'గీతంకు విద్యా దాహం కంటే భూ దాహం ఎక్కువైంది' | Gudivada Amarnath Fires On TDP Politics Over GITAM Frauds | Sakshi
Sakshi News home page

'గీతంకు విద్యా దాహం కంటే భూ దాహం ఎక్కువైంది'

Published Mon, Oct 26 2020 1:15 PM | Last Updated on Mon, Oct 26 2020 3:31 PM

Gudivada Amarnath Fires On TDP Politics Over GITAM Frauds - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరించి ప్రచారం చేస్తోందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు భరత్‌కు చెందిన గీతం విద్యా సంస్థల ప్రాంగణంలో ఆక్రమిత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. 70 రోజులు జైళ్లో ఉన్న అచ్చెన్నాయుడు కూడా గీతం భూములపై మాట్లాడుతున్నారు. విశాఖలో ఆక్రమిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు. గీతం ఆధీనంలోని 40 ఎకరాల ఆక్రమిత భూమి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.   (గీతం అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు)

గీతం యాజమాన్యం కోర్టు ఆర్డర్‌ను కూడా వక్రీ కరించి ప్రచారం చేస్తోంది. రిట్ పిటిషన్ గీతం ఆధీనంలో ఉన్న శాశ్వత నిర్మాణాలు మాత్రమే తొలగించవద్దు అని కోర్టు సూచించింది. కానీ టీడీపీ పచ్చమీడియా కోర్టు ఆర్డర్లను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తోంది. ఆగస్టు 3న సీఎం వైఎస్‌ జగన్‌కి గీతం యాజమాన్యం తమ ఆధీనంలోని 43 ఎకరాలు క్రమబద్ధీకరించాలని కోరింది. ఇప్పటికే సర్కారు నుంచి 71 ఎకరాలు తీసుకుని ఇంకా భూమి కావాలని కోరింది. గీతం యాజమాన్యం తన సొంత భూమి రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఖాళీగా ఉంచుకుంది. గీతం యాజమాన్యానికి విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువగా కనిపిస్తుంది. వేల కోట్ల విలువ చేసే భూములను ఆక్రమించి క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరడం సరికాదు. పేదల కోసం ప్రభుత్వం ఉచితంగా స్థలాలు ఇస్తుంది కానీ ఇలా భూ దాహం వున్న వ్యక్తులకు ఇవ్వలేదు. 

చంద్రబాబు ప్రభుత్వం ఆఖరి క్యాబినెట్‌లో గీతం భూముల క్రమబద్దీకరణ అంశాన్ని అప్పటి  క్యాబినెట్ వాయిదా వేసింది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని విమర్శలు చేసే టీడీపీ నాయకులు రుజువు చేయాలి. టీడీపీ అవినీతి విశ్వవిద్యాలయాన్ని నడిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు' అంటూ గుడివాడ అమరనాథ్‌ చంద్రబాబు తీరును ఎండగట్టారు.  (చంద్రబాబు బంధువులు అయితే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement