రాష్ట్రాన్ని కాపాడుకోవాలి... ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నాం... ప్రజలంతా ఫ్రస్టేషన్‌లో ఉన్నారు... ఇవన్నీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్న డైలాగులు. ఇవన్నీ పాత డైలాగులే అయినా, కొత్తగా చెబుతున్నట్లు కనిపిస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటైనా నిజమేనా అన్నదానికి సమాధానం దొరకదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం అంటే ఏమిటి? ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయనే కదా.. చంద్రబాబు సొదగా నిత్యం చెప్పేది. ఇక్కడే ఆయనలో బహురూపి కనిపిస్తాడు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసే పనులన్నీ తాను చేస్తానని అంటారు. కావాలంటే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తానని చెబుతారు. మరి అది రాష్ట్రాన్ని నాశనం చేయడం అవ్వదా అంటే జవాబు దొరకదు. అదేమంటే తాము సంపద సృష్టించి ఖర్చు చేస్తామని చంద్రబాబు ఒక పిచ్చి డైలాగు చెబుతారు. అదెలాగో మాత్రం వివరించరు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడితే ఈ నాలుగేళ్లు పూర్తిగా వ్యతిరేకించారు. అనేక నిందలు మోపారు. దానివల్ల రాష్ట్రం నాశనం అయిందని ప్రచారం చేశారు. వలంటీర్లు అంటే ఏమిటి? వారు చేసేది ఏమిటి? మూటలు మోసే ఉద్యోగం. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు ఆడవాళ్లను ఇబ్బంది పెడతారు! అని చంద్రబాబు విమర్శించేసేవారు. ఈయన దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లు ఆడవాళ్లను ట్రాఫికింగ్ చేస్తున్నారని దారుణమైన నీచమైన ఆరోపణ చేశారు. ఇవి విన్నవారికి ఏమినిపిస్తుంది. ఓహో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలన్నీ తొలగిస్తారు కాబోలు అనుకుంటే, అందరిని ఆశ్చర్యపరచే విధంగా ప్రకటన చేశారు.
తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, పైగా ఇప్పుడు ఇస్తున్న గౌరవ వేతనం ఐదువేల రూపాయలను పదివేల రూపాయలు చేస్తామని అంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదువేలు ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్న చంద్రబాబు ఇప్పుడు రెట్టింపు వేతనం ఇచ్చి రాష్ట్రాన్ని కాపాడతానంటే జనం ఎవరైనా నమ్ముతారా! గతంలో 2014లో లక్ష కోట్ల రుణాల మాఫీ చేస్తానని అంటే చంద్రబాబును నమ్మి ఓటేసిన వారిని ఎలా నట్టేట ముంచింది తెలిసిన వారంతా ఆయన ఏదో ఒకటి ఇలాగే చెబుతారులే అని సరిపెట్టుకుంటున్నారు. అసలు విశ్వసనీయతతో నిమిత్తం లేకుండా మాట్లాడడం అంటే ఇది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వృద్దాప్య పెన్షన్‌లను రెండువేల నుంచి మూడువేల రూపాయలకు పెంచితే రాష్ట్రం నాశనం అయినట్లు కదా! ఆ మాట నేరుగా చెప్పకపోయినా, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారనే కదా చంద్రబాబు చెబుతూ వస్తోంది. మరి తాను అధికారంలోకి వస్తే నాలుగువేల రూపాయల పెన్షన్ ఇస్తానని అంటున్నారు. అది బొంకడమా? కాదా? అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి.
తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అలాంటి హామీనే ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. అలాగే చంద్రబాబు కూడా పొరపాటున అధికారంలోకి వస్తే అలాగే చేస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం ఉండదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు చేయూత స్కీమ్ కింద ఏడాదికి 18750 రూపాయలు ఇస్తుంటే రాష్ట్రం పాడైపోతోందని చంద్రబాబు బృందం, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఆయన మీడియా ప్రచారం చేసింది.
చిత్రంగా సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన వాగ్ధానాలలో ప్రతి మహిళకు 1500 ఇస్తానని అంటున్నారు. అప్పుడు రాష్ట్రం పాడవదా? అంటే సమాధానం ఉండదు. అమ్మ ఒడి కింద స్కూల్‌కు వెళ్లే పిల్లల కోసం పదిహేను వేలు ఇస్తానంటే డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారని పరోక్షంగా ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అదే స్కీమ్‌కు తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అక్కడితో ఆగలేదు. సంసారాలు చేసుకునేవారంతా ఎక్కువ మంది పిల్లలను కనాలని ఒక దిక్కుమాలిన సలహా ఇస్తున్నారు.
రైతు భరోసా కింద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 13500 ఇస్తుంటే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నది వీరి మనసులో మాట. కానీ 2024 ఎన్నికలలో రైతులను మోసం చేయడానికి ఏకంగా ఇరవైవేల చొప్పున ఇస్తానని అంటున్నారు. గతంలో రుణమాఫీ చేస్తానని చెప్పి జనాన్ని ఆ తర్వాత ఆశపోతులన్నట్లుగా ఇప్పుడు మాత్రం దూషించరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా అనేది ఆయనే.వలంటీర్ల సేవలను నిమ్మగడ్డ ద్వారా నిలుపుదల చేయించిన తర్వాత లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగాలు చేస్తున్నారు కదా! అని చెప్పింది చంద్రబాబే! ఇవన్నీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఇంతకీ ఏ రకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరికి అర్దం కాదు.
పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేసింది చెప్పరు. తాను ఇన్ని పోర్టులు నిర్మింప చేశానని చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు పోర్టులను నిర్మిస్తున్న ఘనత పొందారు.
అవే కాదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ లాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే కదా! అయినా రాష్ట్రం నాశనం అయిందని అంటారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిని నిర్మించడం, 800 గ్రామాలకు వాటర్ స్కీమ్ అమలు చేయడం రాష్ట్రాన్ని పాడు చేయడమా? లేక తన పద్నాలుగేళ్ల పాలనలో ఆ ఆస్పత్రి నిర్మించని చంద్రబాబు రాష్ట్రాన్ని పాడు చేసినట్లా?
రాజధాని అమరావతి పేరుతో మూడు పంటలు పండే భూములను సమీకరించి పంటలు లేకుండా చేసిన చంద్రబాబు విధ్వంసానికి పాల్పడినట్లా? కాదా! అన్ని హంగులు ఉన్న విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేయడం ద్వారా లక్ష కోట్లు ఆదా చేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పు చేసినట్లా!ప్రతిదానికి ఒక సినిమా డైలాగు మాదిరి చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించాలని అనుకుంటే ప్రజలు పిచ్చివాళ్లు కాదు.
విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్‌ను నిర్మించడం ద్వారా వేలాది మందిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రక్షిస్తే రాష్ట్రం ఏ రకంగా నాశనం అవుతుంది? మరి అదే పని చంద్రబాబు తన పాలనలో ఎందుకు చేయలేకపోయారు? బడులకు రంగులేస్తే సరిపోతుందా అని అంటారు. మరి తన హయాంలో వాటిని బాగు చేయడానికి ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదో చెప్పరు. ఆస‍్పత్రులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాగు చేస్తే రాష్ట్రం పాడైందట. చంద్రబాబు పట్టించుకోకుండా ఉంటే అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరిగినట్లా?
ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక స్థాయిలో అవసరం లేదని అంటారు. అలాంటప్పుడు తన కొడుకును, మనుమడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదంటే మాత్రం నోరు పెగలదు. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు. ప్రభుత్వ స్కూళ్లలో ఉంటే తప్పని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలను కాపాడతారట.
ముప్పైఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తుంటే రాష్ట్రం పాడైపోయినట్లు.. తన హయాంలో ఒక్క ఇల్లు కట్టకుండా ఉంటే రాష్ట్రాన్ని బాగు చేసినట్లా? పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి నిర్మాణాలు చేస్తుంటే రాష్ట్రం ఎలా నాశనం అవుతుందో తెలియదు.
చంద్రబాబు టరమ్‌లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాకపోయినా, రాష్ట్రాన్ని బాగా అభివృద్ది చేసినట్లు! ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి అడ్డగోలు మీడియాను అడ్డం పెట్టుకుని పడికట్టు డైలాగులు చెబితే సరిపోదు. స్పష్టంగా ఏ రకంగా రాష్ట్రం నష్టపోతోంది చెప్పి, ఆ తర్వాత తాను ఏమి చేస్తానో చెప్పగలిగితే ఆలోచించవచ్చు. కేవలం ప్రజలను భ్రమలలో పెట్టాలన్న దృష్టితోనే ఇలాంటి మాటలు చెబితే ప్రజలు ఎవరు అభివృద్ది చేసేది, ఎవరు చేయనిది అర్ధం చేసుకోగలరు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment