CT 1998- 2017: టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకం అదొక్కటే! | Champions Trophy, From 1998 to 2017 Glance At India Performance In Each Edition, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

CT 1998- 2017: టీమిండియాకు అత్యంత చేదు జ్ఞాపకం అదొక్కటే!

Published Thu, Feb 20 2025 9:56 AM | Last Updated on Thu, Feb 20 2025 10:47 AM

Champions Trophy: 1998 to 2017 Glance At India Performance In Each Edition

భారత అభిమానులకు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఒక చేదు జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ జట్టు తమ చిరకాల  ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో ఘోరమైన పరాజయం చవిచూడటమే ఇందుకు కారణం. ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా  ఓడిపోలేదు. 

కానీ  2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత్ పై భారీ ఆధిక్యంతో విజయం సాధించి తన ప్రతీకారం తీర్చుకుంది. ఇందుకు బదులు చెప్పేందుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మరి.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు ప్రయాణం ఇప్పటి వరకు ఎలా సాగిందో చూద్దామా?!

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్
ప్రపంచ కప్ టోర్నమెంట్‌ ప్రారంభమైన 23 సంవత్సరాల విరామం తర్వాత 1998లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పోటీలకు శ్రీకారం చుట్టింది.  ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ క్రికెట్  అగ్రస్థానంలో ఉన్న జట్లు ఈ ట్రోఫీ కోసం పోటీ పడతాయి. ఇంతవరకు ఎనిమిది  సార్లు ఛాంపియన్షిప్ పోటీలు జరుగగా, ఆస్ట్రేలియా మరియు భారత్ రెండుసార్లు ఈ టైటిల్ ని గెలుచుకున్న అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ మరియు పాకిస్తాన్ ఒక్కొక్కసారి గెలిచాయి. 1998లో ఛాంపియన్షిప్ ట్రోఫీ ప్రారంభం నుంచి ఈ టోర్నమెంట్లో భారత్ ప్రదర్శన మీ కోసం:

1998 (బంగ్లాదేశ్‌)
1998లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టౌర్నమెంట్ కి బంగ్లాదేశ్‌ ఆతిధ్యమిచ్చింది.  నాకౌట్ ఫార్మాట్‌లో జరిగిన ఈ టౌర్నమెంట్ లోని ప్రారంభ మ్యాచ్ లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది, సచిన్ టెండూల్కర్ 141 పరుగులు సాధించడం తో భారత్  307 పరుగుల భారీ స్కోరు చేసింది. సచిన్ మళ్ళీ బౌలింగ్ లోనూ విజృంభించి  నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థులను 263 పరుగులకే పరిమితం చేశాడు. 

మహ్మద్ అజారుద్దీన్ నాయకత్వం లోని భారత్ జట్టు సెమీ-ఫైనల్లో వెస్టిండీస్‌తో తలపడింది. సౌరవ్ గంగూలీ మరియు రాబిన్ సింగ్ లు అర్థ సెంచరీలు సాధించి భారత్ స్కోర్ ను 242/6 కు చేర్చారు.  కానీ శివనారాయణ్ చంద్రపాల్ (74) మరియు బ్రియాన్ లారా (60 నాటౌట్)  రాణించడంతో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. అయితే, వెస్టిండీస్‌ను ఫైనల్‌లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో ఓడించి తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.

2000 (కెన్యా)
కెన్యా ఆతిధ్యమిచ్చిన రెండో ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. భారత్ తొలి మ్యాచ్ లో ఆతిథ్య కెన్యాను సునాయాసంగా ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్ జట్టు  సౌరవ్ గంగూలీ అజేయంగా నిలిచి  141 పరుగులు చేయడంతో భారత్ 295 పరుగులు స్కోర్ చేసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 200 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో, గంగూలీ సెంచరీని సాధించినప్పటికీ  ప్రయోజనం లేకపోయింది.  క్రిస్ కైర్న్స్ కూడా రాణించి సెంచరీ సాధించడంతో కివీస్ భారత్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరవేసుకొనిపోయింది.

2002 (శ్రీలంక)
2002 నుండి ఈ టౌర్నమెంట్ ని నాకౌట్  ఫార్మాట్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్  లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి. వాటిని నాలుగు "పూల్స్"గా విభజించారు.  భారత్, ఇంగ్లాండ్ మరియు జింబాబ్వేతో పాటు పూల్ 2లో ఉంది. ప్రతి పూల్ నుండి అగ్రస్థానంలో ఉన్న జట్టు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ రెండు విజయాలతో పూల్‌లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్  అర్హత సాధించింది. గంగూలీ నేతృత్వంలోని జట్టు సెమీ-ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికా ను 10 పరుగుల తేడాతో ఓడించింది.

ఫైనల్‌లో  శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ సనత్ జయసూర్య, కుమార్ సంగక్కరల అర్ధ సెంచరీలతో రాణించడం తో  ఆ జట్టు 244/5 స్కోర్ చేసింది.  కానీ భారత్ లక్ష్య సాధనకి   వర్షం అడ్డంకిగా నిలిచింది. ఫలితంగా భారత్ స్కోర్  రెండు ఓవర్ల కు 14/0 వద్ద ఉండగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్‌ను రిజర్వ్ డేకి మార్చారు, అక్కడ ఆట మళ్ళీ  మొదటి నుండి ప్రారంభమైంది. శ్రీలంక మళ్ళీ మొదట బ్యాటింగ్ చేసి 222/7 స్కోరు చేసింది. వర్షం మరోసారి ఆటకు అవరోధం గా నిలిచింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్  38/1తో ఉంది. చివరికి భారత్, శ్రీలంక లని సంయుక్త విజేతలు గా ప్రకటించారు.

2004 (ఇంగ్లాండ్‌)
ఇంగ్లాండ్‌లో జరిగిన 2004 ఛాంపియన్స్ ట్రోఫీలో 12 జట్లు పాల్గొన్నాయి. కానీ ఈ టౌర్నమెంట్ లో భారత్ పేలవమైన ప్రదర్శన తో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.  భారత్, పాకిస్తాన్ మరియు కెన్యాతో పాటు గ్రూప్ సి నుంచి రంగంలోకి దిగింది. కానీ కెన్యాపై కేవలం ఒక మ్యాచ్ గెలిచిన భారత్ తన చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలై గ్రూప్ దశలోనే టౌర్నమెంట్ నుంచి వైదొలగింది. ఈ టౌర్నమెంట్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది.

2006 (భారత్)
భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నమెంట్ లో పది జట్లు పాల్గొన్నాయి. రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని భారత్ జట్టు గ్రూప్ దశలో ఇంగ్లాండ్ పై గెలిచింది కానీ, ఫైనల్ కి అర్హత సాధించిన ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ చేతిలో వరుసగా ఆరు వికెట్లు మరియు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై టౌర్నమెంట్ నుంచి గ్రూప్ స్థాయిలోనే వైదొలిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను ఓడించి ట్రోఫీ ని కైవసం చేసుకుంది.

2009 (దక్షిణాఫ్రికా)
2009లో ఛాంపియన్స్ ట్రోఫీ దక్షిణాఫ్రికాలో జరిగింది మరియు టోర్నమెంట్‌ను ఎనిమిది జట్లుగా కుదించారు. అన్ని జట్లని నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్  ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మరియు వెస్టిండీస్‌లతో పాటు గ్రూప్ ఎ నుంచి రంగంలోకి దిగింది. కానీ మరోసారి గ్రూప్ లో మూడవ స్థానంలో నిలిచి తర్వాత గ్రూప్‌ను దాటలేకపోయింది. భారత్ పాకిస్తాన్ చేతిలో 54 పరుగుల తేడాతో పరాజయం చవిచూడగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత భారత్ జట్టు వెస్టిండీస్‌ను ఓడించింది, కానీ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి అది సరిపోలేదు.

2013 (ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్)
ఎమ్ ఎస్  ధోని నేతృత్వంలోని భారత్ జట్టు ఇంగ్లాండ్‌లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీని లో విజేత గా నిలిచింది. గ్రూప్ బి లో మూడు విజయాలతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సెమీఫైనల్లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఫైనల్‌ లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడింది, వర్షం కారణంగా ఈ మ్యాచ్ ని 20 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 129/7కే పరిమితమైంది. కానీ రవీంద్ర జడేజా (2/24), ఇషాంత్ శర్మ (2/36) మరియు రవిచంద్రన్ అశ్విన్ (2/15) రాణించడంతో భారత్ బౌలర్లు ఇంగ్లాండ్ ని 124/8కే పరిమితం చేయడంతో  భారత్ ట్రోఫీ ని చేజిక్కించుకుంది.

2017 (ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్)
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూడడం తో ట్రోఫీ ని నిలబెట్టుకోలేకపోయింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకలతో కూడిన తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా నిలిచి 123 పరుగులు సాధించడంతో  భారత్ సెమీఫైనల్స్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే భారత్ చివరికి ఫైనల్ లో పాకిస్తాన్ చేతి లో ఓటమి చవిచూసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement