టీజీ హోటల్‌లో భోజనాలు ఏర్పాటు చేసిన దృశ్యం
కర్నూలు(టౌన్): ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ప్రలోభాలకు ఒడిగట్టారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ మరింత బరి తెగించారు. ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వారం రోజులుగా తన హోటల్ కేంద్రంగా ప్రలోభపర్వం కొనసాగిస్తున్నప్పటికీ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాస్తవానికి భరత్‌కు చివరి నిమిషంలో టికెట్ ఖరారైంది. అప్పటికే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ కర్నూలు అసెంబ్లీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు.
అన్ని వర్గాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానంటూ హఫీజ్‌ఖాన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో కంగుతిన్న భరత్ ప్రలోభాలకు తెరతీశారు. తక్కువ సమయంలో ఓటర్లను కలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో తాయిలాలు ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. మౌర్య ఇన్‌లో డబ్బుల పంపిణీ జోరుగా చేపడుతున్నట్లు స్వయాన టీడీపీ నాయకులే చెబుతున్నారు. ప్రతి రోజు హోటల్‌లో మహిళా గ్రూపులతో సమావేశాలు నిర్వహించడం, భోజనాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది.
రంగంలోకి ఆల్కలీస్ సిబ్బంది
ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో భాగంగా టీజీ వెంకటేష్ అల్కలీస్ పరిశ్రమలకు చెందిన సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు. మంగళవారం సాయంత్రం వారు కర్నూలు శ్రీరామ నగర్‌లోని పలు కాలనీలలో పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించారు. కాలనీల్లో తమకు తెలిసిన వారి నుంచి ఓటరు కార్డు నకలు, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను సేకరించారు. ముందస్తుగా మాట్లాడుకున్న వారికి నేరుగా అకౌంట్‌లో డబ్బులు జమచేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కడికి ‘సాక్షి’ బృందం చేరుకుంది. దీంతో అల్కలీస్ సిబ్బంది మెల్లగా జారుకున్నారు. టీజీవీ కళాక్షేత్రంలోనూ కళాకారులతో గెట్–టు–గెదర్ పేరుతో డబ్బుల పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment