
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో వరుస పరాజయాలతో.. కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఇంటా బయటా రిజ్వాన్(Mohammad RIzwan) బృందంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ ఆకిబ్ జావేద్(Aaqib Javed) సైతం ఆటగాళ్లపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడని.. ఘాటు వ్యాఖ్యలతో వారిని దూషించాడని స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఆటగాళ్లను గౌరవిస్తాను
ఈ వార్తలపై ఆకిబ్ జావేద్ తాజాగా స్పందించాడు. తానెన్నడూ ఆటగాళ్లను దూషించలేదని స్పష్టం చేశాడు. తమ జట్టులో కోచ్ ఆటగాళ్లను తిట్టే సంస్కృతి ఉందన్న మాట నిజమేనని.. అయితే, తాను మాత్రం అందుకు విరుద్ధమని తెలిపాడు. ఈ మేరకు.. ‘‘ఆటగాళ్లపై నేనెప్పుడూ అసభ్య పదజాలం వాడను.
గురువు పిల్లలను కొట్టడం, కోచ్ ఆటగాళ్లను తిట్టడం మా సంస్కృతిలో ఉంది. అయితే, నేను మాత్రం ఈ విధానాన్ని విశ్వసించను. ఆటగాళ్లను నేను గౌరవిస్తాను. కోచ్‌గా వారికి కావాల్సిన సాయం చేస్తాను. జట్టు ప్రయోజనాల కోసం కఠినంగా శ్రమించేలా చేస్తాను. అంతేగానీ.. తిట్టడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఆలోచించే రకం కాదు’’ అని ఈ మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు.
అందుకే నిలకడ కూడా ఉండదు
ఇక చాంపియన్స్ ట్రోఫీలో పాక్ బ్యాటింగ్ వైఫల్యాల గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘గత నాలుగేళ్లుగా మా క్రికెట్ బోర్డులో, జట్టులో చాలా మార్పులే జరిగాయి. సరైన, నిర్ధిష్టమైన విధానాలు లేనప్పుడు నిలకడ కూడా ఉండదు.
మా ఆటగాళ్లను వేరే జట్ల ఆటగాళ్లతో పోల్చినపుడు వారి బోర్డులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి? అన్న అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. యాజమాన్యం నిలకడగా ఉంటే.. ఆటగాళ్లను కూడా మనం ప్రశ్నించే వీలు ఉంటుంది’’ అని పాక్ క్రికెట్ బోర్డు తీరుపై ఆకిబ్ జావేద్ పరోక్షంగా విమర్శలు సంధించాడు.
ఏదేమైనా ఐసీసీ టోర్నమెంట్లలో వరుస ఓటములు చవిచూసిన జట్టును ఉపేక్షించేది లేదని.. కచ్చితంగా చర్యలు ఉంటాయని ఆకిబ్ జావేద్ పేర్కొన్నాడు. సాకులు చెప్పి తప్పించుకునే వీలులేదు. కచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రతి మ్యాచ్‌కు ముందు ఫలితం అనుకూలంగా ఉంటుందనే భావిస్తాం.
కచ్చితంగా బాధ ఉంటుంది
కానీ ఒక్కోసారి చెత్త ప్రదర్శన కారణంగా తీవ్ర నిరాశకు గురికావాల్సి వస్తుంది. కచ్చితంగా ఈ ఓటములు మమ్మల్ని బాధించాయి. భవిష్యత్తులో మరింత మెరుగ్గా ఆడతామని జాతికి చెప్పడం తప్ప ప్రస్తుతం చేసేదేమీ లేదు’’ అని ఆకిబ్ జావేద్ చెప్పుకొచ్చాడు. కాగా లీగ్ దశలో భాగంగా చివరగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ఇక చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’లో ఉన్న పాకిస్తాన్ న్యూజిలాండ్, టీమిండియా చేతిలో ఓడి సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. అంతకుముందు వన్డే వరల్డ్‌కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లోనూ ఇదే తరహా చెత్త ప్రదర్శనతో నాకౌట్ దశకు కూడా చేరలేకపోయింది.
చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!