టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కానీ, ఇతరత్రా ఆయా ప్రాంతాలలో జరిగిన సభలలో కానీ చేసిన వివిధ ప్రసంగాలు తమాషాగా ఉంటున్నాయి. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఏమిటి! ఇలా మాట్లాడుతున్నారు.. అన్న సందేహం అందరిలో కలుగుతోంది. కొన్ని ఉదాహరణలు చూడండి. మగవారు టీడీపీకి ఓటు వేయకపోతే వారికి ఆడవాళ్లు భోజనం పెట్టవద్దని చంద్రబాబు అన్నారు. టీడీపీ గ్రాఫ్ పెరగాలని ఆయన అనడం వరకు అభ్యంతరం లేదు. కానీ గ్రాఫ్ పెరగకపోతే దానికి ప్రజలు బాధ్యులట. అందుకే బగ్గింగ్ మెకానీజం ఏదో ఆయన వద్ద ఉందట. ఎవరి ఇంటిలో ఏమి అనుకుంటున్నది ఆయనకు తెలిసిపోతుందని బెదిరిస్తున్నారు. దేశంలో ఇలాంటి విచిత్రమైన ప్రకటన చేసిన వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరు ఉండరు.
చంద్రబాబు ఇలా పలు ఆణిముత్యాలను తన ప్రసంగాలలో చెబుతున్నారు. వాటిలో మరీ పరువు తక్కువవి అయితే, టీడీపీకి నష్టం కలిగించేవి అయితే ఎల్లో మీడియా జాగ్రత్తగా ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నాయి. ఆయన నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు సరఫరా చేస్తారట. ఎవరైనా మద్యం సేవించవద్దని చెప్పాలా? లేక బాగా తాగండి.. తాను అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ తాగిస్తానని చెబుతారా? పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి హామీలా ఇచ్చేది! ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలందరు తమ పిల్లలను బాగా చదివించాలని చెబుతుంటే, చంద్రబాబేమో పేదలకు మద్యం అందిస్తానంటున్నారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్లన్ని చంద్రబాబు టైమ్ లో వచ్చినవే అయినా, వాటన్నిటిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు అంటగడుతూ దుష్ప్రచారం చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సైకో అని చంద్రబాబు అంటారు. ఆయనేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నిస్తారు. తానేసిన రోడ్డుపై నడుస్తారా? తాను ఇచ్చిన మరుగుదొడ్లను వాడతారా అని ప్రశ్నిస్తారు. తన ప్రచార పిచ్చికి గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్నారన్న విమర్శ ఎప్పటికి ఆయనపై ఉంటుంది. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా కందుకూరులో ఇరుకు రోడ్డుపై మీటింగ్ పెట్టి తొక్కిసలాటకు కారణం అయ్యారు. ఇక్కడ ఎనిమిది మంది మరణించారు. అలాగే గుంటూరు తొక్కిసలాటలో మరో ముగ్గురు చనిపోయారు.
ఇలాంటి ఘటనలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న కార్యక్రమాలలో ఎప్పుడైనా జరిగాయా? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పరిపాలనను ఇంటి వద్దకు తీసుకు వెళితే సైకో అంట. ఈయనేమో ప్రజలను బలిగొంటే వారి ఖర్మ అట. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఈయనకు అండగా ఉండి వారు నిత్యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అబద‍్ధాలు వండి ప్రజల మీద రుద్దుతున్నారు. వాటన్నిటిని ఈయన పట్టుకుని తిరుగుతుంటారు. అలాంటివారిని సైకో అంటారు కానీ, తన మానాన తాను స్కీములు అమలు చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలా సైకో అవుతారు? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఐదేళ్లలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నది వాస్తవం. చంద్రబాబు టైమ్ లో మాదిరి ఉద్యమాలు, ఆందోళనలు దాదాపు లేవు. ప్రజలంతా ఈ స్కీముల ద్వారా లబ్ది పొందుతూ సంతృప్తిగా ఉంటే వీరికి కడుపు మంటగా ఉందని చెప్పాలి.
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈయన కూటమి కట్టారట. జనం చెవిలో పూలు పెట్టుకుని వినాలట. నిజంగానే జనంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అంత వ్యతిరేకత ఉందని నమ్మితే టీడీపీ ఎందుకు ఒంటరిగా పోటీచేయడం లేదు? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆదరణ పొందుతుండడం వల్ల ఆయనను ఓడించలేమన్న భయంతోనే కదా కూటమి కట్టింది. అయినా గెలుపు మీద సందేహాలు ఏర్పడడంతో చంద్రబాబు చెమటోడ్చుతున్నారు. చివరికి కుప్పంలో ఏమవుతుందో అన్న వణుకు ఆయనలో పుట్టింది. అందువల్లే ఒకటికి రెండుసార్లు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నారు. కుప్పంకు విమానాశ్రయమని, కుప్పంలో అది చేస్తా, ఇది చేస్తా అంటూ హామీలు ఇస్తూ గెలిపించాలని తంటాలు పడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీటిని ఎందుకు చేయలేదంటే సమాధానం ఉండదు.
హైదరాబాద్‌కు తానే ఫౌండేషన్ వేశానని, రైతులు పొలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి, మిగులు కరెంటును అమ్ముకోవచ్చని అందరూ ఆశ్చర్యపోయే ప్రకటనలు చేస్తున్నారు. ఏపీలో గంజాయి అధికంగా ఉందని అబద్ధాలు ప్రచారం చేసి రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నోరు జారి వైశ్యుల, కిరాణా షాపులవారి ఆగ్రహానికి గురయ్యారు. రావులపాలెం సభలో మాట్లాడుతూ కిరాణా షాపులలో గంజాయి అమ్మతున్నారని విమర్శించారు. దానిపై షాపుల యజమానులంతా బంద్ పాటించగా, వివిధ ప్రాంతాలలో వైశ్య సంఘాలు తీవ్రంగా నిరసించాయి.
టిప్పర్ డ్రైవర్‌కు వైఎస్సార్‌సీపీ టిక్కెట్ ఇస్తారా అని డ్రైవర్ వృత్తి చేసుకునేవారిని అవమానించారు. ఫలితంగా డ్రైవర్లంతా టీడీపీపై మండిపడుతున్నారు. చంద్రబాబుకు ఏమైంది! ఇలా మాట్లాడుతున్నారు అని జనం విస్తుపోయే పరిస్థితి ఏర్పడింది. కుప్పంకు హంద్రీ-నీవా జలాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకు వచ్చినా ఎద్దేవగా మాట్లాడారు. ప్రస్తుతం కృష్ణా నదిలో నీళ్లు లేకపోతే, కుప్పంకు వచ్చే కాల్వల్లో నీళ్లేవి అని చంద్రబాబు ప్రశ్నించి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. కుప్పం ప్రాంతంలోని చెరువులలో గతంలో ఎన్నడైనా వేసవిలో నీళ్లు ఉండేవా? ఇప్పుడు ఎందుకు ఉన్నాయి. అవి హంద్రీ-నీవా నీళ్లు కాదా? ఏదో ఒక విమర్శ చేయాలి కాబట్టి చేస్తున్నారు.
కుప్పంలో సైతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్కీముల వల్ల కొన్నివేల కోట్ల మేర ప్రజలు లబ్ది పొందారు. సుమారు రెండువేల మందికి ఇళ్ల స్థలాలు వచ్చాయి. ఇళ్లు కట్టుకున్నారు. వీటన్నిటిని కప్పిపుచ్చుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో విద్వంసం అంటూ పడికట్టు డైలాగులు వదలుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి, చేయూత తదితర స్కీముల కింద సాయం చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణలు ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న స్కీములను మూడు రెట్లు అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు? అంటే ప్రజలను మోసం చేయడమే కదా?
సోషల్ మీడియాలో ఒక సామాన్యుడి వ్యాఖ్య చూశాను. 'వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు మూడు లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేసి వారిని ఆదుకున్నారు. చంద్రబాబు టైమ్ లో కూడా రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు కదా! ఆ డబ్బు అంతా అప్పుడు ఏమైపోయింది? వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎలా ఇవ్వగలిగాడు?" అని ప్రశ్నించాడు. దీనికి చంద్రబాబు జవాబు ఇవ్వగలిగితే అప్పుడు ఆయన చెప్పే మాటలకు ఏమైనా విలువ వస్తుంది.
తను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తానని చెబితే జనం విశ్వసిస్తారా? తాను పద్నాలుగేళ్లు గొప్పగా పాలన చేశానని, ప్రత్యేకించి 2014 -2019 మధ్య ఫలానా విధంగా పాలన చేశానని, దానినే మళ్లీ అందిస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఒక వైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను మంచి చేశానని అనుకుంటేనే ఓటు వేయండని ధైర్యంగా అంటుంటే, చంద్రబాబు మాత్రం తన పాలన గురించి చెప్పలేని దైన్య స్థితిలో ఉన్నారన్నది వాస్తవం.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment