TG ventesh
-
బరి తెగించిన టీజీ భరత్
కర్నూలు(టౌన్): ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ప్రలోభాలకు ఒడిగట్టారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ మరింత బరి తెగించారు. ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వారం రోజులుగా తన హోటల్ కేంద్రంగా ప్రలోభపర్వం కొనసాగిస్తున్నప్పటికీ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాస్తవానికి భరత్‌కు చివరి నిమిషంలో టికెట్ ఖరారైంది. అప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ కర్నూలు అసెంబ్లీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అన్ని వర్గాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానంటూ హఫీజ్‌ఖాన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో కంగుతిన్న భరత్ ప్రలోభాలకు తెరతీశారు. తక్కువ సమయంలో ఓటర్లను కలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో తాయిలాలు ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. మౌర్య ఇన్‌లో డబ్బుల పంపిణీ జోరుగా చేపడుతున్నట్లు స్వయాన టీడీపీ నాయకులే చెబుతున్నారు. ప్రతి రోజు హోటల్లో మహిళా గ్రూపులతో సమావేశాలు నిర్వహించడం, భోజనాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రంగంలోకి ఆల్కలీస్ సిబ్బంది ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో భాగంగా టీజీ వెంకటేష్ అల్కలీస్ పరిశ్రమలకు చెందిన సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు. మంగళవారం సాయంత్రం వారు కర్నూలు శ్రీరామ నగర్‌లోని పలు కాలనీలలో పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించారు. కాలనీల్లో తమకు తెలిసిన వారి నుంచి ఓటరు కార్డు నకలు, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను సేకరించారు. ముందస్తుగా మాట్లాడుకున్న వారికి నేరుగా అకౌంట్లో డబ్బులు జమచేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కడికి ‘సాక్షి’ బృందం చేరుకుంది. దీంతో అల్కలీస్ సిబ్బంది మెల్లగా జారుకున్నారు. టీజీవీ కళాక్షేత్రంలోనూ కళాకారులతో గెట్–టు–గెదర్ పేరుతో డబ్బుల పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఐలయ్యపై దాడి పిరికిపందల చర్య: కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ఓబీసీ, దళిత హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక వేత్త, రచయిత, ఫ్రోఫెసర్ కంచె ఐలయ్యను దూషిస్తూ జరగుతున్న దాడిని పిరికిపందల చర్యగా భావిస్తున్నామని ఏఐసీసీ సమాచార వ్యవహారాల ఇంచార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్యదేశంలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేచ్చఉందన్నారు. మేధావుల గొంతు నొక్కి తార్కిక వాదుల ఆలోచనలపై నిరంతరం జరుగుతున్న దాడులు దారుణమన్నారు. సెప్టెంబర్ 24న పరకాలలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఫ్రోఫెసర్ కంచె ఐలయ్య వాహనంపై రాళ్లు చెప్పులతో దాడి చేయించడం, బీజేపీ అంటకాగుతున్న టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ నిస్సిగ్గుగా ఐలయ్యని చంపమని, వీలైతే బహిరంగంగా వీధుల్లో ఉరితీసినా తప్పులేదని ఫత్వా జారీ చేయాడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ ప్రవర్తన పట్ల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. -
మేయర్ పీఠం చిచ్చురేపుతోంది
రెండు కుటుంబాలకు ప్రతిష్టాత్మకం నువ్వా నేనా అన్నట్లు అధికార పార్టీ నేతలు చర్చనీయాంశంగా మారిన రిజర్వేషన్ అంశం తెరపైకి కేఈ, టీజీ కుటుంబాలు కర్నూలు కార్పొరేషన్ పోరు కేఈ, టీజీ కుటుంబాల మధ్య మళ్లీ అగ్గి రాజేసేలా కనిపిస్తోంది. మేయర్ పీఠం తమ వర్గానికే అంటూ ఒకరు.. కాదు, రాజకీయ సమీకరణలు మారిన నేపథ్యంలో తమ వర్గానికే దక్కాలంటే మరొకరు వాదనకు దిగడం చర్చనీయాంశమవుతోంది. అసలే వేసవి.. ఈ సమయంలో రాజకీయ వేడి కర్నూలును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 2014లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధపడింది. కర్నూలు కార్పొరేషన్‌కు సంబంధించి మేయర్ పదవి బీసీ జనరల్ మహిళలకు రిజర్వేషన్ చేసినట్లు ప్రకటించింది. అదే సమయంలో కర్నూలు కార్పొరేషన్ పరిధి పెంచుతూ స్టాంటన్‌పురం, మామిదాలపాడు, మునగాలపాడు గ్రామ పంచాయతీలను విలీన ప్రకటనను వెలువరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయావిలీన గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో కర్నూలు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడటం తెలిసిందే. ఇటీవల హైకోర్టు జోక్యంతో మళ్లీ కర్నూలు నగరంలో కార్పొరేషన్ ఎన్నిక ప్రక్రియ తెరపైకి వచ్చింది. అయితే గతంలో బీసీ వర్గానికి రిజర్వేషన్ చేసిన మేయర్ పీఠాన్ని.. జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఓసీలకు కేటాయించేందుకు కొందరు నేతలు పావులు కదపడాన్ని బీసీలో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు వర్గాలు మేయర్ పీఠం తమదంటే తమదంటూ బహిరంగంగానే ప్రకటించుకోవడం చర్చనీయాంశమవుతోంది. తెరపైకి ఇద్దరు నేతలు.. కర్నూలు నగరంలో పట్టుకోసం మొదటి నుంచి యత్నిస్తున్న కేఈ, టీజీ కుటుంబాలు కార్పొరేషన్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. మేయర్ పీఠం బీసీ మహిళలకు కేటాయించడంతో.. ఆ స్థానం దక్కించుకొని కర్నూలులో తమ పట్టు నిలుపుకునేందుకు కేఈ కుటుంబం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుటుంబంలో మేయర్ అభ్యర్థి ఎవరనే విషయమై భిన్న వాదన వినిపిస్తోంది. కుటుంబంలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా నిలపాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి భావిస్తున్నారనే చర్చ ఉండగా.. ఆయన సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ప్రస్తుత మార్కెట్ యార్డు చైర్పర్సన్ శమంతకమణిని మేయర్ బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా తన కుటుంబంలో ఒకరిని మేయర్ పీఠంపై కూర్చోబెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. లేదా ఆయన సూచించిన వారికి మేయర్ పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరనున్నట్లు సమాచారం. సదరు అభ్యర్థిని ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో గెలిపించే బాధ్యత కూడా తానే భుజానికెత్తుకుంటానని కూడా చెబుతున్నట్లు ఆ పార్టీ వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ మార్పుపై చర్చ కర్నూలు కార్పొరేషన్ మేయర్ పీఠం రిజర్వేషన్ మార్పు అంశం ఇప్పుడు కర్నూలులో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ అధిష్టానం కూడా రిజర్వేషన్ మార్పునకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం చర్చనీయాంశం కావడంతో బీసీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రిజర్వేషన్లో మార్పు జరిగితే అధికార పార్టీ తరపున స్వతంత్ర అభ్యర్థిని పోటీకి నిలిపి గెలిపించుకుంటామని ఓ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద మేయర్ పీఠం ఇరు కుటుంబాల మధ్య రాజకీయ చిచ్చుకు తెర లేపింది.