సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.. సూపర్ సిక్స్ హామీల అమలు సంగతి మర్చిపోయారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నిర్మించిన బిల్డింగ్‌లు వరదలకు గురయ్యాయి. మా హయాంలో అద్భుత భవనాలు నిర్మిస్తే ఓర్చుకోలేకపోతున్నారన్నారు
‘‘రాష్ట్రంలో రుషికొండ టూరిజం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి అద్భుత భవనాలు లేవు. నిన్న చంద్రబాబు షెడ్యూల్‌లో కూడా ఏపీ టూరిజం బిల్డింగ్ అని షెడ్యూల్ విడుదల చేశారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా రుషికొండ టూరిజం భవనాలు లాంటివి నిర్మించారా?’’ అంటూ అమర్‌నాథ్ ప్రశ్నించారు.
‘‘రూ.15 వందల కోట్లు పెట్టి చంద్రబాబు తాత్కాలిక సచివాలయం కట్టారు. వర్షం వస్తే మంత్రుల పేషిల్లోకి వరద నీరు వస్తుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో పెద్ద ఎత్తున దోచేశారు. రుషికొండ నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.. రుషికొండ టూరిజం భవనాలను మేమే ప్రారంభించాం’’ అని గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు.
‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు ప్రకటన చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను పక్కదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు’’ అని అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
‘‘ప్రజలకు రుషికొండ భవనాలు చూపిస్తామని చంద్రబాబు అంటున్నారు. అమరావతి తాత్కాలిక సచివాలయం కూడా చూపిస్తే ఎవరి నిర్మాణాలు గొప్పవో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రభుత్వానికి అమరావతి తప్పితే వేరే ప్రాంతం అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత విశాఖే పెద్ద నగరం. అందుకే విశాఖను రాజధాని చేయాలనుకున్నాం. విశాఖ గ్రోత్ ఇంజెన్‌గా ఉపయోగపడుతుంది. రాష్ట్రపతి, ప్రధాని వంటి పెద్దలు వచ్చినప్పుడు ఈ భవనాలు ఉపయోగపడతాయి.’’ అని అమర్‌నాథ్ వివరించారు.
ఇదీ చదవండి: సిగ్గేస్తున్నది బాబూ!
‘‘స్టేట్ గెస్ట్ హౌస్ కట్టాలని మా ప్రభుత్వం భావిస్తే కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు.. రుషికొండ భవనాలు దేనికి వాడుతారో చెప్పాలి. కేవలం రుషికొండ భవనాలు మాత్రమే కాదు.. ఉద్దానం రీసెర్చ్ సెంటర్, మెడికల్ కాలేజీలు, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ వంటివి కూడా ప్రజలకు చూపించాలి. పోలవరం నిర్మాణం ఎలా జరుగుతుందో చూపించడానికి రూ. 150 కోట్లు వృథా చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇళ్లు, ఫార్మ్ హౌస్ రెన్నోవేషన్ కోసం కోట్లు ఖర్చు చేశారు.’’ అని అమర్‌నాథ్ మండిపడ్డారు.
‘‘సూపర్ సిక్స్ అన్నారు ఒక్క రన్ కూడా తియ్యలేదు.. ఇంకెప్పుడు సిక్స్ కొడతారు. గ్యాస్ ఇచ్చాం అంటున్నారు.. ముందు ప్రజలు డబ్బులు కడితే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మద్యం ధరలు తగ్గింపు అని బోర్డులు పెట్టారు. నిత్యావసర ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గించారు. తల్లికి వందనం లేదు. నాన్నకు ఫుల్లుగా ఇంధనం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
రుషికొండ భవనాలు ప్రభుత్వానివి.. ఎలా వాడాలో ఆలోచించండి. గుర్ల డయేరియా బాధితులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు. ఆ కుటుంబాలను ఎందుకు పిలిచి మాట్లాడలేదు. గుంతలు సృష్టించి గుంతలు కప్పుతున్నారు. ఉన్న గుంతలను కప్పాలి. బాగున్న రోడ్లు తవ్వేసి కప్పేస్తున్నారు. లేని గోతులను సృష్టిస్తున్నారు. గుంతలు పూడ్చడానికి ఇంత ప్రచారం దేనికి’’ అంటూ అమర్‌నాథ్ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment