సాక్షి, విశాఖపట్నం: చెప్పులు తినే కుక్క నోటికి చెరకు రుచిస్తుందా? ప్రభుత్వ భూములు కనిపిస్తే కాజేయడమే ఆనవాయితీగా మార్చుకున్న టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లాలో దాదాపు 430 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపించింది. వీటిలో అగ్రభాగం టీడీపీ నేతలే కబ్జా చేయడం గమనార్హం. ఇన్నాళ్లూ విశాఖలో భూకబ్జాలతో వందల ఎకరాలను ఆక్రమించిన టీడీపీ నేతల దందాకు తెరపడటంతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
గీత దాటి కబ్జాలు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గీతం వర్సిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విశాఖలో ఇలా మూడేళ్లలో మార్కెట్ ధర ప్రకారం రూ.5,000 కోట్ల విలువైన 430.81 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది.
బినామీ పేర్లతో..
టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు బినామీ పేర్లతో విశాఖ భూములపై రాబందుల్లా వాలిపోయారు. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.వేల కోట్ల విలువైన భూముల్ని చెరపట్టారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ పెంచి పోషించిన భూబకాసురులపై ఉక్కుపాదం మోపింది.
ప్రత్యేక దర్యాప్తు బృందాలతో..
విశాఖతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ యంత్రాంగం మూడేళ్లుగా చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని నియమించి క్షేత్రస్థాయి పరిశీలనతో భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు కాగా మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.
పల్లా సోదరుడి భూ ఫలహారం..
అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ నేతల కబంధ హస్తాల్లో ఉన్నవే కావడం గమనార్హం. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా కాజేశారు. కొద్దిరోజుల క్రితం గాజువాక నియోజకవర్గం తుంగ్లాం గ్రామ సర్వే నంబరు 33–2లో గుడితో పాటు ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోదరుడు పల్లా శంకర్రావు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన స్థానిక యువతపై దాడికి యత్నించాడు.
Comments
Please login to add a commentAdd a comment