రెండు కుటుంబాలకు ప్రతిష్టాత్మకం
నువ్వా నేనా అన్నట్లు అధికార పార్టీ నేతలు
చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ అంశం
తెరపైకి కేఈ, టీజీ కుటుంబాలు
కర్నూలు కార్పొరేషన్ పోరు కేఈ, టీజీ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గి రాజేసేలా కనిపిస్తోంది. మేయర్ పీఠం తమ వర్గానికే అంటూ ఒకరు.. కాదు, రాజకీయ సమీకరణలు మారిన నేపథ్యంలో తమ వర్గానికే దక్కాలంటే మరొకరు వాదనకు దిగడం చర్చనీయాంశమవుతోంది. అసలే వేసవి.. ఈ సమయంలో రాజకీయ వేడి కర్నూలును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 2014లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడింది. కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి మేయర్ పదవి బీసీ జనరల్ మహిళలకు రిజర్వేషన్ చేసినట్లు ప్రకటించింది. అదే సమయంలో కర్నూలు కార్పొరేషన్ పరిధి పెంచుతూ స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను విలీన ప్రకటనను వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయావిలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో కర్నూలు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడటం తెలిసిందే. ఇటీవల హైకోర్టు జోక్యంతో మళ్లీ కర్నూలు నగరంలో కార్పొరేషన్ ఎన్నిక ప్రక్రియ తెరపైకి వచ్చింది. అయితే గతంలో బీసీ వర్గానికి రిజర్వేషన్ చేసిన మేయర్ పీఠాన్ని.. జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఓసీలకు కేటాయించేందుకు కొందరు నేతలు పావులు కదపడాన్ని బీసీలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు వర్గాలు మేయర్ పీఠం తమదంటే తమదంటూ బహిరంగంగానే ప్రకటించుకోవడం చర్చనీయాంశమవుతోంది.
తెరపైకి ఇద్దరు నేతలు..
కర్నూలు నగరంలో పట్టుకోసం మొదటి నుంచి యత్నిస్తున్న కేఈ, టీజీ కుటుంబాలు కార్పొరేషన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మేయర్ పీఠం బీసీ మహిళలకు కేటాయించడంతో.. ఆ స్థానం దక్కించుకొని కర్నూలులో తమ పట్టు నిలుపుకునేందుకు కేఈ కుటుంబం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుటుంబంలో మేయర్ అభ్యర్థి ఎవరనే విషయమై భిన్న వాదన వినిపిస్తోంది. కుటుంబంలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా నిలపాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి భావిస్తున్నారనే చర్చ ఉండగా.. ఆయన సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ప్రస్తుత మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ శమంతకమణిని మేయర్ బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా తన కుటుంబంలో ఒకరిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లేదా ఆయన సూచించిన వారికి మేయర్ పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరనున్నట్లు సమాచారం. సదరు అభ్యర్థిని ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలిపించే బాధ్యత కూడా తానే భుజానికెత్తుకుంటానని కూడా చెబుతున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది.
రిజర్వేషన్ మార్పుపై చర్చ
కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠం రిజర్వేషన్ మార్పు అంశం ఇప్పుడు కర్నూలులో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ అధిష్టానం కూడా రిజర్వేషన్ మార్పునకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చర్చనీయాంశం కావడంతో బీసీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రిజర్వేషన్‌లో మార్పు జరిగితే అధికార పార్టీ తరపున స్వతంత్ర అభ్యర్థిని పోటీకి నిలిపి గెలిపించుకుంటామని ఓ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద మేయర్ పీఠం ఇరు కుటుంబాల మధ్య రాజకీయ చిచ్చుకు తెర లేపింది.
మేయర్ పీఠం చిచ్చురేపుతోంది
Published Tue, May 3 2016 1:09 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement