
తిరువూరు టీడీపీలో కమీషన్ల పంచాయతీ రచ్చ రచ్చగా మారింది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా వాటాల్లో లెక్కలు బట్టబయలయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కమీషన్ల పంచాయితీ సాగుతోంది.
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో కమీషన్ల పంచాయతీ రచ్చ రచ్చగా మారింది. ఇసుక, మట్టి, మద్యం అక్రమ రవాణా వాటాల్లో లెక్కలు బట్టబయలయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమీషన్ల పంచాయితీ సాగుతోంది. ఎంపీ కేశినేని చిన్ని కనుసన్నల్లోనే ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా, ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికపూడికి వాటాల్లో తేడా వచ్చింది. దీంతో ఎంపీ కేశినేని చిన్నిని కొలికపూడి పరోక్షంగా టార్గెట్‌గా చేశారు. చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ హడావుడి సృష్టించారు.
ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేస్తున్నారు. గిరిజన మహిళలతో తన ఇంటి ముందు ధర్నా చేయించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. 48 గంటల్లో రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానంటూ కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. తనను కాపాడేందుకు రమేష్‌రెడ్డి ఎంపీ కేశినేని చిన్ని పీఏ కిషోర్‌కు నాలుగు ట్రాక్టర్లు, రూ.50 లక్షల నగదు ఇచ్చాడంటూ కొలికపూడి ఆరోపించారు.
కాగా, కొలికపూడి డ్రామాకు ఎంపీ కేశినేని చిన్ని రివర్స్ డ్రామా నడిపారు. తమకు లోన్లు ఇప్పిస్తామంటే వచ్చామని కొలికపూడి ఇంటి వద్ద ధర్నా చేసిన గిరిజన మహిళలు అన్నారు. లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయలు కూలీకి తమను తీసుకొచ్చారని మహిళలు చెబుతున్నారు. మరో వైపు, తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కొలికపూడిపై ఎంపీ అనుచరుడు రమేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
కొలికపూడికి ఎన్నికల సమయంలో 50 లక్షల ఆర్థిక సహాయం చేశానని.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను రెండు కోట్లు అడిగారని.. మండలంలో కాంట్రాక్టులన్నీ తాననే చేసుకోమన్నారంటూ ఎంపీ అనుచరుడు ఆలవాల రమేష్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్ట్ పనుల్లో 10 శాతం కమిషన్ ఇస్తే చాలన్నారు. నేను రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి నన్ను టార్గెట్ చేశారు. మహిళలను లోన్లు ఇప్పిస్తామని 300 రూపాయల కూలీకి తీసుకొచ్చి ధర్నా చేయించారు’’అని రమేష్‌రెడ్డి ఆరోపించారు.
