KE krishnamurti
-
రూ.400 కోట్ల దేవుడి భూమికి ఎసరు!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి సహా మంత్రులు ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఇలాంటి సమయంలోనే గుంటూరు రెవెన్యూ పట్టణ పరిధిలో 89, 90, 135, 151 సర్వే నెంబర్లలోని 43.05 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేయడానికి అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. గుంటూరు నగరంలోని ఫీవర్ ఆసుపత్రిని (గుంటూరు– అమరావతి ప్రధాన మార్గం) ఆనుకుని ఈ భూమి ఉంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.400 కోట్ల పైమాటే. ఈ భూమి గుంటూరులోని సీతారామస్వామి ఆలయానికి చెందినదని దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన రికార్డులు ఉన్నాయి. ఆ భూమి దేవదాయ శాఖకు చెందినది కాదంటూ నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)తో పాటు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయం నుంచి కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. దేవాదాయ శాఖలో పనిచేసే కొందరు కీలక అధికారులు తెలుగుదేశం పార్టీ పెద్దలకే వత్తాసు పలుకుతున్నారు. ఒత్తిళ్లను తట్టుకోలేక దేవాదాయ శాఖ కమిషనర్ మరో వారం, పది రోజుల్లోనే ఎన్వోసీ జారీ చేయబోతున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ రికార్డుల్లో మార్పులు చేయాలట! చల్లపల్లి జమీందార్‌గా పిలిచే పాత గుంటూరు జమీందార్ రాజా మానూరి వెంకట నారాయణ 19వ దశకంలో గుంటూరు నగరంలో 128 ఎకరాలు, జిల్లాలోని చిలకలూరిపేట పట్టణం సమీపంలో మరో 31.12 ఎకరాల భూమిని సీతారామస్వామి ఆలయం పేరిట దానంగా ఇచ్చినట్టు దేవాదాయ శాఖ రికార్డుల్లో ఉంది. ఆ ఆలయంలో పనిచేసే కొందరు పూజారులు గుంటూరులోని భూమిని తమకు అమ్మారని.. ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే ఆలయానికి చెందిన 128 ఎకరాల భూమిలో ఫీవర్ ఆసుపత్రి వెనుక ఉండే 43.05 ఎకరాలను గుంటూరుకు చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడి వద్ద నుంచి తాము కొనుగోలు చేశామని పేర్కొంటూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుల రియల్ ఎస్టేట్ కంపెనీ తెరపైకి వచ్చింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు 2011లో ప్రయత్నించింది. స్థానికులు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది. తాజాగా అదే భూమిని తాము కొనుగోలు చేశామంటూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్ కుమార్ తెరపైకి వచ్చారు. పట్టాభి సీతారామస్వామి ఆలయ భూమిగా పేర్కొంటూ దేవాదాయ శాఖ రికార్డుల్లోని వివరాల్లో మార్పులు చేయాలని, తనకు ఎన్వోసీ జారీ చేయాలని కోరుతూ సుధీర్ కుమార్ 2018లో దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఆలయ రికార్డుల్లో ఆ భూమి స్వామి వారిదేనని స్పష్టంగా ఉండడంతో సుధీర్ కుమార్ చేసుకున్న ఎన్వోసీ దరఖాస్తును 2018 అక్టోబరులో దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించారు. మంత్రుల రంగ ప్రవేశం గతేడాది అక్టోబరులో ఎన్వోసీ దరఖాస్తును దేవాదాయ శాఖ కమిషనర్ తిరస్కరించిన తర్వాత కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబీకులు రంగ ప్రవేశం చేశారని, దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని దేవాదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కార్యాలయంతో పాటు సీఎం కార్యాలయ పెద్దలు ఇప్పుడు తెరవెనుక ఉండి.. ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న సుధీర్ కుమార్ పేరుతో ఆ 43.05 ఎకరాలను కొట్టేయడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2018 అక్టోబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్ మొదట ఎన్వోసీ దరఖాస్తును తిరస్కరించిన తర్వాత శ్రీనివాస ఎస్టేట్స్ యజమాని సుధీర్‌కుమార్ ఉపముఖ్యమంత్రి కేఈ కార్యాలయానికి పున:పరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవడం.. తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై పున:పరిశీలన చేయాలంటూ కమిషనర్ కార్యాలయానికి ఉపముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందడం ఒకదాని వెంట ఒకటి వేగంగా జరిగిపోయాయి. 43.05 ఎకరాల భూమిపై ప్రొద్దుటూరు శ్రీనివాస ఎస్టేట్స్ పేరిట ఎన్వోసీ జారీకి నాలుగు రోజుల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ పున:విచారణ ప్రారంభించారు. పదోన్నతులు అందుకోసమేనా? ఒకసారి తిరస్కరించిన ఎన్వోసీ దరఖాస్తుపై సానుకూల నిర్ణయం తీసుకునేందుకు గుంటూరు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసే అధికారికి డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి ఇచ్చి గుంటూరులోనే నియమించారని దేవాదాయ శాఖలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఈ తతంగం జరగడం గమనార్హం. 43.05 ఎకరాల భూమిపై ముందుగా నిర్ణయించుకున్న మేరకు నివేదికలు ఇవ్వడం కోసమే పదోన్నతులు కొనసాగాయని చెబుతున్నారు. -
‘మీ’–సేవ అర్జీలు బుట్టదాఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘మీ–సేవ’ తిరస్కరణ సేవగా మారింది. నిర్దిష్ట రుసుం, సర్వీస్ చార్జీ చెల్లించి మీ–సేవలో సమర్పించిన దరఖాస్తులను రకరకాల కుంటిసాకులతో అధికారులు తిరస్కరించి చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఇలాగైతే అర్జీలు స్వీకరించడం ఎందుకని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల అప్డేట్(మ్యుటేషన్), మైగ్రేషన్ సర్టిఫికేట్(వలస ధ్రువీకరణ), డూప్లికేట్ మార్కుల జాబితా, కొత్త ఇల్లు నిర్మాణం/ఉన్న ఇంట్లో అదనపు గదుల నిర్మాణానికి అనుమతి, రెవెన్యూ రికార్డుల్లో అదనపు సర్వే నంబరు చేర్పు తదితర సేవల కోసం మీ–సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును గత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నీరుగారుతున్న లక్ష్యం లంచాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సర్టిఫికేట్లు జారీ చేయడమే మీ–సేవ కేంద్రాల ఏర్పాటు లక్ష్యమని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అధికారుల అలసత్వంతో ఈ లక్ష్యం నీరుగారిపోతోంది. ‘‘సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన, ముడుపులు సమర్పించాల్సిన అవసరం ఉండదు. మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేస్తే చాలు సర్టిఫికేట్ ఇంటికే వస్తుంది. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయి’’ అని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మీ–సేవలో దరఖాస్తు చేసినప్పటికీ ధ్రువపత్రం రావాలంటే సంబంధిత అధికారులను కలిసి ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేకపోతే ఏదో ఒక సాకుతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. 2017 మార్చి 1 నుంచి 2018 మార్చి 1వ తేదీ వరకూ కేవలం ఏడాది వ్యవధిలో 10.25 లక్షల అర్జీలను చెత్తబుట్టలో పడేయడం గమనార్హం. మీ–సేవ ద్వారా రుసుం చెల్లించి ఏడాది కాలంలో మొత్తం 70.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 57.36 లక్షల అర్జీలను అధికారులు ఆమోదించారు. మరో 10.25 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా 2.64 లక్షల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. డబ్బు, సమయం వృథా కరువు వల్ల అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి చాలామంది పొట్ట చేతపట్టుకుని కూలీ పనులకోసం వలస వెళుతున్నారు. వీరు వలస ధ్రువీకరణ పత్రాలకోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రూ.635 చెల్లించి దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. వలస వెళ్లినట్లు సర్టిఫికేట్ ఇస్తే వారికి పని చూపలేదంటూ ప్రజాప్రతినిధుల నుంచి మాట పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే వలస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని సమాచారం. దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తుండడంతో డబ్బు, సమయం వృథా అవుతున్నాయని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది అర్జీలు తిరస్కరణకు గురవుతున్నట్లు తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సర్వే, మ్యుటేషన్ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది తిరస్కరించి పక్కన పడేస్తున్నారని, సమస్యలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతున్నాయని రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇటీవల జరిగిన జాయింట్ కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. డబ్బులిస్తేనే ఎన్ఓసీ వచ్చింది ‘‘విశాఖపట్నంలోని నా ఇంటికి అదనపు నిర్మాణానికి గాను నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) కోసం నిర్ధిష్ట రుసుం చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేశా. సంబంధిత అధికారిని కలవకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారని వేరేవారు చెప్పడంతో వెళ్లి కొంత డబ్బు ముట్టజెప్పా. వెంటనే ఎన్ఓసీ వచ్చింది. నాతోపాటు దరఖాస్తు చేసిన నా మిత్రుడు సంబంధిత అధికారిని కలవకపోవడంతో అతడి అర్జీ తిరస్కరణ జాబితాలో చేరింది’’ – ప్రసాదరాజు, ఎంవీపీ కాలనీ, విశాఖపట్నం -
మేయర్ పీఠం చిచ్చురేపుతోంది
రెండు కుటుంబాలకు ప్రతిష్టాత్మకం నువ్వా నేనా అన్నట్లు అధికార పార్టీ నేతలు చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ అంశం తెరపైకి కేఈ, టీజీ కుటుంబాలు కర్నూలు కార్పొరేషన్ పోరు కేఈ, టీజీ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గి రాజేసేలా కనిపిస్తోంది. మేయర్ పీఠం తమ వర్గానికే అంటూ ఒకరు.. కాదు, రాజకీయ సమీకరణలు మారిన నేపథ్యంలో తమ వర్గానికే దక్కాలంటే మరొకరు వాదనకు దిగడం చర్చనీయాంశమవుతోంది. అసలే వేసవి.. ఈ సమయంలో రాజకీయ వేడి కర్నూలును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 2014లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడింది. కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి మేయర్ పదవి బీసీ జనరల్ మహిళలకు రిజర్వేషన్ చేసినట్లు ప్రకటించింది. అదే సమయంలో కర్నూలు కార్పొరేషన్ పరిధి పెంచుతూ స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను విలీన ప్రకటనను వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయావిలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో కర్నూలు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడటం తెలిసిందే. ఇటీవల హైకోర్టు జోక్యంతో మళ్లీ కర్నూలు నగరంలో కార్పొరేషన్ ఎన్నిక ప్రక్రియ తెరపైకి వచ్చింది. అయితే గతంలో బీసీ వర్గానికి రిజర్వేషన్ చేసిన మేయర్ పీఠాన్ని.. జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఓసీలకు కేటాయించేందుకు కొందరు నేతలు పావులు కదపడాన్ని బీసీలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు వర్గాలు మేయర్ పీఠం తమదంటే తమదంటూ బహిరంగంగానే ప్రకటించుకోవడం చర్చనీయాంశమవుతోంది. తెరపైకి ఇద్దరు నేతలు.. కర్నూలు నగరంలో పట్టుకోసం మొదటి నుంచి యత్నిస్తున్న కేఈ, టీజీ కుటుంబాలు కార్పొరేషన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మేయర్ పీఠం బీసీ మహిళలకు కేటాయించడంతో.. ఆ స్థానం దక్కించుకొని కర్నూలులో తమ పట్టు నిలుపుకునేందుకు కేఈ కుటుంబం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుటుంబంలో మేయర్ అభ్యర్థి ఎవరనే విషయమై భిన్న వాదన వినిపిస్తోంది. కుటుంబంలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా నిలపాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి భావిస్తున్నారనే చర్చ ఉండగా.. ఆయన సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ప్రస్తుత మార్కెట్ యార్డు చైర్పర్సన్ శమంతకమణిని మేయర్ బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా తన కుటుంబంలో ఒకరిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లేదా ఆయన సూచించిన వారికి మేయర్ పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరనున్నట్లు సమాచారం. సదరు అభ్యర్థిని ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలిపించే బాధ్యత కూడా తానే భుజానికెత్తుకుంటానని కూడా చెబుతున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ మార్పుపై చర్చ కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠం రిజర్వేషన్ మార్పు అంశం ఇప్పుడు కర్నూలులో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ అధిష్టానం కూడా రిజర్వేషన్ మార్పునకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చర్చనీయాంశం కావడంతో బీసీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రిజర్వేషన్లో మార్పు జరిగితే అధికార పార్టీ తరపున స్వతంత్ర అభ్యర్థిని పోటీకి నిలిపి గెలిపించుకుంటామని ఓ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద మేయర్ పీఠం ఇరు కుటుంబాల మధ్య రాజకీయ చిచ్చుకు తెర లేపింది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వారు స్వామి దర్శనం చేసుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
అసెంబ్లీలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తారా?
బేతంచెర్ల: టీడీపీ నాయకులు బడి, గుడి, ప్రభుత్వ కార్యాలయాలనే తేడా లేకుండా పార్టీ జెండాలను ఎగరవేస్తుంటే అధికారులు అవేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం చూస్తుంటే శాసనసభ మధ్యలో కూడా టీడీపీ జెండాను ఎగురవేశేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ నాయకులు బడి ముందు జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాల బయటకు వస్తే జాతీయ జెండాను చూడాలా లేక టీడీపీ జెండాలను చూడాలా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పార్టీలు మార్చే వ్యక్తినంటూ తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై విమర్శలు చేసిన కేఈ ఎన్ని పార్టీల తీర్థం పుచ్చుకున్నారో తెలియదా అని ప్రశ్నించారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుస్తానని అనలేదా అని ఆయన గుర్తు చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న కేఈ కృష్ణమూర్తి
తిరుమల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వేకువజామున వీఐపీ ప్రారంభ సమయంలో ఆలయానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్ధప్రసాదాలు అందజేశారు.