endowment department
-
AP: వివాదాస్పదమైన దేవాదాయ కమిషనర్ నియామకం
సాక్షి,విజయవాడ: దేవాదాయ శాఖ కమిషనర్ నియమాకం వివాదాస్పదమైంది. దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్‌గా కూటమి ప్రభుత్వం తాజాగా రామచంద్రమోహన్‌కి బాధ్యతలు అప్పగించింది. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్‌కి కమిషనర్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నాన్ ఐఏఎస్ అధికారికి దేవాదాయశాఖ కమిషనర్‌గా బాధ్యతలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ అధికారిని కాదని రామచంద్రమోహన్‌కి బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖలో ఏడీసీ 1 గా ఉన్న అధికారిని పక్కనపెట్టి రామచంద్రమోహన్‌కి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడమేంటని ఇతర అధికారులు చర్చించుకుంటున్నారు.తీవ్రమైన అవినీతి ఆరోపణలు,కేసులు ఉన్న రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవోగా కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకే వ్యక్తికి ఇన్ని బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది.సామాజికవర్గం ఎఫెక్ట్‌తోనే రామచంద్రమోమన్కి కీలక పోస్టు దక్కిందన్న మరో ప్రచారం కూడా జరుగుతోంది. -
ఏపీ దేవాదాయ శాఖలో భారీ బదిలీలు
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుమారు 15 మంది డిప్యూటీ కమీషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.విజయవాడ కనకదుర్గ ఆలయపు డీసీ ఎం రత్నరాజును డిప్యూటీ ఈవోగా నియమించారు. అలాగే మహానందీశ్వర స్వామి దేవస్థానం డీసీ శోభారాణికి.. ఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న విజయ రాజును కర్నూల్ ఉరుకుండ నరసింహ ఎర్రన్న స్వామివారి దేవస్థానానికి డీసీ & ఈవోగా నియమించారు.శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం డీసీ, ఈవో డీవీఎల్ రమేష్ బాబును కాకినాడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. ఈ మేరకు మొత్తం 15 మందికి పోస్టింగ్‌లతో పాటు బదిలీలు జారీస్తూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ సత్యనారాయణ(ఐఏఎస్) పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదీ చదవండి: దుష్ప్రచారంలో దిట్ట -
ఆ పనులు ఆపండి!
సాక్షి, అమరావతి: కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పాత ఆలయాల పునరుద్ధరణకు కామన్ గుడ్ఫంఢ్ (సీజీఎఫ్), శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా గత ప్రభుత్వం మంజూరు చేసిన పనుల్లో ఇంకా ప్రారంభంకాని వాటన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టాలని సీఎం చంద్రబాబు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదలైన పనులను మాత్రమే పూర్తిచెయ్యాలన్నారు.దేవదాయ శాఖ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీజీఎఫ్ కార్యక్రమంలో పాత ఆలయాల పునరుద్ధరణకు సంబందించి గత ప్రభుత్వంలో మంజూరై ఇంకా మొదలుకాని 243 పనులను సైతం పక్కన పెట్టాలంటూ సీఎం ఆదేశించారు. అలాగే, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద వివిధ ప్రాంతాల్లో తలపెట్టిన 1,797 దేవాలయాల పనులు ప్రారంభం కాలేదని, వాటినీ నిలిపివేయాలని ఆయన చెప్పారు. గతంలో పల్లెల్లో, వాడల్లో శ్రీవాణి ఆలయ నిర్మాణం ట్రస్ట్ ద్వారా రూ.10 లక్షలు ఇచ్చేవారని.. వీటితో ఆలయాల నిర్మాణాలు సాధ్యంకావడంలేదని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో ఈ మొత్తాన్ని పెంచడానికి, ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం సూచించారు. ఆలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదు.. దేవాలయాల్లో అన్యమతస్తులు ఉండకూడదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో స్పష్టంచేశారు. ఏ మతంలో అయినా భక్తుల మనోభావాల ముఖ్యమని.. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేలా దేవాదాయ శాఖాధికారులు పనిచేయాలని సూచించారు. అలాగే, రాష్ట్రంలో ఇకపై ఎక్కడా బలవంతపు మత మారి్పళ్లు ఉండకూడదన్నారు. రూ.20 కోట్లు కంటే ఎక్కువ వార్షికాదాయం ఉండే ఆలయ ట్రస్టు బోర్డుల్లో ప్రస్తుతం 15 మందిని సభ్యులుగా నియమిస్తుండగా, ఆ సంఖ్యను 17కు పెంచే ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. అదనంగా పెంచిన సభ్యుల సంఖ్యలో ఒక బ్రాహ్మణుడు, ఒక నాయీ బ్రాహ్మణునికి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని.. ఈ విషయంలో ప్రణాళికలతో రావాలని సీఎం అధికారులను కోరారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి దేవాదాయ శాఖ, అటవీ శాఖ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయించారు. అర్చకుల వేతనాలు పెంపు.. దేవదాయ శాఖ పరిధిలో పనిచేసే పలువురు అర్చకుల వేతనాల పెంపుపైనా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. » ప్రస్తుతం రూ.10 వేల వేతనంతో పనిచేసే అర్చకులకు ఇకపై రూ.15 వేలు చెల్లించాలని నిర్ణయించారు. » తక్కువ ఆదాయం ఉండే ఆలయాలలో ధూపదీప నైవేద్య పథకం ద్వారా అర్చకులకు అందజేసే మొత్తం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. » అలాగే, వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని సీఎం సూచించారు. » అంతేకాక.. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. » వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి, కృష్ణా నదీ హారతులు మళ్లీ.. గోదావరీ, కృష్ణా నదీ హారతులు మళ్లీ నిర్వహించాలని సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే, ప్రతి దేవాలయంలో ఆన్లైన్ విధానం అమలుచేయాలని, అన్ని సర్విసులు ఆన్లైన్ ద్వారా అందాలన్నారు. అవసరమైతే ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో హోటళ్ల నిర్మాణం చేపట్టి భక్తులకు వసతులు కల్పించాలన్నారు. దేవాలయాలకు విరాళాలిచి్చన వారిని ప్రోత్సహించాలని.. వారి పేర్లు ప్రకటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. -
రూ.250 కోట్ల మఠం భూమి హాంఫట్.. కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని గ్యాంగ్ అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతోంది. అధికారమే అండగా రూ.250 కోట్ల విలువ చేసే దేవుడి మాన్యాన్ని అమాంతం మింగేసింది. నాని అనుచరులు.. అభ్యంతరం చెప్పిన దేవదాయశాఖ సిబ్బంది బట్టలు విప్పి, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నానాబూతులు తిట్టి నిర్బంధించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నా ‘డోంట్ కేర్’ అంటూ వారి ఎదుటే.. దేవుడి మాన్యానికి దర్జాగా ప్రహరీ నిర్మించారు. నానీస్ గ్యాంగ్ అక్రమాలపై ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనం తిరుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లోనూ, దేవదాయ, రెవెన్యూ శాఖ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. అప్పనంగా కొట్టేసి.. సొమ్ము చేసుకోవడమే లక్ష్యం.. తిరుపతి రూరల్ మండలం అవిలాల లెక్క దాఖలాలోని సర్వే నంబర్ 145, 147/1లో సుమారు 10 ఎకరాల విలువైన దేవుడి మాన్యం భూమిని నాని గ్యాంగ్ ఆక్రమించుకుంది. ఇక్కడ అంకణం కనీసం రూ.4 లక్షల వరకూ ఉంది. మొత్తం10 ఎకరాలు బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లు పలుకుతోంది. నాని గ్యాంగ్ దీన్ని అప్పనంగా కొట్టేసి, అమ్మేసి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.250 కోట్లకు స్కెచ్ వేశారంటే అధికార పారీ్టలోని ఎవరో ‘ముఖ్య’నేత ప్రమేయం ఉండకుండా ఉండదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు మూడు.. మీకు ఏడు హథీరాంజీ మఠానికి చెందిన భూమిని స్వాదీనం చేసుకోవడానికి చూస్తున్న ముగ్గురు వ్యక్తులతో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి మఠం, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తనకు మూడెకరాలు కేటాయించాలని.. మీరు ఏడెకరాలు తీసుకోవాలని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగని నాని ఆ తర్వాత ఆ ఏడెకరాలను కూడా తానే కొనుగోలు చేసుకుంటానని చెప్పడంతో ఆ ముగ్గురు షాక్ అయ్యారు. ‘ఆ ఏడెకరాలకు రూ.25 కోట్లు ఇస్తా.. ఆ నగదును ముగ్గురు పంచుకోండి. దీంట్లో అమరావతి పెద్దలకు కూడా వాటా ఉంది’ అని స్పష్టం చేయడంతో చేసేదేమీ లేక ఆ ముగ్గురూ తెల్లముఖం వేశారని సమాచారం. పనులు ప్రారంభం ఆ పదెకరాలు చుట్టూ జూన్ 9న ఉదయం 7 గంటలకు ప్రహరీ గోడ వేయడానికి నానీస్ గ్యాంగ్ పనులు ప్రారంభించింది. ఈ సమాచారం అందుకున్న దేవదాయ శాఖ అధికారులు, మఠం సిబ్బంది అందరూ కలిసి జూన్ 10న ఆ స్థలం వద్దకెళ్లి ప్రహరీ నిర్మించడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ 100 మందికిపైగా నాని గూండాలు కాపుకాస్తున్నారు. ‘మేమెవరో తెలియదా?, ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తారు? మూసుకుని వెళ్లండి’ అంటూ బెదిరింపులకు దిగారు. అయితే మఠం అధికారులు పనులు ఆపాల్సిందేనంటూ గట్టిగా వాదించారు. దీంతో కోపోద్రిక్తులయిన టీడీపీ గూండాలు మఠం సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించుకున్న గదిలోకి తీసుకెళ్లి బట్టలు ఊడదీయించారు. అధికారులతో గోడ కుర్చీ వేయించారు. నోటికొచ్చినట్లు బండ బూతులు తిట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ప్రాణ భయంతో అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు కాళ్లా వేళ్లా పడి బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి మఠం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మఠం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై చంద్రగిరి డీఎస్పీ జూన్ 11న నాని గ్యాంగ్‌ను, దేవదాయ శాఖ అధికారులను అక్కడకు పిలిపించుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం గ్యాంగ్ ఓ దశలో అధికారులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో దేవదాయ అధికారులకు ‘నాని గ్యాంగ్’ వారి్నంగ్ ఇచి్చనట్లు తెలుస్తోంది. ఎక్కడా ఈ అంశంపై నోరు మెదపవద్దని మండిపడినట్లు సమాచారం. తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడానికి లేదని హుకుం జారీచేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకు ప్రజా సంఘాలు సిద్ధం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఒక ఆర్యవైశ్య వ్యాపారి రూ.రెండు కోట్లు ఇవ్వనందుకు ఇటీవల రైస్‌మిల్లు మూయించారు. అదే క్రమంలో టీటీడీ కాంట్రాక్టర్ నుంచి రెండెకరాలు రాయించుకున్నారు. ఇప్పుడు రూ.250 కోట్ల విలువైన పదెకరాల మఠం భూమిని ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.ఆ భూమి హథీరాంజీ మఠందే.. తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో ఆక్రమణకు గురైన భూమి హథీరాంజీ మఠానిదే. మఠానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకునేందుకు వెళ్లిన మఠం సిబ్బందిని వంద మంది గూండాలతో రూమ్‌లో బంధించి, బట్టలూడదీసి.. నానా దుర్భాషలాడుతూ అంతు చూస్తామని బెదిరించారు. ఈ మేరకు తిరుపతి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఈ భూకబ్జాలో ల్యాండ్ మాఫియా పాత్ర ఉంది. – రమేష్ నాయుడు, హథీరాంజీ మఠం పరిపాలనాధికారి భూములను సంరక్షించాలి.. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో ఉన్న హథీరాంజీ మఠం, పరకాల మఠం, దేవదాయ భూములను ప్రభుత్వం సంరక్షించాలి. తిరుపతి నగర నడిబొడ్డున 10 ఎకరాల భూమిని గత నెల నుంచి అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధి కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలిసి అడ్డుకున్న మఠం అధికారులను బట్టలూడదీయించి.. నానా బూతులు తిడుతూ భయకంపితులను చేశారు. ఈ భూముల కబ్జాను తక్షణం ఆపాలని సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నా. – కందారపు మురళి, సీపీఎం నేత -
515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 515 ఆలయాలకు కొత్త ట్రస్టు బోర్డులను నియమించాలని ప్రభుత్వం నియమించింది. పది పదిహేను రోజుల్లో ఈ బోర్డుల ఏర్పాటుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ. 5 లక్షలు, అంతకు పైబడి ఆదాయం ఉండే ఆలయాలు 1,234 వరకు ఉన్నాయి. వీటిలో 678 ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఉన్నాయి. ట్రస్టు బోర్డుల పదవీ కాలం ముగిసిన ఆలయాలు 556 ఉన్నాయి. వీటిలో ట్రస్టు బోర్డుల నియామకానికి ఎలాంటి పాలన పరమైన, న్యాయపరమైన చిక్కులు లేని 515 ఆలయాలకు నూతన ట్రస్టు బోర్డులను నియమిస్తున్నారు. ట్రస్టు బోర్డులో ఆలయం స్థాయినిబట్టి 7 నుంచి 15 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ ట్రస్టు బోర్డుల నియామకం ద్వారా ఐదు వేల మందికి పైనే నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ పదవుల్లో సగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. జనరల్ సహా అన్ని కేటగిరీల్లో 50 శాతం పదవులు మహిళలకే దక్కనున్నాయి. రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉండే ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం నుంచి పూర్తిగా మినహాయించారు. ఈ ఆలయాల వంశ పారంపర్య ధర్మకర్తలు లేదంటే వంశ పారంపర్య అర్చకులు, లేదా çప్రముఖ హిందూ సంస్థలు వాటి నిర్వహణకు ముందుకొస్తే వారికే అప్పగించేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ట్రస్టు బోర్డుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చింది సీఎం జగనే.. ఆలయ ట్రస్టు బోర్డుల్లోనూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ ఇంతకు ముందే ప్రత్యేకంగా దేవదాయ శాఖ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ప్రతి ట్రస్టు బోర్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు, జనరల్ సహా ఆయా రిజర్వు కేటగిరిల్లో సగం పదవులు తప్పనిసరిగా మహిళలకే కేటాయించేలా జగన్ ప్రభుత్వం ఈ చట్టం చేసింది. దీంతోపాటు ఆలయాల కేశ ఖండన శాలల్లో నాయీ బ్రాహ్మణుల సేవలు ప్రముఖంగా ఉంటే ట్రస్టు బోర్డులోనూ ఆ వర్గం వారిని ఒక సభ్యుడిగా నియమించే వీలు కల్పించారు. అదే సమయంలో ట్రస్టు బోర్డు సభ్యుల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని వారి పదవీ కాలం కంటే ముందే తొలగించేలా విస్పష్టంగా చట్టాన్ని సవరించారు. ఈ చట్ట సవరణలు అనంతరం ప్రభుత్వం నియమించిన అన్ని ఆలయ ట్రస్టు బోర్డుల్లో ఇప్పుటి వరకు 4,024 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చోటు దక్కింది. 3,787 మంది మహిళలూ ఆయా ట్రస్టు బోర్డుల్లో భాగస్వాములయ్యారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు నామ మాత్రపు ప్రాధాన్యత కూడ ఉండేది కాదని అధికారవర్గాలు వివరిస్తున్నాయి. -
‘ధూపదీప నైవేద్యం’ ఎలా?
సాక్షి, హైదరాబాద్: గౌరవ భృతి అందని కారణంగా దేవుళ్లకు నైవేద్యం, పేద అర్చకుల పూట గడవటం కష్టంగా మారింది. కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ భృతి బకాయిల కోసం వేడుకుంటున్నా ఫలితం లేదు. దీంతో అర్చకులు నిరసనకు సిద్ధమయ్యారు. మంగళవారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించడం ద్వారా తమ దీనావస్థను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదీ సంగతి: ఆదాయం అంతగా లేక ఆలనాపాలన కష్టంగా మారిన దేవాలయాల్లో నిత్య పూజలకు ఉమ్మడి ఏపీలో డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ‘ధూప దీపనైవేద్య పథకం’ప్రారంభించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దాని పరిధిలో దేవాలయాల సంఖ్యతోపాటు గౌరవ భృతి మొత్తం కూడా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 6000 దేవాలయాలు ప్రస్తుతం దీని పరిధిలో ఉన్నాయి. తొలుత 3500 దేవాలయాలకు మాత్రమే ఉండగా, గతేడాది గోపనపల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మరో 2500 దేవాలయాలను ఇందులో చేర్చనున్నట్టు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆమేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ వాటిని ధూపదీప నైవేద్య పథకంలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గౌరవ భృతి రూ.6500 ఉండగా, దానిని కూడా రూ.10 వేలకు పెంచుతున్నట్టు కేసీఆర్ అప్పడు ప్రకటించారు. కొద్దిరోజులకు ఆమేరకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో గౌరవ భృతి రూ.10 వేలకు పెరిగింది. అప్పటి వరకు రూ.6500 చెల్లిస్తున్న ఆలయాలకు కూడా వర్తింపజేశారు. కొన్ని నెలలు పాత దేవాలయాలకు ఆ మొత్తం చెల్లించారు. కానీ, కొత్తగా చేరిన దేవాలయాలకు మాత్రం ఇప్పటి వరకు వాటి చెల్లింపులు మొదలు కాలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తర్వాత ఇస్తారులే అనుకుంటూ అర్చకులు కాలం గడిపారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరటంతో బకాయిలు సహా వాటి చెల్లింపు ఉంటుందని ఆశపడ్డారు. కానీ, వారి గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. పాత దేవాలయాలకు సంబంధించి నవంబరు నుంచి బకాయిలు పేరుకుపోగా, కొత్తగా చేరిన దేవాలయాలకు ఇప్పటి వరకు అసలే చెల్లించలేదు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి విన్నవించినట్టు ఆర్చకులు చెబుతున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిసి అభ్యర్థించామని పేర్కొంటున్నారు. కానీ, ఆర్థిక శాఖ అధికారులు డబ్బులు విడుదల చేయటం లేదన్న సమాధానం దేవాదాయ శాఖ అధికారుల నుంచి వస్తోందన్నారు. దీంతో విషయాన్ని స్వయంగా సీఎం దృష్టికి తెస్తేనన్నా ఫలితముంటుందన్న ఉద్దేశంతో చలో సచివాలయం కార్యక్రమానికి నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు. -
విప్లవాత్మక సంస్కరణలతో దేవదాయ శాఖలో సువర్ణాధ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ళ పాలనలో దేవదాయ, ధర్మాదాయ శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేవదాయ శాఖలో ఒక సువర్ణాధ్యాయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి ఛాంబరులో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడచిన ఐదేళ్ళ జగన్మోహన్రెడ్డి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సమర్ధవంతంగా జరిగిందని, అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూరిందని అన్నారు. ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శించడం బాధాకరమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక దేవాలయాలను కూల్చేయగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిన్నంటిని పునరుద్ధరించడమే కాకుండా 4500 కొత్త ఆలయాలను నిర్మించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1600 కోట్ల వ్యయంతో ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. శ్రీశైలం దేవాలయంలో భక్తులకు సౌకర్యం కల్పించే దిశగా సాలమండపాలు నిర్మాణాలను త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. విజయవాడలో ఇటీవల జరిగిన మహాలక్ష్మి యజ్ఞం ఫలితంగా కేంద్రం నుంచి నిధులు వరదల్లా పారాయన్నారు. 2018 వరకు 1621 దేవాలయాలకు మాత్రమే ధూపదీప నైవేధ్యాల సౌకర్యం ఉండేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10వేల దేవాలయాల వరకు ధూపదీప నైవేధ్యాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేసే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వార, మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. అర్చక వెల్ఫేర్ బోర్డు, ఆగమ సలహామండలి, అర్చక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేశామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ ద్వారా బుకింగ్ సౌకర్యం కల్పించే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ బుకింగ్ కోసం యాప్‌ను కూడా రూపొందించామన్నారు. దేవాలయాల భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎండోమెంట్ ఆస్తుల లీజు గడువు ముగిశాక ఖాళీ చేసే విధంగా ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఆ చట్టం ప్రకారం వారిని ఖాళీ చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అర్చకులు పనిచేసే దేవాలయాల పరిధిలో వారికి ఇళ్ళ స్థలాలు కేటాయించామన్నారు. అందులో భాగంగా ఇళ్ళు లేని పేద అర్చకులకు ఇళ్ళు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదోన్నతులు కల్పించడమే కాకుండా ఆలయాల నిర్మాణాలలో క్వాలిటీని పెంచేందుకు ఇంజనీర్లను నియమిస్తున్నామన్నారు. ప్రీ ఆడిట్ సిస్టంను అమల్లోకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకుని పలు దేవాయాలకు చెందిన ఉద్యోగులు మంత్రి కొట్టు సత్యనారాయణకు అభినందనలు తెలిపి గజమాలతో సత్కరించారు. -
ఇక గుడి భూములకు పక్కా లెక్క!
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల భూములన్నింటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేస్తోంది. ఆలయం వారీగా ఏ గ్రామంలో, ఏ సర్వే నంబరులో, ఎంతెంత భూమి ఉంది, తదితర వివరాలను పక్కాగా ఆన్లైన్లో నమోదు చేస్తోంది. దీని ద్వారా అన్ని ఆలయాల వివరాలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 24,669 వరకు ఆలయాలు, సత్రాలు, మఠాలు, ట్రస్టులు ఉన్నాయి. వీటి భూముల వివరాలు ఆలయం లేదా సంస్థల వద్ద ‘43 నెంబరు’ రిజిస్టర్ పేరుతో ఉండే ప్రత్యేక రికార్డుల్లో మాత్రమే ఉండేవి. ఇటీవల కొన్ని చోట్ల రికార్డుల్లో భూముల వివరాలను ఉండే పేజీలను ప్రత్యేకంగా స్కాన్ చేసి, వాటిని మాత్రం ఆన్లైన్లో పొందుపరిచారు. దేవదాయ శాఖ కమిషనర్ సహా అధికారులకు ఏదైనా సమాచారం కావాలంటే జిల్లా లేదా ఆలయాల ఈవో నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఏళ్ల తరబడి ఆలస్యం కావడంతోపాటు పారదర్శకత లోపించి, పలు చోట్ల ఆలయాల భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేవుడి భూముల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, శాఖలోని కీలక అధికారులకు ఆలయాల వారీగా భూముల వివరాలన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలా కంప్యూటరీకరణకు చర్యలు చేపట్టింది. గత నెల రోజులుగా ఈవో స్థాయిలో ఆలయాల భూముల వివరాలు ప్రత్యేక ఫార్మాట్లో అన్లైన్లో నమోదు చేశారు. మాగాణి లేదా మెట్ట లేదా కొండ ప్రాంతం లేదా ఖాళీ స్థలం లేదా చెరువు తదితర కేటగిరితో సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఈవో స్థాయిలో నమోదు కార్యక్రమాన్ని నిలిపివేశారు. వీటిలో మార్పులు చేసే అధికారం ఇకపై ఈవోలకు ఉండదు. ఇంకా ఎక్కడన్నా ఏ ఆలయం వివరాలు ఏవైనా మిగిలిపోతే వాటిని నమోదు చేసే అవకాశం దేవదాయ శాఖ జిల్లా అధికారులకు మాత్రమే కల్పించారు. ఈ ప్రక్రియను కూడా ముగించి.. ఆగస్టు మొదటి వారంలో రికార్డులను సరిపోల్చుకునే ప్రక్రియ చేపడతారు. వారం రోజుల్లో దీనిని పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల్లో మార్పులకు వీలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో ఆలయాల భూముల వివరాల్లో మార్పులు చేయాలంటే జిల్లా అధికారులు, ఈవోలు ముందుగా దేవదాయ శాఖ కమిషనర్‌కు స్పష్టమైన కారణాలను తెలియజేసి, ఆయన అనుమతి పొందాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఫార్మాసిటీ కోసం ఆలయ భూములా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్ఐఐసీ గత నవంబర్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు. ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు. ఇతర అవసరాలకు సేకరించవచ్చు... ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. -
హనుమా.. భూమాయ కనుమా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ అధికారులు, పూజారి వారసులు కలిసి ఏకంగా ఆంజనేయస్వామి భూములకే ఎసరు పెట్టారు. పహాణీలు, ధరణిలోని నిషేధిత జాబితాను పక్కన పెట్టి ఏకంగా 34 ఎకరాల దేవాదాయ భూమికి ఓఆర్సీ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి వరకు పలుకుతుండటంతో ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. మాడ్గుల మండలం అర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో 9.18 ఎకరాలు, సర్వే నంబర్ 79/ఎ4లో 20 గుంటలు, సర్వే నంబర్ 283లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 241లో 11.06 ఎకరాల భూమి ఆంజనేయస్వామి దేవాలయం పేరున ఉంది. ఈ భూమికి అప్పటి ఆలయ పూజారి పప్పు లక్ష్మయ్య దంపతులను రక్షిత కాపలాదారుగా నియమించి, ఆ మేరకు రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేశారు. భూమి కౌలు ద్వారా వచ్చి న డబ్బులతో ధూపదీప నైవేద్యాలు సమకూర్చా ల్సి ఉంది. ఆశించినస్థాయిలో కౌలు రాక, ఆలయ నిర్వహణ భారంగా మారి పూజారి లక్ష్మయ్య దంపతులు సుమారు 40 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను గ్రామస్తులే చూసుకుంటున్నారు. పహాణీల్లోనే కాదు ధరణి పోర్టల్లోనూ ఈ భూములు ఆంజనేయస్వామి దేవాలయం పేరునే రికార్డు అయి ఉన్నాయి. గుడ్డిగా ఓఆర్సీ జారీ చేసిన రెవెన్యూ.. తాజాగా ఈ భూమి తనదేనని, ఆయా భూములను తమ పేరున మార్చాల్సిందిగా కోరుతూ ఆలయ పూజారి కుమారుడు ఫైల్ నంబర్ 6820/2022న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన అడిగిందే తడవుగా రెవెన్యూ అధికారులు ఓఆర్సీ జారీ చేశారు. ఈ విషయం తెలిసి ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు సహా దేవాదాయశాఖ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ఈ భూమిపై లావాదేవీలతో పాటు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఓఆర్సీని సైతం నిలిపి వేయాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ సహా గ్రామ పంచాయతీ సభ్యులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నేడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో విచారణ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) తిరుపతిరా>వు ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్సీని నిలిపివేయడంతో పాటు రెవెన్యూ కోర్టుకు ఈ కేసును సిఫార్సు చేశారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం రెవెన్యూ కోర్టులో ఈ అంశంపై ఇటు దేవాదాయశాఖ, అటు పూజారి వారసులు, ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. పరిశీలించకుండానే మ్యుటేషన్! అర్కపల్లి రెవెన్యూ గ్రామానికి ఆనుకునే సర్వే నంబర్ 95/2లో సుమారు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. రైతు ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని స్థానికులకు గుంటల్లో విక్రయించాడు. ప్రస్తుతం ఆ భూమిలో నివాసాలు కూడా వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా రికార్డు చేశారు. ఇప్పటికే విక్రయించ గా మిగిలిన పది గుంటల భూమిని తన పేరున మ్యుటేషన్ చేయాల్సిందిగా సదరు రైతు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కనీస రికార్డులను పరిశీలించకుండా ఏకంగా నివాసాలు వెలిసిన భూమిని సైతం అమ్మిన రైతు పేరున మ్యుటేషన్ చేయడం గమనార్హం. భూ రికార్డుల నిర్వహణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. -
దేవాదాయ శాఖ కొత్త ప్లాన్.. గుడుల్లోకి వెండి తీసుకుని, బంగారం!
సాక్షి, హైదరాబాద్: గుడుల్లో నిరుపయోగంగా పడి ఉన్న వెండికి బదులుగా బంగారం సేకరించి డిపాజిట్ చేయాలని దేవాదాయ శాఖ యోచిస్తోంది. ప్రధాన ఆలయాల్లో ఉపయోగించకుండా ఉన్న వెండి 8 వేల కిలోలుగా లెక్క తేలింది. ఆర్జేసీ కేడర్‌లో ఉన్న యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ దేవాలయాల్లోనే 4 వేల కిలోలున్నట్టు గుర్తించారు. మూల విరాట్టులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరణ, పూజాధికాలకు వాడే వెండి, ఆలయ తాపడాలకు ఉన్నది కాకుండా.. భక్తులు కానుకలుగా హుండీలో వేసిన వెండిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానుకలుగా వచ్చినవాటిలో ఉపయోగించుకునే వస్తువులుగా ఉన్నది పోను, మిగిలిన ముక్కలకు సంబంధించిన నిల్వలపై లెక్కలు తీశారు. మొత్తం 8 వేల కిలోలుగా ఖరారు చేశారు. ఈ వెండిని స్వచ్ఛమైన (ఫైన్ సిల్వర్) వెండిగా మార్చి, దాని విలువకు సమానమైన బంగారాన్ని పొంది, గోల్డ్ డిపాజిట్ పథకం కింద స్టేట్ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 80 కిలోల వెండికి కిలో బంగారం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు భారీగా ఖర్చు వస్తోంది. ఇందుకు ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వెండిని ఆదాయంగా మార్చుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆలయాల్లో వెండిని సేకరించి, ఆయా ఆలయాల వారీగానే దాన్ని కరిగించి బంగారంలోకి మార్పిడి చేయించబోతోంది. కనీసం వంద కిలోల వెండి ఉన్న దేవాలయాలనే ఇందుకు గుర్తించింది. 8 వేల కిలోల వెండిని 995 (అంతకంటే మెరుగైన) ఫైన్ సిల్వర్‌గా మార్చేందుకు చర్లపల్లిలోని మింట్‌తో దేవాదాయశాఖ సంప్రదింపులు జరుపుతోంది. తిరుమల తిరుపతి దేవాలయంతో మింట్‌కు ఇప్పటికే ఒప్పందం ఉంది. అదే పద్ధతిలో తమ దేవాలయాల్లోని వెండిని కూడా కరిగించి, మేలిమిగా మార్చి, దాని విలువకు తగ్గ బంగారు బిస్కెట్లను అందించాలని కోరుతోంది. ఫైన్ వెండిగా మారిస్తే మొత్తం వెండి నిల్వలో 55 శాతం నుంచి 60 శాతం మాత్రమే మేలిమి వెండి ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఆ రోజు మార్కెట్లో ఉన్న మేలిమి వెండి ధర ఆధారంగా, దానికి సమానమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో పొందాలన్నది ఆలోచన. ఈ లెక్కన 80 కిలోల వెండికి కిలో బంగారం సమకూరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గోల్డ్ డిపాజిట్ పథకంతో లబ్ధి.. సమకూరిన బంగారాన్ని స్టేట్ బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ పథకంలో ఉంచనున్నారు. ఇలా చేయటం వల్ల ప్రస్తుతం వెండికి చేయిస్తున్న బీమా ఖర్చు భారం తొలగిపోతుంది. ఇక స్టేట్ బ్యాంకు నుంచి వచ్చిన వడ్డీని దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు వినియోగిస్తారు. -
దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్
సాక్షి, అమరావతి: కుటుంబ సమేతంగా అన్నవరం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలని అనుకుంటున్నవారు ఇంతకు ముందులా ఎక్కువగా హైరానా పడాల్సిన పనిలేదు. 10–15 రోజుల ముందే వ్రతం టికెట్‌ను ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే వారు నెలరోజుల ముందే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలయం వద్ద దేవదాయశాఖ గదులను బుక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో పలు ఆలయాల్లో వివిధ రకాల పూజలు, దర్శన టికెట్లతోపాటు ఆయా ఆలయాల వద్ద నివాసిత గదుల బుకింగ్ వంటివన్నీ ఇప్పుడు ఆన్లైన్ విధానంలోకి తీసుకొచ్చింది. పూజలు, దర్శనం టికెట్లు, వసతి గదులను ఆలయం వద్దకు వెళ్లి మాత్రమే తీసుకోవాల్సిన ఇబ్బందులు తొలిగిపోయాయి. తాము వెళ్లే తేదీని ముందే నిర్ణయించుకున్న భక్తులు ఇంటివద్ద నుంచే ముందుగానే సేవా టికెట్లను, గదులను బుక్ చేసుకోవచ్చు. తమ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటిలో ఈ తరహా సేవలన్నీ ఉమ్మడిగా ఒకచోట ఆన్లైన్లో పొందేందుకు దేవదాయ శాఖ కొత్తగా https://www.aptemples.ap.gov.in వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని ఆలయాల్లో కొన్ని రకాల సేవలకు మాత్రమే దేవదాయశాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్ నిర్వహించగా.. ఇప్పుడు మొదటి దశలో 175 ప్రముఖ ఆలయాలన్నింటిలో అన్ని రకాల సేవలను ఈ కొత్త వెబ్‌పోర్టల్ ద్వారా భక్తులు ముందస్తుగా పొందేందుకు వీలు కల్పించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది, విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి, అంతర్వేది, అరసవెల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి.. మొత్తం 16 ఆలయాల్లో స్వామి సేవలు, దర్శన టికెట్లు, గదుల కేటాయింపు వంటివన్నీ ముందస్తుగానే ఆన్లైన్లో పొందేందుకు అందుబాటులోకి ఉంచింది. అడ్వాన్స్ బుకింగ్ గడువు వివిధ ఆలయాల్లో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 175 పెద్ద ఆలయాల్లో, తర్వాత దశలో ఓ మోస్తరు ఆలయాల్లోనూ ఈ తరహా ముందస్తు ఆన్లైన్ సేవలు ఈ వెబ్‌పోర్టల్ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
ఏపీలో దేవాలయాల భూముల పరిరక్షణకి ప్రత్యేక చర్యలు
-
ఉదయం అర్చకత్వం ఆ తర్వాత కాయకష్టం..
సాక్షి, హైదరాబాద్: అంతగా ఆదాయం లేని చిన్న దేవాలయాల నిర్వహణకు ప్రభుత్వం ప్రారంభించిన ధూపదీపనైవేద్య పథకం గందరగోళంగా మారింది. దేవాల యంలో పూజాదికాలకు కావాల్సిన వస్తువులు(పడితరం) కొనేందుకు రూ.2 వేలు, ఆలయ అర్చకుడి కుటుంబ పోషణకు రూ.4 వేలు.. వెరసి రూ.6 వేలు ప్రతినెలా చెల్లించాల్సి ఉండగా, నిధుల లేమి సాకుతో ఆ మొత్తాన్ని ఆర్థిక శాఖ విడుదల చేయటం లేదు. పెద్ద దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ట్రెజరీ నుంచి వేతనాలు అందుతున్నాయి. ఆ దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని దేవాదాయ శాఖ తీసేసుకుంటోంది. కానీ చిన్న దేవాలయాలకు అంతగా ఆదాయం లేకపోవటంతో ధూప దీప నైవేద్య పథకం నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతేడాది కొన్ని నెలల పాటు వేతనం ఇవ్వక, ఆ దేవాలయాలు, వాటి అర్చకుల కుటుంబాలను ఆగమాగం చేసి న అధికారులు ఆ తర్వాత ఎట్టకేలకు కొద్ది నెలలు సక్రమంగానే విడుదల చేశారు. మళ్లీ డిసెంబరు నుంచి నిధులు విడుదల చేయటం లేదు. నాలుగు నెలలు వరసగా ఆగిపోగా, గత నెల ఒక నెల మొత్తం విడుదల చేశారు. మిగతావి అలాగే పెండింగులో ఉన్నాయి. ఆటో తోలుతున్న ఈ వ్యక్తి పేరు పురాణం దివాకర శర్మ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన స్థానిక శ్రీ వైద్యనాథ స్వామి దేవాలయ అర్చకులు. ధూప దీప నైవేద్య పథకం కింద ఆయన ఈ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. కానీ ఆ పథకం కింద ఇవ్వాల్సిన రూ.6 వేలు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. నాలుగు నెలలుగా స్తంభించిన ఆ మొత్తంలో అతి కష్టమ్మీద ఒక నెల వేతనం మాత్రమే తాజాగా విడుదలైంది. గతేడాది కూడా ఇలాగే కొన్ని నెలలు నిలిచిపోయింది. దీంతో కుటుంబ పోషణ భారం కావడంతో ఉదయం దేవాలయం మూసేసిన తర్వాత ఇదిగో ఇలా అద్దె ఆటో తీసుకుని నడుపుకొంటున్నారు. ఒక్కో సారి రాత్రి దేవాలయం మూసేసిన తర్వాత గ్రామీణులకు కోలాటంలో శిక్షణ ఇస్తూ వారిచ్చిన ఫీజు తీసుకుని రోజులు గడుపుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ హయాంలో పథకం ప్రారంభం మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆదాయం లేని దేవాలయాల్లో నిత్య పూజలకు ఆటంకం కలగొద్దన్న సదాశయంతో 2007లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పట్లో అర్చకులకు గౌరవ వేతనం రూ 1500, పూజా సామగ్రికి రూ.1000 చొప్పున విడుదల చేసేవారు. 1750 దేవాలయాల్లో ఈ పథకం అమలవుతుండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2018లో 3645 ఆలయాలకు విస్తరింపజేస్తూ చెల్లించే మొత్తాన్ని రూ.6 వేలకు పెంచారు. దేవాలయాల సంఖ్య, వేతన మొత్తం పెరిగినా.. నిధుల విడుదల మాత్రం సక్రమంగా లేకపోవడంతో సమస్యలు ఎదురువుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3645 దేవాలయాలకు సంబంధించి ప్రతినెలా రూ. 2,18,70000 మొత్తం విడుదల కావాల్సి ఉండగా, నిధుల సమస్య పేరుతో ఆర్థిక శాఖ ఆ మొత్తాన్ని దేవాదాయ శాఖకు అందించటం లేదు. ఎన్ని ఇబ్బందులో.. ఓ దేవాలయ నిర్వహణకు నెలకు రూ.2 వేల నిధులు ఏమాత్రం సరిపోవటం లేదు. ఇక పూజారి కుటుంబ పోషణకు రూ.4 వేలు కూడా చాలటం లేదు. అయినా సరిపుచ్చుకుందామంటే ఆ నిధులు క్రమం తప్పకుండా అందటం లేదు. ధూపదీపనైవేద్యం అర్చకుల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు. వీరు పూర్తిగా ఆలయంపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్న పేరుతో ఆలయానికి దాతలు అడపాదడపా ఇచ్చే సాయం కూడా ప్రస్తుతం తగ్గిపోయిందనేది అర్చకుల మాట. దీంతో గత్యంతరం లేక చాలా మంది అర్చకులు ఇతర పనులు చేసుకుంటున్నారు. కొందరు ఆటో నడుపుతుంటే, మరికొందరు ఉపాధి హామీ పనులు, ఇతర కూలీ పనులకు వెళ్తున్నారు. కూలీ పనులకు వెళ్తున్నాం ‘‘నేను కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం నాగల్ గావ్ ఆలయంలో ధూపదీపనైవేద్య పథకం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఆ రూపంలో రావాల్సిన గౌరవ వేతనం సరిగా రావటం లేదు. ఆ వచ్చే మొత్తం కూడా కుటుంబ పోషణకు సరిపోక నా భార్యతో కలిసి మిగతా సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు, ఇతరుల పొలాల్లో పనులకు కూలీలుగా వెళ్తున్నాం.’’ – సంగాయప్ప అర్చకుడు నిధులు పెంచాలి, క్రమం తప్పకుండా ఇవ్వాలి ‘‘గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో నిత్య పూజలు చేస్తూ పూజాదికాల్లో ఉంటున్న ధూపదీపనైవేద్య పథకం అర్చకుల పరిస్థితి దారు ణంగా మారింది. ఆ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ ధరల పట్టికను అనుసరించి పెంచాల్సి ఉంది. ఆ మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇవ్వాలి’’ – వాసుదేవ శర్మ,ధూపదీపనైవేద్య పథకం అర్చకుల రాష్ట్ర అధ్యక్షులు -
శ్రీశైలం దేవస్థానానికి 4,500 ఎకరాలు ఇచ్చేందుకు రెడీ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం దేవస్థానానికి చెందిన 4,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు అటవీశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత 50 ఏళ్లుగా ఈ భూమికి సంబంధించిన సమస్య అటవీశాఖకు, దేవస్థానానికి మధ్య పెండింగ్‌లో ఉంది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి చెందిన భూముల వివరాలు పురాతన శాసనం ద్వారా వెలుగులోకి వచ్చాయి. దాని ఆధారంగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ వెంటనే అటవీ, దేవదాయ, రెవెన్యూ శాఖల అధికారులు ఉమ్మడిగా అత్యంత ఆ«ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సర్వే చేయించారు. వారు ఆ 4,500 ఎకరాల భూమి శ్రీశైలం దేవస్థానానికి చెందినదేనని ధ్రువీకరించారు. దీంతో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయంలో శ్రీశైలం దేవస్థానం ఈవో ఎస్.లవన్న, అటవీశాఖ డిప్యుటీ డైరెక్టర్ అలెన్‌చాంగ్‌టెరాన్ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఆ కాపీని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.మధుసూదన్‌రెడ్డి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వై.శ్రీనివాసరెడ్డిలకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖకు భూమిని అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని, ఆ వెంటనే దేవదాయ శాఖకు భూమిని అప్పగిస్తామని అలెన్‌చాంగ్‌టెరాన్ తెలిపారు. -
ఆలయాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణులు..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియామకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసింది. అనాదిగా ఆలయాల వ్యవస్థలో అర్చకులతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉందని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఆలయాల్లో పలు కార్యక్రమాల్లో సేవలందించే తమకు పాలక వర్గాల్లో చోటు కల్పించాలని నాయీ బ్రాహ్మణులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సమయంలో దీనిపై సానుకూల హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నిర్వహించిన బీసీ గర్జన సభలలోనూ దీనిపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ దేవదాయ శాఖ చట్టానికి సవరణ తెచ్చి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 610 ఆలయాలకు త్వరలో నియామకం! హైకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం దేవదాయ శాఖ పరిధిలో ఐదు లక్షలకు పైబడి ఆదాయం సమకూరే ఆలయాల్లో మాత్రమే దేవదాయ శాఖ ట్రస్టు బోర్డులను నియమించే అవకాశం ఉంది. రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలో ఏడాదికి రూ.ఐదు లక్షల పైబడి వార్షికాదాయం ఉన్న ఆలయాలు 1,234 వరకు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ట్రస్టు బోర్డు నియామకాలు పూర్తైన వాటిని మినహాయిస్తే మరో 610 ఆలయాలకు కొద్ది రోజుల్లో కొత్తగా ట్రస్టు బోర్డులను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. వీటిల్లో ప్రతి ఆలయానికి ఒకరి చొప్పున నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉంది. నాడు అవమానం.. నేడు సముచిత స్థానం ఆలయాల ట్రస్టు బోర్డు నియామకాల్లో తమకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ హయాంలో తాము అవమానాలు ఎదుర్కొనగా ఇప్పుడు సముచితం స్థానం దక్కిందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఆలయాల నిర్వహణలో తమకు తగిన స్థానం కల్పించాలని కోరిన నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను అధికారంలో ఉండగా చంద్రబాబు తీవ్రంగా అవమానించారని గుర్తు చేస్తున్నారు. నాడు సచివాలయంలో తనను కలసి సమస్యలు వినిపించిన సంఘాల నేతలనుద్దేశించి ‘తోకలు కత్తిరిస్తా.. ఆలయాల మెట్లు కూడా ఎక్కకుండా చేస్తా’ అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేశ చరిత్రలోనే అరుదు దేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులకు అరుదైన గౌరవం దక్కింది. మా వినతిని ఆలకించి ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని మరో మెట్టు ఎక్కించింది. సీఎం జగన్‌కు నాయీ బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది. – సిద్దవటం యానాదయ్య (ఏపీ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్), గుంటుపల్లి రామదాసు (కేశ ఖండనశాల నాయీ బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుడు) -
మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: మహాశివరాత్రి నేపథ్యంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నింటిలో దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, మహానంది ఆలయాలకు దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు అడిషనల్, రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్కరిని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ కమిషనర్ –1 చంద్రకుమార్‌ను కోటప్పకొండ ఆలయానికి, అడిషనల్ కమిషనర్ –2 రామచంద్రమోహన్ శ్రీకాళహస్తి ఆలయానికి, ఎస్టేట్స్ విభాగం జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్‌ను శ్రీశైల ఆలయానికి, కర్నూలు డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న రాణా ప్రతాప్‌ను మహానంది ఆలయానికి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగిలిన శైవక్షేత్రాలకు సంబంధించి ఆర్జేసీలు ఆయా ఆలయాల వారీగా తమ పరిధిలోని సీనియర్ అధికారులను చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్లుగా నియమించాలని పేర్కొన్నారు. -
మన్నించు తల్లీ..
రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. ఆదివారమైతే ఆ సంఖ్య 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. ఏటా రూ.3 కోట్లకుపైగానే ఆదాయం వస్తుంది. కానీ భక్తులకు సౌకర్యాలు ఉండవు. రెగ్యులర్ ఈఓను నియమించరు. ప్రస్తుతం పాలకవర్గం కూడా లేదు. వెరసి పెద్దమ్మతల్లి అమ్మవారి వద్దకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. సాక్షి, పాల్వంచరూరల్: భక్తుల కొంగుబంగారమైన పెద్దమ్మతల్లి (శ్రీకనకదుర్గ) ఆలయంపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెగ్యులర్ ఈఓను నియమించకపోవడంతో ఇన్చార్జీల పాలనలో కాలం గడుస్తోంది. ఇటీవల కొంతకాలంగా పాలకవర్గం కూడా లేదు. భక్తులకు సరైన సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. రోజూ వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే భక్తులు సౌకర్యాల లేమిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.3 కోట్ల ఆదాయం ఉన్నా.. జిల్లాలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం తర్వాత అధిక ఆదాయం కలిగిన ఆలయంగా పెద్దమ్మ తల్లి గుడి పేరొందింది. భక్తులకు అమ్మే టికెట్లు, కొబ్బరిచిప్పలు, అద్దెలు, తలనీలాలు, హుండీ ద్వారా ఏటా దేవాదాయ శాఖకు సుమారు రూ.3 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. ఇంత ఆదాయం ఉన్నా దేవాదాయ శాఖ, పాలకవర్గాలు భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదు. ఆలయం ప్రాంగణంలో మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన ఆరు బాత్రూమ్లను కూల్చివేశారు. దీంతో భక్తులకు స్నానాల గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులోలేక ఇక్కట్లు పడుతున్నారు. గుడికి ఎదురుగా రోడ్డు దాటివెళ్తే ఐటీడీఏ నిర్మించిన పది బాత్ రూమ్‌లు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా భక్తులకు అర్థం కాదు. ఆచూకీ దొరకబట్టి అక్కడకు వెళ్లినా.. ఆదివారం భక్తుల సంఖ్య 15 వేలకు మించుతుండటంతో పది బాత్ రూమ్‌లు సరిపోవడం లేదు. అమ్మవారి సన్నిధిలో కనీసం తాగునీరు కూడా దొరకదు. దుకాణాల్లో కొనుగోలు చేసి తాగాలి్సందే. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒకే క్యూలైన్ ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. గతంలో ఆలయానికి ఎదురుగా చెట్ల కింద నైవేద్యం వండుకునేవారు. వంటవార్పు చేసుకునేవారు. ఇప్పుడా చెట్లు నరికించి భవన నిర్మాణం చేపట్టారు. దీంతో భక్తులు నైవేద్యం వండుకునేందుకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా దేవాదాయ శాఖ మౌలిక సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 22 మందిలో ఐదుగురే రెగ్యులర్ ఈఓలు ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చాక 22 మంది ఈఓలుగా పనిచేశారు. ఇందులో ఐదుగురే రెగ్యులర్ ఈఓలు. మిగిలిన 17 మంది ఇన్చారీ్జలే. ప్రస్తుత ఈఓ కూడా ఇన్చార్జే. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి దేవాలయం ఈఓకు పెద్దమ్మగుడి ఈఓగా గత నవంబర్ నుంచి అదనపు బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులు పాలకుర్తి ఆలయంలో, మరి కొన్ని రోజులు పెద్దమ్మగుడి వద్ద విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఆలయ, పూజాది కార్యక్రమాల పర్యవేక్షణ కరువైంది. ఇన్చార్జి ఈఓల కారణంగానే ఆలయంలో అవినితి ఆరోపణలు రావడంతో గత నెలలో విచారణ కూడా నిర్వహించారు. పాలకవర్గ పదవీకాలం కూడా గత అక్టోబర్ 9వ తేదీతో ముగిసింది. నెల రోజుల క్రితం నూతన పాలకవర్గం కోసం నోటిఫికేషన్ జారీచేసినా ఇంతరవకు నియామకం జరగలేదు. దీంతో ఆలయం అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, రెగ్యులర్ ఈఓను, నూతన పాలకవర్గాన్ని నియమించాలని భక్తులు కోరుతున్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి.. పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడికి జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. రోజూ వెయ్యి నుంచి 2 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. గురు, ఆదివారాల్లో రద్దీ మరింతగా ఉంటుంది. ప్రతి గురువారం 5 వేల నుంచి 10 వేల లోపు, ప్రతి ఆదివారం 15 వేల నుంచి 20 వేల లోపు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు. (చదవండి: జనవరి 18న బీఆర్ఎస్ భేరీ ) -
గుళ్లలోని క్షురకులకు రూ.20 వేల కనీస ఆదాయం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లోని కేశఖండనశాలల్లో క్షురకులుగా పనిచేసే వారికి ప్రతి నెలా కనీసం రూ.20 వేలు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాన ఆలయాల్లోని క్షురకులు ప్రస్తుతం టికెట్ల ఆధారంగా ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని చెప్పారు. వాళ్లకు నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఆదాయం దక్కే సమయంలో.. ఆయా ఆలయాల్లోని వెల్ఫేర్ ట్రస్టు ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇప్పించాలని సీఎం వైఎస్ జగన్ తమకు సూచించారని పేర్కొన్నారు. రూ.20 వేల కంటే ఎక్కువ ఆదాయం వస్తే.. వారికే ఆ మొత్తం చెందుతుందన్నారు. తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ మొత్తాన్ని అదనంగా అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో హథీరాంజీ, బ్రహ్మంగారి మఠం,అహోబిలం, గాలి గోపురం, బ్రహ్మానంద మఠాలకు సంబంధించిన పాలనపరమైన అంశాలపైనా చర్చించినట్టు చెప్పారు. బెజవాడ దుర్గ గుడిలో అంతరాలయ దర్శన టికెట్ ధర ఎప్పటి నుంచో రూ.500గానే ఉందన్నారు. -
ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ టికెట్లు
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 11 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల వద్ద గదుల కేటాయింపు వంటి వాటిని కూడా ఆన్లైన్ పరిధిలోకి తెస్తామన్నారు. మంత్రి మంగళవారం విజయవాడలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుడి, పెనుగ్రంచిపోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం, వాడపల్లి, ఐనవల్లి ఆలయాల్లో ఆన్లైన్ టికెట్ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు అడ్వాన్స్‌గా నిర్ణీత తేదీకి ఆన్లైన్ దర్శన టికెట్లు, గదులు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే మరో 12 ఆలయాల్లోనూ ఆన్లైన్ విధానం అమలుపై చర్చిస్తున్నట్లు వివరించారు. వారం వారం సమీక్ష ఇకపై ప్రతి బుధవారం దేవదాయశాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న కోర్టు కేసుల ఉపసంహరణకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకొచ్చారని, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది నియామకాలను చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన ధార్మిక పరిషత్ తొలి సమావేశం అక్టోబరు 10న నిర్వహించనున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల్లో వీఐపీలకూ టైం స్లాట్ దర్శనాలు దసరా ఉత్సవాల్లో విజయవాడ కనకదుర్గ గుడిలో వీఐపీలకు కూడా టైం స్లాట్ ప్రకారమే దర్శనాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. వీఐపీలు కూడా టికెట్ కొనాలని చెప్పారు. రోజుకు ఐదు ప్రత్యేక టైం స్లాట్లు ఉంటాయన్నారు. రెండేసి గంటలు ఉండే ఒక్కొక్క టైం స్లాట్‌లో రెండు వేల వీఐపీ టికెట్లను ఇస్తామన్నారు. అందులో 600 టికెట్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు ఉన్నవారికి కేటాయించి, మిగిలినవి అందరికీ ఇస్తామన్నారు. ఒక లేఖకు ఆరు టికెట్లు ఇస్తామన్నారు. సిఫార్సు లేఖలు, ఇతర వీఐపీ టికెట్ల బుకింగ్‌కు విజయవాడ కలెక్టర్ ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు వంటి ప్రివిలేజ్డ్ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉదయం, సాయంత్రం వేళల్లో అర్ధ గంట చొప్పున ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దుర్గ గుడి ఘాట్ రోడ్డును పూర్తిగా క్యూలైన్లకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత దర్శనానికి మూడు లైన్లు, రూ.300 టికెట్ వారికి ఒకటి, రూ.100 టికెట్ వారికి మరొక క్యూ ఉంటాయని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య మరోసారి ప్రత్యేక దర్శనాలు ఉంటాయని వివరించారు. మంత్రులకూ అంతరాలయ దర్శనం ఉండదు దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడిలో అంతరాలయ దర్శనం గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. మంత్రులకు సైతం బయట నుంచే దర్శనాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. దసరా ఉత్సవాల తర్వాత దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ. 500 టికెట్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. -
చవితి మండపాలకు ఫీజులు వసూలు చేయట్లేదు
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాలకు రుసుములు (ఫీజులు) వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. భద్రతా కారణాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీసు.. రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు. చట్టపరంగా తీసుకోవాల్సిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలని కోరారు. అలాంటివి మినహాయించి ఏ రకమైన రుసుములు గానీ, చందాలు గానీ తీసుకున్నా లేక ప్రేరేపించబడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులు వసూలు చేస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు, భక్తులు నమ్మవద్దని కోరారు. ఎక్కడైనా మండపాలకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఆదాయంలేని గుళ్లకు ‘ధూప దీప నైవేద్యం’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అతి తక్కువ ఆదాయం ఉండే ఆలయాల్లో సైతం స్వామివారికి నిత్యం నైవేద్య కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. ఈ నెలలో కొత్తగా 2,200 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్ఎస్) మంజూరు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కమిషనర్ హరిజవహర్‌లాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలకు నిత్య నైవేద్య ఖర్చులకుగాను నెలనెలా రూ.5 వేల చొప్పున దేవదాయ శాఖ నుంచి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దేవాలయాలకు పరిమితి లేకుండా సంతృప్త స్థాయిలో డీడీఎన్‌ఎస్‌ను అమలుచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని.. అందుకనుగుణంగా అర్హత ఉంటే ప్రతి గ్రామంలోను కనీసం ఒక దేవాలయాన్ని అయినా ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే దాదాపు 1,500 ఆలయాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, మరో 3,500 దాకా వినతులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటికి సంబంధించిన వినతులను జిల్లా దేవదాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని.. ఇప్పటివరకు 2,346 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందన్నారు. వీటిలో 2,200 ఆలయాలకు ఈ పథకం మంజూరు చేసేందుకు అర్హత ఉందన్నారు. ఇక డీడీఎన్ఎస్ పథకం ద్వారా ఆలయాలకు ప్రతినెలా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచే దానిపై సీఎంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని విలేకరుల ప్రశ్నకు మంత్రి కొట్టు సత్యనారాయణ బదులిచ్చారు. అమీన్లు కేటాయించాలని హైకోర్టును కోరుతాం ఇక దేవదాయ శాఖ భూముల ఆక్రమణలకు సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో ప్రస్తుతం 4,708 కేసులు ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్నాయని.. అందులో 722 కేసులు పరిష్కారమయ్యాయని ఆయన చెప్పారు. కొన్నిచోట్ల దేవదాయ శాఖ సిబ్బంది ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మరికొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. ఇలాంటి చోట్ల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఎనిమిది మంది అమీన్లను ప్రత్యేకంగా దేవదాయ శాఖకు కేటాయించేందుకు హైకోర్టును కోరాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇక ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తామన్నారు. మాన్యం భూముల హక్కుదారు స్వామివారే.. దేవుడి మాన్యాలపై అసలు హక్కుదారుడు దేవుడేనని.. అందులో ఫలసాయం తీసుకోవడం వరకు మాత్రమే వాటిని పొందిన వారికి హక్కు ఉంటుందని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టంచేశారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాల పేరిట 4.09 లక్షల ఎకరాలు భూములున్నట్లు గుర్తించామని, వాటిలో ఆక్రమణలో ఉన్న వాటి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే, టీటీడీ తరహాలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా అన్నిరకాల సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా శ్రీశైలంలో అమలుచేస్తున్నామన్నారు. ఇక 21 మంది సభ్యులతో పూర్తిస్థాయిలో ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసిందని.. అవినీతికి, అక్రమాలకు పాల్పడే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం, వారి స్థానంలో మరొకరిని నియమించే అధికారం ఈ ధార్మిక పరిషత్‌కు ఉందన్నారు. ఆస్తులను 11 సంవత్సరాలకు పైబడి లీజును విస్తరించే అధికారం కూడా ఈ పరిషత్‌కే ఉందని మంత్రి చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల సంతృప్తికి ఆ సర్వేనే సాక్ష్యం దేవుడిపై విపరీతమైన నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఉంటారని, సంక్షేమ పథకాలు అమలుచేయడంలో ఆయనకు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారన్న దానికి ఇటీవల ఓ ఆంగ్ల చానల్ నిర్వహించిన సర్వే ఫలితాలే సాక్ష్యమని కొట్టు సత్యనారాయణ చెప్పారు. చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ -
మరిన్ని గుడులకు ‘గుడ్ ఫండ్’!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం ద్వారా మూడేళ్లలో 547 పురాతన, శిధిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం సోమవారం మరికొన్నింటికి అనుమతి ఇవ్వనుంది. ఈమేరకు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన సచివాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ముఖ్య కార్యదర్శి, కమిషనర్లతో పాటు టీటీడీ ఈవో సభ్యులుగా కొనసాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ఆలయాల పునఃనిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 4వతేదీన నాడు దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూ.31.40 కోట్లతో 60 ఆలయాల పునఃనిర్మాణానికి అనుమతి తెలిపారు. ప్రస్తుతం దేవదాయ శాఖ వద్ద సుమారు 160 ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సీజీఎఫ్‌కు నిధులు పెంచుతూ చట్టం ఆదాయం లేని పురాతన, శిధిలావస్థకు చేరుకున్న ఆలయాల పునఃనిర్మాణం కోసం వినియోగించే కామన్‌గుడ్ ఫండ్‌కు ఏడాది కిత్రం వరకు టీటీడీ తన వాటాగా ఏటా రూ. 1.25 కోట్లు ఇవ్వగా శ్రీశైలం, విజయవాడ దుర్గగుడి సహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఇతర పెద్ద ఆలయాల నుంచి అధిక మొత్తంలో నిధులు అందేవి. ఈ నేపథ్యంలో టీటీడీ ఏటా రూ.40 కోట్లు చొప్పున కామన్‌గుడ్ ఫండ్‌కు కేటాయించేలా గతేడాది ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో కామన్‌గుడ్ ఫండ్ కింద రూ.130 కోట్లు దాకా నిధులు సమకూరనున్నాయి. -
అన్యాక్రాంతమైన ఆలయ భూములపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవదాయశాఖకు చెందిన భూములను తిరిగి రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతర పరిస్థితులపై అన్ని జిల్లాల దేవదాయ శాఖ అధికారులకు బుధవారం తాడేపల్లిలోని దేవదాయ శాఖ ట్రైనింగ్ కేంద్రంలో ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. దేవదాయ శాఖకు రాష్ట్రంలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని, వాటిలో 1.05 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు చెప్పారు. ఈ భూములకు సంబంధించి మూడు వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆ కేసుల విషయంలో ఆక్రమణదారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు తగిన సమాచారాన్ని కోర్టుల ముందుంచాలన్నారు. భూముల విషయంలో కోర్టు కేసుల ప్రగతి ఎలా ఉందనే విషయంపై ప్రతి మూడు నెలలకోసారి, రాష్ట్రంలో ఆలయాల పరిస్థితిపై ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తామని మంత్రి వివరించారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవదాయ శాఖపై లేని పోని అబద్ధాలతో బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకుకూర్చున్నాయని, ఏ చిన్న పొరపాట్లకూ తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ప్రస్తుత వేసవిలో భక్తులు ఇబ్బంది పడకుండా క్యూలైన్లలో నీడ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కమిషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆలయానికి ఆ ఆలయ సంప్రదాయాలు పాటిస్తూ.. భక్తులకు సౌకర్యాలు, అభివృద్ధి పనులు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ఉంటుంది. వచ్చే 40 ఏళ్ల అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్‌కు రూపకల్పన చేయనున్నారు. తొలి దశలో దేవదాయ శాఖ పరిధిలోని 8 ప్రధాన ఆలయాలతో సహా 25 దేవాలయాలకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. వీటిలో మహానంది, కసాపురం, అహోబిలం, యెక్కంటి వంటి ఆలయాలు ఉన్నాయి. ఇందుకు ఉత్తర భారత దేశంలో, తమిళనాడులో పలు పురాతన, ప్రఖ్యాత ఆలయాలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్లను రూపొందించిన రెండు ప్రముఖ అర్కిటెక్చర్ సంస్థలను దేవదాయ శాఖ ఎంప్యానల్ చేసింది. ఈ సంస్థల ప్రతినిధులతో వారం క్రితం దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు వీడియో సమావేశం నిర్వహించి, ఆలయాల వారీగా మాస్టర్ ప్లాన్ల రూపకల్పనపై చర్చించారు. ఆలయాల్లోని సంప్రదాయాలు, ప్రస్తుతం ఉన్న ప్రధాన గర్భాలయాల రూపం మారకుండా మాస్టర్ ప్లాన్లు ఉంటాయని దేవదాయశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఆలయం ప్రాంగణంలో, చుట్టుప్రక్కల ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమమైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపడతారని చెప్పారు. సాయంత్రం వేళ ప్రాచీన సంప్రదాయ కళా ప్రదర్శనలు, ఇతర ఆరాధన కార్యక్రమాలకు వేదికల నిర్మాణం వంటి వాటికి ప్రాధన్యత ఉంటుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కుటుంబ సమేతంగా కార్లలో ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలయం పరిసరాలను అవకాశం ఉన్న మేరకు విశాలమైన పార్కింగ్ ఏరియా, ఆహ్లదకరమైన పూల వనాలు వంటి వాటికి మాస్టర్ ప్లాన్‌లో చోటు కల్పిస్తామన్నారు. -
రోజుకు 25 వేల మందికి అయ్యప్ప దర్శనం
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ప్రతి రోజూ గరిష్టంగా 25 వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఈ ఏడాది కరోనా ఉధృతిలో తగ్గుదల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులకు అనుమతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే, భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం నుంచి శబరిమల యాత్రకు వచ్చే భక్తులకు తెలిసేలా విస్త్రత ప్రచారం కల్పించాలని కేరళ ప్రభుత్వం కోరింది. శబరిమల యాత్రికులకు కేరళ ప్రభుత్వం సూచనలు: ► శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు ముందస్తుగా కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్‌లో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ► రెండు డోసుల కరోనా టీకా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం వెంట తీసుకురావాలి. లేదా దర్శనానికి 72 గంటల ముందుగా పరీక్ష చేయించుకుని, కోవిడ్ నెగిటివ్ ధృవీకరణ పత్రాన్ని వెంట తెచ్చుకోవాలి. ► శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించరు. ► పంబా నదిలో స్నానాలపై ఆంక్షలు ఈ ఏడాది కూడా కొనసాగుతాయి. నదీ స్నానాలకు బదులు కేవలం నది వెంబడి షవర్ స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. -
హైందవ ధర్మ సంరక్షణే ధ్యేయం
పెందుర్తి: వేద పరిరక్షణ, హైందవ ధర్మ రక్షణే ధ్యేయంగా శ్రీ శారదాపీఠం ముందుకు సాగుతోందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. పీఠం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందంటే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ధర్మ మార్గమే కారణమని తెలిపారు. ఆదిశంకరుడి అడుగుజాడలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీగా నాగుల చవితి పర్వదినం రోజున జరిగే ఈ వేడుకల్లో భాగంగా స్వామీజీ చేతుల మీదుగా పీఠ ఆస్థాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా స్వామీజీకి కూపి స్నపనం, వేద మంత్రోచ్ఛారణల నడుమ పాదపూజ చేశారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి జరిపారు. ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ భారతదేశపు మూలాల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఆదిశంకరాచార్యులేనని.. ఆయన ఆలోచనలు తలచుకుంటూ పురుడుపోసుకున్నదే విశాఖ శ్రీ శారదా పీఠమన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, చెట్టి పాల్గుణ, కారుమూరి నాగేశ్వరరావు, వెంకట చిన్నఅప్పలనాయుడు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. -
ముగిసిన సీఎం జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన
సాక్షి, తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీవారి ధ్వజ స్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించారు. సీఎం జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, అనీల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: బడితోనే అమ్మఒడి బూందీ పోటును ప్రారంభించిన సీఎం జగన్ తిరుమలలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అటు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నమయ్య భవన్లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ సమక్షంలో టీటీడీ, రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ కుదిరింది. అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం జగన్. చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ -
1,771 ఆలయాలకు కొత్త పాలక మండళ్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,771 ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం, దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఆయా ఆలయాలకు కొత్త పాలక మండళ్ల నియామకానికి సంబంధించి దేవదాయ శాఖ ఇప్పటికే ఆలయాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లోనే 400 పైగా ఆలయాల చొప్పున ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు దేవదాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత వేగంగా పాలక మండళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తాజాగా దేవదాయ శాఖకు సూచించినట్టు సమాచారం. ఈ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24,622 ఆలయాలు ఉండగా.. అందులో 4,481 ఆలయాలకు మాత్రమే పాలక మండళ్ల ఏర్పాటు ఆనవాయితీగా కొనసాగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అందులో 715 ఆలయాలకు ప్రభుత్వం, దేవదాయ శాఖ పాలక మండళ్ల నియామక ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. ఇప్పుడు నోటిఫికేషన్లు జారీ అయ్యి.. ప్రక్రియ కొనసాగుతున్న 1,771 ఆలయాలతో పాటు ఇంకా 1,995 ఆలయాలకు కూడా పాలక మండళ్ల నియామకానికి అవకాశం ఉంది. వాటిలో న్యాయపరంగా చిక్కులున్న ఆలయాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కొత్త పాలక మండళ్ల నియామకానికి కూడా దేవదాయ శాఖ కసరత్తు చేస్తోంది. పాలక మండళ్ల నియామకానికి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయిన ఆలయాలతో పాటు నోటిఫికేషన్ల జారీకి అవకాశం ఉన్న ఆలయాలతో కలిపి మొత్తం 3,766 ఆలయాల దాకా పాలక మండళ్ల నియామకానికి అవకాశం ఉంది. తద్వారా దాదాపు 26 వేల మందికి పైగా చోటు దక్కే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వివరించాయి. -
7 నుంచి 14 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం
తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు వెయ్యి మంది చొప్పున వెనుకబడిన వర్గాల భక్తులకు ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయించనున్నారు. హిందూ ధర్మ ప్రచారం, మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవదాయ శాఖ ద్వారా సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో మొదటి విడతలో రూ.25 కోట్లతో 13 జిల్లాల్లో 502 ఆలయాలను టీటీడీ నిర్మించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో వెనుకబడిన వర్గాల భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను ఉచితంగా తిరుమలకు తీసుకురానున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో ఇద్దరు సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గం మధ్యలో ఆహార పానీయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. దర్శన టికెట్లు ఉంటేనే అనుమతి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ గానీ, దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ రిపోర్టు గానీ తప్పనిసరిగా తీసుకురావాలని సోమవారం టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. పలువురు భక్తులు దర్శన టికెట్లు లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నామని తెలిపింది. ఇతర ఆలయాల్లోనూ టీటీడీ విధానాలు! 9 కమిటీలతో అధ్యయనం భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీలో అమలు చేస్తున్న విధానాలను.. దేవదాయ శాఖ పరిధిలోని ఇతర ఆలయాల్లోనూ అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన వారం కిందట జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాల మేరకు దేవదాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. ఆన్లైన్లో పూజ టికెట్ల జారీ, బంగారు ఆభరణాల డిజిటలైజేషన్, నిర్వహణ, ఆలయ భద్రత, అవసరమైన సామగ్రిని పారదర్శకంగా కొనుగోలు చేయడం తదితర అంశాలపై దేవదాయ శాఖలో పనిచేసే కీలక అధికారులతో 9 కమిటీలను ఏర్పాటు చేస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఆయా కమిటీల్లోని సభ్యులు 2 విడతల్లో తిరుమల ఆలయాన్ని సందర్శించి.. టీటీడీలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఈ నెల 5–9 తేదీల మధ్య 4 బృందాలు, 18–22 తేదీల మధ్య 5 బృందాలు తిరుమల సందర్శనకు వెళ్లాలని ఆదేశించారు. -
అరచేతిలో ఆలయ సమాచారం
సాక్షి, అమరావతి: తరచూ ఆలయాలను సందర్శించే భక్తుల సౌకర్యార్థం దేవదాయ శాఖ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా వారికి అందజేయాలని సంకల్పించింది. ఈ నిర్ణయం విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే వారితోపాటు రాష్ట్రంలోనూ ఆలయ సమాచారాన్ని ఇంటర్నెట్లో వెతికేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. దూర ప్రాంతాల్లో ఉండే భక్తులకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు తెలీక ఆయా దేవాలయాల్లోని విశేష కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు అందజేసేందుకు వారు ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు దేవదాయ శాఖాధికారులు వెల్లడించారు. మొదటి దశలో 175 ఆలయాల సమాచారం ఈ తరహా సమాచారాన్ని ముందుగా దేవదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల కేటగిరీలో ఉన్న 175 గుళ్ల సమాచారాన్ని భక్తులకు చేరవేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఇప్పటివరకు వివిధ ఆలయాల్లో భక్తులు దర్శన లేదా పూజా టికెట్ల కొనుగోలు సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్లను వినియోగించుకోవాలని భావిస్తోంది. వాటి ఆధారంగా భక్తులకు వివిధ ఆలయాల్లోని పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేస్తారు. ఆన్లైన్లో టికెట్ల కొనుగోలుతో పాటు ఆలయం వద్ద బస సౌకర్యం కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తారు. మరోవైపు.. ఈ సమాచారాన్ని సోషల్ మీడియాకు అనుసంధానం చేసేందుకు.. ఆయా కార్యక్రమాలకు డిజిటల్ మార్కెటింగ్ కల్పించేందుకు ఒక ఏజెన్సీని ఎంపిక చేయాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే టెండరు ప్రక్రియను చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు చేరువయ్యేలా.. రాష్ట్రంలో ఉండే ఆలయాలను ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలను మొబైల్ ద్వారా భక్తులు తెలుసుకునేలా యూజర్ ఫ్రెండ్లీగా ఈ ప్రక్రియను రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించి దేవదాయ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. – వాణీమోహన్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి -
వంశపారంపర్య అర్చకులకు విధి విధానాలు
సాక్షి, అమరావతి: ఆలయాల్లో పనిచేసే అర్చకుల కలలు నిజంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలను ఖరారుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎనిమిది రకాల అంశాలకు సంబంధించి ఏ ఒక్క అంశంలో ఆధారాలు చూపినా వారిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకత్వానికి అర్హుడిగా గుర్తిస్తూ ఆలయ 43(10) రిజిస్టర్లో నమోదు చేయాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ రెండ్రోజుల క్రితం రాష్ట్రంలోని అందరు రీజనల్ జాయింట్ కమిషనర్లు, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. సంబంధిత ఎనిమిది అంశాలను అ ఉత్తర్వులలో వివరించారు. అవి.. ► అర్చక ఇనాం భూములను అనుభవిస్తూ ప్రస్తుతం అర్చకత్వం చేస్తున్న వారు సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకులుగా గుర్తించబడతారు. ► దరఖాస్తుదారుని తండ్రి లేదా తాతలు ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తే అతడిని ఆ ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అమలులో ఉన్న దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల రిజిస్టర్ 25లో గానీ, 1966 నాటి ఆంధ్రప్రదేశ్ దేవదాయ చట్టం ప్రకారం ఆలయ రిజస్టర్ 38లో గానీ అర్చకులుగా నమోదై ఉన్న వారి వారసులను సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకులుగా గుర్తిస్తారు. ► అర్చకులందరూ ఒక అవగాహనకు వచ్చి ఓ వ్యక్తిని సూచించినా అతడిని సంబంధిత ఆలయానికి వంశపారంపర్య అర్చకునిగా గుర్తిస్తారు. ► గతంలో కోర్టు ఆదేశాలున్న చోట.. అలాంటి వారిని సంబంధిత ఆలయ వంశపారంపర్య అర్చకునిగా అర్హుడవుతారు. ► ఎలాంటి వివాదాల్లేని చోట ప్రస్తుతం ఆలయ అర్చకుడే ఆ ఆలయ వంశపారంపర్య అర్చకుని హోదా పొందవచ్చు. ► ఏదైనా ఆలయంలో వంశపారంపర్య అర్చకునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు పేపరు నోటిఫికేషన్ ద్వారా అతని నియామకానికి చర్యలు చేపడతారు. ► వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉండి ఆలయ అర్చకునిగా పనిచేసిన వారు చనిపోయిన పరిస్థితుల్లో ఆ కుటుంబంలో నిబంధనల ప్రకారం అర్హులు లేనట్లయితే భర్తను కోల్పోయిన అర్చకుని భార్య సూచించిన వ్యక్తి ఆమె జీవితకాలం వంశపారంపర్య హోదా అర్చకునిగా పనిచేయవచ్చు. .. పై ఎనిమిది అంశాల ప్రాతిపదికన రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వం గుర్తింపు ప్రక్రియను దేవదాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలోనే చేపడతారు. రూ. కోటిలోపు ఆదాయం ఉండే 6(ఏ) కేటగిరి ఆలయాలలో ఈ గుర్తింపు ప్రక్రియ రీజనల్ జాయింట్ కమిషనర్ల అనుమతితో చేపడతారు. 6 (బీ) కేటగిరి ఆలయాల్లో జోనల్ డిప్యూటీ కమిషనర్లు, 6(సీ) కేటగిరి ఆలయాల్లో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియకు అనుమతిస్తారు. ఏపీ అర్చక సమాఖ్య హర్షం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన దేవదాయ సవరణ చట్టం ప్రకారం ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశపారంపర్య అర్చకుల గుర్తింపునకు విధివిధానాలు ఖరారుతో పాటు అప్పటి చట్టం అమలుకు పూనుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌తో పాటు వెలంపల్లి, వాణీమోహన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చక సమస్యలపై చొరవ అవసరం పెందుర్తి: అర్చకుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ సూచించారు. వంశపారంపర్య హక్కులను అమలు చేయాలన్నారు. రుషికేష్‌లోని శారదాపీఠం శాఖలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వామీజీని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణీమోహన్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి పీఠ పూజలో పాల్గొన్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకుల డిమాండ్లపై చొరవ చూపాలని సూచించారు. జీర్ణావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక చల్లిన అసిస్టెంట్ కమిషనర్
సాక్షి, విశాఖపట్నం : విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తెరపైకి వస్తున్నాయి. దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్థన్‌పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక చల్లారు. పుష్ప వర్ధన్ మాన్సస్, సింహాచలం భూముల అక్రమాలపై లోతుగా విచారణ చేస్తున్నారు. గురువారం ఆయన తన ఛాంబర్లో కూర్చుని ఉండగా శాంతి చేతిలో ఇసుకతో గదిలోకి వచ్చారు. కోపంగా ఆయనపై ఇసుకను చల్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డవటంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్..అసిస్టెంట్ కమిషనర్ల విభేదాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, తనను డిప్యూటీ కమిషనర్ మానసికంగా వేధిస్తున్నాడని, ఆ బాధ తట్టుకోలేక ఓ మహిళగా ఆయనపై ఇసుక చల్లి నిరసన తెలియజేశానని ఆమె తెలిపింది. కాగా, ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించనున్నారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై డిసిప్లీనరీ యాక్షన్స్ తీసుకోనున్నారు. -
అప్పన్న భూములు 862.22 ఎకరాలు మాయం
సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉండగా సింహాచలం ఆలయానికి చెందిన 862.22 ఎకరాలను దేవుడి భూములు కాదంటూ ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన విషయాన్ని తాజాగా గుర్తించినట్లు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శాఖాపరంగా నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూములు మాయం కావడం నిజమేనని అధికారులు కమిటీ తేల్చిందని, దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారో తేలాలంటే దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2017లో చోటు చేసుకున్న ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో దేవదాయ శాఖ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌లతో కూడిన కమిటీ విచారణ జరిపి 108 పేజీల నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు సమర్పించింది. ఆ నివేదికను జత చేస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుతోనే.. గత సర్కారు ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించిన 862.22 ఎకరాల భూముల్లో కొన్ని ఇప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో సింహాచలం ఆలయం పేరిట ఉన్నట్టు కమిటీ తన నివేదికలో వెల్లడించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో భూములను తొలగించారు. ఇనామ్ భూముల కేటగిరీలో తొలగించిన వాటిలో 21 సర్వే నంబర్లకు సంబంధించి ‘మీ భూమి’ పోర్టల్‌లో ఇప్పటికీ ఆలయ భూములు పేరుతో ఉన్నట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. ఆ సర్వే నెంబర్ల వివరాలను కమిటీ నివేదికలో వెల్లడించింది. కమిషనర్ అనుమతి లేకుండా తొలగింపు.. దేవదాయ శాఖ చట్ట నిబంధనలన్నీ ఉల్లంఘించి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 862.22 ఎకరాలను తొలగించినట్లు అధికారుల కమిటీ తేల్చింది. దీనికి సంబంధించి అప్పటి ఆలయ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. 2016 సెప్టెంబరు 19, అక్టోబరు 4వతేదీన ఈ భూముల తొలగింపునకు అప్పటి ఈవో ప్రతిపాదిస్తే అప్పటి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారని నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత మరో అధికారి 2017 ఏప్రిల్ 24వ తేదీన అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చారని కమిటీ నివేదికలో తెలిపింది. మరో 2144 ఎకరాలూ దేవుడి భూములే.. 862.22 ఎకరాల భూముల సంగతి అలా ఉంచితే మరో 2144.37 ఎకరాల సింహాచలం ఆలయ భూములు ఇప్పటికీ ఆలయ ఆస్తుల జాబితాలో చేరలేదని కమిటీ తేల్చింది. ఈ భూములకు సంబంధించి సింహాచలం ఆలయం పేరిట పట్టా తీసుకునే ప్రక్రియ రెవిన్యూ అధికారుల వద్ద పెండింగ్‌లోనే ఉందని పేర్కొంది. టీడీపీ హయాంలో వీటిని సింహాచలం ఆలయం పేరిట నమోదుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ కార్యాలయం నుంచి పలుమార్లు ఆలయ అధికారులకు ఆదేశాలు వెళ్లినా అమలుకు నోచుకోలేదని వెల్లడించింది. సహకరించిన అధికారులపై చర్యలకు సిఫార్సు.. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ప్రభుత్వానికి సూచించారు. అప్పటి ఆలయ ఈవో, నాటి విశాఖ అసిస్టెంట్ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. -
అప్పన్న భూముల బాగోతంపై విచారణ షురూ
సింహాచలం (పెందుర్తి): రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సింహాద్రి అప్పన్నస్వామి భూముల గోల్‌మాల్‌పై విశాఖలో విచారణ ప్రారంభమైంది. ఈ భూబాగోతంపై రాష్ట్ర దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, విజయవాడ దుర్గగుడి దేవస్థానం ఈఓ డి. భ్రమరాంబ, విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మంగళవారం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టి రికార్డులను పరిశీలించారు. నగరంలోని అడవివరం, చీమలాపల్లి, వేపగుంట ప్రాంతాల్లో దేవస్థానానికి చెందిన రూ.10వేల కోట్లకు పైగా విలువచేసే 748.07 ఎకరాలను 2016లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానం ఆస్తుల రికార్డుల నుంచి తొలగించింది. దేవాలయాల భూములు పరిరక్షణలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు)లో ఈ భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఈ భూములు దేవస్థానానివి కావని, వేరే వారివంటూ 2016 డిసెంబరు 14న అధికారిక నోటిఫికేషన్ జారీచేశారు. ఈ బాగోతాన్ని గత నెల 27న సాక్షి దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై పూర్తి విచారణకు దేవదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్, దేవదాయ శాఖ విశాఖ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్‌తో తొలుత ఓ కమిటీని ఏర్పాటుచేశారు. అలాగే, 2016లో సింహాచలం దేవస్థానం అప్పటి ఈఓ, ప్రస్తుతం దేవదాయ శాఖ అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న కె. రామచంద్రమోహన్‌ను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ నేపథ్యంలో.. వారం రోజుల కిందట పుష్పవర్థన్ ప్రాథమికంగా కొంత విచారణ చేపట్టారు. తాజాగా, విచారణ కమిటీలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను కూడా సోమవారం నియమించారు. దీంతో సోమవారం సింహాచలం దేవస్థానం కార్యాలయంలో విచారణ చేపట్టారు. దేవస్థానం ఈఓ ఎంవి సూర్యకళ నుంచి పలు రికార్డులు తీసుకుని పరిశీలించారు. పూర్తి విచారణ చేపట్టి నివేదికను దేవదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తామని భ్రమరాంబ మీడియాకు తెలిపారు. దేవదాయ శాఖ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు శాంతి, వినోద్‌కుమార్, అన్నపూర్ణ కూడా రికార్డులను తనిఖీలు చేశారు. -
చెన్నకేశవస్వామి! నీ మొర ఆలకించేదెవరు?
‘‘కొందరికి దేవుడి ప్రసాదమంటే ప్రీతి. మరికొందరికి దేవుడి సొమ్మంటే మహాప్రీతి. దేవుడి కైంకర్యాల నిమిత్తం క్రీ.శ 1365లో అగ్రహారీకులు అప్పగించిన 112 ఎకరాల భూమిని కౌలుదారులు తమ కైంకర్యాలకు ఉపయోగించుకుంటున్నారు. దీంతో మూల విరాట్‌కు నిత్యనైవేద్యాలకు కొరత ఏర్పడింది. భూములు సాగు చేసుకుంటూ డబ్బులు పోగేసుకుంటున్న కౌలు రైతులు ‘నేతల’ అండదండలతో ఏయేటికాయేడు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. విలువైన ఆస్తులకు అధిపతి అయిన స్వామికి నేడు చిన్న పూలదండ కావాలన్నా దాతల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి కోరుతాడిపర్రు గ్రామంలోని చెన్నకేశవ స్వామి వారిది. ’’ సాక్షి, అమరావతి బ్యూరో: కోరుతాడిపర్రు... వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల పరిధిలోని కుగ్రామం. నడిబొడ్డులో రెండు ఆలయాలు. శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం రంగులతో కనిపిస్తుంటే, పొరుగున శ్రీచెన్నకేశవస్వామి ఆలయం ఇటీవల వరకు దిక్కులేనట్టుండేది. పవిత్రమైన ధ్వజస్తంభం స్థానంలో వెదు రుబొంగు, వెదురు బద్దలతో ‘మేఘనాలు’...గోపురంపై పిచ్చిచెట్లు.. అక్కడక్కడా ఇటుకలు బయటకొచ్చి, శిథిల భవనంలా గోచరించేది. కోరినవారికి వరాలనిచ్చే గర్భగుడిలోని చెన్నకేశవుడు, సుక్షేత్రమైన భూములున్నా, తన ఆలయానికీ దుస్థితి ఏమిటని ప్రశ్నించని మౌనమునిలా ఉండిపోయాడు. భూములను అనుభవిస్తున్న ఆక్రమణదార్లు, కనీసం నామమ్రాతం కౌలూ చెల్లించడం లేదు. పట్టించుకోని దేవదాయ అధికారులు, వారిని అదుపాజ్ఞల్లో ఉంచిన నాటి పాలకులపైనా కన్నెర్ర చేయనే లేదు. దేవుడి నిస్సహాయతకు గుండెలు కరిగిన భక్తులే చందాలు వేసుకుని «నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఇక్కడ చెన్నకేశవుడి భూములకు ఇప్పటికీ కౌలు వేలం జరపకపోవటం గమనించాల్సిన అంశం. కౌలు ఎగవేతపై అధికారులు కోర్టులో దావా వేశారు. ఆ భూములు తమవేనంటూ అనుభవదార్లు 2005లో హైకోర్టునాశ్రయించారు. దీనిపై కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ (సీసీఎల్) కమిషనర్ ఆ భూములు దేవస్థానంకు చెందినవని నిర్ధారిస్తూ, తీర్పునిచ్చారు. దేవదాయ అధికారులు 2012 ఫిబ్రవరి 17న 47.15 ఎకరాల భూమిని మూడేళ్లపాటు కౌలుకిచ్చేందుకు బహిరంగ వేలం జరిపారు. 35.3 ఎకరాలకు వేలం పూర్తయే సరికి, పూర్వ కౌలుదారులు స్టే తెచ్చారు. దీంతో మిగిలిన 8.53 ఎకరాలకు వేలం నిలిచింది. భూమి స్వాధీనం కోరుతూ పాటదారులు వేసి పిటిషనుపై 2013 జులై 19న స్టేను ఎత్తివేశారు. భూమిలోకి పాటదారులు రాకుండా అడ్డుకోవటం, పోలీసులు బందోబస్తు ఇవ్వకపోవటంతో హైకోర్టులో ధిక్కారం పిటీషను వేశారు. చేసేదిలేక 2014 డిసెంబరులో పోలీసు బందోబస్తుతో పాటదారులకు స్వాధీనం చేయటంతో అప్పటి పైరును కోసుకున్నారు. మిగిలిన 8.53 ఎకరాలకు 2015 జూలై 6న ఆలయ ప్రాంగణంలో వేలంకు దేవదాయ అధికారులు నిర్ణయించారు. దీనిని అడ్డుకునేందుకు అదేరోజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. వేలాన్ని అడ్డుకునేందుకని టీడీపీ నేతల సలహాతో అమాయకంగా చేసిన ప్రయత్నం వికటించిందనీ, దేవదాయ సిబ్బంది పొరపాటేమీ లేదని ఆ శాఖ ఉన్నతాధికారులు తేల్చారు. ఎకరం రూ.35 లక్షల విలువచేసే మొత్తం 47.15 ఎకరాల భూములన్నీ పాతసాగుదార్ల చేతుల్లో ఉండిపోయాయి. -
కొలిక్కి వచ్చిన మఠాధిపతి ఎంపిక
బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం నూతన మఠాధిపతి విషయంలో నెల రోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. ఇటీవల శివైక్యం పొందిన మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా ఎంపిక చేసినట్లు మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. శనివారం రాత్రి ఇరు కుటుంబాలతో దాదాపు 4 గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం దేవదాయశాఖ సంయుక్త సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కందిమల్లాయపల్లె గ్రామస్తులు, భక్తులు అందరి సహకారంతో శనివారం వెంకటాద్రిస్వామిని మఠాధిపతిగా నిర్ణయించేందుకు పూర్వ మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ అంగీకరించారని తెలిపారు. అలాగే ఉత్తరాధికారిగా వీరభోగవసంత వేంకటేశ్వరస్వామి రెండో కుమారుడు వీరభద్రస్వామిని నియమించినట్లు చెప్పారు. వీరిద్దరి అనంతరం రెండో భార్య మహాలక్షుమ్మ పెద్ద కుమారుడు గోవిందస్వామిని మఠాధిపతిగా నియమించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మఠం అభివృద్ధికి దేవదాయశాఖ సహకరిస్తుందన్నారు. -
బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతో పాటు కొందరు మండల స్థాయి నేతలు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని నియమించాలని నిర్ణయించారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో జరిపిన చర్చల్లో అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. అలాగే, త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. నేడు దేవదాయశాఖ సంయుక్త కమిషనర్ రాక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి శనివారం దేవదాయశాఖ సంయుక్త ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ రానున్నారు. మఠం ఆచారాలు, ప్రస్తుత పరిస్థితులు, కందిమల్లాయపల్లె గ్రామ ప్రజల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రికి నివేదక అందిస్తారని దేవాలయం ఫిట్ పర్సన్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజీ తెలిపారు. -
కరోనాపై పోరులో దైవసంకల్పం కోసం..
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు దైవ సంకల్పం తోడుగా ఉండాలని దేవదాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో హోమాలు, యాగాలు నిర్వహిస్తోంది. ప్రజలకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ధన్వంతరి హోమం, సుదర్శన హోమం, స్వాతి హోమాలు నిర్వహించనున్నారు. 24న వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ హోమాలలో భక్తులు నేరుగా పాల్గొనే అవకాశం లేదు. ఆన్లైన్లో వీక్షించేందుకు దేవదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ► కర్నూలు జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయంలో ఆదివారం మహా మృత్యుంజయ పాశుపత హోమం నిర్వహించారు. దీనికి తోడు ఆదివారం మొదలు వరుసగా 21 రోజుల పాటు రోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల మధ్య మహా మృత్యుంజయ మంత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. ► అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో ఇప్పటికే దేవదాయ శాఖ ప్రత్యేక ఆయుష్ హోమాన్ని నిర్వహించగా, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సర్వశాంతి హోమాన్ని నిర్వహించారు. విజయవాడ దుర్గ గుడిలో శుక్రవారమే చండీ హోమం, శ్రీచక్ర నవ వర్ణార్చన పూజలు చేయగా.. గణపతి హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమాలనూ పూర్తి చేశారు. నెల రోజులుగా కొనసాగుతున్నాయి.. కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి పెరిగిన నాటి నుంచి గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఆలయాల్లో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు రోజువారీగా జరుగుతున్నాయి. భక్తులు ఇంటి వద్ద నుంచే తమ ఇష్టదైవానికి మొక్కులు తీర్చుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 79 ఆలయాల్లో పరోక్ష సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇలా ఇప్పటి వరకు రూ.76.12 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయాల్లో పరోక్ష సేవల పురోగతిపై ఈవోలు, జిల్లా దేవదాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో వారంలో రెండు రోజులు సమీక్షిస్తున్నాను. – వాణీమోహన్, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి తిరుమలలో హస్తా నక్షత్రేష్టి తిరుమల: కరోనా మహమ్మారి నుంచి రక్షించి సమస్త మానవాళికి ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠంలో హస్తా నక్షత్రేష్టి మహాయాగం నిర్వహించారు. పీఠం ప్రిన్సిపాల్ కేఎస్ఎస్ అవధాని ఆధ్వర్యంలో జరిగిన ఈ యాగంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు జరిగిన ఈ మహాయాగంలో విశేషమైన హోమం చేపట్టి అధిష్టాన దేవతను ప్రార్థించారు. కాగా, మే 9న ప్రారంభమైన నక్షత్రసత్ర మహాయాగం జూన్ 15వ తేదీ వరకు జరగనుంది. కృత్తిక నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు అభిజిత్ నక్షత్రం సహా 28 నక్షత్రాల అధిష్టాన దేవతలకు శ్రౌతయాగాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఈ 28 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించి ఉంటారు. ఈ యాగాల ద్వారా ఆయా అధిష్టాన దేవతలు తృప్తి చెంది విశేషమైన ఫలితాలను అనుగ్రహిస్తారని పండితులు తెలిపారు. -
ఈసారీ మంచి వానలు
సాక్షి, హైదరాబాద్: ప్లవ నామ సంవత్సరంలో మంచి వానలు కురుస్తాయని, రైతుల మోములో చిరునవ్వు వస్తుందని శృంగేరీ పీఠం ఆస్థాన పౌరాణి కులు బాచంపల్లి సంతోషకుమారశాస్త్రి చెప్పారు. కొత్త ఏడాది మహిళల ఆధిపత్యం అన్ని రంగాల్లో విస్తరిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వం–ప్రజల మధ్య సమన్వయం, సఖ్యత వల్ల పాలన సాఫీ సాగుతూ ప్రజలకు మేలు జరుగుతుం దని వివరించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ‘ప్లవ’నామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్‌లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నిరాడంబరంగా జరిగాయి. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..‘‘ప్లవ అంటే పడవ. నీటి పక్షి అన్న అర్థం కూడా ఉంది. అగ్ని పురాణం ప్రకారం.. ఇప్పుడు ముగిసిన సంవత్సరం శార్వరి. శార్వతి అంటే చీకటి రాత్రి.. వచ్చే సంవత్సరం శుభకృతి అంటే శుభం. చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్లేదే ప్లవ నామ సంవత్సరం. ఈ ఏడాది పర్వతాకారం లాంటి నల్లని మేఘాలతో ఆకాశం ఆవృతమై ఉంటుంది. రాజు- ప్రజలు సమైక్యంగా జగతికి కాంతులనిస్తా రని శాస్త్రం చెబుతోంది. ధనధాన్యాల వృద్ధి అద్భు తంగా ఉంటుంది. వర్షాలు కురుస్తాయి, పంటలు పండేందుకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. విశేష శుభ ఫలితాలను పొందుతాం. ఈ సంవత్సరానికి దైవం రుద్రుడు. అందువల్ల ఈశ్వరారాధన శుభాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి బుధుడు, సేనాధిపతి కుజుడు, సస్యాధిపతి శని, ధాన్యాధిపతి గురువు, అర్ఘాధిపతి, మేఘాధిపతి కుజుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. కుజుడికి ఆధిపత్యం రావటం, మేష లగ్నంలో సంవత్సరం ప్రారంభం కావడం వల్ల ప్రజలకు– ప్రభుత్వానికి మధ్య సానుకూలాంశాలు నెలకొంటాయి. సమర్థ పాలన మన రాష్ట్రాధిపతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకరీత్యా బుధ మహాదశలో పుట్టారు. ఆయనది మేష లగ్నం. ఆయన గ్రహస్థితిలో అద్భుతంగా యోగించిన కుజుడు ఈ సంవత్సరం రాజు కావడం.. ఈ పోలికల ఆధారంగా పంచాంగాన్ని విశ్లేషిస్తే.. సమర్థవంతమైన పాలన సాగుతుంది. శనికుజుల పరస్పర వీక్షణం వల్ల ముఖ్యమంత్రి వేగాన్ని మిగతా మంత్రులు, అధికారులు అందుకోలేకపోవచ్చు. దీనివల్ల సమన్వయ లోపం కొంత ఏర్పడి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి వ్యయస్థానంలో రవి బుధ చంద్రుల కలయిక వల్ల పాలనాపరమైన ఖర్చులు పెరుగుతాయి. ప్రజలు ఆడంబరాలకు పోయి స్థాయికి మించిన ఖర్చు చేస్తారు. అందుకే ప్లవ నామ సంవత్సరంలో ప్రజలు దుబారా, ఆడంబరాలను తగ్గించుకోవాలి. ప్రభుత్వానికి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. రక్షణ శాఖ ఉత్సాహంగా పనిచేస్తుంది, కొత్త ఆయుధాల ఆవిష్కరణ జరుగుతుంది. ప్రభుత్వానికి ప్రజల అండ ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా ఉండదు. ప్రభుత్వానికి ప్రజల అండదండలు మెండుగా ఉంటాయి. రాజ్యాంగ నిర్ణయాలు ప్రజలకు సంతృప్తినిస్తాయి. ప్రస్తుత గ్రహస్థితి వల్ల జూలై 13 నుంచి ఆగస్టు 16 మధ్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. మే తర్వాత కరోనా ఉధృతి బాగా తగ్గుతుంది. కానీ ప్రజలు నిర్లక్ష్యాన్ని వదిలేయాలి. సెప్టెంబరు 14 నుంచి నవంబరు 20 మధ్య గురు శనిల కలయిక వల్ల మరోసారి భయాందోళన పరిస్థితి నెలకొంటుంది. డిసెంబరు 4 నుంచి కాలసర్పదోషం వల్ల కొన్ని అరిష్టాలు ఏర్పడుతాయి. మకర రాశిలో శనైశ్వర సంచారంతో భయం, అతివృష్టి ఏర్పడతాయి. 2022 మార్చి మొదటివారంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది. ముందుజాగ్రత్తలు అవసరం. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష పురోగతి ఉంటుంది. రియల్ ఎస్టేట్ పురోగమిస్తుంది కుజుడికి చాలా ఆధిపత్యాలు రావటంతో రియల్ ఎస్టేట్‌లో భారీ పురోగతి ఉంటుంది. భూముల ధరలు పెరుగుతాయి. 3,4 రియల్ ఎస్టేట్ సంబంధిత భూ కుంభకోణాలు వెలుగుచూస్తాయి. ప్రజలు భూములు కొనేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది సింధూ పుష్కరాలు నవంబర్ 21 నుంచి డిసెంబరు 2 వరకు సింధూ నది పుష్కరాలు ఉంటాయి. మనదేశంలో తక్కువ ప్రాంతంలో ఆ నది ఉన్నందున సింధూ నదిని తలుచుకుని మిగతా నదుల్లో స్నానం చేస్తే పుష్కర పుణ్యం కలుగుతుంది. ఈ సంవత్సరం మనకు గ్రహణ ప్రభావాలు లేవు. ఈసారి ముహూర్తాలు ఎక్కువ గతేడాది మౌఢ్యముల వల్ల ముహూర్తాలు తక్కువగా ఉండటంతో జనం ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. విశేషంగా పెళ్లిళ్లు జరుగుతాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాలసర్పదోషం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉంటూ ఆధ్యాత్మిక భావనతో గడిపితే మంచి జరుగుతుంది. కాళేశ్వరం పరిపూర్ణంగా నిండి జలవనరులతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. యాదాద్రి దేవాలయం ప్రారంభమై దివ్యమంగళ దర్శనం కలుగుతుంది.’’ -
ప్రతి ఇల్లూ సుభిక్షం.. ప్రతి ఒక్కరిలో ఆనందం
ప్లవ అంటే ఒక నావ అని అర్థం. ఈ సంవత్సరం బాగుంటుందని సిద్ధాంతి కూడా చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, రైతులందరికీ మంచి జరగాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోవిడ్‌పై జరిపే యుద్ధంలో మనం గెలవాలని ఆకాంక్షిçస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరిగి ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన పండుగ కార్యక్రమంలో సీఎం జగన్ సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని పాల్గొన్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. తొలి ప్రతిని ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుకు అందజేశారు. ఈ సందర్భంగా సోమయాజుల పంచాంగ పఠనాన్ని సీఎం జగన్ ఆసాంతం ఆలకించారు. అనంతరం సిద్ధాంతి అందజేసిన ఉగాది పచ్చడి స్వీకరించారు. అనంతరం సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం జగన్‌కు స్వామి వారి ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించింది. ఉగాది పండుగ సందర్భంగా శారదా పీఠం పంపిన శేషవస్త్రాలను పండితులు సీఎం జగన్‌కు అందజేశారు. ఉగాది సందర్భంగా నూతన పంచాంగం తొలి ప్రతిని సుబ్బరామ సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, అధికారులు ఈ ఏడాది చాలా అనుకూల పరిస్థితులు సిద్ధాంతి సోమయాజులు ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ పఠనంలో..ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రమంతటా అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పారు. పాలన చేసే సీఎం వ్యక్తిగత జాతక రీత్యా గురువు సంచారంతో చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. పంచాంగ ప్రభావానికి తోడు పరిపాలన చేసే వారి జాతకం బావుండటం మూలంగా గ్రహాలు రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలిస్తాయన్నారు. ► ఈ ఏడాది మేఘాలు అన్ని ప్రాంతాల్లో చక్కగా వర్షిస్తాయి. వ్యాపారాలకు మంచి అనుకూలత ఉంది. ఈ ఏడాది అంతా బాగుంటుంది. ధన ధాన్యం సమృద్ధిగా చేకూరుతుంది. సుభిక్షం, సంక్షేమం, ఆర్యోగంతో రాష్ట్రమంతా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ► గురు, శుక్రుల ప్రభావంతో మంత్రి మండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడంతో పాటు వాటి అమలును దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఈ కారణంతో ప్రభుత్వం, ప్రజలు చక్కటి ఫలితాలతో ముందుకెళ్లే పరిస్థితి. ఈ సంవత్సరం వాతావరణం సమతూకంగా నడుస్తుంది. ► గురువు ప్రభావంతో భూమి సస్యశ్యామలం అవుతుంది. పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా కురవడం వల్ల చెరువులు, నదులు నీళ్లతో నిండుతాయి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అనుకూల అవకాశాలు పెరుగుతాయి. రైతులు, రైతు కూలీలు, శ్రామికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పాలన కొనసాగడానికి అనుకూలత ఉంది. ► ఈ ఏడాది విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగాలు అన్నీ బాగుంటాయి. గతేడాది కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అన్ని అనుకూల పరిస్థితులతో ప్రజలందరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా బలపడే అవకాశాలుంటాయి. ► వ్యవస్థాపరంగా ఆర్థిక పరిస్థితులు పుంజుకునే అవకాశం ఉంది. ఆనందంగా ఉన్నామని ప్రతి వారు అనుకునేలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తారు. మంచి ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. ► కరోనాను జయించడమే కాకుండా, ప్రజలందరికీ చక్కటి ఆరోగ్యం అందేలా ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి. రాబోయే కాలంలో అందరి మన్ననలు పొందేలా సీఎం వ్యక్తిగత జాతకం ఉంది. అందరితో స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రం విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వ పథకాల వివరాలతో క్యాలెండర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా రూపొందించిన తెలుగు సంవత్సర క్యాలెండర్‌లోనూ ఈ ఏడాది ఎప్పుడు ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది పొందుపర్చారు. క్యాలెండర్ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలను, రెండో పేజీలో గత 22 నెలల కాలంలో అంటే, 2019 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏయే పథకాలలో ఎంత మందికి, ఎన్ని కోట్ల మేర ప్రయోజనం కల్పించారన్న వివరాలను ఇచ్చారు. మూడో పేజీలో అవ్వాతాతలకు ఆసరాగా అందిస్తున్న వైఎస్సార్ పింఛన్ కానుక వివరాలను ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా ఏనెల, ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది వివరించారు. వేద పండితులు, అర్చకులకు సీఎం సత్కారం ► ప్రభుత్వ సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుతో పాటు పలువురు అర్చకులు, వేద పండితులను సీఎం సత్కరించారు. ► విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా మార్కాపురం అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అర్చకులు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, వేద పండితులు ఆర్వీఎస్ యాజులు సీఎం జగన్ చేతుల మీదగా సత్కారం పొందారు. ► ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగంతో పాటు, ప్రభుత్వ క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆలయ వ్యవస్థ ఇక స్వచ్ఛం, పారదర్శకం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని అన్ని రకాల దేవాలయాల మేనేజ్మెంట్ వ్యవస్థ ఇకపై అత్యంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఈ నూతన మేనేజ్మెంట్ వ్యవస్థను ప్రారంభించారు. ఇందులో దేవాలయాల సమాచారం, ఆన్లైన్ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్ బోర్డు, సిబ్బంది వివరాలు ఉంటాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగ పడుతుందన్నారు. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. ► కొత్త విధానం వల్ల భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించవచ్చు. క్యూ ఆర్ కోడ్ ద్వారా కూడా ఇ– హుండీకి కానుకలు సమర్పించే అవకాశం ఉంటుంది. ► ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తొలిసారిగా అన్నవరం దేవాలయంలో ఈ వ్యవస్థ ప్రారంభమైంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అన్నవరం టెంపుల్‌కు రూ.10,116 ఇ–హుండీ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించింది. ► ఈ నెలాఖరుకు మరో 10 ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్ కమిషనర్ అర్జున రావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ జి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ ఏజీఎం అండ్ కోఆర్డినేటర్ ఇ.రాజుబాబు, రీజనల్ హెడ్ వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాపాల పుట్టలు పగులుతున్నాయ్
సాక్షి, అమరావతి: భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. పెద్ద ఆలయాల్లో అవినీతికి ఆస్కారం ఉన్న విభాగాల్లో కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి తిష్ట వేసి సాగిస్తున్న అవినీతి దందాలపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఉద్యోగుల అవినీతి బట్టబయలైంది. పదేళ్లుగా దుర్గమ్మ ఆలయ ఆస్తుల రిజిస్టర్‌ను సరిగా నిర్వహించడం లేదన్న విషయం కూడా బయటపడింది. అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు సహా ఆలయానికి వచ్చే ఆదాయం, ఆస్తుల వివరాలను 43వ నంబర్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా, పదేళ్లుగా అలాంటివేవీ నమోదు చేయడం లేదని ఏసీబీ అధికారులు తేల్చారు. అవినీతికి పరాకాష్టగా మారిన ఈ వ్యవహారంలో 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేయడం దేవదాయ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీశైలం ఆలయంలోనూ.. 2020 జూన్‌లో ఏసీబీ అధికారులు శ్రీశైలం ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. 2016 ఏప్రిల్ నుంచి ఆలయంలో చోటుచేసుకున్న అక్రమాలను బయటపెట్టారు. స్వామివారి దర్శన టికెట్లకు సంబంధించి దాదాపు రూ.2.50 కోట్ల మేర అక్రమాలు చోటుచేసుకున్నట్టు అప్పట్లో ఏసీబీ అధికారులు గుర్తించారు. అప్పట్లో టికెట్ల విక్రయ విభాగంలో పనిచేసే 26 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం, ఆ తర్వాత ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉన్నారన్న ఆరోపణలతో ఆరు నెలల క్రితం 11 మంది ఆలయ రెగ్యులర్ ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రసాదాల నుంచి ఫొటోల వరకూ.. దుర్గ గుడిలో కీలకంగా పనిచేసే ఓ ఉద్యోగి సంప్రదాయ విక్రయ కౌంటర్లో తన సమీప బంధువును అనధికారికంగా నియమించి భారీగా సొమ్ములు దిగమింగుతున్నట్టు ఏసీబీ తేలి్చంది. అమ్మవారి దర్శన టికెట్ల అమ్మకాలకు సంబంధించి ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో జరిగే లావాదేవీలకు సంబంధించిన రశీదుల రిజిస్టర్లో సూపరింటెండెంట్ సంతకాలు ఉండటం లేదని, టికెట్ల విక్రయాల్లో భారీ లొసుగులు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. భక్తులు అందజేసే చీరల్ని ఉంచే గొడౌన్, అమ్మవారి ఫొటోలు అమ్మే విభాగంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఏసీబీ తేల్చింది. అన్న ప్రసాద విభాగంలో కూరగాయలు, పాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించింది. అన్నదానం కోసం భక్తులు ఇచ్చిన రూ.54,31,382 నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా బ్యాంకు ఖాతాలో అలా ఉంచినట్టు తేల్చారు. కొందరు ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఆరు నెలలకు పైగా విధులకు హాజరుకాకపోయినా వారిని కొనసాగిస్తున్నట్టు నిర్ధారించారు. దుర్గ గుడికి మళ్లీ వచ్చిన ఏసీబీ ఇంద్రకీలాద్రి (విజయవాడ, పశ్చిమ): ఏసీబీ అధికారులు మరోమారు బుధవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన పరిపాలనా భవనానికి వెళ్లిన అధికారులు ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. ఇంతకుముందు ఆలయంలో జరిపిన తనిఖీలకు సంబంధించి కొన్ని కీలక పత్రాల గురించి ఆరా తీయడంతో పాటు కొన్ని సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలావుండగా.. ఆలయ ఈవో ఎంవీ సురేష్ బాబు తీరుపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన అంతర్గత బదిలీల సందర్భంగా ఈవో తనకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించినట్టు పేర్కొంటున్నారు. కిందిస్థాయి ఉద్యోగులకు సూపరింటెండెంట్ స్థాయి బాధ్యతలు అప్పగించగా.. సూపరింటెండెంట్ స్థాయి అధికారులకు కింది స్థాయిలో విధులు కేటాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంద్రకీలాద్రిపై ఎవరి దందా వారిదే దుర్గ గుడిలో పదేళ్లుగా కొనసాగుతున్న అనేక అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని కొన్ని కీలక విభాగాల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉద్యోగులు ఎవరికి వారు అవినీతి దందాలను కొనసాగిస్తున్నట్టు తేలింది. ఈవోలు కూడా ఆ ఉద్యోగుల దందాకు వంత పాడుతూ వస్తున్నారు.ఆలయ ఆస్తులకు సంబంధించిన 43 రిజిస్టర్‌తో పాటు షాపులు, భూముల లీజులకు సంబంధించిన 8ఏ రిజిస్టర్‌ను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని ఏసీబీ తేల్చింది. వాటికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది. సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లను సమకూర్చేందుకు టీడీపీ హయాంలో మాక్స్ డిటిక్టెవ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం దానికి దేవదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. అనుమతులు పొందకుండానే రెండేళ్లుగా ఆ ఏజెన్సీని కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సంస్థకు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లిస్తున్నారు. ఆరేళ్లుగా ఆలయ పర్యవేక్షక సూపరింటెండెంట్ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగికి ఆ ప్రైవేట్ ఏజెన్సీతో బినామీ లావాదేవీలున్నట్టు ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం ఆలయాలు సహకార డెయిరీల నుంచే నెయ్యి కొనుగోలు చేయాల్సి ఉండగా, గత కొన్నేళ్లుగా గుంటూరు జిల్లా టీడీపీ నాయకుడికి చెందిన డెయిరీ నుంచి ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు తేలింది. -
రేపటి నుంచి విగ్రహాల పునఃప్రతిష్ట సన్నాహక పనులు
సాక్షి, అమరావతి: రామతీర్థం శ్రీరామస్వామి వారి ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట సన్నాహక కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విగ్రహ పునఃప్రతిష్టతో పాటే ఆగమ పండితుల సలహాలతో పురాతన ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు సోమవారం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు. హోమం అనంతరం సంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలో ఉంచుతారు. ఆలయంలోని గర్భాలయం పాతకాలపు కట్టడం అయినా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ.. లోపలి భాగాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణ చేసే ప్రాకారం వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించింది. కొండపై ఉన్న ఆలయం వద్ద ఏ పనులు చేపట్టాలన్నా తగిన స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన కొండపై నీటి ట్యాంకును కూడా దేవదాయ శాఖ ఏర్పాటు చేయనుంది. కొండపై ఆలయం వద్దకు భక్తులు సులభంగా వచ్చి వెళ్లేందుకు వీలుగా మెట్ల మార్గాన్ని కూడా విస్తరిస్తారు. కొండపై ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోనేరును కూడా ఆధునికీకరిస్తారు. ఇదిలా ఉండగా, రామతీర్థం ఆలయంలో పునః ప్రతిష్టించేందుకు శ్రీరాముడి మూలవిరాట్ విగ్రహంతో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు ఈ నెల 23 నాటికి సిద్ధం చేస్తారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆలయ ఆధునికీకరణపై రేపు మంత్రి సమీక్ష శ్రీరామస్వామి గర్భాలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని ఒకరిద్దరు స్వామీజీలు దేవదాయ శాఖకు సూచన చేసినట్టు తెలిసింది. ఆ సూచనలను ఇతర ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లే విషయమై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. -
గోమాతకు వందనం
సాక్షి, అమరావతి, నరసరావుపేట: రాష్ట్ర వ్యాప్తంగా గత 40–50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా శుక్రవారం కామధేను పూజ (గోపూజ) కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, ఘనంగా కొనసాగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), దేవదాయ శాఖల ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో ఉదయం 11.50 గంటలకు జరిగిన గోపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంప్రదాయ పంచెకట్టు, కండువాతో పాల్గొన్నారు. స్వయంగా గోవుకు పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించారు. గోత్రనామంతో సంకల్పం చేసుకున్న అనంతరం టీటీడీ పండితుల మంత్రోచ్ఛారణ మధ్య గోమాతకు, దూడకు పట్టువ్రస్తాలు, పూలమాలలు సమర్పించారు. గోమాత, దూడకు ప్రదక్షిణ చేసి హారతి ఇచ్చి నమస్కరించుకున్నారు. పచ్చిమేత, అరటి పళ్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో 108 గోవులకు గోపూజ నిర్వహించారు. 20 నిమిషాల పాటు సాగిన పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట తదితర నియోజవర్గాల నుంచి వేలాది మంది వచ్చారు. గోమాతకు పూలదండ వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గోమాత గొప్పదనం తెలిసేలా.. ► తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉండే 50 ఆలయాలతో సహా మొత్తం 2,262 ఆలయాల్లో శుక్రవారం గోపూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గోమాత గొప్పదనం తెలిసేలా ఆయా ఆలయాల్లో పోస్టర్లను ప్రదర్శించారు. ► శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన గోపూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో ఉదయం, సాయంత్రం మంత్రులు ఆదిమూలపు సురే‹Ù, చెల్లుబోయిన వేణు వేర్వేరుగా పూజల్లో పాల్గొన్నారు. ► అరసవెల్లి ఆలయంలో విద్యార్థులకు గోమాత ప్రాముఖ్యతపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. అందరికీ మంచి జరగాలి ► గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పూజా కార్యక్రమం అనంతరం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి కాసేపు మాట్లాడారు. ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ సందర్భంగా రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ► సీఎం రాక సందర్భంగా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంను సంక్రాంతి శోభ ఉట్టిపడేలా రంగవల్లులు, అలంకరణలతో తీర్చిదిద్దారు. బొమ్మల కొలువులు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసుల కీర్తనలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను, గోమాతలు, నందీశ్వరులు (ఎద్దు) అలంకరణలను సీఎం తిలకించారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన పిండి వంటలను రుచి చూశారు. ► టీటీడీ అర్చకులు, ఇస్కాన్ ప్రతినిధులు శేష వస్త్రంతో.. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గజమాలతో సీఎంను సత్కరించారు. ► ఈ కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు, తదితరులు పాల్గొన్నారు. -
రామతీర్థం ఘటనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో దేవాదాయ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజా శంకర్, దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్లు, ఆర్ జేసీలు, డీసీలు హాజరయ్యారు. రామతీర్థం ఘటన తో పాటు దేవాలయాలపై జరుగుతున్న దాడులపై అధికారుల నుంచి వివరాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. (చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్) ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. రామతీర్థం రాముడు విగ్రహం పున:ప్రతిష్ఠపై చర్చించారు. అధికారులు, పండితుల అభిప్రాయాలను మంత్రి తీసుకున్నారు. నెల రోజుల్లో రాముడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.(చదవండి: విగ్రహాల ధ్వంసం: దీని వెనక ఉన్నది టీడీపీనే) చిన్న చిన్న దేవాలయాల్లోనూ కూడా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు, మెటల్ డోర్ డిటెక్టర్స్ తో తనిఖీలు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి వెల్లంపల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. రామతీర్ధం ఆలయంలో జరిగిన ఘటన దురదృష్డకరమని, దీని వెనుక కుట్రకోణాలు కనిపిస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో లబ్ధి కోసమే బాబు కుట్రలు.. సమీక్ష అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రామతీర్ధం ఘటనపై సీఎం వైఎస్ జగన్... ఇప్పటికే సీఐడీ విచారణకి ఆదేశించారని, రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. ‘‘అధికారులు రూపొందించిన డిజైన్ని ఆమోదించాం. ఆగమ పండితులతో చర్చించాం. విగ్రహాన్ని ఎప్పుడు పునఃప్రతిష్ట చేయాలో మరోసారి ఆగమ పండితులతో చర్చించి రెండు రోజులలో ప్రకటిస్తాం.రామతీర్థం దోషులనను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రామతీర్థం చాలా చిన్న ప్రాంతం. ఎక్కువ మంది వెళ్తే ఇబ్బందికరం. రాజకీయంగా బురద చల్లాలని చూడటం దారుణం. విజయవాడలో ఓ ఆలయంలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. రాజమండ్రి ఘటనపై కూడా సీఐడీ విచారణకి ఆదేశించాం. టీడీపీ వర్గానికి చెందిన ఆలయాల్లోనే దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టలేదు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల కేసులో 169 మందిని అరెస్ట్ చేశాం. రాష్ట్రంలో 57,584 ఆలయాలు ఉన్నట్టు పోలీస్‌శాఖ మ్యాపింగ్ చేసింది. అంతర్వేది ఘటనకు ముందు 3వేల ఆలయాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 39,076 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దేవాలయాల నిధులను ఎక్కడా డైవర్ట్ చేయలేదు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలు, వేలల్లో దాడులు జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాబు హయాంలో ధ్వంసం చేసిన ఆలయాలను పునర్నిర్మిస్తాం. తిరుపతి ఉపఎన్నికలో లబ్ధి కోసం బాబు కుట్రలు చేస్తున్నారని’’ మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. -
దేవాలయాలపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పెందుర్తి: రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో ఫోన్ ద్వారా ఆయన చర్చించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టతో పాటు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించడం అవసరమన్నారు. దేవాలయాలపై దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న సంకేతాలు భక్తులకు వెళ్లే విధంగా దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల జరిగిన దాడులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. -
పోస్టల్ ద్వారా ఆలయాల నుంచి ప్రసాదాలు
సాక్షి,అమరావతి/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో పెద్ద, ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలు వంటివి భక్తులకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామాలైన అమరారామం (అమరావతి), సోమారామం (భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), భీమారామం (ద్రాక్షారామం), కుమారారామం (సామర్లకోట) చిత్రాలు ముద్రించిన ఐదు రకాల పోస్టు కార్డులను పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పోస్టుకార్డులను మంత్రి వెలంపల్లి బుధవారం విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయా ఆలయాల్లోనూ పోస్టల్ శాఖ, దేవదాయ శాఖ అధికారులు పోస్టుకార్డుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ఏకకాలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలు, దేవాలయాలపై పోస్టు కార్డులు ప్రింట్ చేయడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, విజయవాడ సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ టి.యం. శ్రీలత, రీజియన్ పోస్టల్ డైరెక్టర్ ఎస్.రంగనాథన్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కేవీఎల్ఎన్ మూర్తి, విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కందుల సుదీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
దేవుళ్లకే ‘బాబు’ శఠగోపం!
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వం దేవుళ్ల డబ్బులనూ ఇతర అవసరాలకు మళ్లించినట్టు కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) కడిగిపారేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన 2014–2018 కాలంలో వివిధ ఆలయాలకు చెందిన దేవుళ్ల నిధులను ప్రభుత్వ అధికారులు ఉపయోగించే కార్లకు ప్రెటోలు ఖర్చుకు.. తమకు నచ్చిన కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు గ్రాంట్ రూపంలో ఆర్ధిక సహాయం చేసేందుకు మళ్లించినట్టు స్పష్టం చేసింది. రూ.34.07 కోట్ల మేర ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన నిధులకు సంబంధించి రికార్డుల్లో ఎటువంటి వివరాలు లేవని తప్పు పట్టింది. వందల కోట్ల రూపాయల ఆలయ నిధుల అక్రమాలకు సంబంధించి కాగ్ తన నివేదికలో మొత్తం 16 పేజీలలో వివరించింది. 2014–15 ఆర్ధిక ఏడాది నుంచి 2017–18 ఆర్ధిక ఏడాది మధ్య నాలుగేళ్ల లావాదేవీలకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయ రికార్డులతో పాటు రాష్ట్రంలోని 6 (ఏ) కేటగిరికి చెందిన 13 ప్రముఖ ఆలయాల రికార్డులను కాగ్ అధికారులు తనిఖీ చేసి, ఓ నివేదిక రూపొందించారు. 2018 ఏప్రిల్, జూలై మధ్య కాగ్ ఈ తనిఖీలు నిర్వహించింది. ఈ నివేదికను కాగ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► దేవదాయ చట్టం ప్రకారం ఆలయాల నిధులను వేద, సంస్కృత సంస్థల ఏర్పాటుకు, సనాతన ధర్మ ప్రచారానికి, అవసరం ఉన్న ఏ ఇతర ఆలయాల కోసమే వినియోగించాలి. అయితే గత ప్రభుత్వం అలా కాకుండా చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ► తనిఖీలు చేసిన 13 ఆలయాల్లోని ఎనిమిదింటిలో మిగులు నిధులను అధికారులు ఉపయోగించే కార్ల అద్దెలకు, పెట్రోలు ఖర్చుకు, ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపులకు ఉపయోగించారు. ► చిన్న ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నప్పుడు వాటి పునరుద్ధరణ, సంరక్షణ, నిర్వహణ కోసం పెద్ద ఆలయాల నుంచి దేవదాయ శాఖ సేకరించిన కామన్‌గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల్లోంచి రూ.12.41 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవన (కమిషనర్ కార్యాలయ) నిర్మాణానికి వెచి్చంచారు. ఓ ట్రస్టుకు రూ.10.60 కోట్లు ► భక్తులు వివిధ ఆలయాలకు సమర్పించిన కానుకలను, సీజీఎఫ్ రూపంలో దేవదాయ శాఖ సేకరించిన నిధులతో పాటు మరో రూ.10.60 కోట్లను దేవదాయ శాఖ పర్యవేక్షణలో లేని ఒక ట్రస్టుకు కేటాయించారు. ► ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకుండానే ఇలా ఇవ్వకూడదు. పైగా ఆ డబ్బులను ఆ ట్రస్టు దేని కోసం ఖర్చు పెట్టిందన్న వివరాలను అప్పటి ప్రభుత్వం తెలుసుకోలేదు. ఇలా ఆయా ఆలయాల్లో రూ.వందల కోట్లలో నిధులు పక్కదారి పట్టాయి. భూ అక్రమణలను పట్టించుకోలేదు.. ► రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పేరిట 4,53,459 ఎకరాల వ్యవసాయ భూమి, 9,05,374 చదరపు గజాల వ్యవసాయేతర భూమి ఉంది. అందులో 70,091 ఎకరాల (మొత్తంలో 15.46 శాతం) వ్యవసాయ భూమి, 11,131 చదరపు గజాల (మ్తొతం 1.23 శాతం) వ్యవసాయేతర భూమి ఆక్రమణలకు గురైంది. ► కాగ్ తనిఖీ చేసిన ఆలయాల పరిధిలోని ఐదు ఆలయాలకు సంబంధించి 716.10 ఎకరాల వ్యవసాయ భూమి ఆక్రమణలో ఉంది. వాటి పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక చోట 4.88 ఎకరాల భూమిని విడిపించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా, చర్యలు తీసుకోలేదు. డిపాజిట్ చేయని బంగారం 68.468 కిలోలు ► ఆలయాల వద్ద దేవుడి అభరణాల రూపంలో ఉన్నవి కాకుండా ఉపయోగించకుండా ఒక్క గ్రాము బంగారం ఉన్నా, బంగారం డిపాజిట్ స్కీంలో డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే నాలుగు ఆలయాల పరిధిలో 68.468 కిలోల బంగారం డిపాజిట్ చేయకుండా లాకర్లో ఉంచారు. ► ఆయా ఆలయాల పరిధిలోని దుకాణాలకు సంబంధించి రూ.18.48 కోట్ల లీజు బకాయిలు వసూలు చేయలేదు. -
20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కర ప్రారంభ ముహూర్తం ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాల ప్రారంభ ముహుర్తంగా దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ధారించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతి కోసం దేవదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్య 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. 23 పుష్కర ఘాట్లు సిద్ధం ► తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని సూచించింది. ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది. ► పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. ► పిండ ప్రదానం, తదితర కార్యక్రమాలకు రేట్లను దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. ► పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. దేవదాయ శాఖ కార్యక్రమాలపై ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. 20న పుష్కరాల్లో పాల్గొననున్న సీఎం జగన్ తుంగభద్ర పుష్కరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి అదనపు పీఎస్ కె.నాగేశ్వరరెడ్డి ప్రభుత్వ అధికారులకు సర్క్యులేట్ చేశారు. -
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
సాక్షి అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాన్ని ధరించి దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనానికి రోజుకు పదివేలమందిని అనుమతిస్తారు. శనివారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ అనంతరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో దుర్గగుడి వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలపై దేవదాయశాఖ ఆంక్షలు విధించింది. కోవిడ్ నేపథ్యంలో ఇవీ మార్గదర్శకాలు.. ► మాస్క్ ధరించి, ఆన్లైన్ టికెట్, ఐడీ కార్డు ఉంటేనే క్యూలైన్లోకి అనుమతిస్తారు. పదేళ్లలోపు చిన్నారులను, 60 ఏళ్లు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. ► దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండే వారిని జర్వంతో బాధపడుతున్నదీ లేనిదీ పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే క్యూలైన్లోకి అనుమతిస్తారు. క్యూలైన్లో ఇతరులు తాకిన వస్తువులు తాకవద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. ► భక్తులు మంచినీటి బాటిల్స్ తెచ్చుకోవాలి. అత్యవసరాల కోసం క్యూలైన్లో మంచినీటి క్యాన్లు ఉంచారు. దుర్గాఘాట్, ఇతర ఘాట్లలో పుణ్యస్నానాలు, తలనీలాల సమర్పణ నిషేధించారు. ► భక్తులు తమ గ్రామాల్లోనే దీక్షల ఇరుముడులు సమర్పించాలి. పెద్ద శేషవాహనంపై మలయప్ప తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్రవారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలో పెద్ద శేష వాహన సేవ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి అలంకారంలో అనుగ్రహించారు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా, శ్రీమన్నారాయణుడికి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. స్వామి వారికి పానుపుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. ఉదయం బంగారు తిరుచ్చిపై శ్రీ మలయప్పస్వామి వారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. -
దేవదాయ శాఖ నిధుల మళ్లింపు అవాస్తవం
సాక్షి, అమరావతి: అమ్మఒడి పథకం కోసం దేవదాయ శాఖ నిధులు మళ్లించారంటూ బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారని.. అవన్నీ పూర్తి అవాస్తవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ‘జగనన్న అమ్మఒడి పథకం అమలుకు ఏ దేవాలయానికి సంబంధించిన నిధులుగానీ, భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలుగానీ, దేవదాయ శాఖ నిధులుగానీ ఉపయోగించలేదు. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు మాత్రమే ఉపయోగించాం. దీనిపై ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయం గమనించాలి’.. అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రకటనలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ► గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 42,33,098 మందికి జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరింది. వీరిలో 8,89,113 మంది ఓసీలు కాగా అందులో 17,611 మంది బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పిల్లలకూ లబ్ధి చేకూరింది. ► ఈ ఏడాది జనవరి 3న రూ.24.24 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ జీఓ నెంబరు 20 ద్వారా దేవదాయ శాఖకు అదనపు నిధులు కేటాయించింది. అదే నెల 6న దేవదాయ శాఖ వాటిని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జనవరి 17న మరోసారి రూ.2.16 కోట్లు ఇదే విధానంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు విడుదలయ్యాయి. ► బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు పాలనాపరమైన ఉత్తర్వులు, ప్రభుత్వ బడ్జెట్, నిధుల మంజూరు, దేవదాయ శాఖ ద్వారానే వస్తాయి. ఈ వాస్తవాన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు గుర్తించాలి. అది దేవాలయాల సొమ్ము కాదు దేవాలయాల సొమ్ము రూ.25 కోట్ల మేర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి తరలించిందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య కూడా ఒక ప్రకటనలో ఖండించింది. దేవదాయ శాఖలో ఒక భాగంగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులను మంజూరు చేసిందని.. కానీ, కొంతమంది దానిని దేవాలయాల సొమ్ముగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబులు పేర్కొన్నారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులు ఒకొక్కరికి రూ.5వేల చొప్పున ఇచ్చిన సహృదయులు సీఎం వైఎస్ జగన్ అని వారు ప్రశంసించారు. -
నేటి నుంచి శ్రీవారి దర్శనం
తిరుమల/సింహాచలం/సాక్షి, విజయవాడ: తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం భక్తులకు గురువారం నుంచి లభించనుండగా.. సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామి, విజయవాడలోని దుర్గగుడి దర్శనాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆయా ఆలయాల్లో భక్తులు భౌతికదూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకున్నారు. క్యూల ప్రవేశ మార్గాల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేశారు. దుర్గగుడిలో రోజూ ఐదారు వేల మంది భక్తుల్ని అనుమతించేందుకు ఏర్పాట్లు చేసినా తొలిరోజు బుధవారం 1321 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. కొండ దిగువనే భక్తులకు థర్మల్‌స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాకే కొండపైకి అనుమతిస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావులు అమ్మవార్ని దర్శించుకున్నారు. తిరుమలలో రోజూ 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు ► తిరుమలలో మూడు రోజుల పాటు టీటీడీ ప్రయోగాత్మకంగా దర్శనాలు ఏర్పాటు చేసింది. తొలి రెండు రోజులు టీటీడీ ఉద్యోగులను, బుధవారం స్థానికులను దర్శనానికి అనుమతించింది. లోటుపాట్లను పరిశీలించి గురువారం నుంచి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనుంది. ► గురువారం ఉదయం 6.30 నుంచి ఏడు గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ దర్శనం ముగిసిన వెంటనే సామాన్య భక్తులను అనుమతిస్తారు. ► శ్రీవారి దర్శనానికి అనుమతి ఉన్నట్టుగా టోకెన్‌ను చెకింగ్ పాయింట్ వద్ద చూపాకే భక్తులను అలిపిరిలోకి అనుమతిస్తారు. ► ఆ తర్వాత థర్మల్ స్క్రీనింగ్, పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేశాకే తిరుమలకు అనుమతిస్తారు. ► రోజూ ర్యాండమ్‌గా సుమారు 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ► టికెట్‌తో పాటు వారికి గదిని కేటాయించే సదుపాయాన్ని కల్పించారు. గదికి ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. -
నేటి నుంచి అన్నీ ఓపెన్
సాక్షి, అమరావతి: ఒకటి రెండు పరిమితులు తప్ప నేటి నుంచి రాష్ట్రంలో పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 23న లాక్‌డౌన్‌తో మొదలైన ఆంక్షలు ఒక్కొక్కటిగా సడలిస్తూ వచ్చిన ప్రభుత్వం.. జూన్ 8 సోమవారం నుంచి దేవాలయాలు, అన్ని మతాల ప్రార్థనా మందిరాలు, మాల్స్, హోటళ్లకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. వీటన్నిటిచోటా అందరూ మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. దీంతో సినిమా థియేటర్లు, బార్లు, కళా ప్రదర్శనలు, ఆటలు, బహిరంగ సభలు వంటివి తప్ప మిగిలినవన్నీ ప్రారంభం కానున్నాయి. దీనికి అనుగుణంగా గత వారం రోజుల నుంచి లాడ్జిలు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, మాల్స్ తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్లలో ప్రవేశ ద్వారం వద్దే శానిటైజేషన్ చేయడం, టేబుల్‌కు టేబుల్‌కు మధ్య దూరం ఉండే విధంగా చూడటం వంటి నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. విధులకు వచ్చే సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని.. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కాగా, ఏప్రిల్ 20 నుంచే ‘రీస్టార్ట్’ పేరుతో పరిశ్రమలు ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా షాపులకు.. ఇప్పుడు దేవాలయాలు, మాల్స్, హోటళ్లకు పచ్చజెండా ఊపింది. దీంతో పూర్తిస్థాయిలో వాణిజ్య లావాదేవీలు రాష్ట్రంలో మొదలైనట్లే. 80 రోజుల తర్వాత గుడిగంటలు రాష్ట్రంలో 80రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి. ఉ.6 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమ, మంగళవారాల్లో టీటీడీ సిబ్బందితో, బుధవారం తిరుమలలోని స్థానికులతో ట్రయల్ రన్ మొదలు పెట్టి, గురువారం (11వ తేదీ) నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అలాగే.. – రాష్ట్రవ్యాప్తంగా దేవదాయ శాఖ అధీనంలోని మిగిలిన అన్ని ఆలయాల్లోనూ సోమ, మంగళవారాల్లో ఆయా ఆలయాల సిబ్బంది, స్థానికులతో ట్రయల్ రన్ మొదలు పెట్టి, బుధవారం (10వ తేదీ) నుంచి పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. – అన్ని ఆలయాల వద్ద వద్ద టీటీడీ, దేవదాయ శాఖ కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లుచేశాయి. – దర్శన సమయంలో భక్తులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే స్పష్టంచేశాయి. – ధర్మల్ స్క్రీనింగ్ అయ్యాకే భక్తులను లోపలికి అనుమతించనున్నారు. – ఆలయ మండపంలో ఎప్పుడూ 30 మంది భక్తులు మించకుండా ఉంచుతూ, గంటకు 300 మందికి మాత్రమే దర్శనం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. -
రేపటి నుంచి ఆలయ దర్శనం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర నెలలుగా ఆలయాల్లో నిలిచిపోయిన భక్తుల దర్శనాలు సోమవారం (ఈనెల 8) నుంచి పాక్షికంగానూ.. బుధవారం నుంచి పూర్తిస్థాయిలోనూ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఆలయాల ఈఓలను ఆదేశిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఈ నెల 8, 9 తేదీల్లో ట్రయల్ రన్ విధానంలో ఆలయం ఉండే ప్రాంతంలోని స్థానికులకు మాత్రమే దర్శనాలకు అనుమతిచ్చి ఆ సమయంలో గుర్తించిన లోటుపాట్లను సరిచేసుకుని పదో తేదీ నుంచి పూర్తిస్థాయిలో దర్శనాలకు అనుమతి తెలపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భక్తులకు సూచనలు.. ► గంటకు 300 మంది భక్తులకు మించకుండా దర్శనాలకు అనుమతించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం, విజయవాడ దుర్గగుడి వంటి 11 పెద్ద ఆలయాలకు వెళ్లదలిచిన భక్తులు 12 గంటల ముందు తమ పేర్లను ఆలయ ఈఓ ఫోను నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. ► దర్శనానికి వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించి ఉండాలి. కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► క్యూలైన్ ప్రారంభంలో థర్మల్ స్క్రీనింగ్‌లో జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయితే లోపలికి అనుమతించరు. ► క్యూలైన్‌లోనూ ప్రతిఒక్కరు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. ► భక్తులు ఆధార్ లేదా ఏదైన గుర్తింపు కార్డు తీసుకురావాలి. ► 65 ఏళ్లు పైబడిన వారు, పదేళ్లలోపు పిల్లలు, గర్భవతులు రావొద్దు. విజయవాడ దుర్గ గుడి దర్శనం క్యూలైన్లలో భక్తులు భౌతికదూరం పాటించేలా మార్కింగ్ చేసిన దృశ్యం ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. ► సాధారణ పరిస్థితులు ఏర్పడేవరకూ కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి దేవాలయాల్లో కొంతకాలం తీర్థ ప్రసాదాల పంపిణీ, శఠగోపం వంటివి ఉండవు. ► నిత్యాన్నదానాలను కొంతకాలం అమలుచేయవద్దు. ► ఉ.6 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య కాలంలో మాత్రమే దర్శనాలకు అనుమతించాలి. ► కేవలం రెండే రెండు క్యూలైన్ల ద్వారా దర్శనాలకు అనుమతి. ఇందులో ఒకటి ఉచిత దర్శనం క్యూలైన్. ► భక్తులను అంతరాలయం, గర్భగుడిలోనికి మరికొంత కాలం పాటు అనుమతించరు. ► ఆలయ మండపంలో ఒకే సమయంలో 30 మంది భక్తులకు మించి ఉండకూడదు. ► ఆలయాల్లో భక్తులకు శానిటైజేషన్ ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. ► 50 ఏళ్ల పైబడి వయస్సు ఉండి, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ఆలయ సిబ్బందిని కార్యాలయ వ్యవహారాలకో లేదంటే రద్దీ తక్కువ ఉండే ప్రాంతాలలో విధులకు పరిమితం చేయాలి. భక్తులూ స్వీయ నియంత్రణ పాటించాలి : మంత్రి వెలంపల్లి ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుతో పాటు ఆ శాఖ అధికారులతో కలిసి మంత్రి శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 8వ తేదీ నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. కేశ ఖండనశాలలు తెరిచే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారు చిన్న పిల్లలను తీసుకురావద్దని మంత్రి కోరారు. -
మీ పేర్లేంటి.. అంతు చూస్తా..
సాక్షి, వరంగల్ రూరల్: జనగామ జిల్లా రఘునాథపల్లిలో అంగడి స్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సర్పంచ్, దేవాదాయశాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పంచాయితీ పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో సర్పంచ్ పోకల శివకుమార్‌పై దేవాదాయశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో విద్యుత్ శాఖ ఏఈ ఇచ్చిన ఫిర్యాదుతో సర్పంచ్‌పై కేసు నమోదవగా, తాజాగా మరో ఫిర్యాదు అందింది. దేవాదాయ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కందుల అశోక్‌కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని బస్టాండ్ వెనక ఉన్న దేవాదాయ శాఖ భూమిలో(2.11 ఎకరాలు) 2008 నుంచి అంగడి జరుగుతోంది. ప్రతి ఏటా టెండర్ ద్వారా నిర్వహణ బాధ్యతను అప్పగిస్తున్నారు. మార్చిలోనే టెండర్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నా.. లాక్‌డౌన్‌తో జాప్యం జరిగింది. ఈ నెల 1న టెండర్ నిర్వహించగా స్పందన రాకపోవడంతో శుక్రవారం మరోసారి బిడ్లు స్వీకరించాలని నిర్ణయించారు. కమ్యూనిటీ హాల్లో సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో ఎంపీఈఓ వేణుగోపాల్, జెడ్పీటీసీ మణికంఠ, ఎంపీటీసీ రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, ఉప సర్పంచ్ వాసుల సమక్షంలో టెండర్ ప్రక్రియను ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న దేవాదాయశాఖ ఈఓ శేషుభారతి, ఇతర అధికారులు 12 ఏళ్లుగా అంగడి నిర్వహిస్తూ దేవాదాయ శాఖకు పైసా ఇవ్వడం లేదని లీజు ప్రకారం రూ.21 లక్షల బకాయి చెల్లించాలని కోరారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి తీసుకున్న తర్వాతే టెండర్ నిర్వహించాలన్నారు. ఎస్సైకి ఫిర్యాదు చేస్తున్న ఈఓ శేషుభారతి దీంతో తీవ్రంగా స్పందించిన సర్పంచ్ సమావేశం జరుగుతుంటే కార్యాలయానికి వస్తారా..? ఇక్కడకు రావడానికి మీరెవరూ .. ఎందుకు వచ్చారు.. మీ అంతు చూస్తా ..? అని విరుచుకు పడ్డారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ అధికారులు, సర్పంచ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న ఎస్సై, ఇతర ప్రజాప్రతినిధులు ఇరువురికి నచ్చచెప్పారు. అనంతరం దేవాదాయశాఖ ఈఓ శేషుభారతి సర్పంచ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా అధికారినని చూడకుండా బెదిరింపులకు దిగాడని, కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. 12 ఏళ్ల క్రితం.. 12 ఏళ్ల క్రితం అంగడి నిర్వహణ కోసం దేవాదాయశాఖకు చెందిన భూమిని జీపీ లీజుకు తీసుకుని ఏటా రూ.25 వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి సర్పంచ్‌లు ఆ ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. రూ.21 లక్షల బకాయి ఉందని, అవి చెల్లించాకే టెండర్ నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులు పలుమార్లు పంచాయతీకి నోటీసులు పంపారు. దీంతో రూ.3.20 లక్షలు చెల్లిస్తానని సర్పంచ్ చెబుతూ వస్తున్నారు. కాగా, రూ.3.20 లక్షలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు అంగీకరించలేదు. మొత్తం బకాయి చెల్లించాలని, లేని పక్షంలో దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి తీసుకోవాలని సూచించారు. -
తిరుమల శ్రీవారి దర్శనానికి 8 నుంచి ట్రయల్ రన్
సాక్షి, అమరావతి/తిరుమల: లాక్డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి పునఃప్రారంభిస్తోంది. మొదట ప్రయోగాత్మక పరిశీలన కింద ట్రయల్ రన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అనుమతిచ్చింది. టీటీడీ ఆలయ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వినతి మేరకు రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ అనుమతి తెలియజేస్తూ మంగళవారం మెమో ఉత్తర్వులు జారీచేశారు. భౌతికదూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేయాలని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడ్రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ పద్ధతిలో దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ ట్రయల్ రన్ నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ కూడా సమ్మతి తెలియజేసినట్లు జేఎస్వీ ప్రసాద్ ఆ మెమోలో తెలిపారు. అనంతరం 10 లేదా 11 నుంచి సాధారణ భక్తులను అనుమతించే అవకాశముంది. ఈ సందర్భంగా అధికారులు పలు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. అవి.. ► క్యూలైన్, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో భక్తులు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ► అన్నప్రసాద కేంద్రం, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలో కరోనా నివారణ చర్యలు చేపట్టనున్నారు. ► తొలుత రోజుకు 8వేల నుంచి 10వేల మంది భక్తుల వరకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ► అనంతరం 20వ తేదీ నుంచి సుమారు 30 వేల మంది భక్తులను అనుమతించే అవకాశం ఉంది. అలాగే, అలిపిరి నుంచి ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి. ► సర్వదర్శనాలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ► అలిపిరి, మెట్ల మార్గంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. ► పుష్కరిణిలో స్నానాలకు భక్తులకు అనుమతిలేదు. ► శ్రీవారికి ఏకాంతంగానే సేవలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. మిగిలిన ఆలయాలపైనా సమీక్ష ఇదిలా ఉంటే.. దేవదాయ శాఖ ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ భక్తులకు తిరిగి దర్శనాలు ప్రారంభించడంపైనా ఆ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అలిపిరిలో థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే అనుమతి : వైవీ సుబ్బారెడ్డి తిరుపతి అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే భక్తులను తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి కూడా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. వీరికి అలిపిరి వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. -
ఆలయాల వద్ద అద్దె గదులు ‘సచివాలయం’లో బుకింగ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు వెళ్లే భక్తులు అక్కడ ఉండడానికి అవసరమైన అద్దె గదులను గ్రామ, వార్డు సచివాలయాలలోనే ముందస్తుగా బుక్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. అన్నవరం, శ్రీకాళహస్తి, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో స్వామి వారి సేవా టికెట్లను కూడా ముందస్తుగా పొందవచ్చు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను వలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు వాట్సాప్ మెసేజ్‌ల రూపంలో సమాచారం ఇస్తున్నారు. జూన్ 8వ తేదీ నుంచి అన్ని ఆలయాల్లో దర్శనాల పునఃప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో రాష్ట్రంలో టీటీడీ, దేవదాయ శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయ సేవలపై ప్రచారం.. ► ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలలో మొత్తం 540 రకాల సేవలు పొందేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాటు చేసింది. ► ఈ సేవలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా గ్రామ, వార్డు సచివాల య శాఖ, వలంటీరు శాఖలను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ► సచివాలయం ద్వారా ఏయే సేవలు పొందవచ్చో రాష్ట్రంలో ప్రతి కుటుం బానికి వాట్సాప్ ద్వారా ప్రచారం చేసేందుకు ఆయా శాఖలు ఇటీవలే ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి. ► మొదట వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాల అందరి ఫోను నంబర్లతో ఒక వాట్సాప్ గ్రూపును రూపొందిస్తున్నారు. ► ప్రభుత్వానికి సంబంధించి ప్రతి సమాచారం కూడా ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా అందరికీ తెలియజేస్తారు. ► ఆధార్ కేవైసీ, ఎలక్ట్రిక్ మీటర్ కనెక్షన్, ఓటర్ ఐడీ అప్లికేషన్, కుటుంబ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకం, ఎఫ్ఎంబీ కాపీ, ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్, ఈసీ కాపీ, కొత్త రైస్ కార్డు, రైస్ కార్డులో కొత్త పేర్ల చేరిక, బిల్డింగ్ ప్లాన్ ఆమోదం, పుట్టిన తేదీ, వివాహ, మరణ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి బస్‌పాస్, డ్రైవింగ్ లైసెన్స్‌ల స్లాట్ బుకింగ్ తదితర మొత్తం సేవల గురించి వలంటీర్లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. -
అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్లకు రూ.5వేల ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి/నెట్వర్క్: కోవిడ్ విపత్తు సమయంలో ఇబ్బందులు పడుతున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్లకు వన్‌టైమ్ ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా వారివారి ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నగదు జమ చేశారు. దీని ద్వారా 33,803 మంది అర్చకులు, 29,841 మంది పాస్టర్లు, 13,646 మంది ఇమామ్‌లు, మౌజన్లకు రూ.37.71 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. -
దేవుడి భూములు 1/4 ఆక్రమణలోనే
సాక్షి, అమరావతి: లీజుల పేరుతో కొన్ని.. అవేమీ లేకుండానే మరికొన్ని దేవుడి భూములు గత ఐదేళ్లలో పరాధీనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దేవుడి మాన్యాల్లో నాలుగో వంతు ఇప్పుడు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నాయి. దేవదాయ శాఖ పరిధిలోని గుడులు, సత్రాలు, మఠాల ఆధీనంలో 4,09,229.99 ఎకరాలు ఉండగా 1,19,615 ఎకరాలు ఆక్రమణదారుల అధీనంలో ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే విలువైన మరో లక్షన్నర చదరపు గజాల భూమి కూడా ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది. దీంతో కోట్ల రూపాయల ఆస్తులున్న ఆలయాలు కూడా ధూపదీప నైవేద్యాలకు నోచుకోక, పూజారులకు తిండిపెట్టలేని దుస్థితి నెలకొంది. సహకరించని గత ప్రభుత్వ పెద్దలు కృష్ణా, ఉభయ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో దేవుడి భూముల్లో దాదాపు సగం ఆక్రమణదారుల అధీనంలోకి వెళ్లాయి. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ఆలయాల ఈవోలు, దేవదాయ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు గత ప్రభుత్వ పెద్దల నుంచి సహకారం లేకపోవడంతో ఫలించలేదని అంగీకరిస్తున్నారు. కోర్టు కేసులతో అడ్డుకోవడం, కొన్నిసార్లు తీర్పులు వెలువడిన తర్వాత కూడా సహకరించని ఉదంతాలున్నాయి. కాగా దేవుడి భూముల పరిరక్షణ విషయంలో ఆక్రమణదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూములను విడిపించేందుకు దేవదాయ శాఖ పరిధిలోని ప్రత్యేక కమిటీలో ఐపీఎస్ అధికారిని కూడా నియమించాలనే యోచన ఉంది. దేవుడి భూముల రిజిస్టర్లన్నీ ఆన్‌లైన్‌లోకి.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు దేవదాయ శాఖ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రిజిస్టర్లన్నింటినీ స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసే ప్రక్రియ చేపట్టారు. ఆక్రమణలకు గురైన ఆస్తుల సత్వర రికవరీ కోసం దేవదాయ శాఖ చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఆక్రమణల తొలగింపు, పోలీసు శాఖతో మెరుగైన సమన్వయం, భద్రతపై సలహాల కోసం దేవదాయ శాఖకు ఎస్పీ స్థాయి అధికారిని డిప్యుటేషన్‌పై పంపే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. – ఆజాద్ (దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ – ఎస్టేట్స్) -
కోరుకున్న గుడిలో.. నచ్చిన పూజ
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలో ఉంటున్న వెంకటేశ్వరరావుకు సింహాచలం లక్ష్మీ నర్సింహస్వామిపై ఎంతో గురి.. గతంలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా పుట్టినరోజున కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి పూజ చేయించేవాడు. అలా చేయకపోతే.. ఆ ఏడాది పనులు సజావుగా సాగవని అతని నమ్మకం. ఇప్పుడు విదేశాల్లో ఉంటున్నందున పుట్టినరోజ నాడు ప్రతి ఏటా సింహాచలం వచ్చి పూజ చేయించడం సాధ్యం కాని పని. ఇలాంటి వారి కోసం రాష్ట్ర దేవదాయ శాఖ ఎన్నారై సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఎన్నారైలే కాదు.. దేశంలో ఎక్కడున్నా సరే.. మీపుట్టిన రోజు నాడో, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనే తమ ఇష్టదైవం ఆలయంలో పూజ, ఇతర సేవలు చేయించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుడు దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా.. వారి పేరిట కోరుకున్న తేదీన ఎంచుకున్న పూజను ఆలయ పూజారి జరిపిస్తారు. ఇందుకోసం అన్ని దేవాలయాల సేవల్ని ఒకచోట అందుబాటులోకి తెస్తూ.. ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పనకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో గుళ్లలోని వివిధ పూజల టికెట్ ధరకు అదనంగా కొంత మొత్తాన్ని సర్వీసు చార్జ్ రూపంలో వసూలు చేస్తారు. పూజ అనంతరం భక్తుడికి ప్రసాదం వంటివి పంపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. -
సత్యసాయి ట్రస్టుకు మరో పదేళ్ల పాటు మినహాయింపులు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలోని సత్యసాయి ట్రస్టుకు దేవదాయ శాఖ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఇస్తున్న మినహాయింపులను మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ట్రస్టు ఆదాయ వ్యయాలపై ఆ సంస్థకే స్వయంప్రతిపత్తి అధికారం కల్పించడం, ట్రస్టు నిర్వహణకు దేవదాయశాఖ నుంచి ఒక అధికారిని నియమించడం వంటి 25 సెక్షన్లకు సంబంధించిన మినహాయింపులు చాలా ఏళ్ల నుంచి అమలవుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌తో వీటి కాలపరిమితి ముగియడంతో మరో పదేళ్లు.. అనగా 2029 సెప్టెంబర్ వరకు ఈ మినహాయింపులను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మత విద్వేషాలకు చంద్రబాబు, పవన్ కుట్ర
సాక్షి, అమరావతి: మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కుట్రలు చేస్తున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనలేక అన్యమత ప్రచారం అంటూ ఆరోపణలకు దిగుతున్నారని తెలిపారు. పార్ట్నర్స్ ఇద్దరు వేరువేరుగా చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమా? అని మంత్రి సవాల్ విసిరారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బ్రిటిష్ వారి విభజించు పాలించు పాలసీని నల్ల దొరలు చంద్రబాబు, పవన్‌లు అనుసరిస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో, పచ్చ మీడియాలో కావాలని చంద్రబాబు, పవన్.. సీఎంపై విష ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలు, అర్చకుల అభివృద్ధికి రూ.234 కోట్లు మొదటి బడ్జెట్లో కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దని చెప్పారు. చంద్రబాబు ఇసుక దీక్షకు 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో 15 మంది రాలేదని, దీక్షకు వారి మద్దతు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి అన్ని విధాలుగా అడుగులు వేస్తూ.. సీఎంపై మతపరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ భవానీ ఐల్యాండ్‌లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నిర్మాణం చేసిన తోరణం చూసి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. అర్చకులకు చంద్రబాబు ఏనాడైనా మేలు చేశారా?: మల్లాది విష్ణు చంద్రబాబు విజయవాడలో 40 దేవాలయాలు కూలదోస్తే, సీఎం వైఎస్ జగన్ నిర్మిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్‌కల్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అర్చకుల మేలు గురించి ఏనాడైనా చంద్రబాబు ఆలోచించారా? అని ప్రశ్నించారు. అర్చకులకు సంబంధించిన జీవో నంబర్ 76ను ఎందుకు అమలు చేయలేదని విష్ణు నిలదీశారు. అవినీతి రాజధాని కాంట్రాక్ట్ పనిలో రూ.150 కోట్లు లంచం తీసుకున్న నేత ఎవరో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. సోషల్ మీడియాలో మితిమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు రోడ్లపైకి వచ్చి గగ్గోలు పెట్టడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. -
ఏపీలో అర్చక పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : ఈ ఏడాది జూలైలో నిర్వహించిన అర్చక పరీక్షకు సంబంధించిన ఫలితాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనావాస్ గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘనతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిషనర్ పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. మొత్తం 7687 మంది అభ్యర్థులకు గానూ 4396 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. కాగా, పరీక్షలో ఫేయిలయిన వారికి సప్లిమెంటరీ నిర్వహిస్తామని వెల్లడించారు. 2013 తర్వాత రాష్ట్రంలో అర్చకులకు పరీక్షలు నిర్వహించలేదని , ఇక మీద ప్రతి ఏటా అర్చకులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అంతేగాక జగన్ ముఖ్యమంత్రి కాగానే అర్చకులకు పరీక్షలు నిర్వహించాలని సూచించినట్లు గుర్తుచేశారు. ఈ అర్చక పరీక్షల ద్వారా విదేశాల్లో విరివిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. అర్చకత్వం చేసుకునేవారికి పట్టా లభించడంతో పాటు ఉద్యోగాలు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. -
అర్చకుల కల సాకారం
సాక్షి, అమరావతి: ఒక గుడిని నమ్ముకొని దశాబ్దాలపాటు అర్చకత్వం చేసుకుంటూ జీవించే అర్చక కుటుంబాల ఏళ్ల నాటి కలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది. అలాంటి ఆలయాల్లో ఆ అర్చక కుటుంబమే వంశపారంపర్యంగా అధికారికంగా అర్చకత్వం కొనసాగించుకోవడానికి ఆమోదం తెలుపుతూ సోమవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మినహా దేవదాయ శాఖ పరిధిలో ఉండే 6 (ఏ), 6 (బీ), 6 (సీ) ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ పథకం అమలవుతుంది. 1966 నాటి దేవదాయ శాఖ చట్టం ప్రకారం.. ఏదైనా ఆలయంలో అర్చకులుగా చేరినవారి కుటుంబాలకు ఆ ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వం చేసుకోవడానికి అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వంశపారంపర్య అర్చకత్వానికి తమ ఆలయ వివరాలతో దేవదాయ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత కాలంలో ఏదైనా ఆలయంలో నిర్ణీత జీతభత్యాల మేరకు నియమితులైతే వంశపారంపర్య అర్చకునిగా కొనసాగుతారో.. లేదంటే నియమితులైన చోట పనిచేస్తారో ఎంచుకునే వీలు అర్చకులకే కల్పించారు. ఏ ఆలయానికి ఎవరు వంశపారంపర్య అర్చకత్వానికి అర్హులో తేల్చుతూ దేవదాయ శాఖ కమిషనర్ పారదర్శకంగా ఒక జాబితాను తయారు చేస్తారు. అర్హత ఉన్న అర్చకులు, కుటుంబ సభ్యుల సర్టిఫికెట్, కుటుంబ వారసత్వ పట్టిక, అందుకు సంబంధించిన అఫిడవిట్లను దేవదాయ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. వంశపారంపర్య అర్చకత్వానికి గుర్తింపు పొందిన వారు.. తమ తదనంతరం వారసులుగా ఎవరు కొనసాగుతారో తెలపాలి. వంశపారంపర్య అర్చకుడిగా నియమించాలంటే కనీస వయసును 16 ఏళ్లుగా నిర్ణయించారు. ఒక ఆలయంలో వంశపారంపర్య అర్చకత్వానికి అర్హత ఉన్న కుటుంబం వేరొక ఆలయానికి బదిలీపై వెళ్లడానికి అనుమతించరు. రూ.ఐదు లక్షల ఆదాయం లోపు ఉన్న ఆలయాల్లో వంశపారంపర్య అర్చకత్వంలో సెక్షన్ 144 అమలుకు మినహాయింపునిచి్చ.. కొత్త నిబంధనలు రూపొందిస్తారు. ధారి్మక పరిషత్ నియమ నిబంధనలకు అనుగుణంగా వంశపారంపర్య అర్చకులకు అందించే ప్రయోజనాలను ఆలయాల వారీగా ప్రత్యేకంగా పేర్కొంటారు. 12 ఏళ్ల తర్వాత విధివిధానాలు ఖరారు వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలుపుతూ 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేవదాయ శాఖ చట్టానికి చట్ట సవరణ తీసుకొచ్చారు. దీనికనుగుణంగా పూర్తి విధివిధానాలతో తుది ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియ ముగియక ముందే ఆయన దివికేగారు. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అర్చకులను మోసం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. మూడేళ్లపాటు మాయమాటలతో మభ్యపెట్టి అర్చకుల తీవ్ర ఒత్తిడితో 2017, ఫిబ్రవరి 16న వంశపారంపర్య అర్చకత్వం అమలుపై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయించారు. అభ్యంతరాలు స్వీకరించాక తుది నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి మరోసారి మోసపుచ్చారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాదయాత్రలో అర్చకులు కలిసినప్పుడు ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే వంశపారంపర్య అర్చకత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇచి్చన మాటను నిలబెట్టుకున్నారు. దేవాలయాల రక్షణకు దోహదం వంశపారంపర్య అర్చకత్వం అమలుకు ఆమోదం తెలపడం పట్ల అర్చక కుటుంబాలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయని టెంపుల్స్ ప్రొటెక్షన్ మూమెంట్ కన్వీనర్ ఎంవీ సౌందర్యరాజన్, సీఎస్ రంగరాజన్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సానుకూల చర్యలు దేవాలయాలను రక్షించడానికి సహాయపడతాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు అర్చకులందరి ఆశీస్సులు పుష్కర కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌కు అర్చకులందరి ఆశీస్సులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది. దివంగత సీఎం వైఎస్సార్ చేసిన చట్టాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చంద్రబాబు కూడా మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చారని అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్రిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి పెద్దింటి రాంబాబు, తదితరులు విమర్శించారు. ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, బ్రాహ్మణ సంఘాల నేత ద్రోణంరాజు రవికుమార్ కూడా వేర్వేరుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ముదావహం అర్చకుల వారసత్వపు హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయం ముదావహమన్నారు. అర్చకుల జీవితాల్లో మార్పుకు నాంది పలుకుతుందన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయ వ్యవస్థను కాపాడటంలో అర్చకుల పాత్ర చాలా గొప్పదని తెలిపారు. హిందూ, ధార్మిక, దేవదాయ ధర్మాదాయ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం ఇదే కృషిని కొనసాగించాలన్నారు. కాగా, అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్య పరిష్కారమవ్వడంతో అర్చకుల జీవితాల్లో ఇక వెలుగులు నిండుతాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు. -
దేవుడికి రాబడి!
సాక్షి, రంగారెడ్డి : దేవాదాయ శాఖ భూములను అధికారులు కౌలు కోసం బహిరంగ వేలం వేస్తున్నారు. దశాబ్దాలుగా ఇతరుల చేతుల్లో ఉన్న భూములను జిల్లా ఎండోమెంట్‌శాఖ స్వాధీనం చేసు కుంటోంది. కౌలు రూపంలో వచ్చిన డబ్బులను ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలతో పాటు పలు అభివృద్ధి నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యాలు డబ్బులు చెల్లిస్తున్నా.. దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల విస్తరణ సాధ్యపడటం లేదు. కొన్ని దేవాలయాలకు ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు ఉన్నా ఆదాయం అంతంతే లభిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలో పేరుకు 15,997 ఎకరాల భూమి ఉన్నా ఆశించిన స్థాయిలో రాబడి లేదు. వందల మంది రైతులు దేవుడి మాన్యాలను సాగుచేసుకుంటున్నా కౌలు చెల్లించడం లేదని సంబంధిత అధికారులు గుర్తించారు. ఏళ్లుగా భూములను సాగు చేసుకోవడండం, పోటీ లేకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొంటున్నారు. దీనికి స్వస్తి పలకాలని యంత్రాంగం నడుం బిగించింది. ఇప్పటి వరకు రూ.20 లక్షలు దేవాలయాల వారీగా భూమి లెక్కలు సేకరించిన దేవాదాయ శాఖ అధికారులు.. మొదటగా పొలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సదరు భూముల్లో హద్దురాళ్లు, దేవాదాయశాఖ పేరిట బోర్డులు పాతుతున్నారు. ఇప్పటివరకు 2,615 ఎకరాల భూమిని తమ శాఖ ఆధీనంలోకి తెచ్చారు. ఈ భూముల కౌలు కోసం బహిరంగ వేలం వేస్తున్నారు. ఈఏడాది ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ మొదలు పెట్టగా.. ఇప్పటివరకు 15 చోట్ల దాదాపు 500 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి కౌలు కోసం వేలం వేశారు. వేలం పాటలో ఒకసారి దక్కించుకుంటే రెండేళ్లపాటు సాగుచేసుకోవచ్చు. అయితే, కౌలు చెల్లించాకే పంటలు సాగుచేసుకోవాలని నిబంధన విధించారు. దీంతో వేలంలో భూములు దక్కించుకున్న రైతులు ముందస్తుగా కౌలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు కౌలు రూపంలో ఆయా దేవాలయాలకు సుమారు రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. త్వరలో మిగిలిన భూముల కౌలు వేలానికి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మంచి స్పందన వస్తోంది.. దేవాదాయ శాఖకు చెందిన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుని కౌలు కోసం బహిరంగ వేలం వేస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తోంది. ఆయా ఆలయాలు ఆర్థికంగా పరిపుష్టి అవుతున్నాయి. ఫలితంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి వీలుగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ఇప్పటివరకు 500 ఎకరాలను కౌలు కోసం వేలం వేశాం. ఆలయాలకు చెందిన ప్రతి ఎకరాన్ని స్వాధీనం చేసుకుంటాం. – సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా దేవాదాయ శాఖ -
‘బాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మిస్తాం’
సాక్షి, విజయవాడ : దేవాలయాల దీప దూపా నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం దేవాదాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ, దేవావలయాల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవాదాయశాఖలో ఖాళీలు అన్ని భర్తీ చేస్తామని, అర్చకులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా ప్రతి భక్తుడికి దేవాలయాలు అందుబాటులో ఉండేలా చేస్తామని, సూరయ్యపాలెంలో సుమారు 10 ఎకరాల భూమిని టీడీపీ ఇష్టం వచ్చిన వారికి దరాదత్తం చేశారని మండిపడ్డారు. ఆ భూములపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని, వాటిపై విచారణ జరిపిస్తామని అన్నారు. చంద్రబాబు హయాంలో తన బినామీలకు ఇష్టానుసారంగా భూములు కేటాయించారని, ప్రస్తతం ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబుకు దేవుళ్లంటే భయం లేదని, బాబు కూల్చి వేసిన దేవాలయాలను త్వరలోనే నిర్మిస్తామని పేర్కొన్నారు. -
‘సదావర్తి’లో అక్రమాలపై విజి‘లెన్స్’
సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీ నేతలకు సదావర్తి సత్రం భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సత్రం పేరిట చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాలను అతి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడంతో భూముల అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది. అప్పట్లో జరిగిన వేలం ప్రక్రియలో అవకతవకలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు విచారణకు ఆదేశిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్సింగ్ జీవో జారీ చేశారు. భూముల అమ్మకానికి అప్పట్లో ప్రభుత్వ పరంగా, దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను విజిలెన్స్ అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రెడ్డెమ్మ సొమ్ముకే ఎసరు
మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయ ఆదాయంలో రూ.4.5 కోట్ల నిధులు గోల్మాల్ జరిగాయి. నాలుగేళ్లుగా ఆలయ ఆదాయ, వ్యయ వివరాల రికార్డులను అధికారులు మాయం చేశారు. హుండీ ఆదాయం లెక్కించే సమయంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లడ్డూ తయారీలో గతంలో వేలం పాటలు నిర్వహించే పద్ధతికి స్వస్తి చెప్పి అధికారులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. సాక్షి, గుర్రంకొండ(చిత్తూరు) : రాయలసీమలోనే సంతాన దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ రెడ్డెమ్మ కొండ ఆలయంలో నాలుగేళ్లుగా ఆదాయ లెక్కల వివరాలు గల్లంతయ్యాయి. ఆలయ అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి భద్రపరచాల్సిన దేవాదాయ శాఖ అధికారులు చేతివాటం ప్రదర్శించారు. హుండీ ఆదాయం లెక్కింపులో నిబంధనలు పాటించడం లేదు. దేవాదాయశాఖకు చెందిన వారిని కాకుండా తమకు అనుకూలమైన వ్యక్తులతో, విద్యార్థులతో హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు. హుండీ ఆదాయం లెక్కింపులో కొంతమంది రూ.2వేలు, రూ.500 నోట్లు మాయం చేస్తున్నారు. బంగారం అసలైనదా కాదా అని నిర్ధారించడానికిగానూ ప్రయివేట్ అప్రైజర్లను తీసుకొచ్చి స్వాహా చేస్తున్నారు. దొడ్డిదారిన నియామకాలు గత ప్రభుత్వ హయాంలో అమ్మవారి ఆలయంలో ఉద్యోగులను దొడ్డిదారిని నియమించేశారు. జీవో నెంబరు 19 సాకుగా చూపించి అప్పుడు పనిచేసే ఈవోనే స్వయంగా ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం గమనార్హం. ఒక్కొక్కరికి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు జీతాలు చెల్లిస్తూ మొత్తం 12 మందిని ఆలయంలో ఉద్యోగులుగా నియమించారు. నాలుగేళ్లుగా మారిన తంతు కాంట్రాక్టర్లు లడ్డూ తయారీని సక్రమంగా నిర్వహించడం లేదనే సాకుతో వేలం పాటలు నాలుగేళ్ల క్రితం రద్దు చేశారు. అప్పటి నుంచి దేవాదాయశాఖ అధికారులే లడ్డూల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మవారి లడ్డూ బరువు 80 గ్రాముల బరువు ఉండాలి. అయితే ప్రస్తుతం విక్రయిస్తున్న లడ్డూ బరువు 60 గ్రాముల లోపే ఉంది. లడ్డూల విక్రయం ద్వారా ఏడాదికి రూ. 24 లక్షల నుంచి రూ. 26 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఒక్కో లడ్డూ ధర రూ. 10గా నిర్ణయించి విక్రయిస్తుంటారు. నిబంధనల మేరకు లడ్డూ ప్రసాదాల తయారీ ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రయివేట్ వ్యక్తుల వద్ద లడ్డూలను అధికారులు కొనుగోలు చేసి ఆలయానికి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల వివరాలు లేవు 2014–2018 వరకు రెడ్డెమ్మకొండ ఆదాయ, ఖర్చు వివరాలు అందుబాటులో లేవు. గతంలో పనిచేసిన అధికారులు వాటిని ఇక్కడ స్వాధీనం చేయలేదు. దీంతో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మావద్ద లేవు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులను అప్పుడు పనిచేసే ఈవో నియమించారు. లడ్డూ తయారీని కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా మేమే స్వయంగా తయారు చేయించి ఆలయంలో విక్రయిస్తున్నాం. – మునిరాజ, శ్రీరెడ్డెమ్మకొండ ఈవో -
టీడీపీ హయాంలోనే ఆ టికెట్ల ముద్రణ
సాక్షి, అమరావతి: తిరుమల ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రకటనల ముద్రణ వ్యవహారంపై తక్షణ విచారణకు ఆదేశించినట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఆ టికెట్లు టీడీపీ హయాంలోనే ముద్రించినట్టు తేలిందని.. ఎన్నికలకు ముందు ఆ టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందని పేర్కొన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన ఆ టికెట్లు తిరుపతి డిపోకు వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారని.. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. మతపరంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని సీఎం జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం, సంబంధిత వ్యక్తులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని మంత్రి ఆరోపించారు. దురుద్దేశపూర్వక ప్రచారం ద్వారా శ్రీవారి భక్తుల మనసులను గాయపరిచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కొన్ని టీవీ చానళ్లు, వ్యక్తులు ఈ వ్యవహారాన్ని రాజేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన అంశాల్లో ప్రభుత్వానికి లేని దురుద్దేశాలను అంటగట్టి విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా? హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెలంపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే గతంలో 40 ఆలయాలను కూలగొట్టారన్నారు. సదావర్తి సత్రం భూములు కాజేయాలని చూసింది, కనకదుర్గమ్మ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్ర పూజలు చేయించింది, దుర్గమ్మ భూముల్ని తన వారికి అతి తక్కువ ధరకే లీజుకిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు దుర్మార్గాలూ చేశారు కాబట్టే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారన్నారు. వీటిలో చాలా దుర్మార్గాలు జరిగిన సమయంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నది మాణిక్యాలరావేనని, ఆయన కూడా ఇవే మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా? హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెలంపల్లి ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే గతంలో 40 ఆలయాలను కూలగొట్టారన్నారు. సదావర్తి సత్రం భూములు కాజేయాలని చూసింది, కనకదుర్గమ్మ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్ర పూజలు చేయించింది, దుర్గమ్మ భూముల్ని తన వారికి అతి తక్కువ ధరకే లీజుకిచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు కలియుగ దైవానికి సంబంధించిన బంగారాన్ని లారీల్లో తరలించటం వరకు దుర్మార్గాలూ చేశారు కాబట్టే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారన్నారు. వీటిలో చాలా దుర్మార్గాలు జరిగిన సమయంలో దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నది మాణిక్యాలరావేనని, ఆయన కూడా ఇవే మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. అది టీడీపీ ప్రభుత్వ తప్పిదమే : మంత్రి పేర్ని మచిలీపట్నం టౌన్: తిరుమల టిక్కెట్లపై అన్యమత ప్రకటనల వ్యవహారం గత టీడీపీ ప్రభుత్వ తప్పిదమేనని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. శుక్రవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ టిక్కెట్లకు ఉపయోగించే పేపర్ రోల్ వెనుక జెరూసలెం, మక్కా యాత్రలకు సంబంధించి మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రకటన ముద్రించిందని తెలిపారు. దానిని తిరుమల బస్సులో ఓ కండక్టర్ వినియోగించారన్నారు. ఈ విషయం గురువారం ఉదయం 11 గంటలకు తన దృష్టికి రాగా.. వెంటనే ఆ రోల్‌ను వినియోగించకుండా నిలిపివేశామన్నారు. గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేందుకు టికెట్ రోల్స్‌పై వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రకటనలు ముద్రించిందని తెలిపారు. దానిని కిందిస్థాయి ఉద్యోగి కండక్టర్‌కు పొరపాటున ఇవ్వటం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. ఇవేమీ తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు కావని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ఉన్న ఓ రోల్‌ను ఆర్టీసీ సిబ్బంది ఏమరుపాటుగా వినియోగించడాన్ని రాద్ధాతం చేయడం తగదన్నారు. రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకోవటం దురదృష్టకరం, దిగజారుడు తనమని పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారంతా ఆపాలని హితవు పలికారు. -
చారిత్రాత్మక నిర్ణయాలతో.. రాష్ట్రం ప్రగతి పథంలో..
సాక్షి, ఒంగోలు మెట్రో: దేవదాయ, ధర్మాదాయ శాఖ ప్రతిష్టను పెంచుతామని, అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఒంగోలు వచ్చిన మంత్రి పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ క్రమంలో సాయంత్రం ఏడు గంటలకు ఒంగోలు కొండ మీద శ్రీ ప్రసన్న చెన్నకేశవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాలయాల్లో పవిత్రతను కాపాడుతామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన చేయటానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కోరిన విధంగా దేవుడు సహకరించాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించామన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రూ.230 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆస్తులు పరిరక్షించటానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతామన్నారు. ప్రగతి పథంలో రాష్ట్రం.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దశల వారీగా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పయనింపజేస్తున్నారని మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేయటం ఈ ప్రభుత్వ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు. మరో పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్చక సంక్షేమ సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని, అర్చకుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతామన్నారు. అదేవిధంగా ఆలయాలలో నిత్య ధూప దీప నైవేధ్యాలకు నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అర్చకులకు సొంత గృహాల కల నెరవేర్చేందుకు కృషి చేయటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆయన త్రోవగుంటలోని శివాలయం, వైష్ణవాలను సందర్శించారు. ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు పరాంకుశం రామనాథాచార్యులు, ఆలయ అధికారులు మంత్రిని సత్కరించి ఆశీర్వచనాలు చేశారు. కాగా మంత్రి వెంట ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, సూపర్‌బజార్ మాజీ తాతా ప్రసాద్‌లతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు ఉన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, సహాయ కమిషనర్ డి.సుబ్బారావు, ఇవో కట్టా ప్రసాద్, ఒంగోలు ఆర్డీవో పి.కిషోర్, తహసీల్దార్ చిరంజీవి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రిని కలిసిన అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు.. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి దర్శనం సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావును జిల్లా అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి పలు సమస్యలు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా ధార్మిక పరిషత్తును పునః ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు. అదేవిధంగా దేవదాయ శాఖ చట్టం 144 ప్రకారం ప్రతి ఆలయానికి వొనగూరవలసిన ప్రయోజనాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని, జీవో నెంబర్ 76 ఫైనల్ నోటిఫికేషన్ వెలువరించాలని వారు విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో అర్చక సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోమరాజుపల్లి నాగేశ్వరరావు, ఎంవీ శేషాచార్యులు తదితరులు ఉన్నారు. మంత్రి వెలంపల్లి పర్యటన ఇలా.. ఒంగోలు సిటీ: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం కూడా జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఒంగోలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగర శివారు త్రోవగుంటకు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు లాయరుపేటలోని సాయిబాబా మందిరం సందర్శిస్తారు. బాబా పూజలో పాల్గొంటారు. 8.30 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ రంగుతోటలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొంటారు. 9.30 గంటలకు చీమకుర్తి వెళ్తారు. 10.30 గంటలకు చీమకుర్తి రీచ్ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మానంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చీమకుర్తి నుంచి బయల్దేరి ఒంగోలు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతి వెళ్తారు. రాత్రికి తిరుపతిలో బస చేస్తారు. -
సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి : ఆలయాలు, ట్రస్టుల్లో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలన్న సీఎం వైఎస్ జగన్ మరో విప్లవాత్మకమైన నిర్ణయానికి శాసనసభ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు ఇక నుంచి అగ్ర ప్రాధాన్యం దక్కనుంది. వాటి పాలక మండళ్లలో 50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ గురువారం ఆమోదించింది. అదే విధంగా మొత్తం పదవుల్లో 50శాతం మహిళలకు కేటాయించేలా ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణకు కూడా అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అలాగే, ఆలయాల ఆస్తుల పరిరక్షణ, ప్రతిష్టను కాపాడే దిశగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. ‘ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మత సంస్థలు–ఎండోమెంట్స్ చట్టం–1987’కు సవరణ బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాలను సభకు వివరించారు. సభ్యులు ఈ బిల్లుకు మద్దతిస్తూ ప్రసంగించారు. అనంతరం ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దాంతో ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించనున్నారు. అదే విధంగా అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా ప్రభుత్వం నియమించే మొత్తం సభ్యులలో 50 శాతం పదవులు మహిళలకే రిజర్వ్ చేయనున్నారు. ఈ మేరకు ఈ బిల్లుకు సవరణను కూడా శాసనసభ ఆమోదించింది. అక్రమాలకు పాల్పడితే ఔటే ఇక ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్ల సభ్యులు ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తించినా, అక్రమాలకు పాల్పడినా ప్రభుత్వం వారిని రెండేళ్ల పదవీకాలం కంటే ముందే తొలగించడానికి ఈ బిల్లు ఆమోదం ద్వారా మార్గం సుగమమైంది. ఆలయాలు, ట్రస్టుల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తి అధికారాలను ఇచ్చింది. కాగా, తిరుపతి పట్టణాభివృద్ధి, ప్రాధికార సంస్థ (తుడా) చైర్మన్‌ను టీటీడీలో పదవి రీత్యా సభ్యునిగా నియమించేందుకు చట్టంలో సవరణను సభ ఆమోదించింది. ఆలయాల ప్రతిష్ట కాపాడటమే లక్ష్యం సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అగ్ర ప్రాధాన్యం ఇస్తూ వారికి సామాజిక గౌరవం తీసుకురావాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధాంతం. అందుకే ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో కూడా ఆ వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఆలయాల ఆస్తుల పరిరక్షణకు ఇది ఉపకరిస్తుంది. రెండేళ్ల పదవీకాలం ఉంది కదా అనే ధీమాతో అనుచితంగా ప్రవర్తించే పాలక మండలి సభ్యుల ఆటకట్టిస్తుంది. అలాంటి వారిని పదవుల నుంచి ప్రభుత్వం తొలగించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. – వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆలయాల ప్రతిష్ట, ఆస్తుల పరిరక్షణకు అవకాశం దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు, ప్రతిష్టను కాపాడేందుకు ప్రభుత్వానికి ఈ బిల్లు ద్వారా పూర్తి అధికారాలు దక్కుతాయి. ఎవరైనా పాలకమండలి సభ్యుడు అవినీతికి పాల్పడినా.. భక్తులు, ఇతరులతో అనుచితంగా ప్రవర్తించినా వారిని తొలగించేందుకు ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. చంద్రబాబు పాలనలో విజయవాడ దుర్గగుడి పాలక మండలిలో ఓ సభ్యురాలు అమ్మవారి చీరలను అమ్ముకున్నారు. మరో సభ్యుడు క్షురకులను దూషించారు. కానీ, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇలాంటి వాటిని సహించబోమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ -
అహోబిలంలో ఆధిపత్య పోరు
సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మఠం, దేవదాయ శాఖ అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో భక్తులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శతాబ్దాలుగా తమ ఆధ్వర్యంలోనే దేవస్థానం నడుస్తోందని, సర్వహక్కులు తమవే అని మఠం అధికారులు అంటుండగా.. దశాబ్దాలుగా ఇక్కడ దేవదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలోనే ఈఓ ఉంటూ సిబ్బందిని నియమించి పరిపాలన కొనసాగిస్తున్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరివురి మధ్య ఆధిపత్య పోరులో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరి దారి వారిదే... దేవస్థానంలో సాగుతున్న ఆధిపత్య పోరుతో ఎవరిదారి వారిదే అయింది. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని సుమారు 20 ఏళ్లకు పైగా దేవస్థానంలో పనిచేస్తున్న పావన, సురేంద్ర అనే ఇద్దరు సీనియర్ సిబ్బందికి ఈ నెల వేతనం పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా వారిని విధుల నుంచి తొలగించేందుకు మఠం వర్గాలు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు మఠం నుంచి ఆర్డర్ కాపీ తయారు చేసి ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోలేదు. తాము దేవస్థాన సిబ్బందిగా ఈఓ చెప్పినట్లు నడుచుకుంటున్నాం.. తప్ప తమ సొంత నిర్ణయం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితే వస్తుందని సిబ్బందిని, పూజార్లను మఠం అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దేవదాయ తరఫున ఆరుగు సిబ్బందిని నియమించగా.. తమ అనుమతి లేదంటూ మఠం అధికారులు వారికి వేతనాలు ఇవ్వలేదు. దీనికి తోడు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం రూ. 4000, రూ.5000 మాత్రమే వేతనం ఇస్తున్నారు. మఠం తరఫున ఈ మధ్య నియమించుకున్న సిబ్బందికి మాత్రం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు జీతం ఇస్తున్నారని దేవస్థాన వర్గాలు ఆరోపిస్తున్నాయి. సందట్లో సడేమియా.. దేవదాయ, మఠం అధికారుల మధ్య ఆధిపత్య పోరు కొందరి సిబ్బందికి కలసి వస్తోంది. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు డ్యూటీలు వేసుకుంటూ..అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా 20 రోజుల నుంచి హుండీ డబ్బులు, టిక్కెట్ సొమ్ములు, వెండి, బంగారు కానుకలు సైతం కొందరు సిబ్బంది జమ చేయకుండా దగ్గర ఉంచుకున్నట్లు సమచారం. గతంలో మాదిరిగా రోజూ సాయంత్రం జమ చేయకుండా ఎక్కడ ఉంచుతున్నారో కూడా చెప్పలేదనే మఠం ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రేక్షక పాత్రలో దేవదాయ శాఖ ఈఓ పాలన తమకు వద్దు అంటూ ఖరాకండిగా చెపుతుండటంతో పాటు ఇక్కడి ఖర్చు, ఆదాయానికి సంబంధించి అంతా మఠం స్వాధీనం చేసుకుంది. కేవలం ఈఓ పేక్షక పాత్రలో ఉన్నట్లుగా ఉంది. కనీసం ఓ రూపాయి ఖర్చుపెట్టాలన్న మఠం అనుమతి తప్పనిసరి. ఈఓ ఎక్కడికైనా కారులో వెళ్లాలన్నా మఠం అనుమతి తీసుకుని ఓచర్ రాసి డబ్బులు ఇప్పించుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా.. దేవదాయ ధర్మదాయ శాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు. సరైన సమాధానం చెప్పనందుకే చర్యలు టిక్కెట్, హుండీ సొమ్ములు అందరూ వచ్చి కార్యాలయంలో జమ చేస్తున్నారు. అయితే ఇద్దరు ఉద్యోగులు 20 రోజుల నుంచి వీటిని ఎక్కడ పెడుతున్నారో చెప్పడం లేదు. దీనిపై మెమో ఇస్తే సరైన సమాధానం చెప్పలేదు. ఈఓ జమ చేయమన్నాడని చెబుతున్నారు. అదే రాసివ్వమంటే రాసివ్వడంలేదు. దీంతో జమ చేసుకున్న పవన్, సురేంద్రల వేతనం నిలిపివేశాం. ఇద్దరిని సస్పెండ్ చేసేందుకు ఆర్డర్ తయారు చేసి ఇస్తుంటే వారు తీసుకోలేదు. దీనిపై మఠం ఉన్నత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – భద్రినారాయణ్, మఠం మేనేజర్ -
ముగిసిన ‘వేంకటేశ్వర’ వివాదం
సాక్షి, నేలకొండపల్లి: కొంత కాలంగా శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో మరో విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగుతోంది. స్థానిక శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం పూజారి లక్ష్మినర్సయ్య సొంత ఖర్చులతో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని దేవాలయంలో ఏర్పాటు చేయించేందుకు పూనుకున్నారు. ఈ విషయంలో ఎవరినీ సంప్రందించకుండానే ప్రతిమను తీసుకొచ్చి దేవాలయంలో ఉంచారు. ఈ విషయాన్ని అక్కడి ఈఓకు, సంబంధిత ఆలయ పూజారికి చెప్పినట్లు లక్ష్మినర్సయ్య వివరించారు. కాగా అసలు ఆ విషయం తమకేమీ తెలియదని మాతో చర్చించలేదని ఈఓ, పూజారులు తెలిపారు. దీంతో ఈ వివాదం కొంత కాలంగా కొనసాగుతోంది. వీరికి తోడు గ్రామ పెద్దలు రెండు వర్గాలకు మద్దతు ఇవ్వటంతో వివాదం తారా స్థాయికి చేరింది. కమిషనర్‌కు ఫిర్యాదులు అందటంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ దేవాదాయశాఖ స్థపతి వల్లి నాయగాన్ని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శనివారం స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గ్రామ సభను నిర్వహించారు. రెండు వర్గాల వారు వారి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా స్థపతి వల్లి నాయగం మాట్లాడుతూ.. ఒకే దేవాలయంలో రెండు విగ్రహాలు ఉండకూడదన్నారు. ఇతర దేవుళ్ల విగ్రహాలు ఉండవచ్చు కానీ అదే దేవుళ్ల విగ్రహాలు రెండు ఉండకూడదని అన్నారు. దాని వల్ల దేవాలయం సానిధ్యాం పోతుందని అన్నారు. సాంప్రదాయం, నియమ నిబంధనలు పాటించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వయంభుగా వెలిసినందున్న మరో విగ్రహం పెట్టటం మంచిది కాదని, గ్రామం క్షేమం కోసం విగ్రహ ప్రతిష్ఠకు తిరస్కరిస్తున్నామని అన్నారు. సభలో చప్పట్ల ద్వారా నిర్ణయాన్ని అంగీకరించారు. కొంత కాలంగా తారా స్థాయికి చేరిన వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ సభలో అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వర్లు, ఈఓ నారాయణచార్యులు, సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, శీలం వెంకటలక్ష్మి, ఉపసర్పంచ్ ఏడుకొండలు, గ్రామ పెద్ధలు గూడవల్లి రాంబ్రహ్మం, రావెళ్ల సుదర్శన్‌రావు, చవళం వెంకటేశ్వరరావు, మామిడి వెంకన్న, కాసాని లింగయ్య, మైసా శంకర్, తోట వెంకటేశ్వర్లు, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి, బల్లి వెంకన్న, కాండూరి వేణు, కడియాల నరేష్, బాజా నాగేశ్వరరావు, నిమ్మగడ్డ నగేష్, యార్లగడ్డ నాగరాజు, గొలుసు రవి పాల్గొన్నారు. -
గోవిందా..హుండీ సొమ్ము మాదంటే మాది!
అహోబిలంలో మఠం, దేవదాయ ధర్మదాయ శాఖల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నో ఏళ్లుగా మఠం, దేవదాయ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పాలనపై మఠం వర్గాలకు నచ్చలేదు. తమ పాలన తామే చేసుకుంటామని కోర్టును ఆశ్రయించడమే గాకుండా రాష్ట్రస్థాయి అధికారులను ఒప్పించి తమకు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవసరం లేదని ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు స్టేటస్ కో ఉత్తర్వులను (ఇప్పుడు ఎలా ఉంటే అలాగే పరిపాలన కొనసాగించుకోండి) కోర్టు ఇచ్చింది. ఇలా మూడు నెలలకు పైగా రెండు వర్గాలు ఎత్తులకు, పై ఎత్తులు వేస్తుండటంతో అంతర్గతపోరు తారాస్థాయికి చేరింది. సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : అహోబిల క్షేత్రంలో వివాదాలు ముదురుతున్నాయి. మఠం, దేవదాయ ధర్మదాయ శాఖ.. పాలన తమేదనంటూ కోర్టును అశ్రయించారు. ప్రస్తుతం పాలన వ్యవహారాలను మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల చర్యలతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టేటస్ కో పై ఎవరి వాదన వారిదే.. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో గతంలో ఇక్కడ ఈఓ పరిపాలన ఎలా ఉందో అలా చేసుకోమనే ఇచ్చిందని.. మఠం వారు అడ్డుకుంటున్నారని ఈఓ వాదిస్తుండగా, కాదు స్టేటస్ కో ఇచ్చేటప్పటికి (ఆరోజుకు) ఎలా ఉందో అలానే పరిపాలన కొనసాగించుకోవాలని ఇచ్చిందని దీంతో స్టే ఇచ్చే రోజుకు ఈఓ పరిపాలన లేదని న్యాయస్థానంలో సమస్య పరిష్కారమయ్యే వరకు అలానే కొనసాగిస్తామని మఠం ప్రతినిధులు చెబుతున్నారు. తారాస్థాయికి చేరుకున్న కుమ్ములాటలు.. మొన్నటి వరకు దేవస్థాన, మఠం వర్గాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు తాజాగా దేవుడి హుండీ సొమ్ములు బ్యాంకులో జమ చేసే విషయంలో ఇరు వర్గాలు బుధవారం రాత్రి రోడ్డెక్కాయి. రెండు రోజుల పాటు నవనారసింహ క్షేత్రాల్లో హుండీ సొమ్ముల లెక్కింపు చేపట్టారు. లెక్కించిన నగదు దిగువ అహోబిలం బ్యాంక్ అధికారులు అక్కడికే వచ్చి ఖాతాలో జమ చేసుకుంటారు. ఈ క్రమంలో జమ చేసుకునేందుకు వచ్చిన బ్యాంక్ అధికారులు నగదును అహోబిల మఠం ఆధ్వర్యంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఖాతాలో జమ చేసుకుంటుండగా.. అందులో ఎలా జమ చేస్తారు.. ఈఓ ఆధ్వర్యంలోని దేవస్థాన ఖాతాలో జమ చేయాలని ఈఓ మల్లికార్జున ప్రసాద్ అడ్డుతగిలారు. దీంతో మఠం మేనేజర్ స్పందిస్తూ..కాదు తమ ఖాతాలోనే జమ చేయాలని సూచించారు. దీంతో కొంత సేపు వాదోపవాదనలు చోటుచేసుకున్నాయి. ఏం చేయాలో దిక్కుతెలియని బ్యాంక్ అధికారులు, పెద్ద మనుషుల సూచనల మేరకు సస్పెన్స్ ఖాతా తెరిచి జమ చేశారు. గతంలో కూడా ఈఓ ఆధ్వర్యంలో ఎగువ అహోబిలంలో నిత్యన్నదాన సత్రం ప్రారంభించగా తమ అనుమతి లేకుండా ఎలా ప్రారంభిస్తారని.. అన్నప్రసాద సత్రానికి సరుకులు ఇవ్వద్దని మఠం ప్రతినిధులు ఆదేశించడంతో ఈఓ భక్తుల సహాయంతో సత్రం నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న ఈఓ కొందరు తాత్కలిక సిబ్బందిని నియమించారు. తమను సంప్రదించకుండా ఎలా ఉద్యోగాలిస్తారని, వారికి తామెందుకు వేతనాలివ్వాలని మఠం ప్రతినిధులు వేతనాలు నిలిపివేశారు. అనంతపురం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్న మాన్యంను వేలం వేసేందుకు సిబ్బందిని కారులో పంపగా.. అందుకయ్యే ఖర్చులను తాము ఇవ్వమని తెగేసి చెప్పారు. ఇలా రోజుకో ఘటనతో నిత్యం ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మఠం ఆధ్వర్యంలోనే పాలన.. గతంలో పనిచేసిన ఈఓ చేసిన అక్రమాలను, స్వామి సొమ్ములు దుర్వినియోగం చేసిన వైనం.. ఆమె కొనసాగించిన నిర్లక్ష్య పాలనతో పాటు దేవస్థాన ఈఓగా ఉంటూ జైలుకు వెళ్లిన ఘటనలను మఠం ప్రతినిధులు ఉన్నతస్థాయి అధికారులకు వివరించడంలో సఫలీ కృతులయ్యారు. ఇదే సాకుగా చూపి దేవస్థాన పరువు, ఆదాయం రెండూ పోతున్నాయని ఉన్నతస్థాయి నుంచి సిఫారసు చేయించుకొని ఈఓను బదీలీ చేయించి పరిపాలనను చేతిలోకి తీసుకొని మేనేజర్‌ను నియమించారు. ప్రస్తుతం పాలన మొత్తం మఠం ఆధ్వర్యంలోనే ఉంది. ఎప్పటిలాగే జమ చేయమని చెప్పాం మఠం ఖాతాలో జమ చేయమని చెప్పలేదు. పూర్వం నుంచి ఎలా జమ చేస్తున్నారో అలానే దేవస్థానం ఖాతకు జమ చేయమని చెప్పాం. ఈ ఖాతా ఆళ్లగడ్డలో ఆంధ్రాబ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. ఈ ఖాతాలో ఉన్న సొమ్మును ఎవరు పడితే వారు తీయడానికి ఉండదు. మఠం పీఠాధిపతికి మాత్రమే ఉంటుంది. అయితే కొన్ని అవకతవకలు జరగడంతో ఈఓ అకౌంట్ రద్దు చేయించాం. – బద్రీనారాయణ్, అహోబిల మఠం మేనేజర్ 1961 నుంచి తమ పాలన ఉంది 1961నుంచి అహోబిలంలో దేవదాయ ధర్మదాయ శాఖ పరిపాలన కొనసాగుతోంది. మరి ఇప్పుడు ఎందుకు తమ పాలన ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడంలేదు. ప్రస్తుతానికి హుండీ ఆదాయం సస్పెన్సన్ అకౌంట్లో జమ చేశారు. ప్రస్తుతం హుండీ లెక్కింపు సొమ్మును తమ ఖాతాలో జమ కాకుండా చేయడం సరికాదు. – మల్లికార్జున ప్రసాద్, ఈఓ -
దేవాలయాల లీజు భూములపై సర్కార్ నజర్
సాక్షి, హైదరాబాద్: దేవాలయ లీజు భూములపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగుల వేతన సమస్యల పరిష్కారం, ఆలయ భూముల పరిరక్షణ, లీజు భూములు, ఆన్లైన్ సేవలు, తదితర అంశాలపై ఆ శాఖ అధికారులతో ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆలయ భూములు కబ్జా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని, దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తుల లీజుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. దేవాలయ భూములకు సర్వే చేసి, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నామమాత్రపు ధరకు దేవాదాయశాఖకు సంబంధించిన షాపులను లీజుకు తీసుకుని తిరిగి వాటిని అధిక అద్దెకు సబ్లీజుకు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ భూముల ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యోగుల పే స్కేల్ విషయంలో వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం దేవాలయాల్లో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు, ప్రత్యమ్నాయ మార్గాలను చూడాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆలయాల్లో స్వామి వారికి సరిగా ధూపదీపం అందుతుందో లేదో అనే విషయంలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. దేవాలయాల్లో ఆర్జిత సేవల నుంచి గదులను ఫోన్ ద్వారానే బుక్ చేసుకునేలా సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఆలయాల్లో దశలవారీగా బెల్లంతో తయారు చేసిన లడ్డూలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, వివిధ జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ఈవోలు పాల్గొన్నారు. యాదాద్రి కల్యాణ మండప భవనం ప్రారంభోత్సవం బర్కత్‌పురాలోని రూ.8 కోట్లతో నిర్మించిన యాదాద్రి సమాచార కేంద్రం, కల్యాణ మండప భవనాన్ని శుక్రవారం రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిలతో కలసి ఆయన ప్రారంభించారు. భవన ప్రారంభం అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ప్రసాదం, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఈవో గీత, ఫౌండర్ ట్రస్టీ నర్సింహమూర్తి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, దైవజ్ఞ శర్మ తదితరులు ఉన్నారు. -
రూ.400 కోట్ల దేవుడి భూమికి ఎసరు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఇలాంటి సమయంలోనే గుంటూరు రెవెన్యూ పట్టణ పరిధిలో 89, 90, 135, 151 సర్వే నెంబర్లలోని 43.05 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేయడానికి అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. గుంటూరు నగరంలోని ఫీవర్ ఆసుపత్రిని (గుంటూరు– అమరావతి ప్రధాన మార్గం) ఆనుకుని ఈ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి గుంటూరులోని సీతారామస్వామి ఆలయానికి చెందినదని దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. ఆ భూమి దేవదాయ శాఖకు చెందినది కాదంటూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)తో పాటు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయం నుంచి కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే కొందరు కీలక అధికారులు తెలుగుదేశం పార్టీ పెద్దలకే వత్తాసు పలుకుతున్నారు. ఒత్తిళ్లను తట్టుకోలేక దేవాదాయ శాఖ కమిషనర్ మరో వారం, పది రోజుల్లోనే ఎన్వోసీ జారీ చేయబోతున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ రికార్డుల్లో మార్పులు చేయాలట! చల్లపల్లి జమీందార్‌గా పిలిచే పాత గుంటూరు జమీందార్ రాజా మానూరి వెంకట నారాయణ 19వ దశకంలో గుంటూరు నగరంలో 128 ఎకరాలు, జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం సమీపంలో మరో 31.12 ఎకరాల భూమిని సీతారామస్వామి ఆలయం పేరిట దానంగా ఇచ్చినట్టు దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. ఆ ఆలయంలో పనిచేసే కొందరు పూజారులు గుంటూరులోని భూమిని తమకు అమ్మారని.. ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే ఆలయానికి చెందిన 128 ఎకరాల భూమిలో ఫీవర్ ఆసుపత్రి వెనుక ఉండే 43.05 ఎకరాలను గుంటూరుకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడి వద్ద నుంచి తాము కొనుగోలు చేశామని పేర్కొంటూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుల రియల్ ఎస్టేట్ కంపెనీ తెరపైకి వచ్చింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు 2011లో ప్రయత్నించింది. స్థానికులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా అదే భూమిని తాము కొనుగోలు చేశామంటూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్ కుమార్ తెరపైకి వచ్చారు. పట్టాభి సీతారామస్వామి ఆలయ భూమిగా పేర్కొంటూ దేవాదాయ శాఖ రికార్డుల్లోని వివరాల్లో మార్పులు చేయాలని, తనకు ఎన్వోసీ జారీ చేయాలని కోరుతూ సుధీర్ కుమార్ 2018లో దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఆలయ రికార్డుల్లో ఆ భూమి స్వామి వారిదేనని స్పష్టంగా ఉండడంతో సుధీర్ కుమార్ చేసుకున్న ఎన్వోసీ దరఖాస్తును 2018 అక్టోబరులో దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించారు. మంత్రుల రంగ ప్రవేశం గతేడాది అక్టోబరులో ఎన్వోసీ దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించిన తర్వాత కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబీకులు రంగ ప్రవేశం చేశారని, దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయంతో పాటు సీఎం కార్యాలయ పెద్దలు ఇప్పుడు తెరవెనుక ఉండి.. ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న సుధీర్ కుమార్ పేరుతో ఆ 43.05 ఎకరాలను కొట్టేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2018 అక్టోబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ మొదట ఎన్వోసీ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్‌కుమార్ ఉపముఖ్యమంత్రి కేఈ కార్యాలయానికి పున:పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవడం.. తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై పున:పరిశీలన చేయాలంటూ కమిషనర్ కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందడం ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిపోయాయి. 43.05 ఎకరాల భూమిపై ప్రొద్దుటూరు శ్రీనివాస ఎస్టేట్స్ పేరిట ఎన్వోసీ జారీకి నాలుగు రోజుల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ పున:విచారణ ప్రారంభించారు. పదోన్నతులు అందుకోసమేనా? ఒకసారి తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు గుంటూరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే అధికారికి డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి ఇచ్చి గుంటూరులోనే నియమించారని దేవాదాయ శాఖలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ తతంగం జరగడం గమనార్హం. 43.05 ఎకరాల భూమిపై ముందుగా నిర్ణయించుకున్న మేరకు నివేదికలు ఇవ్వడం కోసమే పదోన్నతులు కొనసాగాయని చెబుతున్నారు. -
బంగారం తరలింపు: గోల్‌మాలేనా.. గోవిందా!
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా అవకాశం కలిగించిందని మన్మోహన్సింగ్ విచారణ నివేదికలో చెప్పినట్లు సమాచారం. సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బంగారం వివాదంపై ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వాదన సరికాదని ఈ అంశంపై విచారణ చేసిన రాష్ట్ర రెవెన్యూ(దేవాదాయ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ తేల్చిచెప్పారు. బంగారం వ్యవహారంలో అటు బ్యాంకు గానీ, ఇటు ఈవో గానీ పాటించాల్సిన నియమ నిబంధనలేవీ పాటించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. మన్మోహన్సింగ్, దేవాదాయ శాఖ కమిషనర్ పద్మ సచివాలయంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యంను కలిశారు. టీటీడీ బంగారం తరలింపులో చోటుచేసుకున్న లోపాలను వివరించారు. ఆ బంగారం తరలింపు బాధ్యత పంజాబ్ నేషనల్ బ్యాంకుదేనని, అది టీటీడీకి చేరే వరకూ తనకు సంబంధం లేదని ఈవో సింఘాల్ వ్యాఖ్యానించడం సరికాదని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా ఈ విషయంలో నిబంధనలను పాటించలేదనే నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? బ్యాంకులో పెట్టిన బంగారం గడువు తీరిపోయి టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్న నేపథ్యంలో.. ఆ బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదేనని లేఖ ఇవ్వాల్సి ఉందని, కానీ, ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే లేఖ ఇవ్వలేదా? అనే సందేహాలున్నాయని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ పేర్కొన్నట్లు తెలిసింది. ఏ రోజున బ్యాంకులో బంగారం పెట్టిందీ.. గడువు తీరాక ఎంత బంగారం టీటీడీకి జమ చేయాలో కూడా ఆ లేఖలో టీటీడీ ఈవో వివరించాల్సి ఉంటుందని, సదరు లేఖతో సహా బంగారం తరలింపునకు పంజాబ్ నేషనల్ బ్యాంకు చర్యలు తీసుకోవాల్సి ఉందని, అయితే ఇవేమీ పాటించలేదని నివేదికలో తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆభరణాల్లోని రాళ్లు, రత్నాలను ఏం చేస్తున్నారు? స్వామి వారికి కానుకల రూపంలో వచ్చిన బంగారు ఆభరణాలను పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారని, అయితే అలా డిపాజిట్ చేసిన బంగారం గడువు తీరాక తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా? అనే దానిపై తాజా ఘటన తరువాత సందేహాలు తలెత్తుతున్నాయనే అభిప్రాయాన్ని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల నియామవళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు తనిఖీల్లో బయటపడింది కాబట్టి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, లేదంటే బ్యాంకుల నుంచి బంగారం తిరిగి టీటీడీ ట్రెజరీకి చేరుతోందా? లేదా మరో చోటుకి వెళ్తోందా? అనే అనుమానాలు వ్యక్తం కావడానికి టీటీడీతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకులు అవకాశం కలిగించాయని చెప్పినట్లు సమాచారం. స్వామి వారికి ఆభరణాల రూపంలోనే భక్తులు బంగారం సమర్పిస్తారని, ఆ బంగారాన్ని కరిగించి కడ్డీలుగా మార్చడానికి ముందు ఆ ఆభరణాల్లో ఉన్న విలువైన రాళ్లు, రత్నాలను ఎక్కడ భద్రపరుస్తారో కూడా విచారించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ‘‘డిపాజిట్ చేసిన బంగారం బ్యాంకు నుంచి టీటీడీ ట్రెజరీకి చేరే వరకూ తనకు సంబంధం లేదంటూ ఈవో చేసిన వాదన సరిగా లేదు. ఆయన పాటించాల్సిన నియమ నిబంధనలను పాటించలేదు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా నిబంధనలు పాటించలేదు. తగిన భద్రత లేకుండా బంగారాన్ని తరలించడం ఏమిటి? ఇందులో టీటీడీ ఈవో, పంజాబ్ నేషనల్ బ్యాంకు తప్పిదాలకు పాల్పడ్డారు. భవిష్యత్తులో స్వామి బంగారం, ఆభరణాల విషయంలో మరింత పారదర్శకతతో వ్యవహరించాలి. దీనిపై ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి’’ అని విచారణ నివేదికలో మన్మోహన్సింగ్ సిఫార్సు చేసినట్లు సమాచారం. భక్తుల మనోభావాలతో వ్యాపారమా? తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే బంగారాన్ని టీటీడీ పాలక మండలి వ్యాపార వస్తువుగా మార్చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హుండీ ద్వారా వచ్చే బంగారాన్ని అధికారులు కడ్డీలుగా మార్చి, బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంకులేమో ఆ బంగారాన్ని విక్రయించి, వచ్చిన సొమ్మును వడ్డీలకు ఇచ్చుకుంటున్నాయి. టీటీడీ డిపాజిట్ చేసిన బంగారంపై బ్యాంకులు చెల్లించే వడ్డీ 2 శాతంలోపే. అదే బంగారాన్ని అమ్మేసి, వచ్చిన సొమ్మును ప్రజలకు అప్పుగా ఇచ్చి 7 నుంచి 9 శాతం దాకా వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అంటే బ్యాంకులు ఏ స్థాయిలో లాభపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గడువు తీరిన తర్వాత తమ వద్ద ఉండే ఇతర బంగారం, లేదంటే దేశవిదేశాల్లో కొనుగోలు చేసి టీటీడీకి బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తున్నాయి. అంటే భక్తులు సమర్పించిన బంగారం అచ్చంగా అదే తిరిగి రాదు. ఇలా బంగారం డిపాజిట్లతో టీటీడీ ప్రతిఏటా రూ.60 కోట్ల దాకా వడ్డీ ఆర్జిస్తున్నట్లు అంచనా. శ్రీవారి ఖజానాలో 9,259 కిలోల బంగారం తమిళనాడులో తనిఖీల్లో పట్టుబడ్డ 1,381 కిలోల బంగారంపై భక్తుల్లో అనుమానాలు వెంటాడుతున్నాయి. దాన్ని ప్రస్తుతం టీటీడీ ఖజానాకు చేర్చారు. ఆ బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసి, విమానంలో భారత్‌కు తరలించినట్లు సమాచారం. టీటీడీ ఖజానాలో ప్రస్తుతం కడ్డీల రూపంలో 9,259 కిలోలకు పైగా బంగారం ఉన్నట్లు అంచనా. ఈ మొత్తం బంగారాన్ని నగదు రూపంలోకి మార్చాలని టీటీడీ పాలక మండలి యోచిస్తున్నట్లు సమాచారం. బంగారం డిపాజిట్లపై బ్యాంకులిచ్చే వడ్డీ 2 శాతం లోపే ఉండడం, నగదు డిపాజిట్లపై వడ్డీ 8 శాతానికి పైగానే ఉండడంతో బంగారాన్ని నగదు రూపంలో మారిస్తే అదనంగా 6 శాతం వడ్డీ వస్తుందని భావిస్తున్నారు. -
దేవుడి సొమ్ము ‘స్వాహా’!
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమ నిర్వహణతో పాటు ఆలయంలో పూజా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు భక్తులిచ్చిన కానుకల్లో రూ.16 కోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. కానీ, ఇప్పుడు వాటిపై సర్కారు కన్నుపడింది. గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కోసం ఆ డిపాజిట్‌ను అర్జంటుగా రద్దుచేసి రూ.3కోట్లను ఖర్చుపెట్టాలని సీఎం పేషీ నుంచి దేవస్థానంపై ఒత్తిడి వస్తోంది. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల పరిస్థితి ఇప్పుడు ఇంతే. రాష్ట్ర దేవదాయ శాఖ ఆధీనంలో మొత్తం 21,664 గుళ్లు ఉంటే, అందులో కాస్త చెప్పుకోదగ్గ ఆదాయం వచ్చే ఆలయాలు కేవలం 995నే. మరో 2,227 ఆలయాల్లో అర్చకులు, సిబ్బంది జీతాలు, పూజాది కార్యక్రమాలకు ఆదాయం ఏమాత్రం సరిపోని పరిస్థితి. మిగిలిన 18,442 ఆలయాలకు కనీస ఆదాయం కూడా లేకపోవడంతో వాటి బాగోగులను దేవదాయ శాఖ పట్టించుకోవడంలేదు. దీంతో ఆదాయంలేని ఆలయాల్లో నిత్య పూజల నిర్వహణకు 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొత్తగా ధూప దీప నైవేద్య కార్యక్రమం (డీడీఎన్ఎస్)ను ప్రారంభించి, మొదటగా.. ఇప్పుడున్న 13 జిల్లాల్లోని 1,910 గుళ్లకు దేవదాయ శాఖ ప్రతినెలా కొంత మొత్తం ఆర్థిక సహాయం చేసే ఏర్పాటుచేశారు. ఆదాయం బాగా వచ్చే ఆలయాల నిధుల్లో కొంత మొత్తం ఈ డీడీఎన్‌ఎస్‌కు కేటాయించి, ఏటా ఆలయాల సంఖ్యను పెంచుకుంటూపోవాలని అప్పట్లో ఆయన ఆదేశించారు. ఆ సంఖ్య ఇప్పుడు పెరగకపోగా, ప్రస్తుతం కేవలం 1,295 ఆలయాలకు మాత్రమే డీడీఎన్ఎస్ నిధులు మంజూరవుతున్నాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. నిజానికి దేవదాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులివ్వదు. ఆ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఆ శాఖ పరిధిలోని ఆలయాల ద్వారా వచ్చే ఆదాయం నుంచే అందరి జీతభత్యాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే, దేవుడికి సమర్పించే కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోకూడదు. అంతేకాక, దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా, ఆలయ నిధులు దుర్వినియోగం కాకుండా, ఆలయాల్లో రోజు వారి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా పర్యవేక్షించడానికే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అర్చకుల సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా చేసే సాయంతో పాటు శిథిలావస్థకు చేరిన ఆలయాల పునర్నిర్మాణం వంటి కార్యక్రమాలకు దేవదాయ శాఖ ఇతర గుళ్ల నుంచి చెల్లిస్తుంది. కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన వేరేలా ఉంది. తన విశేషాధికారాలను ఉపయోగించుకుని విజయవాడ, విశాఖపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని దాదాపు రూ.8 వేల కోట్లకు పైబడి విలువ ఉండే దేవదాయ భూములను కారుచౌకగా లీజుకిచ్చేసింది. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, వైఎస్సార్ కడప జిల్లాలోని మరో అధికార పార్టీ నేత దేవుడి భూములను అక్రమంగా కారుచౌకగా కొనుగోలు చేస్తే, గత ప్రభుత్వాలు వాటిపై ఆంక్షలు పెట్టగా, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటికి ఆమోదం తెలిపింది. దీనికితోడు ప్రభుత్వ పెద్దలు బాగా ఆదాయం వచ్చే ఆలయాలను దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి, అ ప్రాంతంలోని అధికార పార్టీ నేతలను ఆయా ఆలయాల ట్రస్టీలుగా నియమించి వారికి సర్వాధికారాలు కల్పించింది. రూ.18 కోట్ల బ్యాంకు డిపాజిట్లు, వంద కోట్లకు పైబడి భూములు ఉన్న విశాఖపట్నంలోని ఒక ఆలయాన్ని దేవదాయ శాఖ అధికారులు కాదంటున్నా ఆ శాఖ నుంచి తప్పించి అస్మదీయులకు కట్టబెట్టడం ఇందుకు ఉదాహరణ. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టాయన్న ఆరోపణలున్నాయి. గత నాలుగున్నర ఏళ్ల కాలంలో దాదాపు 155 వరకు బాగా ఆదాయం, ఆస్తులున్న ఆలయాలు ఇలా చేతులు మారినట్లు సమాచారం. నిధుల మళ్లింపునకు ప్రణాళిక రెడీ ఈ నేపథ్యంలో పెద్ద ఆలయాలకు భక్తులు సమర్పించే కానుకల్లో కొంత మొత్తాన్ని చిన్న ఆలయాల అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన చంద్రబాబు సర్కార్.. అందుకు విరుద్ధంగా ఆలయాల బ్యాంకు డిపాజిట్లను రద్దుచేసి, గత ఎన్నికల హామీల అమలుకు ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా రాష్ట్రంలో బాగా ఆదాయం ఉన్న వివిధ ఆలయాల పేరిట దాదాపు రూ. 1,800 కోట్ల మేర బ్యాంకు డిపాజిట్లు ఉంటాయని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే రెండు మూడు నెలల కాలంలో వీలైనంత మేర ఆ డిపాజిట్లను ముఖ్యమంత్రి హామీల అమలుకు మళ్లించడానికి ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రణాళిక సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ఇక ఆలయాలపై పచ్చ నేతల కర్రపెత్తనం
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని గుళ్లనూ అధికార పార్టీ నేతలకు పంచిపెట్టబోతోంది. గ్రామాల్లోని టీడీపీ నేతలకు గుళ్లపై కర్రపెత్తనం అప్పగించేందుకు వీలుగా వెయ్యి గుళ్లకు పాలకమండళ్లను నియమించడానికి గత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలో 22 వేలకు పైగా ఆలయాలు ఉన్నప్పటికీ.. ఆదాయం లేదన్న సాకుతో వేలాది ఆలయాల్లో ప్రభుత్వం కనీసం దేవదాయ శాఖ సిబ్బందిని కూడా నియమించలేదు. ఆదాయం బాగా ఉండే 4,459 ఆలయాల్లో మాత్రమే కార్యనిర్వాహక అధికారులు (ఈవోలు)/గుడి మేనేజర్లను నియమించింది. వీటిలో మాత్రమే దేవదాయ శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఈ 4,459 ఆలయాలతో కలిపి మొత్తం 5052 ఆలయాలకు పాలకమండళ్లను నియమించాలని నిర్ణయించడం గమనార్హం. ఇప్పటికే వీటిలో 1955 ఆలయాలకు పాలకమండళ్లను నియమించింది. తాజాగా గత శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసిన వెయ్యి ఆలయాలు కలిపి మొత్తం 1201 ఆలయాలకు నియామక ప్రక్రియ పురోగతిలో ఉంది. మిగిలిన ఆలయాల్లోనూ పాలకమండళ్ల నియామకానికి దేవదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తోంది. నాలుగున్నరేళ్లుగా దార్మిక పరిషత్ ఏర్పాటే లేదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం కంటే హిందూ మతంపై పూర్తి విశ్వాసం ఉండే రిటైర్డ్ న్యాయమూర్తులు, ఆలయాలకు భారీ దానాలిచ్చే దాతలు, మఠాధిపతులు, స్వామీజీల పెత్తనంలో దేవదాయ శాఖ ఉండాలనే ఉద్దేశంతో 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దేవదాయ శాఖ మంత్రితోపాటు మొత్తం 27 మంది సభ్యులుండే ధార్మిక పరిషత్ చెప్పిన ప్రకారమే దేవదాయ శాఖ పనిచేయాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తోపాటు అన్ని ఆలయాల్లో నిత్య పూజా కైంకర్యాలతోపాటు జమాఖర్చులపై పూర్తి పర్యవేక్షణ, పాలక మండళ్ల నియామకం వంటి వాటిపై ధార్మిక పరిషత్ చేసే సూచనలే శిరోధార్యం. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లుగా ధార్మిక పరిషత్ ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు. ఆలయాలపై ప్రభుత్వానికి సమాంతరంగా ధార్మిక పరిషత్ పెత్తనం ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేయని ప్రభుత్వం ఇప్పుడు పాలకమండళ్ల నియామకాలకు మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుంది.. కానీ పాలకమండళ్లను మాత్రం రెండేళ్ల కాలపరిమితికి నియమిస్తుండటం గమనార్హం. దేవాలయాలపై టీడీపీ నేతల పెత్తనానికే.. దేవాలయాల పాలకమండళ్లకు ఎంపికవుతున్న టీడీపీ నేతలు దేవుడి సొమ్మును దిగమింగడానికి అర్చకులు, దేవదాయ శాఖ ఉద్యోగులపై కర్రపెత్తనం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపురం శివాలయంలో పనిచేసే మల్లిఖార్జున శర్మ అనే అర్చకుడు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంటూ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేదాంతం కృష్ణకిశోర్ అనే అర్చకుడు ఆలయ మాజీ ధర్మకర్తలు తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వెళ్లగక్కారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో ఆలయ ఈవోలుగా పనిచేసిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు అక్కడి నుంచి బదిలీ కావడం వెనుక ఆలయ పాలక మండలి సభ్యులతో వారికి పొసగకపోవడమే కారణమనే వార్తలు వినిపించాయి.