సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విపక్ష కూటమిలో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా ఓ పార్టీకి టికెట్ వెళ్లడంతో మిగిలిన పార్టీల్లోని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో బహిరంగంగా ఆందోళనకు, విమర్శలకు దిగుతున్నారు.
తాజాగా పెనమలూరు టీడీపీలో ముసలం రాజుకుంది. బొడే ప్రసాద్‌కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు(వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడే ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఫైర్ అయ్యారు.
చంద్రబాబు,లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తమ తండ్రి ఓటమికి పార్టీనే కారణమని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే తన తండ్రికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారన్నారు. మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అయినా 2014, 2019 లోనూ టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు.
చదవండి: చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం
ఈసారి టికెట్ ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారని.. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. బోడే ప్రసాద్‌కే ఏవిధంగా సీటిస్తారని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్క్ చేసుకునేది తామైతే.. టిక్కెట్లు లాబీయిస్టులకిస్తారా అని మండిపడ్డారు. ఈసారి తమకు టికెట్ ఇవ్వాలని రెండేళ్లుగా అడుగుతున్నామని.. మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ అనేక మార్లు టిక్కెట్ కోసం అడిగామన్నారు.
‘టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేశాం. లోకేష్‌కు వాట్సాప్‌లలో మెసేజ్‌లు పెట్టాం. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. మా మెసెజ్‌లకు సమాధానం ఇవ్వం లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ మేం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం. టికెట్ లేదంటే బోడే ఏడ్చాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. మేం బోడేలా చేయలేదు కదా. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా?
బోడే ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టికెట్‌లు ఇస్తారా? నా వెనుక ఎవరూ లేరనేగా ఆడిపిల్లనైన నన్ను ఏడిపిస్తున్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మేం చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విలువలేని పార్టీకోసం మేం ఎందుకు పనిచేయాలి?. చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని దేవినేని స్మీత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment