
గుంటూరు,సాక్షి: మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. మట్టి మాఫియా వేధింపులతో మనస్తాపం చెంది బ్లేడుతో చేయి కోసుకున్నారు. అప్రమత్తమైన టీడీపీ పార్టీ సిబ్బంది బాబురావును అత్యవసర చికిత్స నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తమ భూముల్ని కబ్జా ప్రయత్నం జరుగుతోందని, మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలి భార్య మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
దాసరి బాబురావు ఆత్మహత్యయత్నంపై ఆమె భార్య దాసరి దాసరి నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ‘మాకు దెందులూరి మండలం చల్ల చింతల పూడిలో పొలం ఉంది. మా పొలంలో జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మేం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులం అని బెదిరిస్తున్నారు. ఇదే విషయం గురించి చింతమనేనితో మా బంధువులు మాట్లాడితే మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. మేం మట్టి మాఫియాని అడ్డుకోడానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. మట్టి మాఫియా గురించి అధికారులు అందరికీ ఫిర్యాదు చేశాం ఎవరూ పట్టించుకోవట్లేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. పైగా మధ్యవర్తులు కలగజేసుకుని రూ.90లక్షలు తీసుకుని, రూ.2కోట్లు తీసుకురమ్మని మని అంటున్నారు. లేదా మీ పొలం మాకు అమ్ముతున్నట్లు సంతకాలు చేయమని బెదిరిస్తున్నారు.
ఆ బెదిరింపులు,ప్రాణభయంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. కనీసం మా ఫిర్యాదు కూడా తీసుకోలేదు. చివరికి ఎస్పీ కార్యాలయానికి కూడా మమల్ని రానివ్వట్లేదు. పోలీసులు మమ్మల్ని మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. మంత్రి లోకేష్‌ను కలిసి మా బాధ చెప్పుకున్నాం. మట్టి మాఫియా చివరకు లోకేష్ మాటను కూడా లెక్క చేయలేదు.
ఇంకా ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని ఉదయం టీడీపీ కార్యాలయానికి వచ్చాం. మట్టి మాఫియా వేధింపులతో మనస్థాపం చెందిన నా భర్త చేయి కోసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.