రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్‌.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే | TDP MLA who occupied Matham land in Tirupati | Sakshi
Sakshi News home page

రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్‌.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే

Published Thu, Jul 11 2024 5:38 AM | Last Updated on Thu, Jul 11 2024 9:47 AM

తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన హథీరాంజీ మఠానికి చెందిన భూమి

తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన హథీరాంజీ మఠానికి చెందిన భూమి

తిరుపతిలో మఠం భూమిని కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే 

పులివర్తి నాని గ్యాంగ్‌ కబ్జాను అడ్డుకున్న మఠం అధికారులు.. మఠం సిబ్బంది 

బట్టలిప్పి, బంధించిన నాని గ్యాంగ్‌ 

బూతులు తిట్టి.. గోడ కుర్చీ వేయించిన వైనం 

అమరావతి పెద్దలకు వాటా ఉందంటున్న ల్యాండ్‌ మాఫియా 

తిరుపతిలో ప్రకంపనలు రేపిన ‘సాక్షి’ కథనం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గ్యాంగ్‌ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది. అధికారమే అండగా రూ.250 కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని అమాంతం మింగేసింది. నాని అనుచరులు.. అభ్యంతరం చెప్పిన దేవదాయశాఖ సిబ్బంది బట్టలు విప్పి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాబూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నా ‘డోంట్‌ కేర్‌’ అంటూ వారి ఎదుటే.. దేవుడి మాన్యానికి దర్జాగా ప్రహరీ నిర్మించారు. నానీస్‌ గ్యాంగ్‌ అక్రమాలపై ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనం తిరుపతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లోనూ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.  

అప్పనంగా కొట్టేసి.. సొమ్ము చేసుకోవడమే లక్ష్యం.. 
తిరుపతి రూరల్‌ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నంబర్‌ 145, 147/1లో సుమారు 10 ఎకరాల విలువైన దేవుడి మాన్యం భూమిని నాని గ్యాంగ్‌ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం రూ.4 లక్షల వరకూ ఉంది. మొత్తం10 ఎకరాలు బహిరంగ మార్కెట్‌లో రూ.250 కోట్లు పలుకుతోంది. నాని గ్యాంగ్‌ దీన్ని అప్పనంగా కొట్టేసి, అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.250 కోట్లకు స్కెచ్‌ వేశారంటే అధికార పారీ్టలోని ఎవరో ‘ముఖ్య’నేత ప్రమేయం ఉండకుండా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నాకు మూడు.. మీకు ఏడు 
హథీరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాదీనం చేసుకోవడానికి చూస్తున్న ముగ్గురు వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డీల్‌ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి మఠం, ప్రభు­త్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు మూడెకరాలు కేటాయించాలని.. మీరు ఏడెకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. 

అంతటితో ఆగని నాని ఆ తర్వాత ఆ ఏడెకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ ముగ్గురు షాక్‌ అయ్యారు. ‘ఆ ఏడెకరాలకు రూ.25 కోట్లు ఇస్తా.. ఆ నగదును ముగ్గురు పంచుకోండి. దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది’ అని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురూ తెల్లముఖం వేశారని సమాచారం. 

పనులు ప్రారంభం 
ఆ పదెకరాలు చుట్టూ జూన్‌ 9న ఉదయం 7 గంటలకు ప్రహరీ గోడ వేయడానికి నానీస్‌ గ్యాంగ్‌ పనులు ప్రారంభించింది. ఈ సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది అందరూ కలిసి జూన్‌ 10న ఆ స్థలం వద్దకెళ్లి ప్రహరీ నిర్మించడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ 100 మందికిపైగా నాని గూండాలు కాపుకాస్తున్నారు. ‘మేమెవరో తెలియదా?, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? మూసుకుని వెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగారు. 

అయితే మఠం అధికారులు పనులు ఆపాల్సిందేనంటూ గట్టిగా వాదించారు. దీంతో కోపోద్రిక్తులయిన టీడీపీ గూండాలు మఠం సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించుకున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీయించారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ప్రాణ భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు కాళ్లా వేళ్లా పడి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి మఠం కార్యాలయానికి చేరుకున్నారు. 

అనంతరం మఠం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చంద్రగిరి డీఎస్పీ జూన్‌ 11న నాని గ్యాంగ్‌ను, దేవదాయ శాఖ అధికారులను అక్కడకు పిలిపించుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌లో సైతం గ్యాంగ్‌ ఓ దశలో అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దేవదాయ అధికారులకు ‘నాని గ్యాంగ్‌’ వారి్నంగ్‌ ఇచి్చనట్లు తెలుస్తోంది. ఎక్కడా ఈ అంశంపై నోరు మెదపవద్దని మండిపడినట్లు సమాచారం. తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి లేదని హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది.  

ఆందోళనకు ప్రజా సంఘాలు సిద్ధం 
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఒక ఆర్యవైశ్య వ్యాపారి రూ.రెండు కోట్లు ఇవ్వనందుకు ఇటీవల రైస్‌మిల్లు మూయించారు. అదే క్రమంలో టీటీడీ కాంట్రాక్టర్‌ నుంచి రెండెకరాలు రాయించుకున్నారు. ఇప్పుడు రూ.250 కోట్ల విలువైన పదెకరాల మఠం భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

ఆ భూమి హథీరాంజీ మఠందే.. 
తిరుపతి రూరల్‌ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి హథీరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన మఠం సిబ్బందిని వంద మంది గూండాలతో రూమ్‌లో బంధించి, బట్టలూడదీసి.. నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఈ భూకబ్జాలో ల్యాండ్‌ మాఫియా పాత్ర ఉంది.  
– రమేష్‌ నాయుడు, హథీరాంజీ మఠం పరిపాలనాధికారి 

భూములను సంరక్షించాలి.. 
చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న హథీరాంజీ మఠం, పరకాల మఠం, దేవదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలి. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి.. నానా బూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. 
– కందారపు మురళి, సీపీఎం నేత  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement