temple land
-
ఆలయ భూముల్లో అక్రమ సాగుకు యత్నం
జంగారెడ్డిగూడెం రూరల్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లవారిగూడెంలో కోదండ రామాలయానికి చెందిన భూములపై అక్రమార్కుల కన్ను పడింది. టీడీపీకి చెందిన ఓ నేత ఆలయానికి చెందిన ఈ భూముల్లో 2 రోజులుగా జేసీబీలతో పామాయిల్ చెట్లను కూల్చివేసి భూమి చదును చేసే పనులు చేపట్టారు. ఇప్పటికే ఈ భూముల్లో అక్రమ సాగు చేసేందుకు పొగాకు నారు సిద్ధం చేశారు. చల్లవారిగూడెంలో కోదండ రామాలయానికి 1957లో పెండ్యాల వెంకట రామారావు 42 ఎకరాల 79 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలువ తవ్వకాలకు అధికారులు భూసేకరణ చేపట్టారు.రామాలయం భూముల మీదుగా ఈ కాలువ వెళ్లడంతో 2015 మే 2న 12 ఎకరాల వరకు ఆలయ భూములను కాలువకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటన ద్వారా తెలిపింది. అప్పట్లో కొంతమంది అక్రమార్కులు ఎత్తిపోతల పథకం పరిహారం కాజేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పట్లో దేవదాయ శాఖ అప్రమత్తమై ఆలయానికి చెందిన ఈ భూములకు సంబంధించి పరిహారం రామాలయానికే చెందాలంటూ కోర్టును ఆశ్రయించింది. దాంతో ఆలయానికి చెందిన ఈ భూముల్లో ఎత్తిపోతల పథకం కాలువ పనులు చేపట్టలేదు. ఈ భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి భారీగా పెరిగిన పామాయిల్ చెట్లు ఉన్నాయి. వీటిని 2 రోజుల నుంచి నేలకూల్చి అక్రమ సాగుకు సిద్ధం చేస్తున్నారు. -
టీడీపీ హయాంలోనే కబ్జా కోరలు
సాక్షి, విశాఖపట్నం: చెప్పులు తినే కుక్క నోటికి చెరకు రుచిస్తుందా? ప్రభుత్వ భూములు కనిపిస్తే కాజేయడమే ఆనవాయితీగా మార్చుకున్న టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లాలో దాదాపు 430 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపించింది. వీటిలో అగ్రభాగం టీడీపీ నేతలే కబ్జా చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ విశాఖలో భూకబ్జాలతో వందల ఎకరాలను ఆక్రమించిన టీడీపీ నేతల దందాకు తెరపడటంతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గీత దాటి కబ్జాలు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గీతం వర్సిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విశాఖలో ఇలా మూడేళ్లలో మార్కెట్ ధర ప్రకారం రూ.5,000 కోట్ల విలువైన 430.81 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. బినామీ పేర్లతో.. టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో విశాఖ భూములపై రాబందుల్లా వాలిపోయారు. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని చెరపట్టారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ పెంచి పోషించిన భూబకాసురులపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో.. విశాఖతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ యంత్రాంగం మూడేళ్లుగా చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని నియమించి క్షేత్రస్థాయి పరిశీలనతో భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. పల్లా సోదరుడి భూ ఫలహారం.. అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నవే కావడం గమనార్హం. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కాజేశారు. కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబరు 33–2లో గుడితో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన స్థానిక యువతపై దాడికి యత్నించాడు. -
దేవుడికే పంగనామాలు!
మంగళగిరి (గుంటూరు): ఓ అర్చకుడు రూ.4 కోట్ల విలువైన ఆలయ భూమికి తన పేరుతో పాస్‌పుస్తకం పుట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబర్ 14లో 13.20 ఎకరాల భూమి ఉంది. అందులో 3.40 ఎకరాలను సాగు చేసుకునే హక్కును అర్చకుడికి దేవదాయ శాఖ కల్పించింది. అయితే ఆలయ అర్చకుడు నిడమానూరు కృష్ణమూర్తి 1998లో తన పేరున పాస్‌పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. 1.71 ఎకరాలకు అప్పటి రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం మంజూరు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.4 కోట్లు. దేవాలయం పేరిట ఉన్న భూమిని రెగ్యులర్ ఖాతాలో ఆన్లైన్ చేయాలని ఇటీవల ఆలయ ఈఓ దరఖాస్తు చేశారు. అర్చకుడు కృష్ణమూర్తి కూడా పాస్‌పుస్తకం ఇచ్చి తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను కోరాడు. తహసీల్దార్ జి.వి.రామ్‌ప్రసాద్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అర్చకుడికి అనుభవించే హక్కు మాత్రమే ఉందని తేలింది. అయితే అతని పేరుతో 1998లో పట్టాదారు పాసుపుస్తకం మంజూరైందని వెల్లడైంది. అర్చకుడి పేరుతో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దుచేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. కాజ గ్రామంలో 11 ఎకరాల పీర్ల మాన్యం, నూతక్కిలో 80 సెంట్ల దేవదాయ శాఖ భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. మండలంలోని ఆక్రమణలకు గురైన భూములన్నింటినీ గుర్తించేందుకు రీసర్వే ఉపయోగపడుతుందని, రికార్డులను పరిశీలించి ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటామని తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
‘దేవుడు చనిపోయాడు.. ఇక ఆ భూమి మాదే’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని లక్నోలో ఉన్న ఓ ఆలయం, అది ఉన్న భూమిని ‘‘దేవుడి’’ పేరిట రిజిస్టర్ చేసిన ట్రస్ట్‌కు చెందుతుందని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆలయం, భూమి హక్కుదారైన ‘‘దేవుడు’’ మరణించాడని చెప్పి.. వాటిని ఆక్రమించారు కొందరు వ్యక్తులు. అసలు హక్కుదారు ఫిర్యాదు చేయడంతో ఈ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. లక్నో మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో కుష్మౌరా హలువాపూర్లో 100 ఏళ్ల నాటి ఆలయం ఒకటి ఉంది. దీని బాగోగులు చూడటం కోసం శ్రీకృష్ణ-రామ్ అనే ‘‘దేవుడి’’ పేరిట ఓ ట్రస్టును నమోదు చేశారు. సదరు ఆలయం, భూమి ట్రస్ట్‌కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు గయా ప్రసాద్ అనే వ్యక్తి తాను శ్రీక్రిష్ణ-రామ తండ్రిని అంటూ వచ్చాడు. ఏకీకరణ ప్రక్రియలో భాగంగా 1987లో ‘‘దేవుడైన’’ శ్రీకృష్ణ-రామ మరణించాడని వెల్లడించి.. సదరు ట్రస్ట్‌ని గయా ప్రసాద్ పేరు మీదకు మార్చారు. ఈ క్రమంలో 1991లో గయా ప్రసాద్ మరణించాడు. దాంతో ఈ ట్రస్ట్‌ను అతడి సోదరులు రామ్‌నాథ్, హరిద్వార్ పేర్ల మీదకు మార్చారు. ఈ విషయం కాస్తా ఆలయ ఒరిజినల్ ట్రస్టీ సుశీల్ కుమార్ త్రిపాఠి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన ఈ వ్యవహారం గురించి 2016 నాయిబ్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అలా ఈ ఫిర్యాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఈ క్రమంలో యూపీ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఈ ఫిర్యాదును ఎస్డీఎం ప్రఫుల్లా త్రిపాఠికి బదిలీ చేశారు. ఇక దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 0.730 హెక్టార్ల ఆలయ భూమిని ఆక్రమించుకోవడం కోసం ఓ వ్యక్తి అసలు ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్డీఎం సదర్ ప్రఫుల్ల కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ.. ‘‘నిజమైనా ట్రస్టీ సంతకాలను ఫోర్జరీ చేసిన వ్యక్తి శ్రీకృష్ణ-రామ్ అనే ‘‘దేవుడి’’ పేరిట ట్రస్ట్ రిజిస్టర్ చేసి.. సదరు ఆలయం, భూమి ట్రస్ట్‌కు చెందుతాయని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ‘‘దేవుడి’’ తండ్రిని అని చెప్పుకుని గయా ప్రసాద్ ట్రస్ట్‌ని తన పేరు మీదకు మార్చుకున్నాడు. ఆ తర్వాత అతడి సోదరులు దీన్ని ఆక్రమించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన భూమిని గ్రామసభ బంజరు భూమిగా ప్రకటించింది. ప్రసుతం ఈ ఫిర్యాదు ఎస్డీఎం కోర్టు విచారణలో ఉంది’’ అని తెలిపారు. చదవండి: యజమాని కుమార్తెగా ఫ్యామిలీ సర్టిఫికెట్.. భూ కబ్జా కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ -
ఆలయ పూజారి దారుణ హత్య
జైపూర్: రాజస్తాన్‌లో ఆలయ భూముల కబ్జాను అడ్డుకుంటున్న ఓ పూజారిని దారు ణంగా హత్య చేసిన ఘటన బుధవారం జరిగింది. కరౌలీ జిల్లాలోని బుక్నా గ్రామంలో ఆలయ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. ఆలయ పూజారి బాబూలాల్ వైష్ణవ్ ఎప్పటికప్పుడు దాన్ని అడ్డుకునేవారు. ఆయన ఉంటే తమ ఆటలు సాగవనే కక్షతో కబ్జాదారులు పూజారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన పూజారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని, ప్రధాన నిందితుడు కైలాశ్ మీనాను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ చెప్పారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేశామన్నారు. ఆలయ పూజారి హత్యకు గురికావడం దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. పూజారి హత్యోదంతంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజస్తాన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూర్ణియా విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ రాజకీయ పర్యటనలు చేయడం బదులు రాజస్తాన్‌లో జరుగుతున్న ఘోరాలపై అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో దారుణంగా విఫలమైందని జవదేకర్ విమర్శించారు. పూజారి ప్రాణాలను బలిగొన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాజా ఘటనపై బీజేపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. -
రూ.400 కోట్ల దేవుడి భూమికి ఎసరు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఇలాంటి సమయంలోనే గుంటూరు రెవెన్యూ పట్టణ పరిధిలో 89, 90, 135, 151 సర్వే నెంబర్లలోని 43.05 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేయడానికి అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. గుంటూరు నగరంలోని ఫీవర్ ఆసుపత్రిని (గుంటూరు– అమరావతి ప్రధాన మార్గం) ఆనుకుని ఈ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి గుంటూరులోని సీతారామస్వామి ఆలయానికి చెందినదని దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. ఆ భూమి దేవదాయ శాఖకు చెందినది కాదంటూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)తో పాటు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయం నుంచి కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే కొందరు కీలక అధికారులు తెలుగుదేశం పార్టీ పెద్దలకే వత్తాసు పలుకుతున్నారు. ఒత్తిళ్లను తట్టుకోలేక దేవాదాయ శాఖ కమిషనర్ మరో వారం, పది రోజుల్లోనే ఎన్వోసీ జారీ చేయబోతున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ రికార్డుల్లో మార్పులు చేయాలట! చల్లపల్లి జమీందార్‌గా పిలిచే పాత గుంటూరు జమీందార్ రాజా మానూరి వెంకట నారాయణ 19వ దశకంలో గుంటూరు నగరంలో 128 ఎకరాలు, జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం సమీపంలో మరో 31.12 ఎకరాల భూమిని సీతారామస్వామి ఆలయం పేరిట దానంగా ఇచ్చినట్టు దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. ఆ ఆలయంలో పనిచేసే కొందరు పూజారులు గుంటూరులోని భూమిని తమకు అమ్మారని.. ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే ఆలయానికి చెందిన 128 ఎకరాల భూమిలో ఫీవర్ ఆసుపత్రి వెనుక ఉండే 43.05 ఎకరాలను గుంటూరుకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడి వద్ద నుంచి తాము కొనుగోలు చేశామని పేర్కొంటూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుల రియల్ ఎస్టేట్ కంపెనీ తెరపైకి వచ్చింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు 2011లో ప్రయత్నించింది. స్థానికులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా అదే భూమిని తాము కొనుగోలు చేశామంటూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్ కుమార్ తెరపైకి వచ్చారు. పట్టాభి సీతారామస్వామి ఆలయ భూమిగా పేర్కొంటూ దేవాదాయ శాఖ రికార్డుల్లోని వివరాల్లో మార్పులు చేయాలని, తనకు ఎన్వోసీ జారీ చేయాలని కోరుతూ సుధీర్ కుమార్ 2018లో దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఆలయ రికార్డుల్లో ఆ భూమి స్వామి వారిదేనని స్పష్టంగా ఉండడంతో సుధీర్ కుమార్ చేసుకున్న ఎన్వోసీ దరఖాస్తును 2018 అక్టోబరులో దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించారు. మంత్రుల రంగ ప్రవేశం గతేడాది అక్టోబరులో ఎన్వోసీ దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించిన తర్వాత కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబీకులు రంగ ప్రవేశం చేశారని, దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయంతో పాటు సీఎం కార్యాలయ పెద్దలు ఇప్పుడు తెరవెనుక ఉండి.. ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న సుధీర్ కుమార్ పేరుతో ఆ 43.05 ఎకరాలను కొట్టేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2018 అక్టోబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ మొదట ఎన్వోసీ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్‌కుమార్ ఉపముఖ్యమంత్రి కేఈ కార్యాలయానికి పున:పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవడం.. తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై పున:పరిశీలన చేయాలంటూ కమిషనర్ కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందడం ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిపోయాయి. 43.05 ఎకరాల భూమిపై ప్రొద్దుటూరు శ్రీనివాస ఎస్టేట్స్ పేరిట ఎన్వోసీ జారీకి నాలుగు రోజుల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ పున:విచారణ ప్రారంభించారు. పదోన్నతులు అందుకోసమేనా? ఒకసారి తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు గుంటూరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే అధికారికి డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి ఇచ్చి గుంటూరులోనే నియమించారని దేవాదాయ శాఖలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ తతంగం జరగడం గమనార్హం. 43.05 ఎకరాల భూమిపై ముందుగా నిర్ణయించుకున్న మేరకు నివేదికలు ఇవ్వడం కోసమే పదోన్నతులు కొనసాగాయని చెబుతున్నారు. -
నెల్లూరులో ఆలయ భూములపై ఆధికార పార్టీ నేతల కన్ను
-
కర్నూలు జిల్లాలో ఆలయ భూమి కబ్జా
-
రైతు నోట్లో మట్టి!
ఫార్మాకు ‘ఓంకారేశ్వర’ భూములు ► 389 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు నిర్ణయం ► టీఎస్ఐఐసీకి దేవాదాయ శాఖ ప్రతిపాదన ► రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్లు తొలగింపు ► లబోదిబోమంటున్న బాధితులు ► జిల్లా కలెక్టర్‌ను కలవనున్న కౌలు రైతులు ఆలయ భూమి 1,289 ఎకరాలు కౌలుకు తీసుకుంటున్న రైతులు 250 మంది ఫార్మాకు ఇవ్వనున్న భూమి 389 ఎకరాలు రైతుల పేర్లు తొలగించిన సర్వే నంబర్లు 201, 204, 211 ఫార్మాకు అమ్మితే వచ్చే ఆదాయం రూ.4కోట్లు ఇప్పటి వరకు దేవాలయ భూములను కౌలుకు తీసుకొని కుటుంబాలను పోషించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూముల మీదే ఆధారపడ్డారు. కానీ, ఇప్పుడు వాటిలో కొంత భూమిని ఫార్మాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆ కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టినట్టయింది. తమ బాధలను కలెక్టర్‌కు విన్నవించేందుకు వారు సిద్ధమవుతున్నారు. – యాచారం(ఇబ్రహీంపట్నం): యాచారం మండలం నందివనపర్తి ఓంకారేశ్వర ఆలయ భూములను ఫార్మాసిటీకి తీసుకోనున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు భూములను టీఎస్ఐఐసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ పరిధిలో 1,289 ఎకరాల భూములు ఉన్నాయి. నందివనపర్తికి చెందిన పప్పు వెంకయ్య 1910లో పింగళి వెంకటరమణారెడ్డి (అప్పట్లో కమిషనర్ ఆఫ్ పోలీస్) వద్ద కొనుగోలు చేసి 1956లో ఓంకారేశ్వర ఆలయానికి అప్పగించారు. అప్పట్నుంచి ఓంకారేశ్వరాలయ ఆధీనంలో ఉన్న భూములకు పప్పు కుటుంబ సభ్యులు ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు. ఈ భూముల్లో ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 250 మంది రైతులు కొన్నేళ్లుగా సాగు (కౌలు) చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కౌలు రైతులతో పాటు దేవాలయ ఉత్సవాల్లో శ్రమించే వివిధ కులవృత్తుల వారు కూడా సాగులో ఉన్నారు. కౌలు రైతుల నుంచి వచ్చే ఆదాయంతో ఓంకారేశ్వరుడికి నిత్యం ధూప, దీప, నైవేద్యాలు, ఏటా ఆలయ ఉత్సవాలకు వెచ్చించాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి ఆర్థిక వనరుల కోసం ఆలయ భూములను ఫార్మాకు విక్రయించాలని అధికారులు టీఎస్ఐఐసీ శాఖకు ప్రతిపాదనలు పంపారు. సర్వే నంబరు 201, 204, 211లలోని సుమారు 389 ఎకరాల భూములను ఫార్మాకు ఇవ్వనున్నారు. భూములను ఫార్మాకు విక్రయిస్తే వచ్చే రూ.4 కోట్లతో ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేయడం, మిగిలిన డబ్బులను బ్యాంకులో జమ చేసి ప్రతి నెలా వచ్చే వడ్డీతో ఓంకారేశ్వరుడికి నిత్యం ధూప, దీప, నైవేద్యాలు, ఉత్సవాలు జరపాలని అధికారులు యోచిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్ల తొలగింపు నస్దిక్‌సింగారం, నందివనపర్తి, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల్లో 148 నుంచి 551 వరకు ఉన్న సర్వే నంబర్లలో దాదాపు 800 ఎకరాల్లో రైతులు ఏళ్లుగా కౌలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రాళ్లు, రాప్పలు తొలగించి ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు. అయితే రైతులు సక్రమంగా కౌలు చెల్లించడం లేదనే సాకుతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్లను తొలగించాలని రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పెట్టారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సూచన మేరకు రైతు సమగ్ర సర్వేలో కూడా కౌలు రైతుల పేర్లను నమోదు చేయలేదు. తమకు మళ్లీ ఆ భూములపై సర్వ హక్కులు కల్పించాలని రైతులు రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావును కోరనున్నట్లు తెలిసింది. ఇదే విషయమై నందివనపర్తి ఓంకారేశ్వరాలయ ఈఓ శశిధర్‌ను సంప్రదించగా 389 ఎకరాల ఆలయ భూములను ఫార్మాసిటీకి విక్రయించడానికి నిర్ణయించింది వాస్తవమేనని అన్నారు. భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం ఏళ్లుగా ఓంకారేశ్వరాలయ భూముల్లోనే సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్నాం. మా బతుకులకు ఆ భూములే ఆధారం. కౌలు చట్టం ప్రకారం భూములు మాకే దక్కుతాయని అనుకున్నాం. కానీ రెవెన్యూ రికార్డుల్లోంచి మా పేర్లను పూర్తిగా తొలగించడం అన్యాయం. ఆ భూములు తీసుకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. కౌలు చెల్లిద్దామన్నా అధికారులు రావడం లేదు. – దార నర్సింహ, కౌలు రైతు నస్దిక్‌సింగారం ఆ భూములెప్పటికీ ఓంకారేశ్వరుడివే మా తండ్రి పప్పు వెంకయ్య 1910 లో కొనుగోలు చేసి దేవాలయానికి చెందేటట్లుగా 1956లో వీలునామా రాశారు. రైతులు కౌలు చేసుకుని జీవనోపాధి పొందడమే కానీ ఆలయ భూములు వారికి చెందవని నింబంధన ఉంది. రైతులు సక్రమంగా కౌలు చెల్లించడం లేదు. అప్పులు చేసి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉంది. – పప్పు కృష్ణమూర్తి, ఓంకారేశ్వరాలయ ధర్మకర్త రైతుల పేర్లు తొలగింపు నిజమే దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రతిపాదనలు.. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు ఓంకారేశ్వరాలయ భూములపై రికార్డుల్లో ఉన్న కౌలు రైతుల పేర్లను తొలగించింది వాస్తవమే. రైతుల పేర్లు తొలగించి ఓంకారేశ్వరస్వామి అని నమోదు చేశాం. సర్వే నంబరు 210, 204, 211లలోని దేవాలయ భూమిని ఫార్మాసిటీకి తీసుకోవడానికి టీఎస్ఐఐసీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం ఉంది. – పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం -
ఆ దుర్మార్గం వెనుక.. సూత్రధారులెవరు?
ఆలయ భూమిపై టీడీపీ నేతల కన్ను కల్యాణ మండపం నిర్మించేందుకు ప్రణాళిక దళితుల పూరిళ్లు దహనం నాలుగు నెలలవుతున్నా కొలిక్కిరాని కేసు సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం : అదో చిన్న గ్రామం. పేరు చినఅమిరం. భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడే ఓ ఇంజినీరింగ్ కళాశాల, పేరెన్నికగన్న ప్రైవేటు ఆసుపత్రి ఉన్నాయి. ఆ గ్రామానికి ముఖద్వారంలో సుమారు 5 ఎకరాల శివాలయ భూమి ఉంది. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. ఇంకేముంది.. 90 ఏళ్లకు లీజుకు తీసుకుని, అందులోఅధునాతనమైన కల్యాణ మండపం నిర్మించాలని ఆ పార్టీ నేతలు సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఉన్నత స్థాయిలో పావులు కదిపారు. ఆలయ భూమిని చౌకగా కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమైంది. ఇక్కడే ఓ అడ్డంకి ఎదురైంది. శివాలయ భూమికి ఎదురుగా.. ప్రధాన రహదారికి మధ్యలో కొంతమంది నిరుపేదలు పూరిళ్లు, రేకుల షెడ్లు వేసుకుని దశాబ్దాలుగా నివశిస్తున్నారు. టీడీపీ నేతలు తలపెట్టిన కల్యాణ మండపం నిర్మాణానికి ఆ పేదల ఇళ్లు అడ్డొచ్చాయి. వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని గదమాయించారు. ఎన్నోఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న తాము ఎక్కడికి పోతామంటూ వాళ్లు ఎదురుతిరిగారు. ఇదే తరుణంలో అక్కడే నివసిస్తున్న దిగమర్తి యాకోబుకు చెందిన పూరిల్లు రాత్రికి రాత్రి దహనమైంది. తగులబెట్టిందెవరు! అర్ధరాత్రి అందరూ తమ ఇళ్లలో గాఢనిద్రలో ఉండగా.. యాకోబు ఇంటికి బయట గొళ్లెం పెట్టి మరీ నిప్పుపెట్టారు. మంటలు ఎగసిపడటాన్ని చూసిన కొందరు పరుగు పరుగున అక్కడికొచ్చి ఆ ఇంటి గొళ్లెం తీసి యాకోబు కుటుంబ సభ్యులను రక్షించారు. తమ మాట వినలేదన్న పగతో నిరుపేదలను సజీవ దహనం చేయాలన్న కుట్రకు పాల్పడింది ఎవరు.. ఆ ఇంటికి నిప్పు పెట్టిన కిరాతకలు ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు. ఈ దారుణ ఘటన గతేడాది నవంబర్ 24న రాత్రి చోటుచేసుకుంది. పూరిల్లు దహనం వెనుక టీడీపీ బడా నాయకుల హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నా.. పోలీ సులు ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేసు విచారణ ఏమైంది! టీడీపీకి చెందిన ఉపసర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, ఆ పార్టీ నాయ కులు గొట్టుముక్కల నారాయణరాజు, బాతుల కృష్ణ తదితరులు తమ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారంటూ యాకోబు కుమారుడు దిగమర్తి రమేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘వ్యవసాయ భూమికి రోడ్డు వేసేం దుకు మా ఇల్లు అడ్డుగా ఉందంటూ ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. మేం అందుకు ససేమిరా అనడంతోనే కక్షగట్టి ఇంటిని తగులబెట్టారు ’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుపేద దళితుడనైన తనకు న్యాయం చేయాలని, శ్రీనివాసరాజు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ పోలీ సులు మాత్రం ఇంకా ఆ కేసును కొలిక్కి తీసుకురాలేదు. సుమారు నాలుగు నెలలవుతున్నా నిందితులెవరినీ అరెస్ట్ కాదు కదా.. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ బెంగతోనే నా భర్త చనిపోయాడు మా తాతల కాలం నాటినుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అర్ధంతరంగా ఉప సర్పంచ్ మనుషులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా కనికరించలేదు. వేధింపులు తట్టుకోలేక.. ఆ బెంగతోనే నా భర్త యాకోబు చనిపోయాడు. - దిగమర్తి మరియమ్మ, చినఅమిరం భయం భయంగా బతుకున్నాం ఉపసర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, మరో 8మంది కులం పేరుతో దూషించి సారాప్యాకెట్లు మా ఇంటి ఆవరణలో పెట్టి నన్ను కేసులో ఇరికించాలని చూశారు. మా ఇంటిని దహనం చేయించారు. దీనిపై భీమవరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదు. నరసాపురం సబ్ కలెక్టర్‌కు ఫిర్యా దు చేసినా న్యాయం జరగలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. - దిగమర్తి రమేష్‌బాబు, చినఅమిరం అసలు సూత్రధారులెవరో ఉన్నారు చినఅమిరం ఉపసర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు పాత్రధారి అయినప్పటికీ ఇంతటి దారుణ ఘటన వెనుక సూత్రధారులెవరో ఉన్నారు. పోలీసు అధికారులు సరిగ్గా విచారణ నిర్వహిస్తే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కానీ పోలీసులు ఈ కేసును అస్సలు పట్టించుకోవడం లేదు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఈ విషయమై బాధితుల పక్షాన పోలీసు అధికారులతో మాట్లాడారు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అసలు దోషులను శిక్షించకపోతే ఎమ్మార్పీఎస్ తరఫున ఉద్యమం తీవ్రతరం చేస్తాం. - సీహెచ్.రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు -
వరాల స్వామి.. జాగ లేదేమి..!
దయనీయంగా కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి గుడి గుట్ట తప్ప.. ఆలయం వద్ద సెంటు భూమి లేదు.. ఇబ్బంది పడుతున్న భక్తులు అభివృద్ధికి నోచుకోని ఆలయం పట్టించుకోని ప్రభుత్వం గీసుకొండ : వరాలిచ్చే దేవుడు.. భక్తుల కొంగు బంగారం ఆ స్వామి.. కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రతీతి.. అయితేనేం స్వామివారికి సెంటు భూమి కూడా లేదు. గుట్టపై కొలువుదీరడమే తప్ప దేవుడు కిందకు దిగే పరిస్థితి లేదు.. ఎందుకంటే గుట్ట మినహా దిగువన కాలు మోపడానికి స్వామివారికి సెంటు భూమి కూడా లేదు. ఇదీ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పరిస్థితి. స్వామివారు కొలువుదీరిన కొమ్మాల గుట్ట దిగువన ప్రభుత్వ, దేవస్థాన భూమి లేకపోవడంతో వందల ఏళ్ల నాటి ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. టూరిజం శాఖ నుంచి రూ.1.75 కోట్లు మంజూరు కాగా, ఆ నిధులతో గుట్ట దిగువన పిల్లల పార్కు, ప్రహరీ, మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాల్సి ఉంది. అయితే స్థలం లేకపోవడంతో వీటిని నిర్మించలేదు. ఇటీవల టూరిజం శాఖ జీఏం నర్సింహరావు, రామకృష్ణతో పాటు జిల్లా టూరిజం అధికారి శివాజీ ఈ ఆలయాన్ని సందర్శించి స్థల పరిశీలన చేశారు. అయితే ఇక్కడ సెంటు భూమి కూడా ఆలయానికి లేదని స్థానికులు చెప్పడంతో వారు వెను దిరిగారు. గుట్ట చుట్టూ రైతుల పంట చేలు, మరికొందరు తమ పొలాలను ప్లాట్లుగా చేసి అమ్ముతుండడంతో ఆలయూభివృద్ధికి అవసరమైన స్థలం ఎవరూ ఇవ్వడం లేదు. భూమి ఇవ్వమంటున్న అర్చకులు.. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలకు ఇక్కడ సుమారు 12 ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ నెల 1న జాతర ఏర్పాట్ల గురించి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులు, అర్చకులతో సమీక్ష నిర్వహించారు. ఆలయానికి భూమి లేకపోతే అభివృద్ధి పనులు ఎలా చేస్తామని ఎమ్మెల్యే గట్టిగానే వాదించారు. కనీసం రెండెకరాల స్థలం ఇస్తే అందులో నిర్మాణాలు చేపట్టవచ్చునని సూచించారు. అయితే తాము రెండెకరాల స్థల ం ఇస్తామని, కానీ మిగిలిన పదెకరాలు కూడా ఎకరానికి రూ.20 లక్షల చొప్పున కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. ఈ విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కాగా, గుట్ట పాదం వద్ద సర్వే చేయిస్తే సుమారు 800 గజాల స్థలం తేలుతుందని, అందులో నిర్మాణాలు చేపట్టవచ్చని ఆలయ అధికారులు అంటున్నారు. స్వామి వారి పేరిట దస్రునాయక్ తండా శివారులో నాలుగెకరాలు, విశ్వనాథపురంలో 2.39 గుంటల భూమి ఉంది. ఇందులో వరంగల్-నర్సంపేట రహదారి పక్కనున్న 4 ఎకరాలు అమ్మి ఆ డబ్బుతో గుట్ట వద్ద కొనుగోలు చేయవచ్చని పలువురు అంటున్నారు. జాతర ఆదాయమే ఆధారం.. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ప్రతి ఏడాది హోలీ పండుగ నుంచి వారం రోజుల పాటు జరిగే జాతర ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరు. ఇవే కాకుండా వివాహాలు, అర్చనలు, ప్రత్యేక పూజల పేరుతో కూడా కొంత ఆదాయం వస్తోంది. 2014-15లో ఆలయానికి రూ. 32.99 లక్షల ఆదాయం రాగా.. ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులకు మొత్తం రూ. 30.94 లక్షలు ఖర్చు అయిందని ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చులకే పోతుండడంతో ఆలయం అభివృద్ధికి, భూమి కొనుగోలుకు నిధులు మిగలడం లేదు. ఇప్పటి వరకు దాతల సాయంతోనే పలు ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఆలయం అభివృద్ధి చెందటం లేదు. ఆలస్యంగా పనులు.. స్వామివారి గుట్టపై వాటర్ ట్యాంకు నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహ న్ రావు రూ. 20 లక్షలు కేటాయించగా పనులు చేపట్టలేదు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాలతో ఇటీవల పనులు ప్రారంభించారు. కొమ్మా ల నుంచి ఆలయం వరకు వేసిన రోడ్డు కంకర తేలి ఉంది. దీన్ని బీటీగా మా ర్చడానికి రూ. 20 లక్షలు అవసరం. పనులు చేసేవారు లేక ఇదీ పెండింగ్‌లోనే ఉంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ లోగా ట్యాంకు, రోడ్డు పనులు పూర్తి కాక భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. స్వామివారి సొమ్ము ఫలహారం..! 2008లో జాతరలో కొబ్బరి కాయలు అమ్ముకోవడానికి వేలం పాట పాడిన ఓరుగంటి సురేశ్ రూ. 30,300 చెల్లించలేదు. 2012లో కొబ్బరి కాయలు అమ్ముకున్న హాలావత్ నర్సింహ రూ. 24 వేలు, 2015లో కత్తి దస్తగిరి కొబ్బరి కాయలు అమ్ముకుని రూ. 95 వేలు చెల్లించలేదు. 2011-12లో భూమి కౌలు దారుడు మూడు లాలునాయక్ రూ. 92 వేలు, హలావత్ సర్సింహ రూ. 21 వేలు చెల్లించాల్సి ఉంది. వీటిని సదరు వ్యక్తులు చెల్లించకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కొం దరు గీసుకొండ సీఐకి ఫిర్యాదు చేశారు. -
'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తాం'
కడప : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు చెందిన 20 వేల ఎకరాల ఆలయ భూములు కబ్జాకు గురైనవని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు తెలిపారు. సదరు భూములును కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దూటూరు శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాణిక్యాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తించి... అక్కడివారికి శిక్షణ ఇచ్చి పూజారిగా నియమిస్తామని పి.మాణిక్యాలరావు వెల్లడించారు. -
ఆలయ భూముల ఆక్రమణల తొలగింపు
పార్వతీపురం: దేవుడి భూములను ఆక్రమించుకున్న వారిపై అధికారులు కొరడా ఝుళిపించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మెయిన్‌రోడ్డులో ఉన్న జగన్నాథ స్వామి దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్న ఆలయ భూములను కొంత మంది ఆక్రమించుకొని దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. దేవాదాయ శాఖ అధికారులు పోలీసులతో కలిసి ఆదివారం ఆలయ ప్రాంగణానికి చేరుకొని అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.