పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా! | Why Did ICC Discontinue Champions Trophy After 2017 All You Need To Know | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా!

Published Wed, Feb 19 2025 11:26 AM | Last Updated on Wed, Feb 19 2025 12:04 PM

Why Did ICC Discontinue Champions Trophy After 2017 All You Need To Know

తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలపై  ఆశలు చిగురిస్తున్నాయి.  సుదీర్ఘ విరామం తర్వాత  మళ్ళీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల్ని చూసే అవకాశం లభించడంతో వారంతా  ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.  

ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రధాన జట్టుగా వెలుగొందిన పాకిస్తాన్‌కి ఉగ్రవాద ముద్ర పడిన తర్వాత ప్రధాన క్రికెట్ జట్లన్నీ ఆ దేశంలో పర్యటించడానికి వెనుకాడాయి.

ముఖ్యంగా 2009లో ఆ దేశానికీ పర్యటనకి వచ్చిన శ్రీలంక జట్టు  ఆటగాళ్ల బస్సుపై  ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ దేశం లో దాదాపు అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు నిలిచిపోయాయి.  విదేశీ జట్ల రాకపోకలు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం వరకు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తమ స్వదేశీ వేదిక చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.

పాకిస్తాన్‌కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే
2015లో జింబాబ్వే తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించింది. దీంతో మళ్ళీ ఆ దేశంలో క్రికెట్ పర్యటనలకు దారులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత 2017లో వరల్డ్ XI జట్టు టి20 సిరీస్ ఆడింది. దీంతో అంతర్జాతీయ జట్ల పర్యటనలు మళ్ళీ మెల్ల మెల్లగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా  దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్ కి పర్యటనలకు వెళ్లడంతో మళ్ళీ ఆ దేశ క్రికెట్ అభిమానులకి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. 

వివాదాల ఛాంపియన్స్ ట్రోఫీ
ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ అభిమానులు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్, అదీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు అవకాశం లభించడంతో వారంతా  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వివాదాల అనంతరం పాకిస్తాన్ కి  మళ్ళీ  ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చే అవకాశం లభించింది. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్‌ను తమ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఫైనల్‌లో 180 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుండి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఎందుకంటె భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ల మధ్య  ఈ  టోర్నమెంట్  ఆడితిధ్యం హక్కులపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడుగా వ్యవహరించిన  రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్  గతంలో జట్టు ని పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించగా, పీసీబీ మాత్రం మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లోనే ఉంచాలని పట్టుదలకు పోయింది.

పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం, అంతే కాక 1996  ప్రపంచ కప్  తర్వాత   తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం రావడం ఇందుకు ప్రధాన కారణం. చివరికి పాకిస్తాన్  కొద్దిగా పట్టు సడలించింది. దీంతో  పాకిస్తాన్  అభిమానుల  కల నెరవేరే రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్‌కి ఇది చాల ప్రత్యేకమైన రోజు!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు రద్దు చేసింది?
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఐసీసీ 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రతిపాదించింది.  ఐసీసీలో అసోసియేట్ దేశాలు గా గుర్తింపు పొందిన దేశాల జట్లు మాత్రమే ప్రతిష్టాత్మకమైన యాభై ఓవర్ల  ఈ  టోర్నమెంట్‌లో పాల్గొనడానికి  ఐసీసీ అనుమతించింది.

మొదటి రెండు టౌర్నమెంట్లకు  ఇదే పద్ధతిని అనుసరించారు. కానీ త్వరలోనే పూర్తి సభ్య దేశాల జట్లు కూడా  ఈ   టోర్నమెంట్‌లో పాలొనడం ప్రారంభించడం తో ఇది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎలైట్ ఐసీసీ యాభై ఓవర్ల ఈవెంట్‌గా మారిపోయింది.  

2006 వరకు  ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు కానీ ఆ తర్వాత ఐసీసీ దీనిని వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే దీన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ప్రారంభించింది. 

అయితే యాభై ఓవర్ల ఫార్మాట్‌లో రెండు ప్రధాన  టౌర్నమెంట్లను -- ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ --- నిర్వహించడంపై దుమారం చెలరేగడంతో, ముఖ్యంగా ప్రపంచ కప్ స్థాయిలో రెండు వన్డే టౌర్నమెంట్లు నిర్వహించడం అర్ధరహితమని క్రికెట్ అభిమానులు వాదనలు వినిపించారు.

మరోవైపు.. మూడు ఫార్మాట్లలోనూ మెగా టోర్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ ప్రవేశట్టింది.  ఈ క్రమంలో 2017లో చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణను నిలిపివేసిన ఐసీసీ... 2021లో రీ ఎంట్రీపై అప్‌డేట్‌ ఇచ్చింది. 2025లో  ఈ  వన్డే ఫార్మాట్‌ టోర్నీని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ వేదిక కోసం పాకిస్తాన్ పట్టుబడటం, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ ఆతిధ్యం పై వివాదం చెలరేగింది.

తటస్థ వేదికైన యూఏఈలో
ఈ టోర్నమెంట్ నిర్వహణ పై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికీ మార్చాలని కూడా భావించారు. అయితే గత సంవత్సరం నవంబర్ లో బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య ఐసీసీ ఒక సమావేశం నిర్వహించింది. భారత్ మ్యాచ్లను తటస్థ దేశమైన యూఏఈలో నిర్వహించేందుకు చివరికి అంగీకారం కుదరడంతో మళ్ళీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.

చదవండి: భారత తుదిజట్టులో బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement