
ఏలూరు టౌన్: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత మూడు పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తమపై దాడి చేశాడని ఏలూరు త్రీటౌన్ పోలీసులకు శనివారం ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
వివరాల ప్రకారం.. పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన నాగరాజు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వద్ద కారు డ్రైవర్‌గా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని ఏలూరు శివారు సీతారామపురం గ్రామంలోని పద్మావతి కళ్యాణమండపంలో జరుగుతున్న ఓ వివాహానికి కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చింతమనేని... నాగరాజును ఏరా అంటూ బూతులు మాట్లాడుతూ.. అసభ్యకరంగా తిడుతూ అతని తల్లిని సైతం దూషిస్తూ దుర్భాషలాడుతూ.. రాడ్డుతో దాడి చేశారు.
దీంతో, పోలీసు అధికారులు విచారణ చేసి చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన అనుచరులు వట్టి నాగబాబు, కలిదిండి అనిల్ రాజు, మరికొందరిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదులో కోరారు. అలాగే.. ఎమ్మెల్యే చింతమనేని తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేశారని పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన మట్టా ప్రవీణ్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment