ఆ దుర్మార్గం వెనుక.. సూత్రధారులెవరు?
ఆలయ భూమిపై టీడీపీ నేతల కన్ను
కల్యాణ మండపం నిర్మించేందుకు ప్రణాళిక
దళితుల పూరిళ్లు దహనం
నాలుగు నెలలవుతున్నా కొలిక్కిరాని కేసు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/భీమవరం : అదో చిన్న గ్రామం. పేరు చినఅమిరం. భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడే ఓ ఇంజినీరింగ్ కళాశాల, పేరెన్నికగన్న ప్రైవేటు ఆసుపత్రి ఉన్నాయి. ఆ గ్రామానికి ముఖద్వారంలో సుమారు 5 ఎకరాల శివాలయ భూమి ఉంది. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. ఇంకేముంది.. 90 ఏళ్లకు లీజుకు తీసుకుని, అందులోఅధునాతనమైన కల్యాణ మండపం నిర్మించాలని ఆ పార్టీ నేతలు సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఉన్నత స్థాయిలో పావులు కదిపారు. ఆలయ భూమిని చౌకగా కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధమైంది. ఇక్కడే ఓ అడ్డంకి ఎదురైంది. శివాలయ భూమికి ఎదురుగా.. ప్రధాన రహదారికి మధ్యలో కొంతమంది నిరుపేదలు పూరిళ్లు, రేకుల షెడ్లు వేసుకుని దశాబ్దాలుగా నివశిస్తున్నారు. టీడీపీ నేతలు తలపెట్టిన కల్యాణ మండపం నిర్మాణానికి ఆ పేదల ఇళ్లు అడ్డొచ్చాయి. వారిని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని గదమాయించారు. ఎన్నోఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న తాము ఎక్కడికి పోతామంటూ వాళ్లు ఎదురుతిరిగారు. ఇదే తరుణంలో అక్కడే నివసిస్తున్న దిగమర్తి యాకోబుకు చెందిన పూరిల్లు రాత్రికి రాత్రి దహనమైంది.
తగులబెట్టిందెవరు!
అర్ధరాత్రి అందరూ తమ ఇళ్లలో గాఢనిద్రలో ఉండగా.. యాకోబు ఇంటికి బయట గొళ్లెం పెట్టి మరీ నిప్పుపెట్టారు. మంటలు ఎగసిపడటాన్ని చూసిన కొందరు పరుగు పరుగున అక్కడికొచ్చి ఆ ఇంటి గొళ్లెం తీసి యాకోబు కుటుంబ సభ్యులను రక్షించారు. తమ మాట వినలేదన్న పగతో నిరుపేదలను సజీవ దహనం చేయాలన్న కుట్రకు పాల్పడింది ఎవరు.. ఆ ఇంటికి నిప్పు పెట్టిన కిరాతకలు ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు. ఈ దారుణ ఘటన గతేడాది నవంబర్ 24న రాత్రి చోటుచేసుకుంది. పూరిల్లు దహనం వెనుక టీడీపీ బడా నాయకుల హస్తం ఉందని బాధితులు ఆరోపిస్తున్నా.. పోలీ సులు ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కేసు విచారణ ఏమైంది!
టీడీపీకి చెందిన ఉపసర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, ఆ పార్టీ నాయ కులు గొట్టుముక్కల నారాయణరాజు, బాతుల కృష్ణ తదితరులు తమ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారంటూ యాకోబు కుమారుడు దిగమర్తి రమేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘వ్యవసాయ భూమికి రోడ్డు వేసేం దుకు మా ఇల్లు అడ్డుగా ఉందంటూ ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. మేం అందుకు ససేమిరా అనడంతోనే కక్షగట్టి ఇంటిని తగులబెట్టారు ’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుపేద దళితుడనైన తనకు న్యాయం చేయాలని, శ్రీనివాసరాజు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ పోలీ సులు మాత్రం ఇంకా ఆ కేసును కొలిక్కి తీసుకురాలేదు. సుమారు నాలుగు నెలలవుతున్నా నిందితులెవరినీ అరెస్ట్ కాదు కదా.. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఆ బెంగతోనే నా భర్త చనిపోయాడు
మా తాతల కాలం నాటినుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అర్ధంతరంగా ఉప సర్పంచ్ మనుషులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు. ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా కనికరించలేదు. వేధింపులు తట్టుకోలేక.. ఆ బెంగతోనే నా భర్త యాకోబు చనిపోయాడు.
- దిగమర్తి మరియమ్మ, చినఅమిరం
భయం భయంగా బతుకున్నాం
ఉపసర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, మరో 8మంది కులం పేరుతో దూషించి సారాప్యాకెట్లు మా ఇంటి ఆవరణలో పెట్టి నన్ను కేసులో ఇరికించాలని చూశారు. మా ఇంటిని దహనం చేయించారు. దీనిపై భీమవరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదు. నరసాపురం సబ్ కలెక్టర్‌కు ఫిర్యా దు చేసినా న్యాయం జరగలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది.
- దిగమర్తి రమేష్‌బాబు, చినఅమిరం
అసలు సూత్రధారులెవరో ఉన్నారు
చినఅమిరం ఉపసర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు పాత్రధారి అయినప్పటికీ ఇంతటి దారుణ ఘటన వెనుక సూత్రధారులెవరో ఉన్నారు. పోలీసు అధికారులు సరిగ్గా విచారణ నిర్వహిస్తే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కానీ పోలీసులు ఈ కేసును అస్సలు పట్టించుకోవడం లేదు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఈ విషయమై బాధితుల పక్షాన పోలీసు అధికారులతో మాట్లాడారు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అసలు దోషులను శిక్షించకపోతే ఎమ్మార్పీఎస్ తరఫున ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
- సీహెచ్.రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు