గత సర్కారు అండతో రుషికొండ, ఎండాడలో 40.51 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వివిధ స్థలాల్ని గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించినట్లు జిల్లా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఎండాడలోని సర్వే నం. 15,16,17,18,19,20, రుషికొండలోని సర్వే నం. 55,61లో ఆక్రమించిన 22.21 ఎకరాల చుట్టూ రక్షణ గోడ నిర్మాణం, సర్వే నం. 34,35,37,38లో 18.30 ఎకరాల విస్తీర్ణంలో గీతం యూనివర్సిటీ గార్డెనింగ్ నిర్మాణంతో పాటు గ్రావెల్ బండ్‌ని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేటతెల్లమైంది. ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్డీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ కూడా తమకు వచ్చిన ఫిర్యాదు నంబర్.2670 ప్రకారం విచారణ చేపట్టింది.
సాక్షి, విశాఖపట్నం: 1981లో గీతం విద్యా సంస్థ ఏర్పాటు చేసేందుకు రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్లు 17/1, 5, 17/7 నుంచి 28 వరకూ 71.15 ఎకరాల భూమిని ఇవ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. ఇదంతా అప్పట్లో భూమిలేని నిరుపేదలకు ఇచ్చిన భూమి కావడం, దాన్ని అప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నా.. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ప్రభుత్వం ఆ స్థల హక్కుల్ని గీతంకి బదిలీ చేయలేదు. కానీ ఆధీన పత్రాలు దక్కించుకునే వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ స్థలాన్ని విద్యాసంస్థకు అప్పగించింది. ఈ నిబంధనల్ని పాటించకపోతే ప్రభుత్వం తిరిగి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.
లేదంటే.. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి.. 14 ఎకరాల్లో నిర్మాణం చేపట్టి.. మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జేసీ ఈ స్థలాన్ని పరిశీలించి.. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు కేవలం 14 ఎకరాలు మాత్రమే నిర్మాణాలు చేపట్టి.. మిగిలిందంతా నిరుపయోగంగా ఉంచేశారంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీనిపై స్పందించిన అప్పటి భూ పరిపాలన చీఫ్ కమిషనర్ గీతంని పరిశీలించి.. కేవలం 49 ఎకరాలు మాత్రమే సరిపోతాయనీ.. మిగిలిన భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 1998 మే 27న ప్రభుత్వం ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. (విశాఖ భూ కుంభకోణం: సిట్ విచారణ ప్రారంభం)
ప్రభుత్వానికి నివేదిక పంపించాం..
ఎండాడ, రుషికొండ పరిసరాల్లో మొత్తం 40.51 ఎకరాల భూముల్ని గీతం సంస్థ ఆక్రమించినట్లు గుర్తించాం. ఏయే ప్రాంతాల్లో ఎంత భూములు ఆక్రమించుకున్నారు... హైకోర్టు విచారణలో ఉన్న కేసులు సంబంధించి ఎంత మేర భూములున్నాయి.. మొదలైన అంశాలతో కూడిన 7 పేజీల నివేదికను ప్రభుత్వానికి పంపించాం. – పెంచల్ కిశోర్, ఆర్‌డీవో, విశాఖపట్నం
ఇలా తీసుకొని.. అలా ఇచ్చేసిన టీడీపీ ప్రభుత్వం
స్వాధీనం చేసుకొని రెండు వారాల తరువాత అదే ఏడాది జూన్ 12న ఎకరా రూ.18వేలుగా ధర నిర్ణయించి గీతంకి అప్పగించేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసింది. స్థలాన్ని అప్పగించిన 1981 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ 10 శాతం వడ్డీ కట్టాలని కూడా ఆదేశించింది. మొత్తంగా రూ.34,94,200 చెల్లించి స్థలాన్ని గీతంకి అప్పటి టీడీపీ ప్రభుత్వం కట్టబెట్టింది.
క్రమంగా.. ఆక్రమణలు
ఇక అప్పటి నుంచి గీతం ఆ భూములకు పక్కన ఉన్న స్థలాల ఆక్రమణల పర్వానికి తెరతీసింది. సర్వే నం.20(పీ)లో 6.09 ఎకరాలు, నం.19లో 0.62 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం ఆక్రమించింది. దీనిపై విశాఖ రూరల్ ఎమ్మార్వో గీతం విశ్వవిద్యాలయానికి నోటీసులు జారీ చేయగా.. యాజమాన్యం ఆ స్థలాల్లో ఉన్న కట్టడాలు కూల్చొద్దంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
గీతం వివరణ తీసుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలంటూ 2004 డిసెంబర్ 28న ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిట్ పిటిషన్ దాఖలైన తర్వాత కూడా ఆక్రమణలు కొనసాగించినట్లు 2005 ఫిబ్రవరిలో గుర్తించారు. సర్వే నం.19లో 0.98 ఎకరాలు, 20లో 6.16 ఎకరాలు, 16లో 0.16 ఎకరాలు చొప్పున మొత్తం 7.30 ఎకరాలు ఆక్రమించినట్లు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆ నిర్మాణాల తొలగించాలని నిర్ణయించారు. మొత్తం 7.30 ఎకరాల్లో ఉన్న నిర్మాణాల్ని తొలిగించి 2005 ఫిబ్రవరి 19న ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు బోర్డులు ఏర్పాటు చేశారు.
ఒత్తిళ్లతో.. కట్టబెట్టారు
ఆ తర్వాత మరోసారి కోర్టుకి వెళ్లి గీతం యాజమాన్యం రిట్ పిటిషన్ దాఖలు చేయగా 4 వారాల్లో స్థలాన్ని గీతంకి స్వాధీనం చేయాలంటూ 2005 ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత రకరకాల ఒత్తిళ్లతో 2010లో స్థలాన్ని ప్రభుత్వం గీతం దూర విద్య కోర్సుల భవనానికి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత అక్రమంగా తమ ఆ«దీనంలో ఉంచుకున్న సర్వే నం. 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని వీఎంఆర్‌డీఏ వీసీ, ఇగ్నో రీజనల్ డైరెక్టర్, సోషల్ వెల్ఫేర్ డీడీ, ఐటీడీఏ పీఓ, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ పీడీ, ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్ మొదలైన వివిధ ప్రభుత్వ సంస్థల అధికారుల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైనా మరోసారి గీతం కోర్టుకి వెళ్లగా.. 2014 మార్చి 10న హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రస్తుతం ఆ స్టే కొనసాగుతూ ఉంది. దీన్ని మార్కెట్ ధర ప్రకారం ఎకరం రూ.8.26 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించినా గీతం యాజమాన్యం మాత్రం స్పందించలేదు. ఇలా.. మొత్తం 40.51 ఎకరాల భూమి గీతం చెరలో ఉందని ప్రభుత్వం నిర్ధారించింది. ఆర్డీవో ఇచ్చిన నివేదిక మేరకు దీనిపై చర్యలకు ఉపక్రమించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment