరణిలోనే వెళ్లారు. వలంటీర్లను గతంలో తిట్టింది ఆయనే. ఆయనకు తోడు పవన్ కల్యాణ్. మళ్లీ ఇద్దరూ యు టర్న్ తీసుకుని వలంటీర్లకు అనుకూలంగా మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక బినామీ సంస్థను స్థాపించి వలంటీర్లకు, ఇతరత్రా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం, కోర్టులలో, ఇతర వ్యవస్థలలో లిటిగేషన్ పెట్టించడం చేశారు.

అందులో భాగంగానే ఈ వలంటీర్ల వ్యవస్థపై ఫిర్యాదులు అని చెప్పాలి. ఆ ఫిర్యాదుల ఫలితం తెలుగుదేశం మెడకే చుట్టుకుంటోందన్న విషయం తెలుసుకుని అంతే స్పీడ్‌గా రామోజీ, రాధాకృష్ణలు యుటర్న్ తీసుకుని చంద్రబాబును రక్షించడం కోసం కొత్త కథనాలు అల్లారు. వైఎస్సార్‌సీపీవారే పెన్షన్‌లను ఇళ్ల వద్ద ఇవ్వకుండా అడ్డుకున్నారని వీరు అడ్డగోలు కథనాలు రాశారు. వృద్దులు గ్రామ, వార్డు సచివాలయాలలో పెన్షన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే, అమ్మో వారిని ఎండలో తిప్పుతారా అంటూ వారిపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ బానర్ కథనాలు ఇచ్చేశారు. దీనిని బట్టే వారు ఎంత భయపడింది అర్దం అవుతుంది. తాము అతి తెలివితో వలంటీర్ల వ్యవస్థపై బురదచల్లి చంద్రబాబుకు ఏదో మేలు చేశామని వారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయి టీడీపీకి ఉరితాడుగా మారడంతో మళ్లీ మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి యత్నించారు.

గ్రామ, వార్డు సచివాలయాలలో 1.35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారిని పెన్షనర్ల ఇళ్లకు పంపించి డబ్బు ఇప్పించవచ్చని ఈనాడు, ఆంధ్రజ్యోతి కలిసి కథనాలు వండాయి. బహుశా ఈ నాలుగేళ్లలో గ్రామ,వార్డు సచివాలయాలలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని రామోజీ, రాధాకృష్ణ అంగీకరించారు. 'చిత్రమేమిటంటే..

  • వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లి డబ్బు ఇస్తే ఎన్నికలను ప్రభావితం చేసినట్లటా!
  • అదే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు వృద్దుల ఇళ్లకు వెళ్ళి డబ్బు ఇస్తే అది ఎన్నికలను ప్రభావితం చేయడం కాదట.

ఇవేమి పిచ్చి రాతలు, ఈ సచివాలయాల ఉద్యోగులు సైతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టైమ్‌లో వచ్చినవారే కదా! వీరు వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అనికాక, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని చెబుతారా? వలంటీర్లను నిలుపుదల చేయడంతో వృద్దులంతా టీడీపీని బండబూతులు తిడుతుండడంతో భయపడి రామోజీ, రాధాకృష్ణలు ఏమి చేయాలో దిక్కుతోచక ఇలాంటి కథనాలు రాసి వైఎస్సార్‌సీపీపై పడి ఏడ్చారు.

పైగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బాధ్యతలు వేరుగా ఉంటాయి. ఒకవేళ వీరు కోరుకున్నట్లు వృద్దుల ఇళ్ల వద్దకు వీళ్లను పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే అప్పుడు మళ్లీ ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి దానిని కూడా విమర్శిస్తూ డబ్బును వృద్దుల చేతికి ఇస్తున్నారని, ఇదంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర అని రాసి ఉండేవి. గతంలో టీచర్లను స్కూళ్ల బాగు చేతకు సంబంధించిన విధులలో పెడితేనే, వారిని అలా వాడతారా? ఇలా వాడతారా? అంటూ ఇదే మీడియా నానా యాగి చేసింది. సచివాలయ ఉద్యోగులను మాత్రం ఇప్పటికిప్పుడు వారికి సంబంధం లేని డ్యూటికీ వేయాలట. అంతా రామోజీ ఇష్టం అన్నమాట! ఎన్నికల సంఘం పవిత్రతపైన బురద చల్లేలా వైఎస్సార్‌సీపీ ఏదో చేసింది అంటూ ఆ వ్యవస్థపై ఏదో తెలుగుదేశంకు అంత గొప్ప అభిప్రాయం ఉన్నట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోకపోతే, అదే సంస్థను ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగ తిట్టిపోసేవి. జగన్‌మోహన్‌రెడ్డి వారిని మేనేజ్ చేసేశారని ఏకిపారేసేవారు.

'2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముఖ్య అధికారి గోపాలకృష్ణ కార్యాలయానికి వెళ్లి ఎంత రచ్చ చేశారో గుర్తు లేదా?' అప్పుడు మాత్రం ఎన్నికల సంఘం పవిత్రమైనదని ఈనాడు రాయలేదే! బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఎన్నికల కమిషన్‌ను కేంద్రం ద్వారా ప్రభావితం చేయడానికే అన్న సంగతి బహిరంగ రహస్యమే.

  • ఎన్నికలు 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకొండున ఎందుకు జరిగాయి.
  • ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఎన్నికలు మే పదమూడు వరకు ఎందుకు వెళ్లాయి?
  • ఇందులో మేనేజ్‌మెంట్ లేదని ఎవరైనా అనుకుంటారా?
  • అందులోను చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ వంటివారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో తెలియదా!
  • లేకుంటే వారికి కావల్సినట్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎలా ఇస్తుంది?
  • కనీసం ఏపీ ప్రభుత్వ అభిప్రాయం అయినా తీసుకుందా?
  • కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్‌కు ఈ వ్యవహారంలో బాద్యత లేదట!
  • ఎన్నికల కమిషన్‌ ఫిర్యాదు చేసి, దారుణమైన ఆదేశాలు తెప్పించిన రమేష్ ఉత్తముడట!
  • ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించిన ఏపీ ప్రభుత్వ అధికారులు చెడ్డవారట.
  • వలంటీర్ల వ్యవస్తపై నీచమైన విమర్శలు చేస్తూ పలు కదనాలు రాసిన రామోజీ గొప్పవాడట.
  • ఆ విమర్శలను సమర్దించిన చంద్రబాబు,పవన్‌లు గొప్ప నాయకులట.
    అంత గొప్పగా ఫీల్ అయితే వలంటీర్ల పై ఆంక్షలు పెట్టిన కొద్ది గంటలలోనే చంద్రబాబు కానీ, ఈ మీడియా సంస్థలు కానీ తమకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకుని వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు. రామోజీ, రాధాకృష్ణలు తనకు ఎంత డామేజీ చేశారో చంద్రబాబుకు అర్దం అయ్యే ఉంటుంది. కానీ ఆయన నిస్సహాయుడిగా మిగిలారు. వారి చేతిలో ఒక బందీగా ఉండి, వారు చెప్పినట్లు ఆడే పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే తప్పుడు వార్తలు, అబద్దాలనే మహా ప్రసాదంగా భావించి చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలేసరికి లబోదిబో అంటున్నారు.

ఇంటింటికి పంపీణీ సులువేనని టీడీపీవారు కానీ, 'ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ కొత్త రాగం ఎందుకు అందుకున్నారో ప్రజలు అర్ధం చేసుకోలేరా? ఇంటింటికి పెన్షన్ ఇచ్చేటప్పుడు వలంటీర్లు అయితేనేమి? గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అయితేమి?' ఈ మాత్రం ఇంగితం లేకుండా వలంటీర్లపై విషం కక్కిన ఎల్లో మీడియా, తాము చేసిన దిక్కుమాలిన చర్యవల్ల, తాము జాకీలేసి లేపుతున్న తెలుగుదేశంకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్ధం అయిందని అనుకోవాలి. కొన్నిచోట్ల వలంటీర్లు టీడీపీ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నారు. ఒక్క మచిలీపట్నంలోనే 1227 మంది వలంటీర్లు రాజీనామా చేశారట. ఇదంతా టీడీపీకి తల బొప్పి కట్టించేదే. అసలే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు ప్రచార సభలలో ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.

టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిక్కెట్ ఇస్తారా అని చంద్రబాబు అన్న ఫలితంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకు ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు వృద్దాప్య పెన్షన్లు ఇళ్లకు ఇవ్వకుండా ఆపి పాపం మూటకట్టుకోవడంతో అరవై లక్షలమంది టీడీపీకి, చంద్రబాబుకు శాపనార్ధాలు పెడుతున్నారు. దీని అంతటికి కారణం ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారేనని కూడా ప్రజలకు తెలిసిపోయింది. చంద్రబాబుకు కూడా అవగతమైంది కానీ, ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దెబ్బమీద దెబ్బపడుతుండడంతో ఏపీలో టీడీపీ గెలవడం అసాద్యమన్న భావన సర్వత్రా ఏర్పడడంతో దానిని కవర్ చేయడానికి ఎల్లో మీడియా రకరకాల విన్యాసాలు, యుటర్న్‌లు చేస్తోంది. టీడీపీని ఆకాశానికి జాకీలతో ఎత్తాలని ప్లాన్ చేసిన వారిద్దరూ చివరికి పెద్ద గోతిలో పడేశారు. తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆ గోయినుంచి పైకి లేవడం అంత తేలిక కాదు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement