
అపుడు పారిపోయారు..ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
ఆది దంపతులు హర్ష్ - మృదు
64 ఏళ్ల అపురూప ప్రేమకథ
ప్రేమ, పెళ్లి అనేవి క్షణికమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అదీ మనవరాళ్ల మధ్య. గుజరాత్‌కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువుర్ని ఆకట్టు కుంటోంది. 80 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
1961 నాటి ప్రేమకథ
1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్న ఊసే లేదు. ఇవి ఆచరణాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష్, మృధు మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన యువకుడు హర్ష్, బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ, ప్రేమ లేఖలతో మరింత బలపడింది.
యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చోపచర్చలు, తర్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిలబడ్డాయి ఇరుకుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ వీటి రెండింటి మధ్యా ప్రేమనే ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ ఇంటినుంచి పారిపోయారు.
హర్ష్ -మృదు వివాహం
కలిసిన ఈ రెండు హృదయాలకు..ఒకరికొకరే తోడు నీడు తప్ప మరెవ్వరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు, పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష్ మృదు పిల్లలు మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా వారి మదిలి మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా, కనీవిని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంట తడిపెట్టించింది.
సాధారణ 10 రూపాయల చీరలో భర్తచేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇపుడు గుజరాతీ సాంప్రదాయంలో ఘర్చోలా చీర, గోరింటాకు, నగలతో అందంగా ముస్తాబైంది. ఆరు దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు , కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి.
చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
నిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు; జీవిత పయనంలో వచ్చే ప్రతీ సవాల్‌ను స్వీకరించడం, అంతే బలంగా దాన్నుంచి బయటపడటం. ఓరిమితో , ఒకరికొరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసి రాజన్నారో, ఆ అవగాహనను, చైతన్యాన్ని తమబిడ్డల్లో కలిగించడం. ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతాయుష్షు అంటూ దీవించారు పెళ్లి కొచ్చిన అతిథులంతా.
చదవండి: కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది!