గుంటూరు కొరిటెపాడులోని పట్టాభి సీతారామస్వామి ఆలయం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఇలాంటి సమయంలోనే గుంటూరు రెవెన్యూ పట్టణ పరిధిలో 89, 90, 135, 151 సర్వే నెంబర్లలోని 43.05 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేయడానికి అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. గుంటూరు నగరంలోని ఫీవర్ ఆసుపత్రిని (గుంటూరు– అమరావతి ప్రధాన మార్గం) ఆనుకుని ఈ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి గుంటూరులోని సీతారామస్వామి ఆలయానికి చెందినదని దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. ఆ భూమి దేవదాయ శాఖకు చెందినది కాదంటూ నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)తో పాటు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయం నుంచి కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే కొందరు కీలక అధికారులు తెలుగుదేశం పార్టీ పెద్దలకే వత్తాసు పలుకుతున్నారు. ఒత్తిళ్లను తట్టుకోలేక దేవాదాయ శాఖ కమిషనర్ మరో వారం, పది రోజుల్లోనే ఎన్‌వోసీ జారీ చేయబోతున్నట్లు సమాచారం.
దేవాదాయ శాఖ రికార్డుల్లో మార్పులు చేయాలట!
చల్లపల్లి జమీందార్‌గా పిలిచే పాత గుంటూరు జమీందార్ రాజా మానూరి వెంకట నారాయణ 19వ దశకంలో గుంటూరు నగరంలో 128 ఎకరాలు, జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం సమీపంలో మరో 31.12 ఎకరాల భూమిని సీతారామస్వామి ఆలయం పేరిట దానంగా ఇచ్చినట్టు దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. ఆ ఆలయంలో పనిచేసే కొందరు పూజారులు గుంటూరులోని భూమిని తమకు అమ్మారని.. ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే ఆలయానికి చెందిన 128 ఎకరాల భూమిలో ఫీవర్ ఆసుపత్రి వెనుక ఉండే 43.05 ఎకరాలను గుంటూరుకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడి వద్ద నుంచి తాము కొనుగోలు చేశామని పేర్కొంటూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుల రియల్ ఎస్టేట్ కంపెనీ తెరపైకి వచ్చింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు 2011లో ప్రయత్నించింది. స్థానికులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా అదే భూమిని తాము కొనుగోలు చేశామంటూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్ కుమార్ తెరపైకి వచ్చారు. పట్టాభి సీతారామస్వామి ఆలయ భూమిగా పేర్కొంటూ దేవాదాయ శాఖ రికార్డుల్లోని వివరాల్లో మార్పులు చేయాలని, తనకు ఎన్‌వోసీ జారీ చేయాలని కోరుతూ సుధీర్ కుమార్ 2018లో దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఆలయ రికార్డుల్లో ఆ భూమి స్వామి వారిదేనని స్పష్టంగా ఉండడంతో సుధీర్ కుమార్ చేసుకున్న ఎన్‌వోసీ దరఖాస్తును 2018 అక్టోబరులో దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించారు.
మంత్రుల రంగ ప్రవేశం
గతేడాది అక్టోబరులో ఎన్‌వోసీ దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించిన తర్వాత కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబీకులు రంగ ప్రవేశం చేశారని, దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయంతో పాటు సీఎం కార్యాలయ పెద్దలు ఇప్పుడు తెరవెనుక ఉండి.. ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న సుధీర్ కుమార్ పేరుతో ఆ 43.05 ఎకరాలను కొట్టేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2018 అక్టోబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ మొదట ఎన్‌వోసీ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్‌కుమార్ ఉపముఖ్యమంత్రి కేఈ కార్యాలయానికి పున:పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవడం.. తిరస్కరించిన ఎన్‌వోసీ దరఖాస్తుపై పున:పరిశీలన చేయాలంటూ కమిషనర్ కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందడం ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిపోయాయి. 43.05 ఎకరాల భూమిపై ప్రొద్దుటూరు శ్రీనివాస ఎస్టేట్స్ పేరిట ఎన్‌వోసీ జారీకి నాలుగు రోజుల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ పున:విచారణ ప్రారంభించారు.
పదోన్నతులు అందుకోసమేనా?
ఒకసారి తిరస్కరించిన ఎన్‌వోసీ దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు గుంటూరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే అధికారికి డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి ఇచ్చి గుంటూరులోనే నియమించారని దేవాదాయ శాఖలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ తతంగం జరగడం గమనార్హం. 43.05 ఎకరాల భూమిపై ముందుగా నిర్ణయించుకున్న మేరకు నివేదికలు ఇవ్వడం కోసమే పదోన్నతులు కొనసాగాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment