యుద్ధం మాదిరి సిద్ధం.. భారత్‌ చేతిలో చిత్తు! పాక్‌ జట్టులో భారీ మార్పులు? | CT 2025: Prime Minister Will Personally Take Notice Pak Poor Show: Report | Sakshi
Sakshi News home page

యుద్ధం మాదిరి సిద్ధం.. భారత్‌ చేతిలో చిత్తు! పాక్‌ జట్టులో భారీ మార్పులు?

Published Sat, Mar 1 2025 6:30 PM | Last Updated on Sat, Mar 1 2025 6:47 PM

CT 2025: Prime Minister Will Personally Take Notice Pak Poor Show: Report

భారత్-పాకిస్తాన్(India vs Paksitan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు  ఏ వేదిక పైన జరిగినా ప్రత్యేకమే. ఈ మ్యాచ్ లు ఎప్పుడూ ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల ఈ రెండు జట్లు మధ్య  ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం పాకిస్తాన్ భారీ స్థాయిలో సన్నద్ధమైంది. 

"యోధుల్లాగా పోరాడండి. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో(ICC Champions Trophy) భారత జట్టును ఓడించి మీ సత్తా చూపించండి" అని ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు సాక్షాత్తూ పాకిస్తాన్  ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) ఆ దేశ క్రికెటర్లను తన సందేశంతో యుద్ధం స్థాయిలో సన్నద్ధం చేశారు. కానీ భారత్ క్రికెటర్ల ప్రతిభ ముందు ఇవేమి పనిచేయలేదు.

ఘోర పరాజయం
పాకిస్తాన్ తన చిరకాల ప్రత్యర్థితో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం చవిదూడడంతో ప్రస్తుతం గ్రూప్ స్టేజి లోనే టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. 29 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా  ఈ ఐసీసీ టోర్నమెంట్‌కు  ఆతిధ్యమిచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు కేవలం ఐదు రోజుల్లోనే అవమానకరమైన రీతిలో గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

ప్రకృతి కూడా సహకరించలేదు
మొదట న్యూజిలాండ్, ఆ తర్వాత భారత్ చేతిలో వరుస పరాజయాలు చవిచూసిన పాకిస్తాన్ కి ప్రకృతి కూడా సహకరించలేదు. చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలని ఆశించిన పాకిస్తాన్ కి వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రావల్పిండిలో జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ మూడు మ్యాచ్ ల నుంచి కేవలం ఒక్క పాయింట్ తో అవమానకరంగా వైదొలిగింది.

స్వదేశం లో జరిగిన ఈ ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ లో  పాకిస్తాన్  క్రికేటర్ల పేలవమైన ప్రదర్శన పై ఆ  దేశం మొత్తం అసంతృప్తి గా ఉంది. అభిమానులు, క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్ల నుండి చాలా మంది పాకిస్తాన్ ప్రదర్శన పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో పాకిస్తాన్  జట్టు  ఆట తీరు ని షెహబాజ్ షరీఫ్   స్వయంగా సమీక్షించాలని భావిస్తున్నారు.

షెహబాజ్ షరీఫ్ రాజకీయ మరియు ప్రజా వ్యవహారాల సలహాదారు రాణా సనావుల్లా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు దారుణమైన ప్రదర్శనను ప్రధాని స్వయంగా  సమీక్షించాలని  భావిస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా, ఈ క్రికెట్ సంబంధిత అంశాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ లో లేవనెత్తుతామని కూడా ఆయన సూచించారు.

పీసీబీ అధికారులపై అసంతృప్తి
ప్రధాన మంత్రి సహాయకుడు రాణా సనావుల్లా,  దేశంలోని  ప్రొఫెషనల్ క్రికెట్‌పై ఆర్థిక వ్యయాలకు సంబంధించి పారదర్శకత కోసం పిలుపునిచ్చారు. క్రీడలకు వనరులు ఎలా కేటాయించబడుతున్నాయ్యో  తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని ఆయన చెప్పారు. జవాబుదారీతనం మరియు సంస్కరణల అవసరాన్ని గురుంచి మరింత నొక్కి చెప్పారు.

పాకిస్తాన్‌కు చెందిన 'ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' నివేదిక ప్రకారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లోని ఉన్నత స్థాయి అధికారుల అధిక జీతాలపై దృష్టిని  సారించాలని రాణా సనావుల్లా సూచించారు. దాదాపు నెలకు రూ.5 మిలియన్ల వరకు జీతం పొందుతున్న పీసీబీ అధికారులలో చాలా మందికి వారి బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహన లేదని, అయినప్పటికీ వారు తమ విధులను నిర్వర్తించకుండా గణనీయమైన పరిహారం పొందుతూనే ఉన్నారని సనావుల్లా విమర్శించారు.

అంతేకాకుండా, పీసీబీ అధికారులు అనుభవిస్తున్న విపరీత ప్రోత్సాహకాలు మరియు అధికారాలపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు, వారు పాకిస్తాన్ సంస్థలో పనిచేస్తున్నారా లేదా అభివృద్ధి చెందిన దేశంలో పనిచేస్తున్నారా అని ప్రశ్నించారు. పిసిబి లో చాలా కాలంగా కొనసాగుతున్న అధికార  దుర్వినియోగానికి సనావుల్లా ఈ సమస్యలను ఆపాదించారు. పీసీబీ అధికారుల  జవాబురాహిత్యం ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ క్షీణతకు ప్రత్యక్షంగా దోహదపడిందని ఆయన వాదించారు.

పాక్ జట్టులో భారీ మార్పులు ?   
ఈ సమీక్ష  పాకిస్తాన్ జట్టులో భారీ కుదుపులకు దారితీయవచ్చు, బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్ మరియు నసీమ్ షా వంటి ప్రముఖ ఆటగాళ్ళు బహిష్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. జట్టు వైఫల్యం కారణంగా తాను రాజీనామా చేసే ఉద్దేశ్యం లేదని తాత్కాలిక ప్రధాన కోచ్ ఆకిబ్ జావేద్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ,  పీసీబీ అతని ఒప్పందాన్ని రద్దు చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత,  ఈ ఏడాది లో జరిగే ఆసియా కప్ సమయంలో రెండు చిరకాల ప్రత్యర్థులు కనీసం మూడుసార్లు తలపడనున్నాయి. 2026  ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారత్  , శ్రీలంకలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం  ఈ జట్లు సిద్ధమవుతున్నందున ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. 

ఆసియా కప్‌ను నిర్వహించే హక్కులు భారత్  కి  కేటాయించినప్పటికీ ఈ  టోర్నమెంట్ తటస్థ దేశంలో  జరుగుతుందని భావిస్తున్నారు. భారత్- పాకిస్తాన్ ఆతిథ్య దేశాలుగా ఉన్నప్పుడు, పోటీని వేరే చోట నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసీసీ) గతంలో ప్రకటించింది.

చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement