
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్న పాకిస్తాన్ ఆశలపై వరణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా పాక్- బంగ్లాదేశ్(Pakistan vs Bangladesh) మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దైపోయింది. ఫలితంగా ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ వన్డే టోర్నమెంట్ బరిలో దిగిన పాకిస్తాన్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అదేమిటంటే....
కాగా 2017 తర్వాత చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరగటం ఇదే తొలిసారి. నాడు టైటిల్ గెలిచిన పాకిస్తాన్ ఈసారి ఈ మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులను సంపాదించింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో చెత్త ప్రదర్శన కనబరిచినా ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా అర్హత సాధించింది.
ఇక ఈ టోర్నీలో పాక్‌తో పాటు గ్రూప్-‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ భాగమయ్యాయి. ఫిబ్రవరి 19న ఈ టోర్నమెంట్ మొదలుకాగా.. తొలి మ్యాచ్లో పాకిస్తాన్- న్యూజిలాండ్ తలపడ్డాయి. ఇందులో కివీస్ జట్టు గెలిచింది.
రెండు ఓటములు.. సెమీస్ ఆశలు గల్లంతు
అనంతరం పాకిస్తాన్ దాయాది టీమిండియాతో పోరులోనూ ఓడిపోయింది. ఈ క్రమంలో సెమీస్ చేరే అవకాశాన్ని పోగొట్టుకున్న రిజ్వాన్ బృందం.. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావించింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో గురువారం మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కాగా.. వర్షం రూపంలో చేదు అనుభవం ఎదురైంది.
రావల్పిండిలో ఎడతెగని చినుకుల కారణంగా టాస్ పడకుండానే పాక్- బంగ్లా మ్యాచ్ ముగిసిపోయింది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది. దీంతో గ్రూప్-‘ఎ’ పాయింట్ల పట్టికలో అట్టడుగున నాలుగో స్థానంతో టోర్నీని ముగించింది. బంగ్లాదేశ్‌తో సమానంగా ఒక పాయింట్ సాధించినప్పటికీ నెట్ రన్‌రేటు పరంగా పాక్ వెనుబడి ఉండటం ఇందుకు కారణం.
పాకిస్తాన్ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో గ్రూప్ దశ(2002 నుంచి) ప్రవేశపెట్టిన తర్వాత.. ఒక్క విజయం కూడా సాధించకుండా.. అదే విధంగా పాయింట్ల పట్టికలో ఆఖరున నిలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఓవరాల్‌గా ఈ జాబితాలో కెన్యా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 2000 సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన కెన్యా ఒక్కటీ గెలవకుండానే నిష్క్రమించింది.
ఇదే కాకుండా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఇంటిబాట పట్టిన రెండో జట్టుగానూ పాకిస్తాన్ నిలిచింది. 2009, 2013 ఎడిషన్లలో ఆస్ట్రేలియా కూడా మూడు మ్యాచ్‌లలో ఒక్కటి గెలవలేదు. వర్షం వల్ల ఓ మ్యాచ్ రద్దు కావడంతో ఇప్పుడు పాక్ మాదిరే వరణుడి వల్ల ఒక్క పాయింట్ సాధించగలిగింది.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ ప్రయాణం
👉ఫిబ్రవరి 19- కరాచీలో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి
👉ఫిబ్రవరి 23- దుబాయ్‌లో టీమిండియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి
👉ఫిబ్రవరి 27- రావల్పిండిలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
గ్రూప్-‘ఎ’ పాయింట్ల పట్టిక
1. న్యూజిలాండ్- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు+0.863(సెమీస్‌కు అర్హత)
2. ఇండియా- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్‌రేటు +0.647(సెమీస్‌కు అర్హత)
3. బంగ్లాదేశ్- మ్యాచ్‌లు మూడు- ఓడినవి రెండు- ఒకటి రద్దు ఒక పాయింట్- నెట్ రన్‌రేటు-0.443(ఎలిమినేటెడ్)
4. పాకిస్తాన్- మ్యాచ్‌లు మూడు- ఓడినవి రెండు- ఒకటి రద్దు ఒక పాయింట్- నెట్ రన్‌రేటు-1.087 (ఎలిమినేటెడ్).
చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు