
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెటర్లకు ఊహించని షాకిచ్చింది. దేశీ మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస పరాజయాలతో పాక్ సీనియర్ జట్టు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని విమర్శల పాలైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయిన రిజ్వాన్ బృందం.. వర్షం వల్ల బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దవడం వల్ల నిరాశగా వెనుదిరిగింది.
ఈ నేపథ్యంలో రిజ్వాన్ బృందంపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక చాంపియన్స్ నిర్వహణ హక్కులు దక్కించుకున్న పీసీబీ.. స్టేడియాల మరమత్తుల కోసం భారీగానే ఖర్చు చేసింది. అయితే, ఆతిథ్య జట్టుగా దిగి దారుణంగా విఫలం కావడంతో సెలక్షన్ కమిటీపై కూడా ఆరోపణలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ బ్యాటింగ్ కోచ్ మొహమ్మద్ యూసుఫ్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడం గమనార్హం. తదుపరి న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. కివీస్‌తో జరిగే 5 టి20లు, 3 వన్డేల సిరీస్ కోసమే అతడిని పీసీబీ ఎంపిక చేయగా... అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
అయితే తన కూతురు అనారోగ్యం కారణంగా టూర్‌నుంచి అతను తప్పుకొన్నట్లు యూసుఫ్ వెల్లడించగా.. అతడి స్థానంలో పీసీబీ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇక చాంపియన్స్ ట్రోఫీ వైఫల్యం తర్వాత కివీస్‌తో ఎంపిక చేసిన టీ20 జట్టులో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజంకు పీసీబీ చోటివ్వలేదు.
లక్ష నుంచి పది వేలకు..
తాజాగా.. దేశవాళీ క్రికెట్‌లో మార్పులకు శ్రీకారం చుడుతూ.. ఆటగాళ్లపై దెబ్బ వేసింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా పాక్ దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను భారీగా తగ్గించేసింది. ఆ బోర్డు ఆర్థిక స్థితికి ఇది నిదర్శనం!
కాగా జాతీయ టీ20 చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు ఒక లక్ష పాకిస్తానీ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 31 వేలు) ఫీజుగా ఇస్తుండగా.. ఇప్పుడు దానిని ఏకంగా 10 వేల రూపాయలకు (రూ.3,100) తగ్గించారు. ఈ 90 శాతం కోతతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన హోటల్స్‌లో వసతి, తక్కువ సార్లు మాత్రమే విమానాల్లో ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నారు.
పాక్‌తో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ సారథిగా బ్రేస్‌వెల్
ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌ను న్యూజిలాండ్ టీ20 కెప్టెన్‌గా నియమించారు. సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనే కివీస్ జట్టును మంగళవారం ప్రకటించారు. చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భుజం గాయానికి గురైన హెన్రీకి మొదటి 3 మ్యాచ్‌లకు విశ్రాంతినిచ్చి ఆఖరి 4, 5వ మ్యాచ్‌లకు ఎంపిక చేయగా, జేమీసన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడనున్నాడు.
దుబాయ్‌లో ఆదివారం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌తో తలపడిన ఏడుగురు ఆటగాళ్లు ఐపీఎల్, పీఎస్‌ఎల్ (పాక్) కాంట్రాక్టుల వల్ల జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. రెగ్యులర్ కెప్టెన్ సాంట్నర్ సహా కాన్వే, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, ఫెర్గూసన్ ఐపీఎల్ ఆడనుండగా, కేన్ విలియమ్సన్ పాక్ సూపర్ లీగ్ ఆడేందుకు వెళ్లనున్నాడు.
కివీస్ జట్టు మార్చి 16, 18, 21, 23, 26 తేదీల్లో పాక్‌తో ఐదు టీ20లు ఆడుతుంది. అనంతరం ఇరుజట్ల మధ్య మార్చి 29, ఏప్రిల్ 2, 5వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ కూడా జరుగనుంది. ఈ జట్టును తర్వాత ఎంపిక చేస్తారు.
న్యూజిలాండ్ టీ20 జట్టు: బ్రేస్‌వెల్ (కెప్టెన్), అలెన్, చాప్‌మన్, ఫౌల్‌కెస్, మిచెల్ హే, హెన్రీ, జేమీసన్, మిచెల్, నీషమ్, రూర్కే, రాబిన్సన్, బెన్ సీర్స్, సీఫెర్ట్, జేకబ్ డఫీ, ఇష్ సోధి.
తస్కీన్ ఒక్కడికే బంగ్లా ‘ఎ’ప్లస్ కాంట్రాక్టు
బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ తస్కీన్ అహ్మద్ ఒక్కడికే బోర్డు కాంట్రాక్టుల్లో అగ్ర తాంబూలం దక్కింది. బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న క్రికెటర్ల జాబితాను ప్రకటించింది. కొన్నేళ్లుగా బీసీబీ ఫార్మాట్ల ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇస్తూ వచ్చింది.
అయితే దీనికి మంగళం పాడిన బోర్డు మళ్లీ పాత పద్ధతిలోనే గ్రేడ్‌లవారీగా కాంట్రాక్టులు ఇచ్చింది. ఇందులో భాగంగా ‘ఎ’ ప్లస్ గ్రేడ్‌లో ఉన్న ఒకే ఒక్కడు తస్కీన్‌కు నెలకు బంగ్లా కరెన్సీలో ఒక మిలియన్ టాకాలు (రూ.7.15 లక్షలు) చెల్లిస్తారు.
కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ సహా మెహదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్‌లకు ‘ఎ’గ్రేడ్ కాంట్రాక్టు దక్కింది. ఇందులో భాగంగా వీరికి నెలకు 8 లక్షల టాకాలు (రూ.5.75 లక్షలు) లభిస్తాయి.
చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక కాని ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు బీసీబీ కాంట్రాక్టు లభించలేదు. 2022 తర్వాత సౌమ్య సర్కార్, షాద్‌మన్ ఇస్లామ్‌లకు సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. ‘సి’ గ్రేడ్‌లో ఉన్న వీరికి నెలకు 4 లక్షల టాకాలు (రూ.2.87 లక్షలు) జీతంగా చెల్లిస్తారు. ‘బి’ గ్రేడ్ ప్లేయర్లకు 6 లక్షల టాకాలు (రూ.4.27 లక్షలు) చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment