సీఎం జగన్‌ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్‌’పై అనుమానాలెన్నో! | Ksr Comments On Tdp, Eenadu And Andhra Jyoti News On The Attack On YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ హత్యకు పెద్ద కుట్ర.. ‘ఎల్లో బ్యాచ్‌’పై అనుమానాలెన్నో!

Published Fri, Apr 19 2024 11:49 AM | Last Updated on Fri, Apr 19 2024 3:08 PM

Ksr Comments On Tdp, Eenadu And Andhra Jyoti News On The Attack On YS Jaganmohan Reddy - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగినప్పుడు తెలుగుదేశం స్పందన, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పిచ్చి రాతలు, నిందితులను పోలీసులు ట్రేస్ చేయడంతో టీడీపీకానీ, వారి మీడియా కానీ మాటలు మార్చిన వైనం చూస్తే కచ్చితంగా ఇందులో ఏదో పెద్ద కుట్రే ఉందన్న అనుమానం వస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అంతా ఒక మాట మీద ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివాటిని ప్రోత్సహించే విధంగా మాట్లాడరాదు. నిందితులకు మద్దతుగా సానుభూతి వచనాలు చెప్పడానికి యత్నించకూడదు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఒక పదునైన రాయి ద్వారా హత్యాయత్నం నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నిటిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ, అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ఎక్కువగా కంగారు పడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఖండన తప్ప ఇతరత్రా స్పందించనవసరం లేని వాటిపై చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తొలుత ఖండన చేసినట్లు కనిపించినా, ఆ తర్వాత నాటకం అంటూ ఆరోపించడం ఆరంభించారు. కానీ పోలీసులు కచ్చితంగా ఇది హత్యాయత్నమేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు.

ఈ ఘటన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని అజిత్ సింగ్ నగర్ వద్ద జరిగింది. ఇక్కడ టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ట్రాక్ రికార్డు అంత సవ్యంగా లేదు. ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్లే ఆయన అనుచరులే ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారని ఇప్పుడు పోలీసుల రిమాండ్‌లోని అంశాలను బట్టి అర్థం అవుతుంది. ఈ రిపోర్టులో ఇంకా కుట్రదారులదాకా వెళ్లలేదు కానీ, భవిష్యత్తులో ఈ కేసులో కుట్రకు పాల్పడింది ఎవరు అన్న దర్యాప్తు జరుగుతుంది. అప్పుడు మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావచ్చు.

ప్రస్తుతానికి ఒక నిందితుడు వేముల సతీష్‌ను పోలీసులు పట్టుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. అజిత్ సింగ్ నగర్ వద్ద ఒక స్కూల్‌కు, ఒక దేవాలయానికి మధ్య ఉన్న చెట్ల వద్ద ఎవరికి కనబడకుండా ఈ దాడి చేశారు. పొరపాటున ఆ రాయి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంటికి తగిలి ఉంటే ఏమిటి పరిస్థితి! అంతేకాదు, నవరగంత వద్ద ఆ పదునైన రాయి తగిలి ఉంటే ఇంకెంత ప్రమాదం జరిగేది. అంత పెద్ద గాయం కంటిపైన తగిలితే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, ఎల్లో మీడియా అది కేవలం గులకరాయి దాడిగా అభివర్ణించడం నీచంగా ఉంది. పవన్ కల్యాణ్‌ వంటి రాజకీయ అజ్ఞాని ముఖ్యమంత్రికి వేసిన దండలో వచ్చిన రాయి కావచ్చని పిచ్చి వాదన తెచ్చారు. లోకేష్ వంటి పరిణితిలేని వ్యక్తి ఈ రాయిని తాడేపల్లి పాలెస్ నుంచి వచ్చిందని అహంకారపూరిత, కనీసం ఇంగితం లేని వ్యాఖ్య చేశారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా తొలుత అయితే ఇదంతా పోలీసుల వైఫల్యంగా తేల్చాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయి విసురుతున్నప్పుడు పోలీసులు ఏమి చేస్తున్నారని, వారు ఎందుకు ఆపలేకపోయారని నిలదీస్తూ వార్తలు రాశారు. అప్పటికి వీరికి ఒక నమ్మకం ఉండి ఉండాలి. ఈ రాయి విసిరిన వ్యక్తులను విజయవాడ పోలీసులు ఎప్పటికి పట్టుకోలేరని భావించి ఉండాలి. అందుకే అంత ధైర్యంగా పోలీసులదే వైఫల్యం అన్నట్లు ప్రొజెక్టు చేసే యత్నం చేశారు. చంద్రబాబు తన సహజ శైలిలో దీనిపై కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడి తన లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకున్నారు.

ఇక్కడ కీలకమైన టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. తొలుత ఈ దాడి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా అన్నట్లు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అనుమానితులను, నిందితులను పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం అవుతున్నాయన్న సమాచారం రాగానే మాట మార్చి, అదేదో కావాలని చేసింది కాకపోవచ్చన్నట్లు చెప్పారు. ఆ తర్వాత నిందితుడు అన్నా క్యాంటిన్ ఎత్తివేశారని కోపంతో, తన తల్లికి రోడ్‌షోకు వచ్చినందుకు ఇస్తానన్న 200 రూపాయలు ఇవ్వలేదన్న కోపంతో రాయి విసిరి ఉండవచ్చని బొండా అన్నారు. అక్కడితో ఆగలేదు. ఈ కేసులో కనుక తనను కూడా ఇరికించాలని చూస్తే జూన్ నాలుగు తర్వాత ఆ పోలీసుల సంగతి చూస్తానని బెదిరించారు. ఇది అచ్చం చంద్రబాబు, లోకేష్‌ల నుంచి తర్ఫీదు పొందినట్లే మాట్లాడారు.

వారు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, అధికారులను ,ముఖ్యంగా పోలీసులను బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ స్వరం మార్చింది. బీసీ వర్గానికి చెందినవారిని కేసులో పెడతారా అని అచ్చెన్నాయుడు విమర్శించారు. హత్యాయత్నం ఘటనలలో కులం చూసి కేసు పెట్టాలని కొత్త రాజ్యాంగాన్ని వీరు చెబుతున్నారు. అలాగైతే చంద్రబాబుపై అలిపిరిలో నక్సల్స్ దాడి జరిగినప్పుడు కూడా కులం చూసే కేసులు పెట్టారా? ఇక చంద్రబాబు అయితే ఈ కేసులో బొండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. అసలు కేసు దర్యాప్తే ఒక దశకు రాకుండానే చంద్రబాబుకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? అంటే ఈ హత్యాయత్నం ఎలా జరిగింది? అందులో ఎవరు ఉన్నారు? ఎవరికి సంబంధించినవారో ముందే తెలుసునని అనుకోవాలి.

పోలీసు రిమాండ్ రిపోర్టులో వేముల సతీష్ అనే వ్యక్తి పదునైన రాయి విసిరితే, అందుకు ప్రేరేపించింది మరో వ్యక్తి అని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలపలేదు. ఈ రెండో నిందితుడు బొండా ఉమా అనుచరులలో ఒక ముఖ్యుడన్న ప్రచారం జరుగుతోంది. లేదా బొండా తన పేరును నిందితులు చెబుతారన్న భయం ఏమైనా ఏర్పడిందా?ఇప్పటికే సతీష్ తాను నేరానికి పాల్పడ్డానని అంగీకరించారు. ఆ తర్వాత అందుకు ఎవరు ప్రోద్బలం చేసింది కూడా చెప్పి ఉంటారు. తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం వీరికి పట్టుకుంది. దాంతో వెంటనే పోలీసులను విమర్శించడం ఆరంభించారు. అందుకు ఈనాడు, జ్యోతి వంటి అనైతికంగా మారిన మీడియాను వాడుకున్నారు.

ఒక ముఖ్యమంత్రిపై అంత దాడి జరిగితే, సానుభూతి చూపకపోతే మానే, ఏకంగా నిందితులకు మద్దతు ఇచ్చేలా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వారు మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీలో ఎవరికి సంబంధం లేకపోతే, అసలు ఈ అంశం గురించి వారు ప్రస్తావించవలసిన పనే లేదు. కానీ అందుకు భిన్నంగా అతిగా వ్యవహరించి తెలుగుదేశం నేతలు వారికివారే ఆత్మరక్షణలో పడ్డారనిపిస్తుంది. ఈనాడు మీడియా నిందితులు ఉన్న వడ్డెర కాలనీకి వెళ్లి నిందితుల కుటుంబాలు చాలా బాధలో ఉన్నట్లు, వారిని అరెస్టు చేయడం అన్యాయమన్నట్లు వార్తలు ప్రచారం చేశారు. ఘటన జరిగినప్పుడు పోలీసులు వైఫల్యం అని రాసిన ఈ మీడియా ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకోవడాన్ని తప్పు పడుతోంది. నిందితుడు రాళ్ళు విసరడంలో నేర్పరి అయి ఉండాలి. లేకుంటే ముఖ్యమంత్రి కంటిపై భాగానికి తగిలేలా ఎలా వేయగలుగుతారు? ఇతనికి సహకరించినవారిని కూడా పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో తన పేరు ఎక్కడ వస్తుందోనని బోండా ఉమ అజ్ఞాతంలోకి వెళ్లినటట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఎల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలీసులను బెదిరించారు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అతనికి అనుకూలంగా వాదించడానికి లాయర్లు వచ్చారు. రోజుకు 250 రూపాయలు సంపాదించుకునే కుటుంబానికి ఇంత పెద్ద లాయర్లను పెట్టుకునే శక్తి ఎక్కడ నుంచి వస్తుందన్నది ప్రశ్న. ఇక్కడ కూడా సరిగ్గా చంద్రబాబు పై వచ్చిన కేసుల్లో వాదించిన రీతిలోనే ఈ లాయర్లు వాదన చేసినట్లు అనిపిస్తుంది.

గతంలో చంద్రబాబుకు ఐటి నోటీసులు వస్తే, ఫలానా ఆఫీస్‌కు జ్యురిస్ డిక్షన్ లేదని సమాధానం ఇచ్చారు. స్కిల్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదించారు. ఇప్పుడు వేముల సతీష్ మైనర్ అని చెప్పడానికి ఆయన లాయర్లు యత్నించారు. కానీ పోలీసులు పకడ్బందిగా అతనికి పందొమ్మిదేళ్లని నిరూపించారు. తదుపరి సతీష్ రాయి వేయలేదన్న వాదనకు వెళ్లారు. సీఎంకు వేసిన దండ కర్ర గీసుకుని ఉండవచ్చని వాదించినట్లు అతని తరపు లాయర్ చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా గాయం అయిన సంగతిని విస్మరించారేమో తెలియదు. దండ కర్ర గీసుకుంటే ఒకరికే గాయం అవుతుంది కానీ, ఇద్దరికి అవ్వదు కదా! ఈ లాజిక్ మిస్ అయి మాట్లాడినట్లు అనిపిస్తుంది.

మరో సంగతి చెప్పాలి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుడు అప్రూవర్‌గా మారడంతోనే అతనికి బెయిల్ వచ్చేసింది. కానీ ఆ కేసు కుట్రదారులన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి మాత్రం నెలల తరబడి బెయిల్ రావడం లేదు. ఈ కేసుతో ముఖ్యమంత్రి పై జరిగిన హత్యాయత్నం కేసును పోల్చి చూస్తే, రాయి విసిరిన వ్యక్తి సంగతి ఎలా ఉన్నా, వెనుక ఉన్న కుట్రదారులకు కీలక పాత్ర ఉంటుందన్నమాట. కుట్రదారులను పట్టుకుని జైలులో పెట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రముఖ నేతలపై జరిగిన హత్యాయత్నం, దాడుల కేసుల్లో నిందితుల తరపున వాదించడానికి లాయర్లు సుముఖంగా ఉండేవారు కారు. కానీ ఇక్కడ సతీష్ రిమాండ్ సమయంలోనే లాయర్లు రావడం విశేషం.

మామూలుగా అయితే పోలీసులు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగానే రిపోర్టు చూసుకుని న్యాయమూర్తి రిమాండ్‌కు పంపిస్తుంటారు. కానీ అతని తరపు లాయర్లు రావడంతో వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామం చూసిన తర్వాత, అతని ఆర్దిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, నిందితుడిని కాపాడడానికి పెద్దప్రయత్నమే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. దీనికి కారణం ఆ నిందితుడు విచారణలో తమ పేర్లు చెబితే అది సమస్య అవుతుందన్న భయం కావచ్చు. వీటన్నిటిని చూసిన తర్వాత తెలుగుదేశం నేతలుకానీ, ఎల్లో మీడియా కానీ వ్యవహరించిన వైనం అనుమానాస్పదంగా ఉన్నట్లు అర్ధం అవుతుంది. వారు అతిగా స్పందించడం, గులకరాయి దాడి అని పనికిమాలిన రాతలు రాయడం, నిందితుడిని రక్షించే యత్నం చేయడం ఇవన్నీ గుమ్మడి కాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు కనిపించడం లేదూ!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement