వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద తెలుగుదేశం లీడర్లు చేస్తున్న కామెంట్లు, అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. చంద్రబాబు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్దులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్ది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది.
తొలుత చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తాను కూడా వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని ప్రకటించారు.
పైగా 'వలంటీర్లకు ఏభై వేల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అదెలాగో ఎవరికి తెలియదు'. వలంటీర్లకు ఆయన తాయిలాలు వేసే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు ప్లస్ అవుతున్నదన్నదే ఆయన బాధ. టీడీపీ నేతలలో వలంటీర్లు అంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్‌లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమమీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది.
'పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వలంటీర్లలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసిపోలేదన్నట్లు సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు'.
కరోనా కష్టకాలంలో ఏపీలో ప్రజలకు అండగా ఉండి వలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులలో చేర్చి, వారికి చికిత్స జరిగేదాక శ్రద్ద తీసుకున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్త సఫలం అవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరుపారేసుకున్నారు.
ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వలంటీరు వందల మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మంతులయ్యారన్నది వీరి అనుమానం. వలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది.
కులం, ప్రాంతం, పార్టీ.. ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలు అవుతున్నాయి. 'గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా చేస్తే టీడీపీ గబ్బు పట్టిపోయింది'. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసినవారు సైతం ఇప్పుడు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రతిష్టపాలవుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వలంటీర్‌కు పది మంది చొప్పున టీడీపీ వారు మారినా, పాతిక లక్షల మంది వైఎస్సార్‌సీపీకి అనుకూలం అవుతారన్నది వీరి అంచనా. అందుకే వలంటీర్ల వ్యవస్థను అవుననాలో, లేక కాదానలో తేల్చుకోలేక, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి మరింతగా పలచన అవుతున్నారు.
'గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్‌ల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీవారికి గంగవెర్రిలెత్తిస్తుంటుంది'.
'చిత్రం ఏమిటంటే ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్టు అని వ్యాఖ్యానిస్తే, టీడీపీ నేతలు బొజ్జల వంటివారు వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు'. చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నట్లే వీరు కూడా వలంటీర్లను ప్రశంసించక తప్పని స్థితి ఏర్పడింది. 'వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమిస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక వలంటీర్‌ను పెడతానని చెబుతున్నారు.
ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు'. జనం వీటిని నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. వలంటీర్లను తెగతిట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే అన్నిటిలోను యుటర్న్ తీసుకున్నట్లు దీనిలో కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి పాట్లు పడుతున్నారని తెలియడం లేదా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment