
పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దిగజారుడు రాజకీయాలకు తెర లేపారు. వేసవిలో ప్రజలకు దాహం తీర్చేందుకు చలివేంద్రం పెట్టిన వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు.
సాక్షి, కృష్ణాజిల్లా: పెనమలూరులో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దిగజారుడు రాజకీయాలకు తెర లేపారు. వేసవిలో ప్రజలకు దాహం తీర్చేందుకు చలివేంద్రం పెట్టిన వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. నాలుగు రోజుల క్రితం యనమలకుదురులో అభయ హస్త సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు.
చలివేంద్రాన్ని పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ప్రారంభించారు. వైఎస్సార్‌షీపీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడంతో బోడే ప్రసాద్ కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే బోడే ఆదేశాలతో చలివేంద్రం తీసేవేయించాలని మున్సిపల్ కమిషనర్‌కు టీడీపీ నాయకుడు వీరంకి కుటుంబరావు ఫిర్యాదు చేశారు.

కమిషనర్ సమక్షంలోనే అక్రమంగా క్రేన్‌తో చలివేంద్రం తొలగించారు. చలివేంద్రం నిర్వాహకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చలివేంద్రం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆరేపల్లి ఈశ్వర్ రావును కాలర్ పట్టుకుని మరీ బయటికి లాగి పడేసిన పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.