
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు(Virat Kohli World Record) సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్, క్రికెట్ దేవుడుగా పేరొందిన సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ అరుదైన ఘనత సాధించాడు.
రాణించిన భారత బౌలర్లు
కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టింది. దుబాయ్‌లో టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన రోహిత్ సేన.. రిజ్వాన్ బృందాన్ని 241 పరుగులకు కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు కీలక వికెట్లు కూల్చాడు.
మిగతా వాళ్లలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీయగా.. పేసర్లలో హర్షిత్ రాణా కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు.
ఈ క్రమంలో 15 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 20 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది వేసిన అద్భుత బంతికి బౌల్డ్ అయ్యాడు. దీంతో రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి గిల్‌తో కలిసి నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే, పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ సూపర్ డెలివరీతో గిల్(46)ను పెవిలియన్‌కు పంపాడు.
తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు
ఈ నేపథ్యంలో సరిగ్గా వంద పరుగులు చేసిన తర్వాత టీమిండియా రెండో వికెట్ కోల్పోగా.. కోహ్లి ఆచితూచి ఆడుతూ సహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో పదిహేను పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి వన్డేల్లో 14000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా ఈ రన్‌మెషీన్ నిలిచాడు. అంతేకాదు.. అత్యంత వేగంగా అంటే.. తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ మైల్‌స్టోన్ అందుకున్న తొలి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు సాధించాడు.
కాగా వన్డేల్లో పద్నాలుగు వేల పరుగులు చేయడానికి సచిన్ టెండుల్కర్‌కు 350 ఇన్నింగ్స్ అవసరమైతే.. కోహ్లి 287వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. తద్వారా 300లోపు ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేయడం గమనార్హం.
ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో కోహ్లి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే.. పాక్‌తో మ్యాచ్‌లో శతకంతో లక్ష్య ఛేదన పూర్తి చేసి జట్టును గెలిపించాడు.
వన్డేల్లో అత్యధిక పరుగుల వీరులు
1.సచిన్ టెండుల్కర్(ఇండియా)- 18426 రన్స్(452 ఇన్నింగ్స్)
2.కుమార్ సంగక్కర(శ్రీలంక)- 14234 రన్స్(380 ఇన్నింగ్స్)
3.విరాట్ కోహ్లి(ఇండియా)- 14000+ రన్స్(287 ఇన్నింగ్స్)*
4. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 13704 రన్స్(365 ఇన్నింగ్స్)
5. సనత్ జయసూర్య(శ్రీలంక)- 13430 రన్స్(433 ఇన్నింగ్స్).
చదవండి: కోహ్లి సరికొత్త చరిత్ర.. భారత్ తరఫున తొలి ఆటగాడిగా అరుదైన ఫీట్