
సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిథ్యమిస్తోంది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) విజేత పాకిస్తాన్. సొంతగడ్డపై జరిగే ఈ ఈవెంట్లో గెలిచి మరోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి.. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటే?..
ప్రపంచ కప్ వంటి పలు అంతర్జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆస్ట్రేలియా ప్రస్తుతం గాయాలతో చతికిలపడి పోయింది. సొంత గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి 3-1తో గెలిచింది ఆస్ట్రేలియా.
ఆసీస్‌కు ఎదురుదెబ్బలు
అయితే, ఈ టెస్టు సిరీస్ తర్వాత కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి తమ పూర్తి స్థాయి జట్టుని పంపలేకపోయింది ఆసీస్ బోర్డు.
ముఖ్యంగా జట్టులోని ప్రధాన బౌలర్ల అందరూ గాయాల కారణంగా ఈ టోర్నమెంట్ కి దూరంకావడం ప్రభావం చూపనుంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల వల్ల వైదొలిగారు.
ఇదే సమయంలో జట్టులోని ప్రధాన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మునుపటి స్థాయి లో చెలరేగి ఆడి ఈ ట్రోఫీ ని సాధించడం అనుమానంగానే కనిపిస్తోంది.
అంత సులువు కాక పోవచ్చు
ఈ టోర్నమెంట్ లో మరో ప్రధానమైన జట్టుగా బరిలో దిగుతున్న ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్, 2022 టి20 ప్రపంచ కప్ ల విజయం తర్వాత ఇటీవలి కాలంలో ఆశించిన రీతిలోరాణించలేకపోయింది. ఇటీవల భారత్ లో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ 3-0 తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టడం కష్టమే.
కానీ ఇలాంటి ప్రధానమైన టోర్నమెంట్ లో రాణించడానికి ముందు వారి ప్రదర్శన, పిచ్ ల ప్రభావం కూడా కీలకం. ఈ నేపధ్యం లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాక పోవచ్చు. ఇక ఈ టోర్నమెంట్ మూడు జట్ల మధ్యే ట్రోఫీ కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రధానమైనవి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్. ఈ నేపథ్యం లో ఈ మూడు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం.
భారత్:
ఛాంపియన్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2002, 2013)
ప్రస్తుత వన్డే ర్యాంకింగ్: 1
ప్రధాన ఆటగాళ్ళు: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా
ఇంగ్లండ్‌లో 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ట్రోఫీ ని గెలుచుకుంది. ప్రస్తుత టి20 ప్రపంచ ఛాంపియన్స్ అయిన భారత్ వరుసగా రెండో ఐసిసి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని చూస్తోంది. సొంతగడ్డ పై 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ చాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా అనూహ్యంగా భారత్ పై విజయం సాధించి ట్రోఫీ ని చేజిక్కించుకుంది.
అయితే రోహిత్ శర్మ సేన ఆ ఘోర పరాజయం నుంచి తొందరగా కోలుకొని ఏడు నెలల తర్వాత టి20 ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ ని సాధించింది. గత ఏడాది కాలంగా భారత్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టెస్ట్‌లలో పేలవమైన ప్రదర్శననను పక్కన పెడితే టి20, వన్డే ఫార్మాట్లలో భారత్ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-0 తేడాతో ఓడించడం, అలాగే టాప్-ఆర్డర్ బ్యాట్స్మన్ అద్భుతమైన ఫామ్‌తో ఉండడటం తో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌కు భారత్ ప్రధాన పోటీదారులలో ఒకటిగా చెప్పడంలో సందేహం లేదు.
ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఒక్కటే భారత్ కి కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తున్న అంశం. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ మునుపటి ఫామ్ ని కనబరిచినట్టయితే ఈ లోపాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ చాకచక్యమైన లెగ్-బ్రేక్ బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ఫామ్ జట్టుకి అదనపు బలం. మంచి ఊపు మీద ఉన్న ప్రస్తుత భారత్ జట్టుని నిలువరించడం ప్రత్యర్థులకు అంత సులువు కాకపోవచ్చు.
పాకిస్తాన్
చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2017)
వన్డే ర్యాంకింగ్: 3
ప్రధాన ఆటగాళ్ళు: బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్
ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా లేదు. సొంత గడ్డ పై ప్రధాన జట్లు ఆడకపోవడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో రాజకీయాలు, కోచ్, కెప్టెన్ ల పై వేటు .. ఇలా పాకిస్తాన్ పేలవమైన ఫామ్ కి అనేక కారణాలు. అయితే 2017 చాంపియన్స్ అయిన పాకిస్తాన్ ఈసారి సొంత గడ్డ పై ఆడటం వారికి కలిసొచ్చే అంశం. పాకిస్తాన్ స్వదేశం లో ఆడిన మూడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను చేజిక్కించుకుంది.
ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై 2-1 తో విజయం, బలీయమైన దక్షిణాఫ్రికా జట్టును 3-0 తేడాతో ఓడించడం వంటివి ఆ జట్టుకు ఈ టోర్నమెంట్ కి ముందు కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది మరియు 2017 టైటిల్ హీరో ఫఖర్ జమాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అదీ కాక స్వదేశీ ప్రేక్షకుల ముందు ఆ జట్టు విజృంభించి ఆడితే ప్రత్యర్థి జట్లకు అంత సులువు కాకపోవచ్చు.
న్యూజిలాండ్
చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2000)
వన్డే ర్యాంకింగ్: 4
ప్రధాన ఆటగాళ్ళు: కేన్ విలియమ్సన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్
గత ఐదు ఐసిసి పరిమిత ఓవర్ల ప్రపంచ కప్‌లలో ఒకటి తప్ప మిగతా వాటిలో న్యూజిలాండ్ నాకౌట్ దశకు చేరుకుని తన సత్తా చాటుకుంది. అయితే 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజీల్యాండ్ ఒక్క ఐసిసి టోర్నమెంట్‌ను కూడా గెలవలేదు. కానీ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ నాయకత్వం, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్ళీ ఫామ్‌లోకి రావడంతో, న్యూజిలాండ్ ఈసారి ఆటుపోట్లను తట్టుకొని నిలబడ గలమని ఆశాభావంతో ఉంది.
పాకిస్తాన్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్ విజయంతో న్యూజిలాండ్ కొత్త ఉత్సహంతో ఈ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టింది. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఫామ్ తో పటు పేస్ బౌలర్లు సరైన రీతి రాణించి నట్లయితే న్యూజిలాండ్ మరోసారి టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు.
చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment