
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) ఆగ్రహం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో బాబర్ ఆజంపై వేటు వేయడాన్ని తప్పుబట్టాడు. అదే విధంగా.. బాబర్‌ను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై కూడా అజ్మల్ ఈ సందర్భంగా మండిపడ్డాడు.
అంతటి సచిన్‌కే తప్పలేదు
అంతటి సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)కు అయినా ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేయడం సాధ్యం కాదని.. అలాంటపుడు బాబర్‌ను పదే పదే ఎందుకు విమిర్శిస్తారని అసహనం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన బాబర్ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా వ్యవహరించడం మానుకోవాలని అజ్మల్ హితవు పలికాడు.
కాగా వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అంతేకాదు చరిత్రలో లేని విధంగా తొలిసారి అఫ్గనిస్తాన్ చేతిలో వన్డే పరాజయం చవిచూసింది. దీంతో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి ముందు పీసీబీ మరోసారి అతడికి పగ్గాలు అప్పగించింది.
ఇక ఈ ఐసీసీ టోర్నమెంట్లోనూ పాకిస్తాన్‌కు పరాభవమే ఎదురైంది. పసికూన అమెరికా చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్‌పై వేటు వేసిన పీసీబీ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో వన్డేల్లో పాక్ చిరస్మరణీయ విజయాలు సాధించింది.
ఆ ఇద్దరిపై వేటు
ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలను ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదే జోరులో సొంతగడ్డపై ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. అయితే, అంతకంటే ముందు సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌లతో త్రైపాక్షక వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన రిజ్వాన్ బృందం.. ఐసీసీ టోర్నీలోనూ చేదు అనుభవం చవిచూసింది.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి ఒక్క విజయం లేకుండానే ఈ వన్డే ఈవెంట్ నుంచి నిష్క్రమించింది. తొలుత న్యూజిలాండ్ చేతిలో.. అనంతరం టీమిండియా చేతిలో పరాజయం పాలైన పాక్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో నిరాశగా వెనుదిరిగింది. ఇక ఈ టోర్నీలో బాబర్‌తో పాటు.. రిజ్వాన్ కూడా తేలిపోయాడు.
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో పీసీబీ ఈ ఇద్దరికి చోటు ఇవ్వలేదు. కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తప్పించడంతో పాటు బాబర్‌పై కూడా వేటు వేసింది. ఈ విషయంపై సయీద్ అజ్మల్ స్పందిస్తూ పీసీబీ తీరును ఎండగట్టాడు.
విరాట్ లాంటి దిగ్గజాలు కూడా అంతే
‘‘బాబర్, రిజ్వాన్ గొప్ప ఆటగాళ్లు. అయితే, మిగతా వాళ్లలా వాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేయలేరు. అయినా సరే జట్టుకు అవసరమైనప్పుడు కచ్చితంగా రాణిస్తారు. కానీ మా వాళ్ల(మాజీ క్రికెటర్లను ఉద్దేశించి) ఆలోచనా విధానం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
అంతర్జాతీయ క్రికెట్ అంటే దూకుడుగా ఆడాలనే ఫిక్సైపోయినట్టున్నారు. మ్యాచ్ విన్నర్లకు దూకుడుతో పని ఏముంది? అటాకింగ్ చేసే కంటే ముందు విరాట్ లాంటి దిగ్గజాలు కూడా తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభిస్తారు. అది వాళ్ల శైలి. కానీ బాబర్- రిజ్వాన్‌లను మీరెందుకు తప్పుబడుతున్నారు?
వాళ్లను టీ20 జట్టు నుంచి తొలగించడం ముమ్మాటికీ తప్పే. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. బాబర్‌పై వేటు వేయకుండా.. అతడితో చర్చించి ఆటను మార్చుకునే విధంగా.. తిరిగి పుంజుకునేలా స్ఫూర్తి నింపి ఉండాల్సింది.
మీరు కాస్త నోళ్లు మూయండి
ప్రతి ఒక్క క్రికెటర్ జీవితంలో ఒకానొక సమయంలో గడ్డు దశ ఎదుర్కోక తప్పదు. కెరీర్ మొత్తం ఏ ఆటగాడూ అద్భుతంగా ఆడలేడు. అంతెందుకు.. సచిన్ టెండుల్కర్ కూడా ప్రతి మ్యాచ్‌లో శతకం బాదలేడు కదా!
పాకిస్తాన్ క్రికెట్‌కు ఉన్న ఏకైక స్టార్ బాబర్. మీరు గనుక అతడిని కూడా డీగ్రేడ్ చేస్తే.. ఎవరి పేరు మీద పాక్ క్రికెట్‌ను నడుపుతారు? కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. మన మాజీ క్రికెటర్లు కాస్త నోళ్లు మూసుకుని ఉంటే బాగుంటుంది’’ అని సయీద్ అజ్మల్ ఘాటు విమర్శలు చేశాడు.
చదవండి: ఎవరూ ఊహించని నిర్ణయం.. అతడి రాకతో కివీస్ కుదేలు: పాక్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment